Saturday, September 8, 2012

కర్మ భూమి

 
 
కర్మ భూమి
 
 

 
లంక ను జయించాక, ఆ రాజ్య సౌందర్యాన్ని చూసి, లక్ష్మణుడు , కొన్ని రోజులు అక్కడే వుండి, విబీషణుని ఆతిధ్యం స్వీకరించి వెళదాం అని కొరితే, రాముడు ఇలా
అంటాడు
* " అపి స్వర్ణమయీ లంకా- న మే రోచతి లక్ష్మణా,
జనని జన్మభూమిస్చ స్వర్గాదపి గరీయసి ".*
బంగారం తో నిర్మించబడ్డది, ఎంతో ఉత్సుకతని కలిగించేది అయినా, ఈ లంకా నగరం పై నాకు ఆసక్తి లేదు. మన తల్లి వంటి మాతృభూమికి సమానమయినది, ఏది లేదు. చివరికి  స్వర్గం కూడా మాత్రు దేశం ముందు దిగదుడుపే.*

 పరాయి దేశపు పౌరసత్వం సంపాదించుకోవచ్చు, కాని కన్న తల్లిని ఎలా మార్చుకోలేమో, అలా మాతృభూమిని, మాత్రు భాషని మర్చిపోలేము. మనిషీ ఒక ప్రాంతంలో పుట్టి, అక్కడి గాలిని పీల్చుకుని, నీటిని త్రాగి, తన బ్రతుకును పండించుకుంటాడు. అతనికి తెలియకుండానే ఆ గాలి, నేల, మట్టి, తో ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఎంతో మంది తెలుగు వాళ్ళు, ఇక్కడి మన భాషని, బంధాలను కోల్పోతున్నామని బాధపడడం చూస్తుంటాం. విదేశీయులంతా , మన సంస్కృతి పట్ల, వేష భాషల పట్ల ఆకర్షితులయ్యి, అచ్చంగా ఆరు గజాల చీరలు కట్టుకుని, బొట్టు- గాజులు వేసుకుని ముచ్చటగా తిరుగుతున్నారు.సరే, భారత భూమిలో పుడితే ఏమిటి విశేషం, మిగిలిన చోట్ల ఏమిటి లోటు, అనే వాళ్ళకు, నాకు తెలిసినంతలో చిన్న వివరణ.

మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. *కర్మ*(సంస్కృతం: कर्म - "act, action, performance") అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము  చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్దంతమే హిందూ మతానికి పునాది. కర్మ సిద్దాంతము ప్రకారము : పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో నుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. హిందూ మతం ప్రకారం మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం  భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి.

విష్ణు పురాణం ప్రకారం, దేశాలు, కర్మభూమి అని, భోగ భూమి అని రెండు రకాలు. భోగ భూమిలో పుట్టే జీవులకి మొక్షార్హత ఉండదు, వీరు ఇంద్రియ లోలులయ్యి, భోగాలను అనుభవించడమే తప్ప వేరే పురోగతి ఎరుగరు. కర్మ భూమి లో పుట్టిన వారు త్రివిధ కర్మలను ఆచరిస్తూ ( నిత్యం, నైమిత్తికం, కామ్యం),ఆధ్యాత్మిక సంబందితమయిన యజ్ఞాలు, యాగాలు, నిర్వహిస్తూ, పాప పుణ్యాలకు తగిన జన్మలు పొంది, మొక్షార్హత కలిగి ఉంటారు. భారత భూమిలో చేసిన దానమయినా , యజ్ఞమయినా, తపమయినా మిగిలిన చోట్ల చేసిన వాటికన్నా, ఊహించలేనంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. భోగ భూమిలో చేసిన ఎంతటి మహాత్కార్యమయినా, చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయంగా ఈ మధ్య కొన్ని ఆశ్చర్య కరమయిన సాంకేతిక ఆధారాలు లభించాయట . క్రింది లింక్ లో చదవగలరు.
http://manasasancharare.wordpress.com/2010/07/01/india-gravity-field-is-unique/

పరాయి దేశాలు పురోగతిలో మనకంటే ముందు ఉండచ్చు. కాని ఒక్క రూపాయి ఆశించకుండా, కేవలం ధర్మ ప్రచారం, యోగ ప్రచారం, లోక శ్రేయస్సు కోసం పాటుపడే మహనీయులు ఇక్కడే
ఉన్నారు. 'లోకాస్సమస్తా సుఖినోభవంతు' అంటూ యజ్ఞాలు చేసే పుణ్యాత్ములు ఇక్కడే ఉన్నారు. మన మాత్రు భూమిని, మనమే చులకన చేయక, ఈ మట్టిలో పుట్టినందుకు, గర్వపడాలి. ఆ మట్టిలో దొరికే మాణిక్యాలం అయ్యి, మన దేశ ప్రతిష్టను అన్నీ దేశాల్లో ఇనుమడిమ్పచేయ్యాలి. ధన్యవాదాలు.

అమరావతి కధలు 1





మరావతి- గుంటూరు జిల్లా లో ఉంది. పంచారామాల్లో ఒకటయిన 'అమరేశ్వరాలయం ' ఇక్కడ ఉంది. కార్తీక మాసంలో గుడి పక్క కృష్ణా

నదిలో కొత్త నీరు, గుడిలో బయటి ప్రాంగణం అంతా, పూల తివాసీ పరచే పున్నాగ చెట్లు, వాటి నుంచి వచ్చే పరిమళం,
గుడిలో అనేక మారేడు,

 

గన్నేరు చెట్లు, నిశ్శబ్ద మౌన సందేశాన్ని అందిస్తూ, మనసుని మైమరపిమ్పచేస్తాయి.


శంకరమంచి సత్యం గారు రెండున్నర ఏళ్ళు అక్కడి ప్రకృతి తో మమేకమయిపోయి, గాలిలో తెమలా, ఇసుకలో రేణువులా, కృష్ణలో అలలా,

మనుషుల్లో మనసులా తాదాత్మ్యం చెంది, చరిత్ర పుటలపై చెక్కిన అమర శిల్పాలు. అమరావతి క్షేత్ర పాలకుడిలా, యోగిలా చరిస్తూ, ఆ నేల

తల్లి పై కురిసిన వాన చినుకు మీద, తడిసీ తడవని ఇసుక రేణువు మీదా, అక్కడి మట్టిలోని దైవికత మీదా --సున్నితమయిన భావోద్వేగాలు,

వెన్నెలలు-ఎండలు, వానలు- వరదలు, వ్యవస్తలు- వృత్తులు , పండగలు- పబ్బాలు, కల్మషం లేని ప్రేమలు, భిన్న మనస్తత్వాలు రంగరించి,

హృద్యంగా అందించిన అమర కధలు.దాదాపు వంద కధల్లో తెలుగు జీవన విశ్వ రూపం కనిపిస్తుంది. మూడు ముక్కల్లో నూరేళ్ళ జీవితాన్ని

మనకు చూపిస్తారు. మరి, కొన్ని కధలు చూద్దామా....


