Monday, December 15, 2014

వెరైటీ తిళ్ళు

వెరైటీ తిళ్ళు 
-------------------
భావరాజు పద్మిని 

పొద్దుటే నిద్రకళ్ళు నులుముకుంటూ వంటింటి అధ్యాయానికి తెర తీస్తుండగా, కళ్ళ ముందు లీలగా కదిలింది...'భామా రుక్మిణి' సినిమాలో కమలహాసన్ లాంటి ఒక బామ్మ.

"ఏవిటే 'కుక్కు'తున్నావ్... అంది దబాయింపుగా..."

"బామ్మా, మనిషికి స్వప్న జాగృత్ సుషుప్తి అవస్థలు అని, 3 రకాల అవస్థలు ఉంటాయని నాకు తెలుసు. కాని, ఇవేవీ కాని 'స్కూలావస్థ ' లో మగ్గుతుంటే, ఇటులొచ్చి లేడీ నాగార్జున లాగా ప్రశ్నలు అడుగుట పాడియా ? చెప్పు ? "

" పాడి, కాదు పశువు కాదే అమ్మా ! పైలోకంలో కాసిన్ని మంచి పనులు చేసానా, యముడు మెచ్చి, అలా ఒక్కరోజు నీకు ఇష్టమైన చోట తిరిగి రా ! అని స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. గూగుల్ సెర్చ్ లో బాగా కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరా అని వెతికితే, 'కబుర్ల పోగు - భావరాజు పద్మిని' అని చెప్పింది. అందుకే ఇలా వచ్చా ! కాసేపు కబుర్లాడితే దీవించి వెళ్ళిపోతా అంతే ! "

" ఐతే ఓకే బామ్మా, టీ తాగుతావా..."

"వద్దు, ఆత్మలకి ఆకళ్ళు ఉండవు కాని, ఏవిటీ నలకల్లా కూరలు తరుగుతున్నావ్ ?"

"బామ్మా ! ఎన్నని చెప్పను నేటి అమ్మల కష్టాలు ? సొత్ , నార్త్ ఇండియా దాటి, చైనీస్, ఇటాలియన్, పొరుగింటి పుల్లకూరలు భారత్ కు వలస వచ్చేసాయ్. రకాలు పెరిగిన కొద్దీ, పిల్లల కోరికలు పెరిగాయి. ఇదిగో, రాత్రి ఇవాల్టి మెనూ లో 'హక్కా నూడుల్స్' కావాలని చెప్పి, పడుకున్నారు పిల్లలు. చైనా చింకి కళ్ళకి కనపడాలనేమో, కూరలు ఇలా నలకల్లా తరుక్కు చస్తారు. వాళ్ళని చూసి, మేమూ వాతలు పెట్టుకుంటున్నాం."

"ఎలాగెలాగ... హక్కు నూడలస్సా... అంటే ఏమిటి ? అసలు అచ్చ తెలుగు పిల్లవి, ఆ వంట ఎలా చేస్తావ్..."

"ఏముంది బామ్మా, మార్కెట్ లో పొడవాటి తాళ్ళ లాంటి ఈ ప్యాకెట్ దొరుకుతుందా, దీన్ని తెచ్చి, సగం ఉడకబెట్టి, సన్నగా తరిగిన ఈ కూరలు వేయించి, అందులో మాలాంటి అజ్ఞానుల కోసం చైనా వాడు కనిపెట్టిన 'చింగుల ఫార్ములా ' వెయ్యాలి ?"

"ఏవిటో నీ గోల, దీనికంటే, నరకంలో కేకలే బాగున్నాయ్... పాపాత్ములని కుండలో ఉడకబెట్టినట్టు, ఈ సగం ఉడకడం ఏవిటే అమ్మా, చిరుగుల ఫార్ము అంటే, కోళ్ళ ఫారం లాంటిదా ?"

"కాదు బామ్మా, అదొక పోట్లంలో పొడి. అది వేస్తే, ఆ రుచి వస్తుందన్నమాట . సగం ఉడికిన నూడుల్స్ అంటే, మళ్ళీ నూనెలో వేస్తే, అంటుకు పోకుండా, అలా ఉడకబెట్టాలి... ఒక్క ఐటెం వింటేనే  అలా కుదేలైపోతే ఎలా బామ్మా ? ఇంకా వేపుడు బియ్యం, వేడి కుక్క, పిజ్జా లు, బర్గర్ లు, పాస్తా లు, మంచురియా, మోమో లు, కేకు లు ... ఇలా నేటి అమ్మలు ఎన్ని చెయ్యాలో తెల్సా... "

"ఏవిటే ఇవన్నీ... కుక్కలూ, పిచ్చలూ నా ? ఈ తిళ్ళు అన్నీ వచ్చాకే రోగాలు ఎక్కువ అయ్యయేమో. ఎవడూ తేలిగ్గా చావడే . హాస్పిటల్లో మగ్గీ, మగ్గీ... వీళ్ళకి నరకంలో శిక్షలు అంటే కూడా ఎద్దేవా అయిపొయింది. మొన్నొకడు, నూనెలో వేగుతూ... హ హ కితకితలు... హైదరాబాద్ ఎండల కంటేనా ... అన్నాడు. ఇంకోడు కొండ మీద నుంచి దొర్లిస్తుంటే... హ హ... రోలరు కోష్టరు రైడ్ కంటేనా, అది తిరగేసి, మరగేస్తుంది అన్నాడు..."



"అవును బామ్మా, ఇప్పుడు మనుషులకి బోలెడు తిళ్ళు, బోలెడు కష్టాలు ! చిన్న వయసుల్లో షుగర్ లు, రోగాలు, హార్ట్ ఎటాక్ లు... బయటి తిళ్ళు... కాని, ఎన్ని తిన్నా నేను జన్మలో మర్చిపోలేని తిండి ఒకటుంది చెప్పనా ?"

"ప్రొసీడ్...."

"వెన్నెల్లో పీటేసుకుని, చుట్టూ మనవళ్ళని, కొడుకుల్ని, కోడళ్ళని, మనవరాళ్ళని కూర్చోపెట్టుకుని,  చద్దన్నంలో బెల్లపావకాయ కలిపి, ఓ గిన్నెడు నెయ్యి పోసి, దబ్బపండంత ముద్ద కలిపి, మా చేతిలో పెట్టేది మా బామ్మ. రెండు ముద్దలు తింటే, కడుపు నిండిపోయేది. ఆ రుచి, ఇప్పుడు ఎన్ని రకాలు తిన్నా రాదనుకో..."

"అవునే పిల్లా, నిజమే !"

"మరి బామ్మా, నీకు బోలెడు కబుర్లు చెప్పాగా, నాకు నరకంలో శిక్షలలో స్పెషల్ డిస్కౌంట్ ఇప్పిస్తావా ?"

"హమ్మా, ఎక్కడన్నా బామ్మ కాని, బాసు యముడి దగ్గర కాదేవ్... ఇంకాసేపు ఉంటే, వరాలు కూడా అడుగుతావేమో ! నేను డింగ్... నువ్వు చింగ్..."

" బామ్మా , దీవించడం మర్చిపోయావ్.... ఆగాగు..."

Wednesday, December 10, 2014

పేర్ల గిన్నెలు

పేర్ల గిన్నెలు 
----------------
భావరాజు పద్మిని - 10/12/14 


అప్పట్లో నేను 6వ తరగతి చదువుతున్నా. నాన్నగారి ఉద్యోగరీత్యా మేము గుంటూరు జిల్లా భట్టిప్రోలు కు బదిలీ అయ్యి వెళ్లి, అక్కడి టి.ఏం.రావు  పాఠశాల లో చేరాము. అక్కా, నేను ఆటల్లో, పాటల్లో, నాట్యంలో, చదువులో మేటి. మమ్మల్ని 'ఆలూరి సిస్టర్స్ ' అనేవారు. స్కూల్ మధ్యమధ్య రకరకాల పోటీలు పెట్టి, బహుమతులు ఇచ్చేది. అప్పుడు మాచేత ప్రార్ధనా గీతాలు, నాటకాలు, స్వాగత నృత్యాలు చేయించేవారు. తర్వాత బహుమతుల కార్యక్రమం మొదలవగానే... ఒకటి తరువాత ఒకటిగా ప్రైజులు చాలా వరకు నాకూ, అక్కకే వచ్చేవి.
వాటిలో కొన్ని పుస్తకాలు ఉండేవి. కాని, ఆ ప్రైజుల్లో చాలా వరకూ ఊర్లో ఉన్న వారు స్పాన్సర్ చేసేవారు. అవి ఏమిటంటే...

పెద్ద స్టీల్ గ్లాసు, మగ్గు, గుండు చెంబు, పళ్ళెం, గిన్నెలు వంటివి. అప్పట్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం లేదు. అన్నీ స్టీల్ వే ! ఊర్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు సైతం పేరంటాళ్ళు స్టీల్ వస్తువులే న్యూస్ పేపర్ లో చుట్టి ,ఇచ్చేవారు. అలా 6,7,8, తరగతులు పూర్తి అయ్యేసరికి, మా దగ్గర ఒక చిన్న స్టీల్ కొట్టు పెట్టుకునేన్ని సామాన్లు పోగయ్యాయి. అమ్మ కొన్ని వాడేది, కొన్ని నీ కాపురానికి అని అటకమీద దాచేది(వాటిలో చాలా తుప్పు పట్టేసాయి)... కొన్ని ఇచ్చేసేది...



