Wednesday, January 28, 2015

వాఘా ఇండో- పాక్ సరిహద్దు దళాల వేడుకలు

వాఘా ఇండో- పాక్ సరిహద్దు దళాల వేడుకలు 
-----------------------------------------------------
భావరాజు పద్మిని - 28/1/15  

ఒక ప్రక్క 'హిందుస్థాన్ జిందాబాద్... వందే మాతరం ...' అన్న నినాదాలు.
మరో ప్రక్క ' పాకిస్థాన్ జిందాబాద్..' అన్న నినాదాలు... ఇదేదో క్రికెట్ మ్యాచ్ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఇది అమృత్సర్ వద్దనున్న భారత్  సరిహద్దులోని చివరి గ్రామమైన 'అటారి' వద్ద గోచరించే హృద్యమైన దృశ్యం.

ఇటువైపు మహాత్మాగాంధీ బొమ్మ ఉన్న  స్టేడియం లో మీకు గోచరిస్తున్న వారంతా భారతీయులు. అటువైపు మొహమ్మద్ జిన్నా  చిత్రం ఉన్న గేటుకు ఆవల మీకు కనిపించే వారంతా పాకిస్థానీయులు.

భారత్, పాక్ సరిహద్దు దళాలు కలిసి, సాయంత్రం వేళ 'వాఘా' వద్ద, జండా దింపే ప్రక్రియను ఒక వేడుకకా చెయ్యాలని అనుకున్నారు. సాయంత్రం వేళ, కాసేపు, ఇటు భారత్ గేటు, అటు పాకిస్థాన్ గేటు  తీస్తారు. ఆ సమయంలో మన స్త్రీ, పురుష దళాలు అటువైపు వెళ్తాయి. అలాగే, పాకిస్థాన్ కు చెందిన దళాలు ఇటువైపు వస్తాయి. ఒకరిని ఒకరు చూసి, మీసాలు మెలేసి, తొడ కొట్టి, బూట్లు ఎత్తుతారు. ఇది కేవలం ఒక చిన్న వినోదం కోసం మాత్రమేనండోయ్...



మేము వెళ్లేసరికి స్టేడియం మొత్తం నిండిపోయింది. అటు పాకిస్థాన్ వైపు జనం చాలా పల్చగా ఉన్నారు.  మధ్యలో గుంపుగా మూగిన కొందరు భారతీయులు, 'ఏ మేరా ఇండియా...' పాటకు, ఆ తర్వాత మరికొన్ని పాటలకు కేరింతలు కొడుతూ, నృత్యం చేసారు. కొందరు బుగ్గలపై భారత జండా టాటూ లు వేయించుకుని వచ్చారు. కొందరు జండాలు తెచ్చి, ఊపుతూ ఆనందించారు.

గేటు తెరిచే సమయానికి, ఈలలు, గోలలు, జై భారత్ అన్న నినాదాలతో... స్టేడియం మొత్తం మార్మ్రోగిపోయింది.  ఇల్లు, కుటుంబానికి దూరంగా ఎక్కడో ఉంటూ, మన కోసం అహర్నిశలూ పనిచేస్తున్న  సరిహద్దు దళాలకు ఇది ఆటవిడుపు. వారు అప్రమత్తంగా ఉంటూనే, అడిగిన వారితో, పిల్లలతో ఫోటోలు తీయించుకుంటూ ఆనందించారు. దేశభక్తి నరనరానా ప్రవహిస్తూ ఉండగా, అది ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన వేడుక. వీలుంటే, మీరు కూడా నయనానందకరమైన ఈ వేడుకలో ఒక్కమారైనా, తప్పక పాల్గొనండి.

Tuesday, January 27, 2015

గురువుల ‘అమృత పాతం ‘ – అమృత్సర్

గురువుల ‘అమృత పాతం ‘ – అమృత్సర్ 
---------------------------------------------
భావరాజు పద్మిని - 27/01/2015 

నా దృష్టిలో...’ మతం అంటే మనిషిలో సత్ పరివర్తన తీసుకురాగలిగింది...’ . నిజంగా ఆ మతంలోనే పుట్టి, అందులోని సిద్ధాంతాలను ఔపాసన పట్టినా, త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినా, అది ఆ మనిషిలోని క్రూరత్వాన్ని/దుష్టత్వాన్ని అణచి, సన్మార్గంలోకి నడిపించలేనప్పుడు, ఆ మతం వ్యర్ధం !