*తోలికధ - వరద* : ఇందులో వరద వచ్చి మిన్ను- మన్ను ఏకమయిపోతే, సాముహిక భోజనాలు చేస్తూ, మాలవాడు- బ్రాహ్మడికి నెయ్యి

వడ్డించడం , అతడు ఆనందంగా తినడం ఇతివృత్తం. వరద వచ్చి ఒక్క పూట బురద కడిగేసినా, మర్నాటికి మళ్లీ మామూలే. ఎన్ని వరదలు

వచ్చినా మనుషుల మనసుల్లోని మాలిన్యం కడగలేకపోతోంది....అంటూ ముగిస్తారు.


*రెండు గంగలు *: ఈ కధలో మనవడికి కధ చెప్తూ, తాత తన పెళ్ళయిన కొత్తలో వాన పడ్డప్పటి అనుభూతి ఇలా చెప్తారు. గల గల వాన- జల

జల వాన. వర్ష రాణి రధచక్రాల సడి- ఉరుము, కిరీటపు తళుకులు- మెరుపులు, అంటారు. మట్టి వాసన మైమరపిమ్పచేస్తోంది,

సర్వాణువులని వాన కరిగించేస్తుంటే, పైరు పులకించినట్టు ఊగుతోంది. కృష్ణ వొడ్డున, కృష్ణలో చినుకులు పడుతుంటే, అవి అమ్మాయి సిగ్గు

పడ్డప్పుడు, బుగ్గ మీది సోట్టలా ఉన్నాయి. చినుకుపడ్డ చోట చిన్న గుంట- అంతలో మాయం. కృష్నంతా చినుకులు- పులకలు. పైనుంచి ఒక

గంగ, క్రింద కృష్ణ మరొక గంగ అయితే, రెండూ కలిసిపోతున్నట్టు, ఒకటే ధార. ఇంతలో తాతయ్యకు నాయనమ్మ గుర్తొచ్చింది. ఇంత వానలో

ఒంటరిగా, ఎక్కడుందో... అని చూస్తే, ఆవిడ పెరట్లో కృష్ణ వైపు తిరిగి, చేతులు చాపి, తలములకలుగా హాయిగా తడిసి పరవశించి పోతోంది.

వర్షం కృష్ణలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోతోంది. ఇలా కధ ముగిస్తారు.


*లేగ దూడ చదువు *: అన్నతోనూ, అక్కతోను చిన్నారి చిట్టి ఇంకా బళ్ళో వెయ్యకపోయినా, రోజూ బడికి వెళుతుంటుంది. దాని పెంపుడు లేగ

దూడంటే చిట్టికి ప్రాణం. తాటాకుతో నాలిగ్గీసుకుని, చద్దనాలు తిన్న పిల్లలంతా, బడికి వెళ్ళే దారిలో పద్యాలు వల్లె వేసుకుంటూ, ఆరేసిన నూలు

తాకుతూ, అదిలిస్తున్న పెద్దల్ని అనుకరించి ఆటపట్టిస్తూ, 'నువ్వు నాకు నిన్న జీళ్ళు పెట్టలేదుగా...' అంతే, 'ఇవాళ పెడతాలేరా...' అని

వాదులాడుకుంటూ, చివరగా గంగన్న తాత చేత విభూది పెట్టించుకుని, ' బడికేల్తున్నాం తాతా,' అని చెప్పి, బడికి చేరతారు. ఈ లోపల

లేగ దూడ పాలేరు ఎంత అదిలించినా, చిట్టి కోసం బడి ముందే నిలబడిపోతుంది. చిట్టి పరిగెత్తుకొచ్చి, చేతనున్న పలక చూపి, అ ..ఆ ... ఇటు

చూడు, ఇవి అంకెలు... ఇది నా బొమ్మ, ఇది నీ బొమ్మ అని చూపుతుంటే, లేగ దూడ చిట్టి చేతులూ, వొళ్ళు నాకేసి, చివరగా పలకకి

అటుపక్క, ఇటుపక్క నాకేసి, తల్లిని కలుసుకోవడానికి వెళ్ళిపోతుంది.

అమరావతి కధలు 2

 
లంకల్ల పుట్టింది లచ్చి తల్లి






 ఈ రోజుల్లో స్విమ్మింగ్ నేర్చుకోడానికి ఎన్ని తిప్పలండి? దానికో డ్రెస్, కేప్, ముక్కు- చెవులకు బడ్స్, గాగుల్స్, ట్యూబ్ లు, నాన హడావిడి

చేసి, బోలెడు డబ్బు తగలెట్టి, చివరికి హమ్మో మా వల్ల
కాదు, అని వదిలేస్తారు. ఒక వేళ నేర్చుకున్నా, ఒక్క సారి ఆ చివరి నుంచి, ఈ

 

చివరికి ఈదేసరికి బస్తాలు మోసేసినట్టు ఆయాసపడి, దిక్కులు చూస్తారు. ఈదేది తక్కువ, విరామాలు, పానీయాలు ఎక్కువ. మరి కృష్ణ

 

వడ్డున గోడలకు, పాలేల్లకు, ఎవరు ఈత నేర్పారు? ఆ వద్దు నుంచి, ఈ వడ్డుకు కిలోమీటర్ పైన ఆగకుండా, వాళ్ళు ఎలా ఈదుతారు?ఇలా

 

ఆలోచించి, ఈ కధ చదివేటప్పుడు నవ్వుకున్నాను.