ఇక్కడితో కధ అయిపోతే సరదా ఏముంది ? ఇదివరలో తమ గిన్నెలు ఇరుగూ పొరుగూ పుల్ల కూర రుచి కోసం మార్చుకున్నప్పుడు, మారిపోకుండా, వాటి మీద పేర్లు రాసుకునే అలవాటు.   తాము ఇచ్చిన గిన్నె బహుమతి అందుకున్న వారు వేరే వారికి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో, స్టీల్ కొట్లో వస్తువు కొనగానే...' చి.ల.సౌ. దమయంతి వివాహ సందర్భంగా లక్ష్మీకాంతమ్మ, కాసులయ్య అందించిన కానుక ' అని రాసేవారు. అయితే, అప్పటికప్పుడు కానుకలు సిద్ధంగా లేనివారు, ఆ స్టీలు గిన్నె షాప్ కు తీసుకెళ్ళి, ఆ పేర్లు కొట్టించి, ఇంకో పేర్లు రాయించేవాళ్ళు. ఎవరైనా చనిపోతే, వారి జ్ఞాపకార్ధం కూడా స్టీల్ గిన్నెలు ఇచ్చేవారు.
మొత్తానికి, స్కూల్ దాకా వచ్చేసరికి ఆ గిన్నెలకు పేర్లు గొప్ప, గిన్నె కురచ లాగా ఉండేవి. అంతగా చదువుకోని ఆ ఊరి జనానికి స్టీల్ కొట్టు వాడే గతి. కొన్ని సార్లు ఒత్తులు, పొల్లులు ఎగిరిపోయేవి. అది చదవబోతే ఇలా ఉండేది.
'కీ.శే. అనంతరామయ్య పుష్పవతి అయిన సందర్భంగా  అందిస్తున్న కానుక..."
" కృష్ణమూర్తి గారి శ్రీమంతం సందర్భంగా వారి జ్ఞాపకార్ధం అందిస్తున్న కానుక..."
"దాని అమ్మ (దానమ్మ ) జ్ఞాపకార్ధం వారి కుమారుడు వెంకటరత్నం , కోడలు వెంకాయమ్మ అందిస్తున్న బహుమతి..."

ఇలా తీసివేతలు, కొట్టివేతల తో ఉన్న గిన్నెలు ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే, నా పెదాలపై చిరునవ్వు పూసేస్తుంది. ఏమైనా కష్టించి గెల్చుకున్న బహుమతి, కల్మషం లేని బాల్యం ఇవన్నీ జీవితపు పుటల్లో మధుర జ్ఞాపకాలు... కదూ !

మహాత్ములను తెలుసుకోవడం ఎలా ?

మహాత్ములను తెలుసుకోవడం ఎలా ?  

ప్రస్తుతం గారడీలతో పలువురు అనేక విధాలుగా మోసగిస్తున్న తరుణంలో, మాహాత్ములకు, గారడీ వాళ్లకు ఉన్న అంతరాన్ని గుర్తించేందుకు పెద్దలు చెప్పిన కొన్ని శ్లోకాలు, వాటి అర్ధాలు, మీకు ఇక్కడ ఇస్తున్నాను.

మహత్వ కార్యం క్రియతే మహద్భిః
హరేర్మహత్వ ప్రతిపాదనార్ధం |
ద్రష్టుశ్చ బుద్దేః పరివర్తనార్ధం
తద్భో మహాత్వస్య పరా పరీక్షా !

మహాత్ములు భగవంతుడి శక్తిని చూపించేందుకూ, చూసేవారిలో మంచి పరివర్తన కలిగించేందుకూ , మహిమలు చేస్తూ ఉంటారు. ఒక పని మాయా, మహత్తా అని నిరూపించేందుకు ఇదే చివరి పరీక్ష !

కో వేంద్ర జాలస్య మహాత్మనశ్చ
యధేష్ట సృష్టి ప్రణవస్య భేదః
ఏకశ్చమత్కార గతార్ధశక్తిః
మనఃపరీవర్తన చుంచురస్య |

గారడీ వాడు, మహాత్ముడు, ఇద్దరూ తలచుకున్నవి సృష్టి చేసేవారే. ఇద్దరిలో తేడా ఏమిటి ? ఒకరి శక్తి చూపరుల్లో ఉల్లాసం కలిగిస్తే, రెండవవారి శక్తి చూపరుల హృదయాలలో పరివర్తన కలిగిస్తుంది.



అంటే, వారు చేసే కార్యం వల్ల భగవంతుడి మహత్తు వెల్లడి కావాలి, ఆ కార్యం చూస్తున్న నీలో ఒక మంచి మానసిక పరివర్తన రావాలి. ఒక్కొక్కసారి అటువంటి కార్యం వల్ల నీలో తాత్కాలిక ప్రశాంతత రావచ్చు. లోకసామాన్యమైన వస్తువుల వల్ల తాత్కాలిక శాంతి కలిగితే, లోకాతీతమైన వస్తువు, అంటే భగవంతుడి వల్ల శాశ్వత శాంతి కలుగుతుంది. అందుకే మీ హృదయాన్ని మీరే చదవాలి ? ఎలా ?

హృదయంలో వ్యక్తమయ్యే అవ్యాజమైన ప్రశాంతతే అసలైన పరివర్తన. హృదయమంటే ఏమిటి ? గురువును ఎలా తెలుసుకోవడం ?

హృదయం నామ కిమితి
స్వతో వేత్స్యసి చింతనాత్ |
ప్రత్యభిజ్ఞాయతే శాంత్యా
హృదయే సద్గురుస్సఖే ||

మిత్రుడా ! హృదయమంటే ఏమిటో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఆ హృదయంలో శాంతి కలగడం ద్వారా నీవు నీ గురువును గుర్తు పట్టవచ్చు. ఎవరి సన్నిధిలో నీ హృదయం ప్రశాంతంగా ఉంటుందో వారే నీ గురువు.

చూసేవారిలో, అటువంటి శాంతిని తీసుకు రాలేనిది మహత్తు కాదు, గారడీ మాత్రమే !

(శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి - 'సూక్తి మాల- నీతి మంజరి' అనే పుస్తకం నుంచి, సేకరణ.)

Sunday, November 16, 2014

అమ్మ మనసు

అమ్మ మనసు (చిత్రం : పొన్నాడ మూర్తి గారు )
-------------------------------------
భావరాజు పద్మిని - 16/11/14
--------------------------------------
"నీకు బుద్ధుందా ? అన్నీ అల్లరి పనులే ! నీతో వేగలేక చస్తున్నానే !"
"ఏవిటో శ్రీమతిగారు చాలా కారంగా ఉన్నారు..."
"ఉండకేం చెయ్యమంటారు... చూడండి... ఏమీ తెలీనట్టు అమాయకంగా ఎలా మొహం పెట్టుకు చూస్తోందో. బాత్రూం నుంచి మగ్గు తో నీళ్ళు తెచ్చి హాల్ నిండా పోసేసింది. ఇప్పుడు ఇదంతా తుడవాలి..."
"ఏం తల్లీ, ఎందుకలా చేసావ్..."
చక్కగా నవ్వుతూ నాన్నని బుట్టలో పడేసి ఎత్తుకోమంటూ చేతులు చాస్తుంది పాప. ఇంకేముంది... ఇద్దరూ హత్తుకుని, నవ్వుకుంటారు...ఒకే పార్టీ !
"ఆ, ఆ , దాన్ని అలాగే నెత్తినెక్కించుకోండి.... ఇంకా అల్లరి చేస్తుంది... రాలుగాయి..."
____________________________________________________________________

"ఇలాంటి వెధవ్వేషాలు ఇంకో సారి వేసావంటే చావగొడతా ! రోజురోజుకీ నీ అల్లరి ఎక్కువౌతోంది..."
"మళ్ళీ ఏమయ్యింది..."
"ఆ మొహం చూడండి... పౌడర్ డబ్బా అంతా ఓంపేసి, భూతంలా మొహం నిండా పౌడర్ పట్టించుకు కూర్చుంది. చీకట్లో దబదబా నడుస్తూ, కిందున్న పౌడర్ వల్ల జారిపడబోయి, మంచం కోడు పట్టుకు చూద్దును కదా, దెయ్యంలా మంచం మూల నక్కి కూర్చుంది... హడిలి చచ్చాను..."
గట్టిగా నవ్వేసి, "అంతే కదా ! పోనీ ఆ పౌడర్ నేను తుడుస్తాలే ! కోప్పడకు... నువ్వు రా తల్లీ..."
చటుక్కున చంక ఎక్కేసి, అమ్మను వెక్కిరింతగా చూస్తుంది పాప...




