Wednesday, April 29, 2015

వృక్షో రక్షతి రక్షితః...

'అరె ఈ మొక్క, ఇంకా ఎలా బ్రతికుంది ?' నాకు ఆశ్చర్యం, అంతకు మించిన ఆనందం. ఒకసారి దాని వద్దకు వెళ్లి ఆకుల్ని స్ప్రుశించాను. నాకు తెలుసు, మొక్కలు కూడా ప్రేమకు స్పందిస్తాయి. వినే మనసుంటే మాట్లాడతాయి, మనం పట్టించుకోవట్లేదని, అలుగుతాయి. మౌనంగా మాట్లాడే పక్షులు, వృక్షాలు ఈ సృష్టిలోని అతి గొప్ప నేస్తాలు నాకు.
మేము చండీగర్ వచ్చిన 6 నెలలకి గత డిసెంబర్ లో హైదరాబాద్ వెళ్ళాము. నాకు, మా అత్తగారికి మొక్కలంటే చాలా ఇష్టం. ఒక చిన్న పువ్వు పూసినా, చిట్టి గువ్వ కూసినా, ఇప్పటికీ ఆవిడ ఆనందంగా నన్ను పిలిచి చూపిస్తారు. హైదరాబాద్ లో మేము పెంచిన మొక్కలన్నీ ట్రాన్స్పోర్ట్ లో వేసేటప్పుడు, లారీ కాబిన్ లో జాగ్రత్తగా పెట్టించి, నీళ్ళు పోస్తూ, జాగ్రత్తగా తెమ్మని చెప్పాము. అయినా వాడు చేసిన ఆలస్యం వల్ల, అన్నీ చచ్చిపోయాయి. కాని వెళ్ళేటప్పుడు హైదరాబద్ లో, మా ఇంటి గుమ్మం వద్ద ఉండే ఆ క్రోటన్ మొక్కను మాత్రం అక్కడే వదిలేసాము.
6 నెలల తర్వాత కూడా ఈ మొక్క ఎలా బ్రతికుంది... అని దానికేసి చూస్తుండగా, మాకు నాలుగు ఫ్లాట్స్ అవతల ఉండే ఒక అరవావిడ వచ్చారు. 'మీ మొక్కకి నేనే నీళ్ళు పోసాను. మీ మొక్కకే కాదు, ఈ ఫ్లోర్ లో ఏ మొక్క ఎండిపోతున్నట్టు అనిపించినా, నీళ్ళు పోస్తాను, అది నా అలవాటు,' అన్నారు. ఆనందంతో ఆవిడకి కృతఙ్ఞతలు తెలిపాను.
యెంత గొప్ప అలవాటు ? ఇలా నేనూ చెయ్యగలనా ? నేనే కాదు, అంతా ఇలాగే చేస్తే యెంత బాగుంటుంది ? అనిపించింది. మంచిపని చేసేందుకు, చెడ్డ సమయం అంటూ ఏదీ ఉండదు కదా ! అందుకే, ప్రతి ఇంటివారు ఒక మొక్కని అయినా తప్పనిసరిగా పెంచాలి. చుట్టుప్రక్కల వారితో సంబంధాలు ఎలా ఉన్నా, మనం చేసే సేవ వృక్షాలకే కాబట్టి, తప్పనిసరిగా ఎండుతున్న మొక్కలకు నీళ్ళు పొయ్యాలి. ఇలా చేస్తామని, మనకి మనమే ప్రమాణం చేసుకుందామా...


Saturday, April 18, 2015

పడడం, ఓడడం జీవితంలో సహజమే !

పడడం, ఓడడం జీవితంలో సహజమే !

భావరాజు పద్మిని 

నాకెందుకో కధలు, కవితలు చదువుతూ భావుక లోకంలో విహరించడం కంటే, ప్రముఖుల ఇంటర్వ్యూ లు చదవడం చాలా ఇష్టం... ఎందుకంటే, వారు చూసిన ఒక నిండు జీవితం, ఆ జీవితం అందించే సందేశం, అమూల్యమైనవి. ఇవి మనకూ, కొన్ని సందర్భాల్లో చాలా ఉపయోగపడతాయి...