 

పశువులని మేపడానికి లంకలకు (నది మధ్య రెళ్ళు గడ్డి మొలిచిన చిన్న ద్వీపాలు) కధలోని ఇతివృత్తం. వందలాది పశువులు, గుభిల్లున

 

కృష్ణలో దూకుతున్నాయి. మొరలు నీళ్ళలో ముంచి వెంటనే పైకి తేలుతున్నాయి. రేవు చూడగానే, నీళ్ళలో దిగగానే, ఎక్కడ లేని ఆవేశం

 

వాటికి. పాలేళ్ళు తెప్ప కొయ్యాల మీద పడుకుని, తలల మీద చద్ది మూటలతో ఈదుతున్నారు. కొందరు ఆవు తోకలు పట్టుకుని,

 

ఈదుతున్నారు. మంద విడిచి వెళ్ళిపోతున్న పసువులను, అదిలించి మందలో కలుపుతున్నారు. గొడ్లు లంకల్లో మేతకు పడ్డాకా, బువ్వ

 

మూతలు విప్పి, పచ్చళ్ళు పంచుకుంటూ తిని, ఎవరో కొమ్మెక్కి పిల్లన గ్రోవి వాయిస్తుంటే వింటూ, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

 

సాయంత్రం మొక్క జొన్న చేలోంచి, పది కండెలు అడిగి కోసుకు తిన్నారు. అందరు బయల్దేరి వెళ్ళిపోగా, పున్నయ్య గారి కర్రావు రానని

 

మొరాయించింది. పాలేరు రాములుకి అది ఈనడానికి సిద్ధంగా ఉందని అర్ధమయ్యింది. దూడ పుట్టగానే, కర్రావుకు ఎక్కడ లేని తమకం,

 

తొందర...ప్రేమగా నాకేస్తోంది. రాత్రంతా, ఆవును అక్కడే ఉంచితే, వాతం కమ్ముతుందని, రాములుకి ఆందోళన. ఇవతలోడ్డున పున్నయ్య గారు

 

కంగారు పడిపోతున్నారు. ఆయనకు ఆ ఆవు కన్నకూతురి లాంటిది. ఆవు ఈనిందన్న గట్టి నమ్మకం తోటి వేన్నీళ్ళు పెట్టించాడు, మడ్డి కూడు

 

వండించాడు. కాని ఆవు ఇవతలి వొడ్డుకు ఎలా వస్తుంది?


ఇంతలో అవతలోద్దుకు వెళుతున్న పడవ అటుగా వచ్చింది. సరంగును బతిమాలి, ఆవుని, దూడని అందులో ఎక్కించి తను ఈదుకుంటూ

వెళ్ళాడు రాములు. ఇవతల వొడ్డుకు రాగానే, లాంతరులతో ఎదురు చూస్తున్న పున్నయ్య గారు, లేగ దూడను ఎత్తుకుని, ' మా తల్లే,

మా అమ్మే, ' అంటుంటే, కర్రావు పున్నయ్యను, దూడను మార్చి మార్చి నాకింది. సంబరంతో రంకెలు పెట్టింది. కొట్టంలో ఆవుని, దూడని

పున్నయ్య స్వయంగా కడుగుతుండగా, వాజ్యంలో పొలం పున్నయ్యకే దక్కిందని, కబురు వస్తుంది. 'గోడ్దోచ్చిన వేళ'.. అని పున్నయ్య భార్య

ఆనందంగా అంటుంటే, పున్నయ్య పొంగిపోయి, లేగ దూడను ముద్దెట్టుకున్నాడు...

సున్నితమయిన భావోద్వేగాలు నిండిన ఇటువంటి  కధలు నేడు చాలా అరుదు.

అమరావతి కధలు 3

 
తృప్తి

 
 



 
పూర్ణయ్యని అందరూ బావగాడంటారు. బావగాడు లేకపొతే, సరదా లేదు, సందడి లేదు. పెళ్లి గానీ, పేరంటం గానీ, వంత వాళ్ళ దగ్గరనుంచి,

వద్దనల దాకా స్వయంగా
చూసుకునేవాడు.


ఒకసారి వన సంతర్పణ కి అంతా మామిడి తోపులో చేరారు. గాడిపొయ్యి వెలిగించి, వంటకాల లిస్టు చదివాడు బావగాడు. 'వంకాయ మెంతి

కారం పెట్టినా కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి, పొట్లకాయ పెరుగు

పచ్చడి, అల్లం, ధనియాల చారు, మసాల పప్పు చారు, జీడిపప్పు పాయసం, మామిడికాయ పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరు

మిరపకాయలు,' చెబుతుంటే, అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీళ్ళు ఊరిపోయాయి.

వంటలు కాక ముందే భోజనం మీద మమకారం పెరిగిపోయింది.జిహ్వ గిలగిల లాడుతుండగా ఆకలి అగ్నిలా లేచింది. మధ్య మధ్య నవ నవ

లాడే వంకాయలని, వాక్కాయలు తెచ్చి పులుపు చూడమని, పాయసంలో జీడిపప్పు రుచిని, చుక్కకూర పెసరపప్పుతో మేళ వింపుని ,

పులిహోర పోపు ఘాటుని వర్ణిస్తూ తెగ ఊరించేసాడు బావగాడు. జనాలకి ఆకలి నిలువెత్తయిపోయి, శరీరం అంతా ఆకలే అలముకుంది.

ఎప్పుడూ వడ్డిస్తారా అని ఆవురావురు మంటున్నారు. చివరకు గంట కొట్టి, అరిటాకులు కడుక్కు రమ్మనాడు బావగాడు. అందరినీ పేరు పేరునా

అడుగుతూ, మారు వడ్డిస్తుంటే, జనాలు ఆబగా తింటున్నారు. జన్మలో ఇంత దివ్యమయిన వంత ఎరగమన్నారు. అందరికీ తాంబూలాలు

ఇచ్చకా, వంటవాల్లను కూర్చోపెట్టి, 'కష్టపడి వండారు, తినండి..' అంటూ కొసరి కొసరి వడ్డించాడు.ఆఖరున గాడి పొయ్యి పక్కన చిన్న ఆకు

వేసుకుని, అంతా తినగా మిగిలిన ఒక గరిటెడు పప్పు, కాస్త పచ్చడి, గుప్పెడు పులిహోర మెచ్చుకుంటూ తిని, అందరి భోజనం తనే తిన్నంత

తృప్తి పడ్డాడు. నలుగురూ హాయిగా తిన్నారన్న తృప్తే, బావగాడి తాంబూలపు పెదవి పైని చిరునవ్వు.

తెలుగు పుట్టినరోజు వేడుకలు



తెలుగు పద్ధతిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎలా ?




గత వారం నాటా సభల్లో శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు మాట్లాడుతూ తెలుగు వాళ్ళు పుట్టిన రోజు

 ఎలా చేసుకోవాలో చెప్పారు. మీతో ఆ సందేశం ఇక్కడ పంచుకుంటాను.