కోపంగా పాపను తిట్టేస్తోంది అమ్మ...." అసలు... నిన్ను కాదే ! మీ నాన్నని అనాలి. అతి గారం చేసి, నిన్ను చెడగోడుతున్నారు..."
"ఓహో, ఈ సారి సమిష్టి యుద్ధమా ! ఇంతకీ నా అందమైన పెళ్ళానికి కోపం ఎందుకొచ్చిందో !"
"మీ మార్కెటింగ్ తెలివితేటలు నా దగ్గర కాదు ! ఇదేం చేసిందో తెల్సా ? పాలవాడు వచ్చాడని, తలుపు తీసి, పాల గిన్నె తేవడానికి వెళ్తే, ఈ లోపల బైటికి పారిపోయి, పక్కింటి డాబా సన్ షేడ్ మీద ఎక్కి, అమ్మా, నేను ఎక్కడున్నానో చెప్పుకో... " అంది. అక్కడి నుంచి పడితే... హమ్మో, నా గుండె జారిపోయింది. అయినా తమాయించుకుని, భలే వెళ్ళావ్, ఎలా వెళ్ళావో, అలాగే రా..." అని పిలిచాను, రాగానే బడితె పూజ చేసేసా. అదిగో, ఆ మూల కూర్చుని ఏడుస్తోంది. క్షణం చూపు తిప్పుకుంటే చాలు, సబ్బు ముక్కలా జారిపోతూ ఉంటుంది. దీన్ని పెంచడం నా వల్ల కాదు...
నాన్న, పాప మళ్ళీ షరా మామూలే !

___________________________________________________________________

"రెండు రోజుల నుంచి తినవు, తాగవు, నిద్రపోవు... కాస్త రెస్ట్ తీసుకో."
"ఎలాగండీ. చిన్నది అలా జ్వరం తో పడుకుని ఉంటే, నాకు ఏం తోస్తుంది చెప్పండి "
"అది అల్లరి చేసిందని తిడతావ్ కదా !దాన్ని విసుక్కుని, కసురుకుని, కొడతావ్ కదా ! ఇప్పుడు అది అల్లరి చెయ్యకుండా ఒక చోటే పడుందిగా , ఇంకేంటి నీ సమస్య ?"
"అదలా పడుకుని ఉండడమే సమస్య ! ఏ తల్లికి అయినా బిడ్డ సందడిగా తిరుగుతూ, ముద్దు మాటలు చెబుతుంటే సంబరం కాని, అది ఇలా నీరసంగా పడుకుని ఉంటే... నా ఒంట్లోని శక్తి అంతా ఎవరో పిండేసినట్టు ఉందండీ ! నేనూ చిన్నప్పుడు అల్లరి చేసిన దాన్నే కదా ! పిల్లల అల్లరి అమ్మకు ఇష్టమే ! కాని, కోప్పడి కాస్త నియంత్రించక పొతే... దానికి మంచేదో, చెడేదో ఎలా తెలుస్తుంది..."
"అయితే... దాని అల్లరి నీకూ ఇష్టమేనా !"
"అవునండి... నేనూ పక్కకెళ్ళి నవ్వుకుంటా ! చూడండి, ఎలా ఒళ్ళు తెలీకుండా పడుకుందో... మాయదారి జ్వరం నాకైనా వచ్చింది కాదు ! ఏం మాట్లాడరే ! అలా నా వంక ఎందుకు చూస్తున్నారు ?"
............................................................ ఎందుకంటే....
"అమ్మ మనసు అంటే ఏవిటో... నాకు ఇవాళే తెలిసింది...."

Tuesday, October 14, 2014

జ్వాలా దేవి - నవదుర్గల ఆలయాలు -1

జ్వాలా దేవి - నవదుర్గల ఆలయాలు
- భావరాజు పద్మిని 

ఏ ప్రాంతంలో ఉంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు, ఆలయాలు దర్శించాలని చెప్తుంటారుమా వారు . మా పెళ్ళయ్యిన నాటి నుంచి అలాగే తిరుగుతున్నాం...  ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లోని నవదుర్గల ఆలయాలు తప్పక చూడాల్సిందే అని అంతా చెప్పారు. అందుకే గతనెల 3 రోజులు సెలవలు ఉన్నప్పుడు బయల్దేరాము. 

ముందుగా వెళ్ళే దారిలో 'నైనాదేవి' ఆలయం దర్శించేందుకు వెళ్ళాము. సన్నగా వాన, కొండ దారి, చుట్టూ హరిత వన సౌందర్యం ! ముందు నిండు గర్భిణి లాగా వెళ్తున్న బస్ టాప్ ఎక్కి కూర్చున్నారు కొంతమంది. వాళ్ళను చూసి, మా చిన్నదానికి గొప్ప సందేహం వచ్చేసింది. "అమ్మా! వీళ్ళు సీట్ బెల్ట్ లు లేకుండా బస్సు మీద ఎక్కరే ! వీళ్ళని పోలీసులు పట్టుకోరా ? వీళ్ళు కింద పడిపోరా ? " ఏం చెబుతాం ? సమాధానం లేని ప్రశ్నలకి చిరునవ్వే సమాధానం కదా !

కేబుల్ కార్ ద్వారా  నైనా దేవి ఆలయం వద్దకు చేరుకున్నాం. సుమారు 100 మెట్ల మీద అంతా జారుడుగా ఉంది. విపరీతమైన రద్దీ. నేనూ, మా వారు నిల్చున్నాం. మా వెనుక నుంచి విపరీతమైన తోపుడు. పావుగంట ఆగి చూస్తే, నేను అక్కడే ఉన్నాను, మా వారు ముందుకు వెళ్ళిపోయారు. నేనొక మెట్టు అంచున ఒంటికాలి మీద కొంగ లాగా నిల్చున్నాను. ముందు చంటి పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు. నా కాలు జారితే, క్రింద ఒక వంద మంది వరుసగా పడిపోతారు. మళ్ళీ లేవలేరు. గుడి యాజమాన్యం భక్తుల రక్షణకు ఎటువంటి ఏర్పాట్లు చెయ్యకపోవడం శోచనీయం !ఇంతకు మునుపు ఇక్కడ తొక్కిసలాటలో దాదాపు 142 మంది చనిపోయారు. తొక్కిసలాటలు ఇలాగే జరుగుతాయేమో ! గురుదేవుల్ని స్మరించుకుంటూ నిల్చున్నాను. కాసేపటికి ముందుకు వెళ్లి చూద్దును కదా, మా వారు నాకు చాలా దూరం వెళ్ళిపోయారు, నేను మెట్ల మీద నుంచి క్యూ లో పడ్డాను. కొందరు vip లను ప్రక్క నుంచి పంపేస్తున్నారు. 2 గంటల నుంచి క్యూ లో నిల్చున్న నా ముందు వాళ్లకు ఒళ్ళు మండి, "ఛలో, బహుత్ హో గయా ఇమాందారి ...' అంటూ క్యూ పై నుంచి దూకేశారు. నేను సైతం... అర్ధమయ్యిందిగా... మొత్తానికి నేనూ, శ్రీవారు, అమ్మవారి ముందు కలిసి, దర్శనానికి వెళ్ళాము.

నైనాదేవి వీళ్ళ ప్రకారం 51 శక్తి పీఠాల్లో ఒకటి. అమ్మవారి కళ్ళు పడ్డట్టుగా భావించే ఈ ప్రాంతానికి కంటి జబ్బులు, సమస్యలు ఉన్నవారు ఎక్కువగా వస్తుంటారు. దర్శనం అయ్యి బయట హోమగుండం వద్దకు రాగానే , అక్కడున్న పూజారులు నా కుడి చెయ్యి ఒకరు,  ఎడమ చెయ్యి ఒకరు లాక్కుని రక్షలు కట్టేసారు. దాదాపు 3 గంటల తర్వాత వానలో భోజనం లేకుండా తిరుగు ప్రయాణం అయ్యాము. దారిలో పాపి కొండల వద్ద గోదారిలా లీలగా నా కళ్ళకు కనిపించింది ఒక మనోహర దృశ్యం... అది హిమాలయాల నుంచి ప్రవహించే ప్రఖ్యాత "బ్యాస్" నది అని తెలిసింది. ఆ నది నీరు రంగే వేరుగా ఉంది. దిగి ఫోటోలు తీసుకుందాం అనుకునే లోపు... అక్కడున్న పోలీసులు అక్కడ ఫోటోలు తియ్యకూడదని, ముందు ప్రతిష్టాత్మకమైన "భాక్రానంగల్ డాం" ఉందని చెప్పారు. అలా చూస్తూ ముందుకు వెళ్ళ సాగాము...