అలా మనిషిలో అంతర్గత మార్పును తీసుకువచ్చే, నేను ఇక్కడ చూసిన గొప్ప మతం సిక్కు మతం. సాధారణంగా వీరికి కొండల్ని పిండి చేసేంత బలం ఉంటుంది. అలాగే ఏనుగు కుంభస్థలాన్ని నేరుగా డీ కొనే ధైర్యం ఉంటుంది. సిక్కు పురుషులు యోధులు, స్త్రీలు కూడా ధీరలే ! అయితే, వారు ఎన్నడూ ఇతరులకు హాని తలపెట్టే ఆలోచనలు చెయ్యరు. వారి బలాన్ని బలహీనులమీద చూపి, మీసాలు మెలేసే నీచత్వానికి దిగజారరు. ఎందుకని ? ఉక్కు వంటి సిక్కు మనసుల్ని మలచి, వారి యుక్తులను సరైన దిశలో మలచిన ఘనత మాత్రం దశావతారాల వంటి వారి పది మంది గురువులదే !

పాత అమృత్సర్ నగరం ఎనిమిది దిక్కుల లోనూ, 8 ప్రాకారాలు ఉన్న కోట గోడచే ఆవరించబడిన ప్రాకారంలో ఉండేది. లాహోర్ నుంచి, మన దేశంలోకి చొరబడిన మొఘల్ రాజులకు, బ్రిటిష్ వారికి, అందరికీ మొదట గోచరించేది, కంచుకోట వంటి ఈ అమృత్సర్ నగరం. ముందా కోటను వశపరచుకోవాలి , ఎలా ? ఎంతటి సైనిక బలగం ఉన్నా, దుర్భేద్యమైన ఆ కోట వైపు, ధీరులైన సిక్కుల వైపు చూడాలంటేనే వారికి భయం ! అందుకే మొదట సిక్కు గురువులను తమ మతం  లోకి మార్చాలని అనుకున్నారు. గురువు దారి తప్పితే, మిగిలిన వారిని సునాయాసంగా మార్చవచ్చని, వారిని హింసించారు. సిక్కు గురువులలో కొంతమందిని మొఘలులు, బ్రిటిష్ వారు ఎత్తుకుపోయి, ఖండ ఖండాలుగా నరికి చంపమని శిక్ష వేసినప్పుడు... వాళ్ళు మౌనంగా తమ చేతులూ, కాళ్ళు అప్పగించి, గురు గ్రంధం లోని శ్లోకాలు చదువుతూ, ఆ చంపేవారి మనసుల్లోని క్రూరత్వాన్ని మార్చమని, దైవాన్ని ప్రార్ధిస్తూ, కన్ను మూశారు ! అంతే తప్ప, మతం, ధర్మం మార్చుకోమని చెప్పారు. గురు దీప్ సింగ్ గాధ అయితే, అత్యంత ఆశ్చర్యకరం ! ఈయన స్వర్ణ దేవాలయాన్ని ముట్టడించిన వారిపై దాడికి దిగగా, వారు ఆయన శిరస్సు ఖండించారు. ఆయన ఏ మాత్రం చలించకుండా, తెగిన తన తలను చేతబట్టుకుని, మిగిలిన శత్రుసంహారం చేసి, చివరికి తన నెలవు చేరుకొని, తెగిన తన తలను వదిలేసారట ! గురువులు సర్వసమర్ధులని, దేహానికి మాత్రమే పరిమితం కారని వారి గాధ నిరూపిస్తుంది.

   అంగబలం, అర్ధబలం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తుంది. 1748 లో లాహోర్ కు గవర్నర్ గా వచ్చిన ‘మీర్ మన్ను‘ హయాంలో జరిగిన దురాగాతాలైతే, చరిత్ర చెక్కిట చెరగని రక్తపు మరకలే అనవచ్చు ! ఈ నాటికీ భారత జాతి చరిత్రలోనే ఇటువంటి దురాగతాల్ని మనం చూసి ఉండము అంటే, అతిశయోక్తి కాదేమో !
కోట బయటే ఉంటూ, తమకు అప్పగించిన ఒక్కొక్క సిక్కు తలకు, 10 రూపాయల బహుమానం ప్రకటించారు. ‘డివైడ్ అండ్ రూల్’ లాగా వారిలో వారికే భేదాలు కల్పించి, సిక్కు మగవారిని సంహరించారు. అతనికి భయపడి, చాలామంది కోట వదిలి, అడవులకు వెళ్ళిపోయారు. మతం మార్చుకోని, ప్రతి ఒక్కరినీ నిర్దయగా సంహరించారు. మిగిలిన ఆడవారిని, పిల్లల్ని కారాగారానికి తరలించారు. అమ్మల కళ్ళ ఎదుటే, వారి బిడ్డల్ని సంహరించి, ఆ మాంస ఖండాలను తల్లుల మెడలో వేసారు. స్త్రీల చేత రోజుకు 450 కిలోల తిండిగింజల్ని నూరిస్తూ, వాళ్లకు రోజుకు కేవలం ఒక చిన్న రొట్టె, ఒక గ్లాస్ నీరు మాత్రమే ఇచ్చేవారు. పని చేసే శక్తి లేని స్త్రీల గుండెపై ఒక పెద్ద బండరాయిని పెట్టి, చంపారు. కొందరిని యధేచ్చగా బలాత్కరించారు. అయినా ఆ స్త్రీలు ఏం చేసారో తెలుసా ! గురు నామాన్ని, గురు గ్రంథ సాహిబ్ లోని శ్లోకాల్ని పాడుకుంటూ హింసను మౌనంగా భరించారు. ఎందుకంటే... వారికి వారి గురువులపై అచంచల విశ్వాసం ! కొంత కాలానికి క్రూరుడైన మీర్ మన్ను మరణించగా, సిక్కులంతా ఏకమై దాడి చేసి, మిగిలిన తమ స్త్రీలకు, పిల్లలకు విముక్తి కల్పించారు.