ప్రస్తుతం మనం పుట్టిన రోజు ఎలా జరిపిస్తున్నాం? కేకు మీద కొన్ని కొవ్వొత్తులు వెలిగించి వాటిని 
 ఆర్పి 'హాపీ బర్త్

 

డే' పాట పాడుకుని కేకు తినేస్తాం. భారతీయ సంప్రదాయం ప్రకారం దీపాలు ఆర్పకూడదు. అందుకే మనం ఇంట్లో

 

పూజలు చేసుకున్నా హారతి కొండెక్కాలే కానీ, మనం ఎపుడూ ఆర్పం. ఈ జన్మలో మనం దీపలు ఆర్పితే వచ్చే

 

జన్మలో మనం గుడ్డివాళ్ళుగా పుడతారని మన పురాణాలు చెపుతున్నాయని జొన్నవిత్తుల గారు అన్నారు.

కాబట్టి మనం పుట్టిన రోజు చేసుకున్నా, పిల్లలకి చేపించినా కొవ్వొత్తులు ఆర్పకూడదు. మీకు ఎన్ని సంవత్సరాలు

 నిండాయో అన్ని కొవ్వొత్తులతో అఖండ జ్యోతిని వెలిగించండి. ఈ సందేశాన్ని మనందరికీ తెలియజేయాలని

జొన్నవిత్తుల గారు "పెళ్ళం పిచ్చోడు" సినిమాలో ఒక సన్నివేశం ద్వారా చెప్పారు. ఈ సినిమా 2005 లో విడుదల

అయింది, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకి ఉత్తమ తెలుగు సినిమా అవార్డుని ఇచ్చి సత్కరించింది. భారీ

తారాగణం లేదు కాబట్టి మనం ఈ సినిమాని ఆదరించలేకపోయాం. ఈ సినిమా తెలుగు వన్ ద్వారా యూ

ట్యూబులో ఉంది, వీలయితే చూడండి.

రుక్మిణి కల్యాణం

'రుక్మిణి కల్యాణం'






మిత్రులారా,

మీ వాళ్ళలో పెళ్లి కావలసిన అమ్మాయిలు ఉంటే, నాకు ఒక గొప్ప శాస్త్ర పండితులు పెళ్ళికి ముందు ఇచ్చిన ఈ అసలయిన 'రుక్మిణి కల్యాణం'

21 రోజులు, రోజుకు మూడు
సార్లు చదివించండి. ఎంతో మందికి ఇచ్చాను, అద్భుతమయిన ఫలితాలు చూసాను. తప్పక చదివిస్తారు కదూ!

స్త్రీ హృదయం

స్త్రీ హృదయం 
 


పెళ్ళయితే అన్నీ కష్టాలే అని, మనశ్శాంతి ఉండదని, పెళ్ళంటే, పెళ్ళాంతో కొత్త సమస్యలను ఆహ్వానించడం తప్ప వేరే ఎలాంటి ఉపయోగం

లేదని, ఆడవాళ్ళంతా సీరియల్ లో ఆడ విల్లన్ల టైపు అని, బంధాలను విచ్చిన్నం చెయ్యడమే వీళ్ళ పని అంటూ ఆడవాళ్ళని తేలిగ్గా, కూరలో

కరివేపాకు తీసినట్టు, తీసి పడేసే మగ వాళ్ళంటే, నాకెందుకో అంత సదభిప్రాయం లేదు. పైగా అవగాహనా లోపం వల్ల విలువయిన జీవన

మాధుర్యాన్ని కోల్పోతున్నందుకు, సానుభూతి కూడా.

ఒక రకంగా, మగవాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు పుట్టి పెరిగిన ఊరిని, తల్లిదండ్రుల్ని, ఇంటిని, స్నేహితుల్ని, వాతావరణాన్ని, యే

మాత్రం మార్చుకోనక్కర్లేకుండా, వదులుకోవక్కర్లేకుండా, పెళ్లి పేరుతొ కొత్త బంధాన్ని కలుపుకుంటూ, వంశాభివృద్ధి చేసుకుంటూ

సాగిపోతారు. సంప్రదాయం వాళ్ళకు ఇచ్చిన వరం అది. మాకా అవకాశం లేదే. ఒక మొక్కను ఉదాహరణగా తీసుకుందాం. విత్తనం నుంచి

మొలకెత్తి, అక్కడి నేల, మట్టి , గాలి, నీరు, ఎండ-వాన, అన్నీ పరిస్థితుల్ని తట్టుకుంటూ, అడక్కుండానే తన అవసరాలు కనిపెట్టి తీర్చే, చక్కటి

తోటమాలి వంటి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతుంది. చక్కగా నాటుకుని, నవ్వుల పువ్వుల్ని, మమతల పరిమళాలను అందిస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో, అందమయిన ఎదిగిన మొక్క లాంటి ఆ ఆడపిల్లను, తను జీవితాంతం సంరక్షించలేడు కనుక, పూర్తిగా, ఒక కొత్త

వాతావరణం లోనికి పంపించాలని అనుకుంటాడు తోటమాలి. అలా అనువయిన మొక్కను అందచందాలు, చదువుసంధ్యలు ,ఆస్తిపాస్తులు

చూసి, ఎంచుకుని, తెచ్చుకోవడం లో ఉన్న శ్రద్ధ, తెచ్చుకున్నకా, వేళ్ళు నాటుకుని, స్థిరపడే దాకా, సంరక్షణ పై పెట్టక పొతే, ఏమవుతుంది?

ఎటూ తోచక ,గాలివాటుకు, జోరు వానకు, అడ్డదిడ్డంగా పెరిగి, మిగిలిన మొక్కలకు కంటకమవుతుంది. కొత్త వాతావరణం లోకి వచ్చిన

ఆడపిల్లయినా అంతే. కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాలు, కొత్త నీరు, గాలి, పరిస్థితులు. ఒక కొత్త దారిలో వెళుతున్నాం. ఎలా వెళ్ళాలి?