చిన్నప్పుడు నోరు తిరగని పేర్లలో  ఈ "భాక్రా నంగల్ డాం " ఒకటి. ఇది 741 అడుగుల ఎత్తులో ఒకప్పుడు భారతదేశంలో అతి పెద్ద డాం(ఇప్పుడు తెహ్రి డాం - ఉత్తరాఖండ్ 855 అడుగుల ఎత్తు కలిగింది ). స్వాతంత్ర్యం వచ్చాకా జవహర్లాల్ నెహ్రు (1955-1963) ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది. 2011 లో లష్కరే వల్ల ఈ డాం కు ముప్పు ఉందని తెలిసి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు పెంచింది. ఎందుకంటే... ఈ డాం లో యెంత నీరు ఉందంటే... ఒకవేళ దీన్ని పేల్చివేస్తే ... హిమాచల్, మొత్తం చండీగర్, హర్యానా, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా మునిగిపోతాయట.... ఈ డాం నిర్మాణానికి నిపుణులు పడ్డ కష్టాలు, ప్రాణాలొడ్డిన కొందరు ఇంజనీర్ ల వివరాల వీడియో లు యు ట్యూబ్ లో చూడవచ్చు. భద్రత కోసం  ఇప్పుడు ఆ డాం చుట్టుప్రక్కల ఫోటోలు, వీడియో లు తియ్యనివ్వరు.

బిలాస్పూర్  లోని నైనాదేవి నుంచి వెళ్తూ, దారిలో అనుకోకుండా సట్లేజ్ నదిపై కట్టిన ఈ డాం చూసాము. నాకు మన పాపికొండల మధ్య గోదారిలో లాంచి ప్రయాణం గుర్తుకు వచ్చింది. నిజానికి ఈ డాం పేరు కేవలం "భాక్రా డాం " ఒక్కటే నట ! కాని దిగువన ఉన్న నంగల్ లోని నంగల్ డాం ను దీనితో కలిపి అంతా "భాక్రానంగల్ డాం " గా చెప్తుంటారు. కొండల్లో లేత ఆకుపచ్చ రంగులో ప్రవహిస్తూ, మధ్య మధ్య మాతో దోబూచులాడుతూ వస్తున్న సట్లేజ్ నది  నీటిని చూస్తూ ముందుకు సాగాము. ఉదయం ఇంట్లో తిన్న ఇడ్లీ నే. భోజనం లేదు. కూడా తెచ్చుకున్న యేవో పదార్ధాలు తిని, ఆత్మారాముడిని శాంతింప చేసాము.

నంగల్ దాటి ఒక 50 కిలోమీటర్లు ముందుకు సాగాకా... పూరీలు, పరాటా ల బొమ్మలు తగిలించిన ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. ఇక్కడ వాళ్లకు పూరీలు పరాటాలే పంచభక్ష పరమాన్నాలు. సాయంత్రం 5 అవుతోంది. ఫోటోలు బానే ఉన్నాయి కాని, ఫుడ్ లేదు. కావాలంటే లస్సి చేసి ఇస్తాను అన్నాడు. అదే త్రాగి బయల్దేరాము. చింతపూర్ని వద్ద ట్రాఫిక్ జాం. కొండల్లో, వానల్లో ఇది మామూలేనట ! ఎప్పుడు ఏ దారి బ్లాక్ అవుతుందో తెలీదట ! జ్వాలాదేవి చేరుకునే సరికి రాత్రి 7.30 అయ్యింది. హోటల్ కి వెళ్లి పిల్లల్ని, అత్తగారిని దింపి, భోజనం ఆర్డర్ ఇచ్చాకా, మా వారికి వెంటనే దేవి దర్శనం చేసుకోవాలని అనిపించింది.

ఇద్దరం బయల్దేరాము. ఇక్కడి దేవుళ్ళకు కొబ్బరికాయలు, మహానైవేద్యాలు అక్కర్లేదు. మరమరాలు పెడితే చాలు. యేవో పటికబెల్లం పలుకులు, డ్రై ఫ్రూట్స్, కొన్ని స్వీట్స్ అమ్ముతారు. కొబ్బరికాయకు ఒక గుడ్డ చుట్టి , కాస్త ప్రసాదం, సాంబ్రాణి, వేసి వెదురు బుట్టలో ఇస్తారు. మనం తీసుకు వెళ్ళినవి కనీసం అమ్మవారికి తాకించరు . 'హో గయా చలో చలో...' అంటారు. ఉదయం నైనా దేవి వద్ద కొన్న బుట్ట తొక్కిడికి పుల్లలు పుల్లలుగా విడిపోయింది. అందులోని పూలు కొందరి నెత్తిన, మరమరాల ప్యాకెట్ విడి మరికొందరి మీద... ఇలా జారిపోయింది. బుట్ట కొంటే కాని, చెప్పులు పెట్టే వీలు లేదు. అయినా బుట్టలూ అవీ రద్దీలో ఎందుకని మెట్ల ప్రక్కన ఒక మూలగా చీకట్లో చెప్పులు విప్పాము.

"చూడు, నీవి కొత్త చెప్పులు. ఎవరైనా ఎత్తుకు పోతారు. నీ చెప్పుల మీద నా చెప్పులు కవర్ చేసి పెట్టు... "అన్నారు శ్రీవారు. అలాగే పెట్టి , వెళ్ళాము. పెద్దగా రద్దీ లేదు. అరగంట లోపే ఆలయ ముఖద్వారం వద్దకు వెళ్ళాము. అక్కడ ఉన్న పాదుకలకు దణ్ణం పెట్టుకున్నాము. మేము సరిగ్గా గుడి లోకి వెళ్ళగానే తలుపులు మూసేశారు. మా వెనుక ఉన్నవాళ్ళకు ఎవరికీ దర్శనం దొరకలేదు.

అంతా గురువుగారి దయ అనుకుని ముందుకు వెళ్ళాము. ఆశ్చర్యం ! అమ్మవారి ముఖం ఉన్న గూటిలో ఒక జ్వాల వెలుగుతోంది. సాధారణంగా, అమ్మవారు అంటే విగ్రహ రూపాన్ని తప్ప, ఒక జ్వాలను ఎవరూ ఊహించరు కదా ! అందుకే భక్తితో, దణ్ణం పెట్టుకున్నాం. దిగువన ఉన్న చిన్న గుహ వంటి ప్రాంతంలో మరొక రెండు జ్యోతులు వెలుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ మూడు జ్వాల లు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలాట! మునుపు ఏడు జ్యోతులు వేలిగేవని ప్రతీతి.

మహాభారతంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉందట. ఎటువంటి గడ్డు ప్రకృతి స్థితిగతుల్లో కూడా ఆరకుండా వెలిగే ఈ జ్యోతులు... అప్పటి నుంచి వెలుగుతూనే ఉన్నాయట ! పరిశోధించే వారికి ఇది సహజవాయువు... కాని ఇన్ని యుగాలుగా ఈ సహజవాయువు ఇంకిపోకుండా ఎలా ఉంది అనేదే ఇంకా వారికీ ప్రశ్నార్ధకం !



జ్వాలా దేవి ని గురించిన కొన్ని పౌరాణిక గాధలు ఉన్నాయి. కాంగ్రా మహారాజు రాజా భూమి చంద్ దుర్గా మాతకు పరమ భక్తుడు. ఈయనకు అమ్మవారు స్వప్నంలో కనిపించి ఆలయ నిర్మాణం చెయ్యమని ఆజ్ఞాపించిందట. ఆవుల మంద ద్వారా రాజు ఆలయం ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని, అందమైన ప్రాకారాలు, చక్కటి ఫోల్దింగ్ వెండి తలుపులతో ఈ ఆలయాన్ని కట్టించాడట . తర్వాతి కాలంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించి, మరిన్ని మెరుగులు దిద్దారట. 

అక్బర్ కాలంలో ఉన్న ధ్యాను భగత్ ఈ ఆలయాన్ని దర్శించడానికి యాత్రికులతో వెళ్తూ ఉండగా, చక్రవర్తి వెంటనే అతన్ని తన సభకు రప్పించి, అమ్మవారి గురించి అడిగాడట ! ధ్యాను అమ్మవారి శక్తిని గురించి చెప్పగానే, చక్రవర్తి ఒక గుర్రం తల నరికి ఇచ్చి, "మీ అమ్మ శక్తి నిజమైతే, ఈ గుర్రం తలను మొండానికి జోడించి, తిరిగి జీవించేలా చెయ్యమను !" అని సవాల్ చేసాడట !పగలూ రాత్రి ప్రార్ధించినా అమ్మ ప్రసన్నం కాకపోవడంతో ధ్యాను తన తలనే నరికి అమ్మకు సమర్పించాడట ! వెంటనే సింహవాహినియై ప్రత్యక్షమైన దేవి, గుర్రాన్ని, ధ్యాను ను తిరిగి బ్రతికించింది. అందరు భక్తులూ దేవి కృపకు ఇలాగె పాత్రులు కావాలని ధ్యాను కోరగా, దేవి ఒక వరం ఇచ్చిందట ! 

"ఎవరైనా ఇక్కడ భక్తితో ఒక్క కొబ్బరికాయ సమర్పిస్తే, వారు తమ తల నరికి సమర్పించినంతగా ప్రసన్నం అవుతానని " దేవి ధ్యాను కు వరమిచ్చింది. ఈ ఉదంతం విన్న అక్బర్ ఈ దేవి విషయం తేల్చాలని, స్వయంగా బయలుదేరాడు.

