Wednesday, December 18, 2013

మన భద్రత మన చేతుల్లోనే

పోయిన సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసాము. తెచ్చి పెట్టాడు. సాయంత్రానికి బాల్కనీ నుంచీ గదంతా గ్యాస్ వాసన. ఈ దిక్కుమాలిన అపార్ట్ మెంట్ లతో వచ్చిన చిక్కేమిటంటే, వాసనలు కూడా మన ఇంటివా, పక్కింటివా, క్రింద, పైన ఇంటివా ఏమీ తెలియదు. కుక్కలా వాసన చూసి పట్టాలి. ఎక్కడో గ్యాస్ వాసన అనుకున్నాను, ఈ లోపు మా వారు 'పద్మిని,ఇక్కడ గ్యాస్ వాసన వస్తోంది చూడు,' అన్నారు. సీల్ వేసిన ఫుల్ సిలిండర్ లీక్ అవుతుందని ఎలా అనుకుంటాం ? ఎందుకైనా మంచిదని వెళ్లి చుస్తే, ఫుల్ సిలిండర్ లీక్ అవుతోంది. శనివారం సాయంత్రం ఏడు దాటింది ... గ్యాస్ కంపెనీ మూసేశారు. ఆదివారం సెలవు... అత్యవసర నెంబర్ చేసాను. అది మారిపోయిందని/ చెల్లనిదని సందేశం వచ్చింది. వెంటనే యెల్లో పేజెస్ వాళ్ళని నెంబర్ అడిగాను. వాళ్ళ దగ్గర బుకింగ్ సెల్ నెంబర్ తప్ప లేదు. ఏం చెయ్యాలి ? అపార్ట్ మెంట్ వాళ్ళ సలహాతో సిలిండర్ తీసుకెళ్ళి టెర్రస్ మీద పెట్టాము. ఇక చేసేదేముంది, సోమవారం ఉదయం వరకూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాను.

సోమవారం ఉదయం ఫోన్ చేస్తే, వాళ్ళు మధ్యానానికి సర్వీస్ అతన్ని పంపారు. అతను గ్యాస్ లీక్ అవుతోందని, సగం సిలిండర్ అయిపోయిందని, మళ్ళీ మేనేజర్ పెర్మిషన్ తీసుకుంటే, కొత్తది ఇస్తారేమో అడగాలని చెప్పాడు.సదరు మేనేజర్ అయ్యవార్ని కలిసేందుకు వెళ్తే వారు వస్తారు, వస్తారు... అంటూనే రారు, ఇక మంగళవారమే అన్నారు. సరే అక్కడ ఉన్న స్టాఫ్ తో మాట్లాడాలని వెళ్ళాను.

ప్రభుత్వ ఆఫీసుల్లో గొప్పతనం ఏమిటంటే, మనుషుల్ని పురుగుల్ని చూసినట్టు చూడడం, అవతలి వాళ్ళు గగ్గోలు పెడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం. ఇలాంటి వాళ్ళని చుస్తే, 'ఫర్ ఎవరీ ఆక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అప్పోసిట్ రిఅక్షన్ 'అన్న న్యూటన్ నెత్తిన మొట్టాలని అనిపిస్తుంది.

గ్యాస్ అయ్యవారు లేరు కనుక, అమ్మగారికి ఫోన్ చేసారు. ఆవిడ ప్రపంచంలో ఎవరూ కనీ వినీ ఎరుగని అవిడియా ఇచ్చింది. మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకోవాలట. లీక్ అవుతున్న సిలిండర్ వాళ్లకు ఇస్తే, వాళ్ళు కంపెనీ కి పంపి, వాళ్ళు వప్పుకున్న రోజున మళ్ళీ నాకు సిలిండర్ ఇస్తారట. నాకు ఒళ్ళు మండింది. వెంటనే ఇంటికి వచ్చి, హెచ్ .పి వెబ్సైటు లో ఆన్లైన్ కంప్లైంట్ పెట్టాను. క్లుప్తంగా ఇలా...

౧. లీక్ అవుతున్న సిలిండర్ ఇవ్వటం కంపెనీ తప్పు.
౨. ప్రింట్ అయిన రేసిట్ లు ఉండిపోయాయని, ఎమర్జెన్సీ నెంబర్ లు మారినా కొత్తవి వినియోగదారులకు ఇవ్వకపోవడం డీలర్ తప్పు.
౩. ఇవన్నీ ఉన్నా, కస్టమర్ కి స్పందించకపోవడం, కొత్తది మళ్ళీ డబ్బు కట్టి తీసోకోమనడం చాలా బాధాకరం.

అయ్యా, ఆలోచించండి. నా చోటులో మీ భార్య/ కుమార్తె ఉంటే... వాళ్ళు గ్యాస్ లీక్ చుసుకోకపోతే. మీ నిర్లక్ష్యం ఖరీదు, ప్రింట్ అయిన రిసీట్ లు వృధా కారాదన్న కక్కుర్తి ఖరీదు, కొన్ని జీవితాలు కావచ్చు. ఈ విషయంపై మీరు చర్య తీసుకుని, నా సిలిండర్ నాకు ఇప్పించ ప్రార్ధన.

మర్నాడు గ్యాస్ కంపెనీ వారే నాకు ఫోన్ చేసి, కొత్త సిలిండర్ ఇచ్చి వెళ్లారు. అంతే కాదు, డీలర్ కు చీవాట్లు పెట్టారు కూడా. ఈ మధ్యన ఎందుకనో, సీల్ వేసిన గ్యాస్ సిలిండర్ లీకేజ్ లు ఎక్కువ అవుతున్నాయి.  నిన్నో, మొన్నో దినపత్రికలో చదివాను. కొత్త సిలిండర్ సీల్ తీస్తుంటే, ఒక్క సారిగా గ్యాస్ లీక్ అయ్యిందట. అది వారు కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో ఉండగానే, దేవుడి ముందు వెలుగుతున్న దీపం మంటకి గ్యాస్ అంటుకుని, వంట గదిలో ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు, ఒక ఎనిమిది నెలల పాప, ఒళ్ళు కాలిపోయి ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ దొంగతనం కోసం ప్రయత్నమో, లేక కంపెనీ వారి వైఫల్యమో, జరిగాకా ఏమీ చెయ్యలేము.

అందుకే, చికిత్స కన్నా, నివారణ మంచిది అన్న సూత్రం ప్రకారం, ఇలా చెయ్యండి. మీ ఇంటి స్త్రీలకు ఈ విషయం తెలియచెప్పండి. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే అబ్బాయి రాగానే, అతని చేతే, సీల్ తీయించి, రెగ్యులేటర్ పెట్టించి, వెలిగించి, లీకేజీ లేదని నిర్ధారించుకున్నాకే, డబ్బులు ఇవ్వండి. మన భద్రత కోసం ఇది తప్పనిసరి. మర్చిపోకండే, వెంటనే చెప్పండి.


 

No comments:

Post a Comment