నెమ్మదిగా, దారిలోని గురుతులన్నీ గమనించుకుంటూ, సాగాలి. వడివడిగా ప్రయాణిస్తే, తిరిగి వెనక్కి రాగలమా? అలాగే జీవితం ఒక కొత్త

మలుపును తీసుకుంటున్నప్పుడు, మెత్తగా, సహనంగా సాగకుండా, తమ ఆధిక్యత, దర్పం, మొదటినుంచి ప్రదర్సించుకోవాలని, ఎవరికి వారే

వారి ప్రత్యేకత ఎంత మాత్రం తగ్గించుకునే ప్రసక్తే లేదన్న పంతం తో ఉంటే ఏమవుతుంది? ఎటూ చెప్పుకోలేక, అన్నీ వైపులా సమర్ధించుకోలేక

ఉక్కిరి బిక్కిరి అయిపోతుందా భార్య పరిస్థితి. ఎదుటి వాళ్లతో పోల్చి తేలిక చెయ్యడాలు, పదే పదే లోపాలను ఎత్తి చూపే ప్రవ్రుత్తి, తనలో నిరాశ

దృక్పధాన్ని, నింపుతాయి. అప్పటిదాకా, గల గలా పారే సెలయేరు లాంటి ఆ అతివ , మందకొడి గా సాగే పిల్ల కాలువ అవుతుంది. తన

ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఎదుటి వారు తనను ఎందుకు అర్ధం చేసుకోరు, అన్న ఆలోచనలతో, మీరెలా ప్రవర్తిస్తే, అలాగే బదులిచ్చే

అలవాటు చేసుకుంటుంది. స్వామీ వివేకానంద చెప్పినట్టు, ఎదుటి వారి వైపు ఒక వేలు చూపిస్తే, మిగిలిన మూడు వేళ్ళు తమ వైపే

ఉంటాయన్న సత్యాన్ని తెలియని వారు వీరంతా. ఒక చేత్తో చప్పట్లు మోగవు. ఇప్పటికయినా ఎదుటి వారిని నిందించడంలో, దిగాజార్చడంలో

ఉన్న ఉత్సాహం ఇలాంటి వారు, తమను తాము సరిదిద్దుకోవడం లో పెడితే, జీవనం సౌఖ్యమై, హ్రుద్యమవుతుంది.

శ్రీ ఇంద్రగంటి హనుమాచ్చాస్త్రి గారి కధలోని ఈ మాటలు నన్ను ఎంతో కదిలించాయి. వారు ఇటువంటి అద్భుతమయిన వాక్యాలు రచించారంటే,

అనుభవైక వైద్యమే తప్ప, వేరెలాగు సాధ్యం కాదు. మీరు చదవండి.

'నలిగిపోయిన పురుషుడిని ఓదార్చడానికి, సేద దీర్చడానికి, ఎన్ని యుగాల నుంచి భగవంతుడు స్త్రీ హృదయం అనుగ్రహించాడో కదా.

పురుషుడి మిధ్యా పౌరుషం, అహంకారం, తెచ్చి పెట్టుకున్న కరకుదనం, అన్నీ స్త్రీ సన్నిధానంలోని ,అవ్యాజ కరుణ, అనురాగం ముందు,

మంచులా కరిగి, ద్రవించిపోతాయి.'

పోతన పద్యం

  


పోతన పద్యం 
 



చక్కటి పోతన పద్యాలు చూద్దామా,

మందార మకరంద మాధుర్యమునదేలు మధుపమ్ము పోవునే మదనములకు?

నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు?

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు?

పూర్ణేందు చంద్రికా స్పురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు?

అమ్బుజోద్భవ దివ్య పాదారవింద చిన్తానామృత పాన విశేషమత్త ,

చిత్తమేరీతి నితరంబు చేర నేర్చు? వినుతగుణ శీల మాటలు వేయునేల?

తాత్పర్యము:

మందార మకరందముల తీపి మరిగిన తుమ్మెద ఉమ్మెత్త పూలు చేరుకుంటున్దా ? ఆకాశ గంగా తరంగాలలో ఉయ్యాలలూగే రాజహంస

వాగులకు, వంకలకు వెళుతుందా?

తీయని లేత మామిడి చిగురులు తిని, పరవశించే కోయిల కొండ మల్లెలను కోరుతుందా?

పండు వెన్నెల బయళ్ళలో విహరించే చకోరం మంచు పోగల వైపు పోతుందా?

భగవంతుడి పాదాలను భజించడంలో మత్తెక్కిన చిత్తానికి, మరో చింత ఉంటుందా? వెయ్యి మాటలు ఎందుకు? పరమాత్ముని వలచిన మనసు

మరో వైపుకు చేరుకోదు.

గోరింటాకు

 
 గోరింటాకు



 అసలే ఆషాడం...ఎవరి చేతులు చూసినా ఎర్రగా గోరింటాకు. ఆడ మనసు, పల్లెల్లో పెరిగి- రక్తంలో మరిగిన సంస్కృతి - గోరింటాకు కావాలని

మొరాయించింది. మేహెంది నాకు ఇష్టం లేదు, ఏదో ఔషదం చేతికి పులుముకున్నట్టు ఉంటుంది. రెండు రోజులు
పోయాకా సగం చెరిగిపోయి,

 

వికారంగా కనిపిస్తుంది. ఈ మహా నగరంలో గోరింటాకా? మొక్క కనిపిస్తే, పీకేసి ఆ చోటులోఒంటి స్థంబం మేడ కట్టేస్తారు. అయినా సరే,


కావాల్సిందే! అంతే. 'లేడికి లేచిందే పరుగు...' కుదురూ కుంపటి ఉన్న ఘటమయితేగా.

మా అపార్ట్మెంట్ వెనుక ఇంట్లోనే, గోరింటాకు చెట్టుంది. కాని వాళ్లెప్పుడూ, కుంటి సాకులు చెప్పి ఇవ్వరు. ఇవాళా, అంతే అయ్యింది, బయట

కూర్చున్నావిడ- పండదని, లోపల ఉన్నావిడ- దొండ పాదు పాకింది, అందదని - చెప్పారు. ఇంకొంచం ముందుకి వెళితే, అపార్ట్మెంట్ ప్రహరీ

అంతా గోరింటాకు చెట్లే. అడక్కుండా కోసుకునే అలవాటు నాకు లేదు. వాచ్మాన్ని అడిగితే, పైన ఉన్నావిడ అవి వేసుకుందని, కోస్తూ చూస్తే,

శ్రావ్యంగా తిడుతుందని చెప్పాడు. పోనీ ఆవిడనే అడుగుదామంటే, లేదు. అసలు టైం పాస్ కి గొడవలు పెట్టుకోడానికి కాకపొతే, రోడ్డు మీద

గోరింటాకు చెట్లు వెయ్యడం ఎందుకు, వచ్చే పోయే వాళ్ళని తిట్టి పొయ్యడం ఎందుకు? అదేదో వాళ్ళ ఇంట్లోనే వేసుకుంటే, ఇన్ని తిప్పలు

ఉండవు కదా, ఇదో రకం మనుషులు, వద్దులే, అని ముందుకు వెళ్ళిపోయాను.