అక్బర్ చక్రవర్తి ఈ ఆలయం లోని జ్వాలను ఆర్పాలని అనేక ప్రయత్నాలు చేసాడట.చివరికి నీటి పైపు ను కూడా పెట్టి చూసినా ఈ జ్వాల ఆరలేదట ! ఈ వింతను చూసిన అతను అమ్మవారి భక్తుడై ఒక బంగారు ఛత్రాన్ని సమర్పించాడు. కాని అది వెంటనే ఏదో తెలియని లోహంగా, బండ రాయిగా మారిపోయిందట ! ఆ రాయిని ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. 

జ్వాలాదేవి గర్భగుడి నుంచి బయటకు వచ్చాకా, అంబికేశ్వర్ మహాదేవ్ మందిరం (శివాలయం ) ఉంటుంది. బయట దుర్గా దేవి, మహాలక్ష్మి ఉపాలయాలు ఉన్నాయి. అక్కడే బంగారు ప్రాకారాలతో వెలిగే ఒక విశాలమైన హారతి మందిరం ఉంది. ఇందులో రోజుకు 5 సార్లు దుర్గా సప్తశతి లోని శ్లోకాలతో దేవికి హారతి ఇస్తూ, శయన హారతి సమయంలో ఆమెకు వెండి ఆభరణాలను ధరింప చేస్తారు . ఈ హారతి లైవ్ లో , యు ట్యూబ్ వీడియో లలో చూడవచ్చు.

మరి అంతటి మహిమ ఉన్న "కొబ్బరికాయ" నివేదన గురించి తెలియక, మేము కేవలం ధనం సమర్పిస్తే ఎలా కుదురుతుంది ? బయటకు వచ్చి చూసేసరికి, మా వారి చెప్పులు ఎవరో ఎత్తుకు పోయారు. నావి మాత్రం క్షేమంగా ఉన్నాయి. "కొండ నాలుకకు మందేస్తే... ఉన్న నాలుక పోయిందని, నీ కొత్త చెప్పులు రక్షించబోయి నా చెప్పులు పోయాయి" అన్నారు మావారు. నేను ఒకటే నవ్వడం. పోన్లెండి, ఏడాది వాడిన చెప్పులేగా... అయినా చెప్పులు పొతే, చాలా మంచిదని, మన కర్మ వాళ్ళు తీసుకు పోయినట్లు అని గురుజి చెప్పారు, అన్నాను.

ఆకలి ఆవురు ఆవురు మంటోంది. ఉదయం నుంచి భోజనం లేదు. మనకు లాగా వీళ్ళకు పెద్ద పెద్ద హోటల్స్ ఉండవు. ఒక రేకుల పాక లో పరాటా లనే పరమాన్నంగా భావించి తిని, బయట లస్సి త్రాగి, పాన్ వేసుకున్నాము. ఆ రోజు అలా అమ్మవారి దయతో ముగిసింది...

జ్వాలా దేవి ఆలయం లోని నవ జ్వాలలను క్రింది లింక్ లో దర్శించవచ్చు...



Monday, September 29, 2014

చండీవనంలో లేడీ గజిని

  
                                               చండీవనంలో లేడీ గజిని 
12:02pm Apr 7
ఎయిర్పోర్ట్ లో దిగంగానే మొబైల్ లో స్వాగత సందేశం...
"airtel
మిమ్మల్ని చండీగర్ కు స్వాగతిస్తోంది. ఉచిత రోమింగ్ కొరకు 121 కు ROAM అన్న SMS పంపండి.
పంపాకా, ఇన్కమింగ్ ఫ్రీ అవ్వాలంటే 75 రూ. కట్టాలి అన్నారు. సరే, ఇదీ బానే ఉంది కదా, అని అంగీకార సందేశం పంపాను.

మరో రెండు కిలోమీటర్లు వెళ్ళామో లేదో... మళ్ళీ మొబైల్ కుయ్ అంది.
"airtel
మిమ్మల్ని పంజాబ్ కు స్వాగతిస్తోంది. ఉచిత రోమింగ్ కొరకు 121 కు ROAM అన్న SMS పంపండి.

ఇదేవిటండి ? అడిగాను శ్రీవారిని.
'
మరే! ఇప్పుడు మనం చండీగర్ నుంచి పంజాబ్ లో అడుగు పెట్టాము. ఇక్కడో తిరకాసు ఉంది. చండీగర్ యూనియన్ టెర్రీటరి. ఇది పంజాబ్, హర్యానా లకు రాజధాని. రెంటికీ మధ్యన ఉంది. అందుకే మనం ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో ఉన్నట్లు...'

మర్నాడు మా అమ్మాయి స్కూల్ కోసం వెళ్తుంటే, మరో సందేశం...
"airtel
మిమ్మల్ని హర్యానా కు స్వాగతిస్తోంది. ఉచిత రోమింగ్ కొరకు 121 కు ROAM అన్న SMS పంపండి.

నాకు ఏడుపోక్కటే తక్కువ ! అంతేకాదు, ఇక్కడ మేము పంచకుల అనే హర్యానా కు చెందిన విభాగంలో ఉండబోతున్నాము. ఇందులోనూ సెక్టార్ లు ఉంటాయి. చండీగర్ లోనూ సెక్టార్ లు ఉంటాయి. కాబట్టి, ఫలానా సెక్టార్ లో కాఫీ పొడి దొరుకుతుంది, అని ఎవరైనా చెప్తే, చవటాయి లాగా బుర్ర ఊపెయ్యకుండా, చండీగర్ సెక్టార్ లోనా? లేక పంచకుల సెక్టార్ లోనా, అని అడగాలన్న మాట !

అనవసరంగా అంటారు గాని, ఇందుకు కాదండీ వీళ్ళకి బుర్ర తక్కువని, అంతా జోకులేస్తారు! మీరు కూడా ఇక్కడికి వస్తే, అసలు ఏ రాష్ట్రంలో ఉన్నామో తెలుసుకునేందుకే సగం మేధా శక్తి స్వాహా అవుతుంది.

త్వరలోనే లేడీ ఘజిని కాబోయే కాబోతున్నాను, కాస్కోండి! అప్పుడు 'అచ్చంగా తెలుగు' అంటే ఏ రాష్ట్రంలో ఉంది ? అని అడుగుట తధ్యం!


చండీవనంలో ఆల్సి (ఆలూ + లస్సి )

చండీవనంలో ఆల్సి  (ఆలూ + లస్సి )

భావరాజు పద్మిని
12:28pm Apr 7
నవ్వుతారేమో !

ఆలూ... లస్సి... ఇవే ఇక్కడ అంతర్జాతీయ సమస్యలు. ఒకప్పుడు ఇక్కడ జనాల అవసరాలకు సరిపడా లస్సి తయారు చేసేందుకు మిక్సీ లు చాలక వాషింగ్ మెషిన్ లు కొని, తయారు చేసేవారట! మరి మంచి మీగడ ఉన్న మజ్జిగ, పంచదార.... ఇక త్రాగిన కాయము పెరుగుట తధ్యం!

ఇక ఆలూ... అంటే, ఓ బంగాళాదుంప... నీ దుంప తెగ! నిన్ను బంగాళాఖాతంలో పడెయ్య! కాశీ లో వదిలెయ్య ! పొద్దుట లేస్తే, నలభీముల్లాంటి ఇద్దరు వంట వాళ్ళు మా వారి గెస్ట్ హౌస్ లో... ఆలూ పరాటా, ఆలూ గాజర్, ఆలూ మేతి, ఆలూ బీన్స్... ఆలూ కుర్మా... ఆలూ శాండ్విచ్... ఇలా బాదేస్తున్నారు. ఒక రోజా, రెండు రోజులా... ఇక ఆలూ చూస్తే ,వికారం పుడుతోంది. ఇక ఆలూ తింటే, ఆలూ బొండా లాగా అవుతామని మీకు తెలిసిందేగా!

అందుకే, ఈ రోజు స్త్రీ స్వేచ్చ కోసం పోరాడినట్లు, ఆలూ స్వేచ్చ కోసం పోరాడాను. నలభీముల్ని, వంటింటి బయటకు తరిమి, లేత బెండకాయలు తరిగి వేయించుకున్నాను. భీముడిని, కరివేపాకు కోసుకు రమ్మని (ఇక్కడ కరివేపాకు అమ్మరు. కనిపెట్టి, కోసుకునో, కొట్టుకునో, రావాల్సిందే!) పంపి, టమాటో పప్పు చేసాను. ఇక తినడమే తరువాయి.

అధ్యక్షా! వెంటనే ఆలూ ను బాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. కూరల్లో నాకు నచ్చని ఒకే ఒక కూర ఆలూ...


కదంబం 3

"అచ్చంగా తెలుగు" ఫేస్ బుక్ బృందంలో అనేకమంది మిత్రులు అందించిన మంచి అంశాలు...

Shan Konduru
6:39pm Mar 7
శ్రీ బేతవోలు రామ బ్రహ్మం గారు వ్రాసిన ఈపాట తెలియని వారు ఉండరేమో.
ఇందులో కవి అమ్మవారిని, వారి ఆభరణాల అందాన్ని, భక్తుడి యొక్క భక్తీ భావనని
ఎంత అద్భుతంగా వర్ణన చేసారో, ఆవిష్కరించారో చూడండి.