ఇంతకూ వారి జీవితం ద్వారా వారు బోధించినది ఏమిటి ? తమ దేశం కోసం , జాతి కోసం, ధర్మం కోసం, సాటివారి శ్రేయస్సు కోసం, ప్రాణాలనైనా తృణప్రాయంగా భావించి అర్పించమని, ఆచరణాత్మకంగా చూపారు. అందుకే, ప్రస్తుతం భారతావని సైన్యంలో అధిక శాతం సిక్కులే ! అంతటి త్యాగధనులు వారు.

‘అమృత్సర్’ పేరుకు తగ్గట్టు... మన మనసుల్లో అమృత సరమై ప్రవహిస్తుంది. అక్కడ రాజైనా, పేదైనా ఒక్కటే ! అందరూ ఒక్క వరుసలో వెళ్లి, దర్శించుకోవాల్సిందే ! అక్కడికి వెళ్ళినవారు తప్పక భోజనం చేసి తీరాలన్న నియమం ఉంది. అదికూడా, ఏ రకమైన వివక్ష లేకుండా, ఎంతటి ఘనుడైనా, భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు, రెండు చేతులూ చాచి, ‘దేహీ’ అన్నట్లుగా పట్టి, రొట్టెను స్వీకరించి, తినాల్సిందే ! అంతేకాదు, ఇక్కడ మరో విశేషం ఉంది. ఈ పాలరాతి ఆలయం అత్యంత శుభ్రంగా ఉంటుంది. ఎలాగో తెలుసా ? కుప్పలుతెప్పలుగా ఆలయ శుభ్రతకు సిబ్బందిని పెట్టుకున్నందుకు కాదు ! గురు భక్తుల సేవతో ! ఆ ఆలయంలో ఈరోజున సేవకు పేర్లు నమోదు చేసుకున్నవారికి అవకాశం వచ్చేందుకు దాదాపు పదేళ్ళు పడుతుందట ! అంటే, వారిలో సేవానిరతి యెంత అధికంగా ఉందో, మీరు ఊహించుకోవచ్చు. భక్తులు పాలరాతి మెట్లపై జారిపోకుండా, రబ్బరు తివాసీలు పరిచారు. ఒక ప్రక్క మనం నడుస్తుంటే, మరో ప్రక్క, తివాసీల పైనుండి, గుడ్డతో, చీపుర్లతో, మన పాద ధూళిని శుభ్రం చేస్తుంటారు కొందరు ! ఆలయం చుట్టూ ఉన్న, పవిత్రమైన ఆ దుఃఖ నివారిణి సరస్సులో దిగి, ఆ జలాన్ని తమ శిరస్సుపై జల్లుకుని, స్నానాలు చేసి, త్రాగి వచ్చే భక్తుల పాదముద్రల్ని, తడి గుడ్డలతో శుభ్రం చేస్తూ ఉంటారు కొందరు. పెద్ద పెద్ద కోట్లు తొడుక్కున్న ధనవంతులు, అక్కడి భక్తులకు ఆలయం వెలుపల నాలుగు దిశల్లో ఉన్న నిర్మాణాలలో, నీటిని అందించి, ఆ ఎంగిలి బొచ్చెలు కడుగుతూ కనిపిస్తారు. సాంఘికంగా గొప్ప గుర్తింపు ఉన్నవారు సైతం, అక్కడ ఉల్లిపాయలు తరిగి, ఆ కన్నీటిని ఆనందభాష్పాలుగా భావిస్తారు. భక్తులకు అందించే ‘లంగరు’ అనబడే భోజనం కోసం అవసరమైన ప్లేట్ ల సరఫరా, వంట సామాన్లు తేవడం, వండడం, బస్తాలకు బస్తాల ఉల్లి, బంగాళాదుంపలు, అల్లం , ఇతర కూరలు తరగడం, వెల్లుల్లి ఒలవడం, వడ్డించడం, తిన్న పళ్ళాలు తోమడం, తిరిగి కడిగిన పళ్ళాలు అందించడం వరకు... అంతా భక్తులే ఒక సేవగా భావించి చేస్తారు. వారికి, అక్కడకు తమ గురువు ఏ రూపంలోనైనా వచ్చి, తమ ముందే తిరుగుతారని ఒక గురి. అందుకే చేసే ప్రతి సేవా... గురుసేవగా భావించి, అత్యంత ప్రేమభావనతో చేస్తారు. ఆ సాత్విక వాతావరణంలోకి అడుగిడిన ఏ హృదయమైనా, వారి సేవాభావం చూసి, ద్రవించి, మున్యాశ్రమంలోకి వచ్చి తన క్రూరత్వాన్ని మరచిన సింహంలాగా ,పరిణామం చెందుతుంది.
ఒక్క స్వర్ణ దేవాలయంలోనే ఈ సేవలన్నీ జరుగుతాయని, మీరు అనుకుంటే, పొరబడినట్టే ! పంజాబ్ లో ఉంటున్న ఏ ఒక్కరూ... ఆకలితో పడుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే... ఇక్కడున్న ప్రతి గురు ద్వారా లోనూ, విధిగా, పేదా- గొప్పా తారతమ్యం లేకుండా భోజనం పంచుతారు. అంతే కాదు, వీరిలో సేవాభావం యెంత అధికమంటే... వేసవిలో కుటీరాలు వేసి, ప్రతి అర కిలోమీటర్ పరిధిలో షర్బత్ పంచుతారు. వారం, వర్జ్యం, ముహూర్తం తో పని లేకుండా, వారికి అనువైన ఏ రోజైనా, నడి రోడ్డుపై డేరాలు ఏర్పరచి, అక్కడే వండించి, రొట్టెలు, కూర, పూరీలు, పప్పు, హల్వా... వంటివి విరివిగా పంచుతారు. కారుల్లో తిరిగే దొరబాబులు సైతం పక్కకి వాహనాలు నిలిపి, ఇది గురుప్రసాదంగా భావించి, అత్యంత ఆదర భావంతో స్వీకరించి తింటారు. అలా తినగలగడం అదృష్టంగా భావిస్తారు.