ఆ ఇల్లు అటు వైపు వెళ్ళినప్పుడల్లా, పదకొండేళ్ళు గా చూస్తున్నా. ఇంటి చుట్టూ సెంటు జాజి, గన్నేరు, నంది వర్ధనం, మందార, ఉసిరి, గోరింట

చెట్లు. చూడ ముచ్చటగా ఉంటుందా ఇల్లు- పాత తరహాలో కట్టి కొత్త హంగులు లేకపోయినా.., అడిగి చూద్దామని, అడిగితే, ఒక చక్కటి ఇల్లాలు

బయటికొచ్చి, కోసుకోమ్మా... అంది. హమ్మ, ప్రాణం లేచొచ్చింది, కోసుకుని, ధన్యవాదాలు చెప్పి వచ్చాను. ఇంటికొచ్చాకా, మా అత్తగారు

ఎప్పుడూ, వేసే ప్రశ్నే వేసారు, 'అమ్మాయ్, చేట్టేక్కావా ...గోడేక్కావా ?' , అని. ఆవిడకి నా మీద అంత నమ్మకం. లేదండీ, కొమ్మలు క్రిందికే

ఉన్నాయి అని చెప్పాను. మా చిన్నప్పటిలా రోట్లో వేసి రుబ్బడానికి లేదుగా. మిక్సి మాతను ఆశ్రయించాను. తర్వాత... ఏముందండీ, ఎన్ని

కబుర్లు చెప్పినా మీకు ముచ్చట తీరదుగా,....మళ్లీ కలుద్దాం, నేను కష్టపడి తెచ్చుకున్న గోరింటాకు పెట్టుకోవాలి కదా మరి !

శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి పద్యాలు

 శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి పద్యాలు

శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి చక్కటి తెలుగు పద్యాలు కొన్ని చూద్దామా!

పరమ సుకుమార దేహయై, భారమయిన

భవుని ధనువును కదలించు బలము కలిగి

వినయ సౌశీల్య గంభీరవిజయ అయిన

దేవిసీతను బోలు నా తెలుగుభాష.


ఇక్కడున్నట్టి మట్టిని ఈసడించి

ఎక్కడెక్కడి పిచ్చినో ఇచ్చగించి

వట్టి వాజమ్మలై పోయినట్టి మీకు

దిక్కురా ఇంక నిక్కమౌ తెలుగుభాష.

పుణ్య సంస్కృతి గల యట్టి పుడమి పుట్టి

అయ్యతెలియని జాతి దెయ్యమ్ము పట్టి

చిట్టి పొట్టి బట్టలు కట్టి చెడెడి జడుల

తెగులు పోగొట్టి నిలబెట్టు తెలుగుభాష.


నిండుచెరువున స్వచ్చమౌ నీటిభాష

పందిపకపక నవ్వేడు పైరుభాష

చెట్టుచుట్టును తిరిగేది పిట్టభాష

తెనేపనసలతోట నా తెలుగుభాష.


పదునాల్గు భువనాల భాషలన్నిటిలోన 

దేవభాషకు సాటి తెలుగుభాష 

భావ ప్రకటనలోన పదముల ఒదుగులో 

దేవభాషకు దీటు తెలుగుభాష 

అమితసుందరములై అలరారు లిపి యందు 

దేవభాషను మించు తెలుగుభాష 

అచ్చులున్ హల్లుల అక్షరాసంఖ్యలో 

దేవభాషకు మిన్న తెలుగుభాష.


కనులకింపైన పదహారు కళలభాష 
లలితకలలన్ని వ్యక్తమై వెలుగుభాష
నిత్యమును సత్యపధమందు నిలుపుభాష 
ఠీవిగా చూచు వాగ్దేవి, తెలుగుభాష.

తిరుపతి వేంకట కవులు


దివాకర్ల తిరుపతి శాస్త్రి 
చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి 


*దివాకర్ల తిరుపతి శాస్త్రి* (1872-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని

జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.

 వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి

పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ

ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.

బావా ఎప్పుడు వచ్చితీవు..,

చెల్లియో చెల్లకో..,

జెండాపై కపిరాజు..

వంటి పద్యాలు ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు .మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక

వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు

చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి

స్నేహాన్ని బలపరచింది.

వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చాకా , కాకినాడ లో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు

ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి

తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.

ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు

అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను

ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.

కవులకు మీసా లెందుకు .? అని ఎవరొ ఆ క్షేపిం చగా , తెలుగు లోను సంస్కృతం లోను మమల్ని మించిన వారెవరైనా ఉంటే , మీసాలు తీసి

మొక్కుతామని సవాలు చేస్తూ చెప్పిన పద్యం చూడండి

దోస మటం చెరింగియు దుందుడు కొప్పగ పెంచి నారమీ

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా

రోసము కల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ

మీసము దీసి మీ పద సమీపములం దలుంఛి మ్రొక్కమే !

అంటూ చమత్క రించారు .

ఇకపోతే మనందరి నోటా నిరంతరము పలికెడి పద్యాలు " పాండవోద్యోగ విజయం లోనివి.

బావా ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్

నీవాల్ల భ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖో పెతులే

నీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ

దేవుల్ సేమంబై నెసంగుదురె ? నీ తేజంబు హెచ్చిం చున్ .

ఉపనయనం

ఉపనయనం




రమణ మహర్షి మాటలలలో ఉపనయనం ప్రాముఖ్యత:

"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము
వేసుకోవటం కాదు. దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"

"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."

కాళిదాసు ఉపమానాలు





కాళిదాసు ఉపమానాలు 
 
* 'ఉపమా కాళిదాసః ' **... అన్నారు కదండీ, అలాంటి కొన్ని కాళిదాసు ఉపమానాలు చూద్దామా...

'రఘువంశము' కావ్యంలో అజ మహారాజు, విదర్భ రాజు చేల్లెలయిన 'ఇందుమతి' స్వయంవర సభకు వెళ్ళిన ఘట్టం ఇలా వర్ణిస్తారు.

'సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా,

నరెంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః'

తాత్పర్యము: ఆయా దేశాల నుండి వచ్చిన రాజకుమారులంతా ఉన్నతాసనాల మీద కూర్చున్నారు. ఇందుమతి తమ వద్దకు రానంతవరకూ,

ప్రతి ఒక్కడూ ఆమె తననే వరిస్తుందనే ఆశతో, ప్రకాసవంతమయిన ముఖంతో కూర్చున్నాడట. ఆమె తమను దాటి వెళ్ళిపోగానే వారి

ముఖాలు వివర్నమావుతున్నాయట. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి కాగడా పట్టుకుని, రాజ వీధిలో నడుస్తుంటే, ఆ కాగడాకి ఎదురుగుండా

ఉన్న భవనం కాంతివంతంగా ఉంటుంది. కాగడా భవనాన్ని దాటి వెళ్ళిపోగానే, పెద్ద చీకటి ఆ భవనాన్ని ఆక్రమిస్తుంది. అలా ఉందట

రాకుమారుల పరిస్థితి.