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు | మా తల్లి లత్తుకకు నీరాజనం |
కెంపైన నీరాజనం || భక్తీ పెంపైన నీరాజనం ||
యో గీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి | బాగైన అందెలకు నీరాజనం |
బంగారు నీరాజనం || భక్తి పొంగారు నీరాజనం ||
నెలకొల్పు డెందాన వలపు వీణలు మీటు | మాతల్లి గాజులకు నీరాజనం |
రాగాల నీరాజనం || భక్తి తాళాల నీరాజనం ||
మనుజాలి హృదయాల తిమిరాలు తొలగించు | మాతల్లి నవ్వులకు నీరాజనం |
ముత్యాల నీరాజనం || భక్తి నృత్యాల నీరాజనం ||
చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు | మాతల్లి ముంగెరకు నీరాజనం |
రతనాల నీరాజనం || భక్తి జతనాల నీరాజనం ||
పసి బిడ్డలను చేసి - ప్రజనెల్ల పాలించు | మాతల్లి చూపులకు నీరాజనం |
అనురాగ నీరాజనం || భక్తి కనరాగ నీరాజనం ||
పగడాలు మరపించు ఇనబింబ మనిపించు | మాతల్లి కుకుమకు నీరజం |
నిండైన నీరాజనం || భక్తి మెండైన నీరాజనం ||
తేటి పిల్లల వోలె గాలి కల్లల నాడు | మాతల్లి కురులకు నీరాజనం |
నీలాల నీరాజనం || భక్తి భావాల నీరాజనం ||
జగదేక మోహిని సర్వేశు గేహిని | మాతల్లి రూపునకు నీరాజనం |
నిలువెత్తు నీరాజనం || భక్తి నిలువెత్తు నీరాజనం ||

______________________________________________________________________

కొల్లూరు విజయా శర్మ(2014)7:30pm Apr 24

"మగడు మెచ్చిన చాన కాపురంలోనా
మొగలిపూలా గాలి ముత్యాల వాన"

ఎంత అందమైన,అద్భుతమైన భావన... అసలు ఊహించటానికే ఎంత బావుంది. ముత్యాల జల్లులలో తడుస్తూ మొగలి పూల సుగంధం మనని కమ్ముతూ... ఆరుద్ర గారు ముత్యాల ముగ్గు లో టిఅటిల్ సాంగ్ లో రాసిన చరణం. .. అసలు ఈ పాటకి మూలం జానపద సాహిత్యం లో ఉంది.

"వీధినెందరు ఉన్న వీచదే గాలి
గడప నెందరు ఉన్న కురియదే వాన
మా చిన్ని అబ్బాయి వీధి నిలుచుంటే
మొగలిపూలా గాలి ముత్యాల వాన"
అని ఒక తల్లి తన బిడ్డ గురించి మురిసిపోతూ ఉంటుంది.

ఆ మాటనే ఆరుద్ర గారు "ముత్యమంతా పసుపు"పాటలో పొదిగారు.ఎంత అందంగా పొదిగారు నాకయితే ఆరుద్ర గారు చెప్పిన మాటే నచ్చింది. అన్యోన్యత,పరస్పర స్నేహం ఉన్న జంట జీవితం లో ప్రతి క్షణం మొగలిపూల గాలి ముత్యాల వానే కదండీ .

_________________________________________________________

కొల్లూరు విజయా శర్మ8:13pm Apr 22
నెత్తిన పాలు పోశావు అంటుంటారు కదా !అవి పాలు కాదు .... "ప్రాలు " అంటే బియ్యం . అంటే ఆశీర్వచనం లాంటిది . తలంబ్రాలు లో ఉన్న ప్రాలు అదే (తలన్ +పరాలు = తలంబ్రాలు ).
Vijaya

____________________________________________________

Durga Bhamidipati6:45am Apr 22
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జన్మదిన మాసోత్సవ సందర్భంగా...........................

బదిలీ కోసం టెలిఫోన్‌పై కవిత్వం: సిరివెన్నెల గారు పి అండ్‌ టిలో పని చేస్తున్నప్పుడు టెలిఫోనుపై కవిత్వం రాయమని పై అధికారి ఒత్తిడి చేస్తే టెలిఫోన్‌ విభాగానికి బదిలీ చేస్తాననే మాట తీసుకుని ఈ కవిత రాశారు.

దూర శ్రవణ యంత్రం
దూరాన్ని తీగతో కట్టిపడేసిన సవ్మెూహన మంత్రం
ప్రకృతి బంధనాలను తెంచేసిన వైజ్ఞానిక తంత్రం
ఆకాశానికి తంత్రులు బిగించి శ్రుతి చేసిన యంత్రం
మానవ వాణికి లోకాలోకన్నందించిన నేత్రం
విశ్వమంతట విశృంఖలముగ నర్తించె నరునిగాత్రం
విజ్ఞాన యజ్ఞ వాటికలో ఇది మానవీయ శ్రీ సూక్తం
మానవుని విజయకీర్తనలో ఇది ఆరోహణమంత్రం.

(ఆంధ్ర ప్రభ డైలీ సెప్టెంబర్ 3, 2011)

కొసమెరుపు:
'శంకరాభరణంః చిత్ర యూనిట్‌ కాకినాడ వస్తున్నప్పుడు ప్రముఖ నవలా రచయిత ఆకెళ్ళ పాటరాయమని కోరితే.. సంఘటనలు, వ్యక్తులపై పాటలు రాయనని చెప్పాను. నా ఆర్థిక పరిస్థితి అప్పట్లో బాగాలేని విషయం తెల్సిన వారు నా సమాధానం విని మొండి అని విమర్శించారు. నేను విధించుకున్న కట్టుబాటు అది. ఇప్పటికీ అంతే'.

సిరివెన్నెల ప్రస్థానం: 'ఓనాడు కె. విశ్వనాథ్‌ నుంచి వచ్చిన పిలుపందుకుని వెళ్లి కలిసా... సిరివెన్నెలకథను చెప్పి..సందర్భానుసారంగా పాటరాయమ న్నారు. విధాత తలపున ప్రభవించినది అని ప్రారంభిం చా.. అది ఆయనకు నచ్చింది. వెంటనే ఈ మాటలకు సరితూగే పూర్తి పాట ఉందని విరించినై విరచించితిని వినిపించా.. అద్భుతంగా ఉందన్నారు. అసలు విషయం అప్పుడే చెప్పా.. గతంలోనే ఈ పాట పంపానని, వినియోగించ లేదని. కె. విశ్వనాథ్‌ దాన్ని సరి చూసుకుని.. నాతో సమ్మతించారు.ఆపాట ఆయనకి ఎంతో సంతృప్తినివ్వడంతో సిరివెన్నెలఃలో పాటలన్ని నన్నే రాయమన్నారు. దీంతో ఇక వెనుతిరిగి చూడలేదన్న విషయం అందరికీ తెలిసిందే'!
-సీతారామశాస్త్రి

_________________________________________________________

కొల్లూరు విజయా శర్మ5:57am Apr 11
శీత వేళ రానీయకు శిశిరానికి చోటీయకు
ఎదలోపలి పూలకారు-ఏనాటికి పోనీయకు
ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి మాయమయేవేళ
ముసలితనపుటదుగుల సడి ముంగిటవినబడేనా
వీటలేదని చెప్పించు వీలు కాదని పంపించు.

కృష్ణ శాస్త్రి

ఎంత చక్కని భావన..వయసు కాదు మనసు ప్రధానం.నిత్య యవ్వనం మనసులో ఉంటే అది మన జీవితం లో అను నిత్యం తొణికిసలాడుతుందింఅనసులో ఎప్పుడు వసంతం వెల్లివిరియాలి.కలల రెక్కలని రాల్చేసే శిశిరాన్ని మనసులోకి,జీవితం లోకీ రానివ్వకూడదు. అసలు అయిన భావన ఎవరికైనా అంతకు ముందు కలిగిందా?ముసలి తనపు అడుగుల చప్పుడు వినిపిస్తే అబ్బెబ్బే లేదు లేదు,రాడు రాడు అని చెప్పాలట. మనసుని ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంచుకోగలిగితే,నిత్య యవ్వనం జీవితం లో ఆరు ఋతువులలో ఆమని నే విరబూస్తుంది. అలా అని కవి కి మరణం అంటే భయమా?కానే కాదు.. మరణాన్ని ప్రియుడు పంపిన" ప్రణయ పల్లకీ"అంటారాయన. 

_________________________________________________________

Kalyani Gauri Kasibhatla9:14pm Apr 10
కొన్నిమాటలు.......