ఇప్పుడు చెప్పండి... పిడిగుద్దుతో ఇతరుల్ని పిండి చెయ్యగల శక్తి ఉన్నా... ఇతరులను తమ గురువుగా భావించి, పాదధూళి తుడిచెంత నిరాడంబరత వీరికి ఎలా వచ్చింది. తమ బలాన్ని సరైన దిశలో వాడి, సన్మార్గంలో నడిచే సాధు వర్తన వీరికి ఎలా వచ్చింది. తమ గురువుల బోధల్ని చదివి, అక్షరాలా పాటిస్తున్నారు. సర్దార్ లు వీరులు, దేశభక్తులు, త్యాగధనులు, సేవానిరతులు, అన్నింటినీ మించి, గొప్ప గురుభక్తులు ... ఎందరికో ఆదర్శవంతులు ! వీరు తిరిగే పుణ్య భూమిలో ఉంటున్నందుకు నేను గర్వపడుతున్నాను. వీరిలోని ఒక్కొక్క భక్త పరమాణువుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

మంచి ఎవరివద్ద ఉన్నా, చూసి నేర్చుకోమన్నారు. మరి, వీరి నుంచి మనం నేర్చుకోదగ్గ అంశాలను మరొక్కసారి గమనించి, నాతో పాటు మీరూ సగర్వంగా అనండి...” సర్దార్ దిల్దార్ హై, అసర్దార్ హై, ... సింగ్ ఈస్ కింగ్ “ అని.

(మొన్న అమృత్సర్ దర్శించినప్పుడు నా మనోభావాలకు అక్షరరూపం...)

Monday, January 5, 2015

మిధునం - మేధో మధనం

మిధునం - మేధో మధనం 
-------------------------------
 భావరాజు పద్మిని 

ఎప్పుడైనా 60 ల వయసు దాటిన మిధునాన్ని కలిసారా ? కలిస్తే వారి చర్చ ఇలా ఉంటుంది. వాళ్ళను కలవడానికి ఒక చుట్టాలామె వెళ్తుంది.