ఈ ఉపమానమే కాలిదాసుకు 'దీపశిఖా కాళిదాసు' అనే బిరుదాన్ని ఇచ్చింది.

 
'అభిజ్ఞాన శాకుంతలం ' లో శకుంతలను చూసిన దుష్యంతుడు ఇలా అనుకుంటాడు...

" ఇదం కిలావ్యాజమనోహరం వపుహు తపహక్షమం సాధయితుం య ఇచ్చతి

ధృవం స నీలోత్పల షత్రధారయా సమిల్లతాం ఛేత్తు మ్రుషిర్వ్యవస్యతి"

తాత్పర్యము: అసలు సహజ సౌందర్యమే ఉండాలి కాని ఎలాంటి బట్ట కట్టినా బాగుంటుంది. చంద్రునికి మచ్చ కూడా ఒక అందమే! ఈమె నార

చీర కట్టినా అందంగా ఉంది."

కాళిదాసు 'మేఘ దూతం' కావ్యం లోని ఉపమానాలు...

కుబేరుని శాపం వల్ల కలిగిన ప్రియావిరహంతో బాధపడుతున్న ఒక యక్షుడు
రామగిర్యాశ్రమంలో (మధ్య ప్రదేశ్ ప్రాంతంలోని రామటేక్)

 

సంచరిస్తూ, ఒక మేఘం ద్వారా ప్రియురాలికి సందేశం పంపడం ఇందులోని ఇతివృత్తం. మేఘుడిని ప్రసన్నం చేసుకోవడానికి పుష్పాలతో

 

పూజించి, అతడిని స్తుతిస్తాడు. తరువాతా రామగిరి నుంచి-- అలకా పట్టణం చేరవలసిన మార్గం సవిస్తరంగా వర్ణించి చెబుతూ, మేఘుడు శ్రమ


తెలియకుండా ఎలా ప్రయాణించాలో చెబుతాడు. మేఘుడు అలకాపట్టణం చేరేలోపుగా నదులు, పర్వతాలు, పట్టణాలు మొత్తం

ఇరవైనాలుగింటిని అతిమనోహరంగా వర్ణించారు-- కాళిదాసు.


ఉజ్జయిని నగరం మేఘుడు ప్రయాణించే దారిలో లేదు. అయినా తన నివాస నగరం మేఘునికి చూపించాలనే ఉద్దేశంతో ఆ మేఘుడిని అక్కడికి

కూడా పంపుతారు కాళిదాసు. 'సంధ్యాకాలం కంటే ముందుగానే ఉజ్జయినిలో ఉన్న మహాకాలేస్వరుని సన్నిధి చేరుకున్న, సంధ్యాకాలం వరకు

అక్కడే ఉండు. సంధ్యా పూజ సమయంలో నీ ఉరుముల ధ్వనితో ఈశ్వరుని సేవించి, సాఫల్యాన్ని పొందు... ఈశ్వరుని సేవించే అవకాశం

దొరికినప్పుడు విడువకూడదు కదా!
 
"అపయన్యస్మిన్ జలధర మహాకాలమాసాద్య కాలే ,స్తాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుహు

కుర్వన్ సంధ్యాబలిపటహతాం శులినః శ్లాఘనీయా, మామంద్రాణాం ఫలమవికాలం లప్స్యసే గర్జితానాం ||"

'మనుష్యులు ఒకరికొకరు దూరం అవడం తోటే, స్నేహం సన్నగిల్లుతుందని అంటారు. అది ఇతరుల విషయంలో వాస్తవం అయితే

కావచ్చునేమో కాని అత్యంత ప్రేమాస్పదులయిన దంపతుల విషయంలో ప్రేమ రోజురోజుకూ పేరుకొనిపోయి, ప్రేమ రాశిగా ఏర్పడుతుంది.'

"స్నేహానాహుహు కిమపి విరహే ధ్వంసినః తే త్వభోగా దిశతే వస్తున్యుపరిచితరసః ప్రేమరాశీభవన్తి"

మేఘుడిని పొగిడి, కార్యోన్ముఖుడిని చేసి, తన సందేశం అందించమనడంలో, కవి చాతుర్యం క్రింది వర్ణనల ద్వారా తెలుస్తుంది....

'ఉత్తముల ధర్మం ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడమే కదా!

ఓ మేఘుడా! నీ హృదయం నిండా ఆర్ద్రత ఉంది, సాధారణంగా ఇటువంటి వారు జాలి కలవారై ఉంటారు కదా!

అక్కడా ఇక్కడా విశ్రాంతి తీసుకుంటూ నా సంగతి మర్చిపోతావేమో మేఘుడా! పని చేసి పెడతామన్న మాట ఇచ్చిన వాళ్ళు ఆలస్యం చెయ్యరు

 కదా!

ఓ మేఘుడా! నా ప్రేయసీ కనపడగానే, మొదట 'నీ భర్త క్షేమంగా ఉన్నాడు', అని చెప్పు. ముందుగా చెప్పవలసినది క్షేమ వార్తే కదా!

 

కృష్ణ నామం

కృష్ణ నామం 
 


కృష్ణ'నామం అత్యంత శక్తివంతమయినది . కోటి జన్మల పాపాలను సైతం హరించివేస్తుంది. ధర్మాచరణ దుర్లభామయిన ఈ కలి యుగంలో,

కేవలం ఒక్క దైవనామస్మరణ మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడింది. తన అవతారం చాలిస్తున్నప్పుడు, శ్రీ కృష్ణ పరమాత్మ తన

 దివ్య తేజస్సును, శక్తులను శ్రీమద్భాగవతములో ప్రవేశింప చేసి," నేను ఈ భాగవతం లోనే నివసిస్తుంటాను. " అని అభయమిచ్చారు. 

విష్ణు గాధా శ్రవణముచే పరీక్షిత్తు, కీర్తనచే శుకుడు, స్మరణచే ప్రహ్లాదుడు, పాద సేవచే లక్ష్మి దేవి, పూజలచే పృధు చక్రవర్తి, అభివందనముచే

అక్రూరుడు, దాస్యముచే హనుమంతుడు, సఖ్యముచే అర్జునుడు సర్వస్వమూ ఆత్మ సమర్పణము చేసి బలిచక్రవర్తి, ఈ నవ విధ భక్తులచే

క్రుతార్దులయినారు. శ్రీ కృష్ణ భక్తి అంత గొప్పది.