''స్త్రీ'' ఒక అమూల్య వరం పురుషుడికి.. తన ప్రేమకు అభ్యంతర కరమైన నీతి మీద
ఆమెకు గౌరవం తక్కువ..అప్పుడే సాధారణంగా ఉదారులైన సత్పురుషులకు ,వారు ప్రేమించే స్త్రీలకూ ఘర్షణ..... చలం

స్వార్ధ ప్రేమ అడుగు లేని పాత్ర వంటిది... ఎన్ని సరస్సులనైనా దానిలో వొంపవచ్చ్చు..కానీ అది ఎప్పుడూ అంచుల వరకు నిండదు... హోమ్స్

అవును ,కాదు అనే మాటలు చాలా పాతవి..చాల చిన్నవి.. అయినా వాటిని చెప్పడానికి ఎంతో ఆలోచన అవసరం... పైధాగరస్

స్నేహం ఎప్పుడూ ప్రతిఫలాపేక్ష లేని ఆపేక్షతో నిండి ఉండాలి

తృప్తి కీ అసంతృప్తి కీ మధ్య తేడాయే అగాధం లా నిలిచి జీవితాన్ని దుఃఖ మయం చేస్తుంది

మగవాడి ఇష్టం వేరు,,ప్రేమ వేరు,,స్త్రీ కి రెండూ ఒకటే

ఏ ఒక వ్యక్తి నుండో మనకు కావాలనుకున్నది పొందాలనుకోవడం..అలా జరగని నాడు ఇక జీవితమే లేదనుకోవడం..అర్ధ రహితం... అవివేకం......

_________________________________________________________

J K Mohana Rao6:24am Apr 9
శ్రీరామనవమి సందర్భముగా ఒక క్రొత్త సార్థకనామ వృత్తము, పేరు రామస్వర. క్రింద రెండు ఉదాహరణములు -

రామస్వర - ర/ర/మ/స/య/లగ, యతి (1, 9) UIU UIU UU - UII UIU UIU
17 అత్యష్టి 38419

రామునిన్ దల్చగా నిండున్ - రాగము డెందమం దెప్పుడున్
రామునిన్ బిల్వగా నిండున్ - రాగము గొంతులో నెప్పుడున్
ప్రేమ రామస్వరమ్మేగా - ప్రీతికిఁ బేరు యా రాముఁడే
రాముఁడే జీవిత మ్మీ నా - ప్రాణపు పేరు యా రాముఁడే

సుందరమ్మౌ వనిన్ రామా - చూడగ లేను నీవెక్కడో
వందలౌ నీలమేఘమ్ముల్ - వారిదదేహ నీవెక్కడో
రామచిల్కల్ రమించెన్గా - రాముని సుస్వర మ్మెక్కడో
ముందురా చిందుచున్ నవ్వుల్ - మోహనరామ వేగమ్ముగా

_________________________________________________________

Kalyani Gauri Kasibhatla5:43pm Apr 6

పాత డైరీలో రాసుకున్న వివిధ రచయితల భావాలు..

రోజూ ఓ గ్లాసుడు నీళ్ళు పోస్తే ...ప్రతి రోజూ దోసెడు పువ్వుల్నిస్తుంది..మల్లె తీగ.
చిన్న ఆధారం చూపిస్తే గాఢo గా అల్లుకుపోతుంది.. మనీ ప్లాంటు..
తాను ఎండిపోయాక కూడా గదినంతా పరిమళం..తో నింపుతుంది..సంపెంగ..
ఈ,పరిమళాలు ,ఈ బంధాలూ..అన్ని తాత్కాలికమే..

కానీ ఒక స్త్రీ తో పోలిస్తే ఇవన్నీ..యే పాటి?

రవ్వంత ఆప్యాయత చూపించి ,కాసింత సెక్యూరిటీ చూపిస్తే, నీకు నేనున్నాను అన్న భావం కలిగిస్తే.. మల్లెకన్నా ఎక్కువగా ప్రేమ పరిమళాన్నిస్తూ,తీవెకన్నా గాఢo గా జీవితాన్ని అల్లుకుపోదూ?..
ఇంత చిన్న విషయాన్ని పురుషుడెప్పుడు తెలుసు కుంటాడు???

నేనొక నాదాన్ని..మీటితే నీకు జీవిత స్వరగతులు వినిపిస్తాను..
నేనొక స్వేదాన్ని.నన్ను గుర్తించు..నీకు జీవితాంతం సేవ చేస్తాను..
నేనొక భావాన్ని..నన్ను అర్ధం చేసుకో..నీ గుండెల్లో ఉంటాను..
నేనొక వేదాన్ని... నన్ను చదువు..నీకు జీవిత పరమార్ధం తెలుస్తుంది..

ఎక్కడ ప్రేమ ఉంటుందో..అక్కడ దుఃఖం ఉంటుంది..
ప్రేమ దుఃఖాన్ని తక్కువ చేయదు... ఎక్కువ చేస్తుంది..
అందుకే ఈ దుఃఖం..ఎప్పుడయితే ఈ దుఃఖం తగ్గిపోతుందో..
అప్పుడు ప్రేమ తగ్గిపోయిందని అర్ధం....

_________________________________________________________

Rama Krishna Choudarapu10:56am Apr 7
ఒక తెలుగు భాషాభిమాని, ఆంగ్లమాధ్యమంలో చదువుకున్న తన మిత్రున్ని, నీకు 'ఆత్మగౌరవం', 'ఆత్మవిమర్శ', 'ఆత్మాభిమానం' అంటే తెలుసా అని అడిగిండట...

అప్పుడు ఆ మిత్రుడు ఆ పదాలకిచ్చిన నిర్వచనాలుః

'ఆత్మగౌరవం' అంటే ఆత్మలను గౌరవించడం, 'ఆత్మవిమర్శ' అంటే ఆత్మలు లేవు అని వాటిని విమర్శించడం, 'ఆత్మాభిమానం' అంటే రాంగోపాల్ వర్మలాగ ఆత్మలను అభిమానించడం!!!

ఇది విన్న భాషాభిమాని, ఇంక నా వల్లకాదు రా, నేను 'ఆత్మహత్య' చేసుకుంటానంటే, అతని మిత్రుడు పగలబడి నవ్వి, 'చాల్లేరా జోకులు... చచ్చిపోయిన తర్వాతనే కదా ఆత్మలయ్యేది, ఆత్మలను ఎవరయినా ఎట్లా హత్య చెయ్యగలరు' అన్నాడట!

(పొద్దున్నే, ఎఫ్ఫెం రెయిన్ బో లో విన్నది...)

చండీవనంలో ఇళ్ళ వేట

చండీవనంలో ఇళ్ళ వేట 
 
12:46pm Apr 11
అవాక్కవుతారా ?

ఓ నాల్రోజుల క్రితం ఇళ్ళ వేటలో ఉన్నాము. వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంటే, ఒక ఇల్లు కనబడింది. ఇల్లు అద్దెకు ఆర్మీ/ గవర్నమెంట్/ ఎం.ఎన్. సి. ... వాళ్లకు మాత్రమే! వివరాలకు సాయంత్రం 5.30 తర్వాత 'తల్వార్' ను సంప్రదించండి... అని ఉంది. ఆహా, కత్తి లాంటి పేరు, అనుకుంటూ చుట్టూ చూసాము. ముందు కరివేప చెట్టు, అశోక వృక్షం(అలిగినప్పుడు, జుట్టు విరబోసుకున్నప్పుడు సీతమ్మవారిలా కూర్చోడానికి బాగుంటుంది), ఇంకా మందార, ఇతర మొక్కలు. ఒక్కటే అంతస్తు, 3 బెడ్ రూములు, పెరడు, పైన డాబా ఇల్లు. బయటికి అంతా బాగుంది. కత్తి మాష్టారు కు ఫోన్ చేస్తే, సాయంత్రం వస్తానని చెప్పారు.

సాయంత్రం ఆయన వచ్చే లోపు పక్కింటి శర్మ గారు పలకరిస్తున్నారు. 'అమ్మాయ్... నువ్వు మెళ్ళో ఆ బంగారపు గొలుసు తీసెయ్యి. ఇక్కడ మొగుడూ పెళ్ళాలు వాకింగ్ కు వెళ్తుంటే కూడా, కత్తితో పొడిచి, బంగారం లాక్కు పోతారు. నేను చెప్తుంటే నా కోడలు, కూతురూ కూడా వినరనుకో !' అన్నాడు.

'
అలాగా !' అంటుండగా తల్వార్ గారు వచ్చారు. 
'
అయ్యా! ఇక్కడ డాబా ఇళ్ళలో భయాలు ఎక్కువా?'
'
అరె, మొత్తం ప్రపంచం ఇక్కడ ఉంటోంది. మీ ఒక్కళ్ళకి భయం ఏమిటండీ, భలే వారే, ధైర్యం ఉండాలి.!', రండి, ఇల్లు చూపిస్తా... అంటూ తీసుకెళ్ళాడు.

ఇల్లంతా పాలరాయి ఫ్లోరింగ్, విశాలంగా ఉంది. కాస్త శుభ్రం చెయ్యాలి అంతే. నాకు డాబా ఇళ్ళ సరదా. వెన్నెల, ప్రకృతి, అన్నీ ఉంటాయని. అయితే, ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు లేవు. 
'
ఫ్యాన్లు అవీ పెట్టించి ఇస్తారా?'
'
అడగాలి, అయినా ఫ్యాన్లు అవీ పెట్టించినా మీరు వచ్చే ముందు పెట్టిస్తా! ఈ లోపు ఎవడైనా వచ్చి పీక్కు పొతే కష్టం కదా !'
'
అంటే ఎవరైనా దొంగతనాలకు వస్తారా? '
'
చూడండీ, ఇవాళ రేపు భారతావనిలో భద్రత ఎక్కడా లేదు. ఫ్లాట్స్ లో రిస్క్ లేదంటారా? ఎక్కడైనా ఉంది. ధైర్యం ఉండాలి ....'