"ఏమే, ఎప్పుడొచ్చావ్ ?"
"3 రోజులు అయ్యిందండి..."
"మీ ఆయన, పిల్లలు అంతా బాగున్నారా ?"
"బాగున్నామండి, మీరు బాగున్నారా ?"
"ఆ, బాగున్నాం, ఇది నీ చిన్న కూతురా ? మీ పెద్దమ్మాయికి ఎన్నేళ్ళు ?"
"అవునండి, 13 డేళ్ళు ..."
"హా, నీ పెళ్లి ఎప్పుడయ్యిందే ? 98 లోనా ?"
"కాదండి, 2000 సం. లో "
"అవున్లే, నీ తాంబూలాలప్పుడు మేము వచ్చాం. కాని, మా చెల్లెలి మనవారాలి పెళ్లి కదూ, అందుకే నీ పెళ్ళికి రాలేకపోయాం."
వెంటనే... మేధో మధనం మొదలు...
"ఏవిటీ, రత్న పెళ్లి అయ్యింది 98 లో ఈ పిల్ల పెళ్ళికి, మన కృష్ణుడు పుట్టాడు కదూ, అందుకే రాలేదు."
"ఏడిశావ్ , కృష్ణుడు 2001 లో కదూ  పుట్టాడు... ఏడాది ముందే అంటావేంటి ?"
"ఇదమ్మాయ్ ఈయన వరస, ఈ మధ్య ఎడ్డెం అంటే తెడ్డెం అంటారు. మనవడు పుట్టిన ఏడాది కూడా మర్చిపోయారు."
"చాల్లే సంబడం, ఈవిడకి మతిమరుపు పెరిగిందే అమ్మాయ్..."
పెదావిడ కాసేపు మౌనం, చూపులతో యుద్ధం...




"అన్నట్టు, మీ అమ్మగారి పుట్టింటి పేరు ఏవిటే..."
"ఆదూరి అండి..."
"ఓ ఆదూరి సుబ్బారాయుడు నీకు తెల్సుటే..."
నేను చెప్పే లోపే... పెద్దావిడ...
"ఏవిటి, సుబ్బారాయుడు ఇంటి పేరు ఆదూరి కాదు, జాస్తి..."
"ఏవిటే నువ్ మాట్టాడేది, నీ పీత బుర్రకు ఇంటి పేర్లు కూడా గుర్తా ?"
"ఏవిటి, నాది పీత బుర్ర అంటారా ? మీదే నత్త బుర్ర ?"
"అయితే నీది చీమ బుర్ర ..."
" అంతే లెండి, తిమిరి ఇసుమున తైలంబు అని... ఊరికే అన్నారా ?"
"నన్ను మూర్ఖుడు అంటావే ! పోన్లే, నువ్వే నాయకురాలు నాగమ్మవి. ఇదే పిల్లా వరస..."
ఈ సారి పెద్దాయన చూపుల యుద్ధం...

"అన్నట్టు, మీ అమ్మగారి స్వస్థలం ఎక్కడే ?"
"చేబ్రోలు అండి..."
"ఏదీ, మన గుంటూరు జిల్లా చేబ్రోలే !"
"కాదండి, పశ్చిమ గోదావరి జిల్లా ..."
" అలాగా, అక్కడ మట్టిగుంట సత్యవతి అనీ, మీకు తెల్సా !"
నేను భయంగా పెద్దావిడ వంక చూస్తూ... "లేదండి..." అంటుండగా... పెద్దాయన పెద్దావిడ వంక చూసారు.
" ఆ పెట్టండి పెట్టండి... అనకాపల్లి వాళ్ళని తీసుకెళ్ళి చేబ్రోలు లో పెట్టండి, ఒకళ్ళ ఇంటి పేరు ఇంకొకళ్ళకి తగిలించండి, ఏళ్ళు మర్చిపోయి... మీకు ఇష్టమొచ్చినప్పుడు పెళ్ళిళ్ళు, బారసాల లు చేసెయ్యండి... నాకెందుకు వచ్చిన గొడవ బాబూ !"
పకపకా నవ్వడం నా వంతు, పెద్దాయన వంతు అయ్యింది... ఎంతైనా, నిండు జీవితం పండించుకున్న దంపతుల గిల్లికజ్జాలు కూడా మధురమే కదా ! మీకూ ఇటువంటి సంఘటనలే ఎదురయ్యి ఉంటాయ్ కదా !