ఎన్నో పాపాలు చేసిన 'అజామిళుడు' చివరి క్షణం లో 'నారాయణా!' అని యధాలాపంగా తన కొడుకుని పిలచి, శాశ్వత వైకుంట ప్రాప్తి

పొందాడు. ఈ కధ 'భాగవతం' లోని షష్ఠ స్కందం లో ఉంది. 'ఎన్నో పాపాలు చేసిన యితడు వైకుంటానికి ఎలా వస్తాడు? పైగా యితడు

పిలచినది తన కొడుకునే గానీ, శ్రీమన్నారాయణుడిని కాదు!' అన్న యమ దూతలతో, విష్ణు దూతలు ఇలా అంటున్నారు. ఎంత చక్కటి

పద్యమో, చదవండి---

సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళన మేవవా |

వైకుంటనామగ్రహణం అశేషాఘహరం విదుహు ||

పతితః స్ఖలితః చిన్నహ సందశ్తః తప్త ఆహతః |

హరిరిత్యవశేనాహ పుమాన్ నార్హతి యాతనాం ||



తాత్పర్యము: పేరు పెట్టి పలికినా, పరిహాసంగా పలికినా, వెక్కిరిస్తూ హేళనగా పలికినా, ఊట పదంగా పలికినా, యే విధంగా అయినా

 భాగావన్నామాన్ని ఉచ్చరిస్తే పాపాలన్నీ నిశ్శేషంగా నసిన్చిపోతాయి. పై నుండి పడినప్పుడు కాని, ఎముకలు విరిగినప్పుడు కాని, పాము,

తేలు లాంటివి కరచినప్పుడు కాని, వళ్ళు కాలినప్పుడు కాని, జ్వరతీవ్రతలో కాని, అమ్మ బాబోయ్ అని అరచే బదులు శ్రీహరీ, కేశవా, రామా,

నారాయణా వంటి భగవంనామాలను స్మరిస్తే, యాతనను అనుభవించవలసి ఉండదు. ఔషధము యొక్క గుణము తెలిసి వాడినా, తెలియక

వాడినా పని చేస్తుంది కదా!

మీ మనసుకి నచ్చిన దైవ నామాన్ని, గురు నామాన్ని స్మరించండి - తరించండి. 

తాతయ్య కబుర్లు


గొబ్బిళ్ళ పద్యం 




"సుబ్బీ! అదిఇది గొణగక గొబ్బున బొబ్బట్లు మింగి గొరగొర రా రా!

గొబ్బండుగ మన కనులకు
గొబ్బిళ్ళకు బంతిపూల గొడుగులు తోడుగన్."

అది సంక్రాంతి పండుగ. ఎక్కడ చూసినా సంబరాలే! అంతకు ముందు రొజు భోగి నాడు వేసిన భోగి మంటలు ఇంకా చల్లారలేదు. సంజ చీకట్లు

 గోరగోరా ముసురుకుంటున్నాయి. యే వీధిలో చూసినా రంగు రంగుల ముగ్గులూ, గొబ్బిళ్ళ పాటలూ కళ్ళకీ-- చెవులకీ విందు చేస్తున్నాయి.

గొంగళి కప్పుకుని గొంతుక్కూర్చుని తాతయ్య ఆ పాటలు వింటూ, ఆ ముగ్గులు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ నవ్వులు బామ్మ

హృదయానికి ముత్యాల గొలుసులు. వాళ్ళ మనవలు కాంతి, సుబ్బి... కాంతి గొబ్బెమ్మలు పెట్టుకునే ప్రయత్నంలో ఉంది. పసుపు, కుంకుమ,

ఆవుపేడ, బంతి పూలు, అటుకులు- బెల్లం, అగరొత్తులు అన్నీ సిద్ధం చేసుకుంటోంది. ఎక్కడి నుంచి ఊడి పడ్డాడో సుబ్బిగాడు, తను

వచ్చేవరకు గొబ్బిళ్ళు పెట్టడానికి వీల్లేదని చెప్పి, గొట్టం పాంటు సవరించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాడు రాకుండా గొబ్బిళ్ళు పెడితే

గొడవ చేస్తాడు. గొబ్బిళ్ళు కాళ్ళతో తొక్కేస్తాడు. వాడు అన్నింటికీ అక్కతో పోటి పడతాడు. వాడివి అన్నీ గొంతెమ్మ కోరికలే! అసలు వాడు

ఆడపిల్లగా పుడితే యే గొడవా లేకపోను. పాపం కాంతి వాడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. మధ్య మధ్యలో వాడు ఏం చేస్తున్నాడో అని

ఇంట్లోకి వెళ్లి వస్తోంది. వాడు నేతిలో ముంచుకుని తాపీగా బొబ్బట్లు తింటున్నాడు. వాడి తిండి అంత తొందరగా పూర్తవదు. తనని చూసి ఏదో

గొనుగుతున్నాడు. ఓ పక్క గొంతు దిగని బొబ్బట్టు ముక్కతో తంటాలు పడుతూ...

కాంతి స్నేహితురాండ్రు తొందర చేస్తున్నారు. కాంతితో కలిసి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర గొబ్బిళ్ళు పెట్టుకోవాలి. ఇదంతా గమనించిన

తాతయ్య గొంతెత్తి సుబ్బిగాడ్ని పిలిచాడు.

" గొబ్బిళ్ళకు బంతి పూలు గొడుగుల్లా గుచ్చిన దృశ్యం మన కళ్ళకు గొప్ప పండుగ. కడుపుకు తినడమే కాదురా సుబ్బీ..ఇంకేమి గోనక్కుండా

ఆ బొబ్బట్లు గొబ్బున మింగి గోరగోరా రారా!"

అరిటాకులో సగం మిగిలిన బొబ్బట్టు ఊరిస్తోంది. నోట్లో ముక్క ఇంకా గొంతు దిగలేదు. " తాతయ్య! నేను తరువాత చుస్తానులే! అక్కని

గొబ్బిళ్ళు పెట్టేసుకోమను.."

సుబ్బిగాడి తిండి యావ చూసి తాతయ్య గొల్లున నవ్వేసాడు. కాంతి స్నేహితురాళ్ళతో కలిసి గొబ్బిళ్ళు పెట్టుకుంది.

( శ్రీ ఎర్రాప్రగడ రామమూర్తి గారి 'తాతయ్య కబుర్లు ' పుస్తకం నుండి...)