మీరు ఊరికే భయపడుతున్నారు. వెనుక గోడ చూసారా యెంత ఎత్తుగా పెట్టించానో, ఇక మీరు తలుపులు తీసుకు పెట్టుకుంటే, ఎవరొచ్చినా ఏమీ చెయ్యలేము. మా ఆవిడ ఒక్కతే ఉండట్లా! రండి, పరిచయం చేస్తాను, అంటూ తీసుకెళ్ళాడు.
దార్లో నీళ్ళు పారుతున్నాయి. చూడండి, ఎదురిల్లు ఖాళీగా ఉందా, దొంగాలోచ్చి, మంచి నీళ్ళ మీటర్ పీక్కు పోయారు. మా ఇంట్లో బయట ఉన్న ఇత్తడి పంపు కూడా పీక్కు పొతే, ఇదిగో, అరవై రూపాయలెట్టి, ప్లాస్టిక్ పంపు పెట్టించా... ఏమైనా ఇది సేఫ్ సిటీ అండి. ఇక్కడ ఉండడానికి ధైర్యం ఉండాలండి....

మరే, దొంగలు కూడా మాంచి ధైర్యంగా పట్టుకు పోయారు, అనుకుంటూ మా వారి వంక చూసాను. ఆయన కూడా నవ్వుతున్నారు.

'
మరైతే ఇల్లు ఇస్తే ఎప్పుడు వస్తారు?' అడిగారు కత్తి కాంతారావు గారు.

'
వచ్చే నెల 15 తర్వాతండి. మా నాన్న గారి సంవత్సరీకాలు ఉన్నాయి. అవయ్యకా వస్తాము. కావలిస్తే, మే 1 నుంచి అద్దె ఇస్తాము. '

'
అవునా ! అలాగైతే ఎలాగండి ? ఇల్లు ఖాళీగా ఉంటే ఎవరైనా లోపలి తలుపులూ, కిటికీలు పీక్కు పోరూ... మీ ఆఫీస్ కుర్రాళ్ళని పడుకోబెట్ట రాదూ !'

అవాక్కయ్యి, వాక్కు మూగబోయి, ఉన్నాము ఇద్దరం.

'
అంటే... ఊరు వెళ్ళినప్పుడు ఇల్లు తాళం పెడితే ఇబ్బందే కదండీ!'

'
ఏవిటండి, మీ ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళతో ఇదే ఇబ్బంది, అన్నిటికీ భయపడి చస్తారు. ధైర్యం ఉండాలండీ!'

'
మొండి గోడలకు కొండ ముచ్చుల్ని కాపలా పెట్టు ! తుప్పు పట్టిన కత్తి మొహమూ నువ్వూనూ...' మనసులో తిట్టుకున్నాను నేను....

'
అలాగేనండి, బాగా ధైర్యంగా ఆలోచించి, చెప్తాము,' అంటూ లేచారు మా వారు. బ్రతికుంటే బలుసాకు తినొచ్చని, కత్తి బాబుకి, ఖాళీ ఇంటి మీద ఉన్న మమకారం, మనుషుల ప్రాణాల మీద లేదులా ఉంది. ఎందుకొచ్చిన రిస్క్, ఊరుకాని ఊళ్ళో ఫ్లాట్స్ లో ఉండడమే నయం...' అనుకుంటూ బయటపడ్డాము ఇద్దరం.

కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధాలు తెలిసిన ఎవరైనా 'సేఫ్ సిటీ' లో డాబా ఇల్లు అద్దెకు తీసుకుని, ధైర్యంగా ఉండచ్చు. మరి ధైర్యం చెప్తూ భయపెట్టే వీళ్ళతో అవాక్కయ్యేందుకు సిద్ధమేనా?



'ఋణానుబంధ రూపేణ...'

 'ఋణానుబంధ రూపేణ...
భావరాజు పద్మిని 

నా జీవితంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన రాస్తున్నాను. 'ఋణానుబంధ రూపేణ...అంటారు కదా ! ఈ సామెతను తలచుకున్నప్పుడల్లా నాకెందుకో ఆ ముసలమ్మే గుర్తుకు వస్తుంది.


అప్పట్లో మేము విజయవాడ లో ఉండేవాళ్ళం. మా ఇల్లు వినాయక థియేటర్ ఎదురు సర్వీస్ రోడ్డు ప్రక్కనే ఉండేది. రోజూ పెద్ద పాపను ఆటో ఎక్కించేందుకు క్రిందికి రావటం అలవాటు. అలా ఆ రోజు ఆటో ఎక్కించి వెళ్తుంటే, గేటు వద్ద ఉన్న మెట్ల ప్రక్కన ఓ ముసలమ్మ కనిపించింది. మాంచి వేసవి కాలం... ఎండ... దాహం, దాహం అంటోంది. 

ఆమె వంక చూసాను. చిరిగిన, మాసిన దుస్తులు, ఎప్పుడు స్నానం చేసిందో తెలీదు. కనీసం కదలలేక పోతోంది. అంతా దూరం నుంచి చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. నా మనసు ఊరుకోలేదు. నా తల్లిదండ్రులు నాకు మనిషిని మనిషిగా చూడడం మాత్రమే నేర్పారు. కులం, మతం, వేషభాషలు చూసి మర్యాద ఇవ్వడం నాకు తెలీదు. అందుకే, వెంటనే పైకి వెళ్లి, నీళ్ళు తెచ్చి ఇచ్చాను. నేను లేవలేను, నోట్లో పోయ్యమన్నట్టు సైగ చేసింది. దగ్గరకు వెళ్లి నెమ్మదిగా తల ఎత్తి, నోట్లో నీళ్ళు పోసాను. కృతజ్ఞతతో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి.

'అమ్మా, మూడు రోజులైంది అన్నం తిని, ఏమన్నా పెట్టావా?' అని అడిగింది. నా మనసు కరిగిపోయింది. వెంటనే వెళ్లి పాపకు వండిన అన్నం, కూరలు ఒక పళ్ళెం లో సర్ది తెచ్చి ఇచ్చాను. మళ్ళీ మామూలే... తినలేను, తినిపించమంది. నడి రోడ్డు ప్రక్కన, క్రింద కూర్చుని, నా చేత్తో కలిపి తినిపించాను. మధ్య మధ్య నీళ్ళు పట్టాను. ఆమె తృప్తిగా తిని, త్రాగి, నా చేతిని తన చేతిలోకి తీసుకుని, 'ఏ తల్లి కన్న బిడ్డవో, నువ్వు మా అమ్మవు... మా అమ్మ తర్వాత ఇంత ఆప్యాయంగా నాకు ఎవ్వరూ తినిపించలేదు...' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. రాత్రి చూస్తే, ఆమె అక్కడ కనిపించలేదు.

రెండు రోజుల తర్వాత వేరే రోడ్డు మీద వెళ్తుంటే, జనం ఓ చోట గుమికూడి ఉన్నారు. నెమ్మదిగా వెళ్తూ చూస్తే, ఆమే ! చనిపోయి ఉంది. ఆలోచిస్తే ఆమె ఎవరో... నేను ఎవరో... ఆమెకి నాకు ఎన్ని మెతుకులు రుణమో ... ఒక మనిషిగా ఆమెకు చెయ్యగలిగిన సాయం చేసాను అంతే !

ఇప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా ఏదో విధంగా ఇతరులకు దానం చేస్తూనే ఉంటాను. నేను చారిటీ లను నమ్మను. పేద పిల్లలు కనిపిస్తే, వెంటనే ప్రక్కనే ఉన్న కొట్టుకు వెళ్లి, చాక్లెట్ లు, బిస్కెట్ లు కొని ఇస్తాను. నా చేత్తో వండి, పులిహోర పొట్లాలు పంచుతాను. బట్టలు, కంబళ్ళు, ఏవైనా స్వయంగా నా చేత్తో ఇచ్చి, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను. అప్పుడు నాకు కలిగే తృప్తి బహుసా ఏ కొటీశ్వరుడికి కూడా కలగదేమో !

ఫేస్ బుక్ అద్దాల మేడలో కబుర్లే కాదు. బయట ప్రపంచం లోని దుఃఖాన్ని చూడాలి. వీలున్నంత ఎదుటివారికి సాయపడాలి. దానం/సాయం చేసే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే వాటి వద్దకు వెళ్ళాలి. మనం చేతిలో ఉన్నది ఇస్తూ పొతే, భగవంతుడు మన దోసిలి మళ్ళీ నింపుతూ ఉంటాడట. గురువుగారు చెప్తారు... ఇంకా, గులాబీలు పంచే చేతులనే పరిమళం అంటి ఉంటుందని చెప్తారు. నాకా నవ్వులు కావాలి, ఒక్క క్షణమైనా ఒక్క పెదవిపై చిరునవ్వు కావాలి. మరి మీకో !