యాదృచ్చికంగా ఇవాళ పేపర్ తీసిన నాకు, టైమ్స్ ఆఫ్ ఇండియా లో ' ఇమ్రాన్ హష్మి ' తో ముఖాముఖి కనిపించింది. మామూలుగా అయితే అతనిపై ఉన్న అభిప్రాయాన్ని బట్టీ చదవకపోదునేమో ! కాని, ఆ ముఖాముఖి హెడ్ లైన్స్...నా దృష్టిని ఆకర్షించాయి...'  ఓటమి  సహజమే అని అయాన్ నాకు నేర్పాడు...' . ఎవరీ అయాన్... అనుకుంటూ చదవసాగాను...

అయాన్ అతని నాలుగేళ్ల కొడుకు. మిష్టర్ ఎక్ష్... అనే అతని కొత్త చిత్రం మూడు రోజుల్లో మొదలౌతుంది అనగా, అతని కొడుక్కి కాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది. ఒక నెల రోజుల విరామం తీసుకుని, అయాన్ కు సర్జరీ అయ్యి, ఖీమోథెరపీ మొదలై, అతను కోలుకుంటూ ఉండగా,  భార్యాపిల్లల్ని వదిలి, అతను షూటింగ్ కు వెళ్ళాడు. కాని, అతను షూటింగ్ లో నటిస్తున్నప్పుడు కాసేపు ఏమారినా, అతని తండ్రి మనసు, బిడ్డ కష్టానికి అల్లాడేది.

చాలా త్వరగా పైకొచ్చిన నటుల్లో ఇమ్రాన్ ఒకరు. అయితే వరుస వైఫల్యాలతో అలసి ఉన్నాడు. ఈ దశలో షూటింగ్ పూర్తి చేసుకుని, నాలుగు నెలల తర్వాత అతను కొడుకు వద్దకు వెళ్లేసరికి, అయాన్ తిరిగి స్కూల్ కి వెళ్ళసాగాడు. అతను 'స్పోర్ట్స్ డే ' పరుగులో పాల్గొనాలని అనుకున్నాడు. ఇంకా తన ఒంట్లో ఓపిక , శక్తి పుంజుకోలేదు. అయాన్ ను నిరాశపరచడం ఇష్టం లేక, మేమూ అతనితో వెళ్ళాము.... అప్పుడు జరిగిన సంఘటన, నన్ను కదిలించివేసింది...




సాధారణంగా, ఏ తల్లిదండ్రులైనా, తమకు యెంత గాయమైనా తట్టుకుంటారు. కాని, తమ బిడ్డకు ఏమైనా అయితే, అల్లాడిపోతారు. మేమూ, అదే దశలో ఉన్నాము, అయాన్ ఏమి చేస్తాడో అని మేము చూస్తూ ఉన్నాము. మూడడుగులు పరుగెత్తి పడిపోయాడు... మళ్ళీ లేచాడు. ఐదడుగులు పరిగెత్తి మరింత గట్టిగా పడిపోయి, గాయపడ్డాడు. అయినా, మళ్ళీ లేచి, పరుగును ముగించాడు. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, నేను నా భార్య పర్వీన్ వంక చూసాను, ఆమె కూడా ఉద్వేగంతో ఏడుస్తోంది. మేమిద్దరం కన్నీటి పర్యంతమయ్యాము... అతను పందెంలో చివర వచ్చినా, అందరికీ, 'నేనూ పాల్గొన్నాను,' అని చెప్పాడు. చిన్నవాడైనా, ఎన్ని అడ్డంకులు, బాధలూ అనుభవించినా, అతను శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. రేస్ పూర్తికాగానే, అయాన్ నా వంక చూసి, నవ్వుతూ, కన్నుగీటాడు.

ఒక బాబు, అన్ని కష్టాల తర్వాత కూడా, నవ్వుతూ, పరుగును ముగించి, 'తాను ప్రయత్నించాను...' అని చెప్తుంటే, ఇక అతని సంకల్పబలం ముందు నేనెంత !

ఆ క్షణం... పడినా, ఓడినా, పరవాలేదని, మళ్ళీ ఒక అవకాశం ఉంటుందని, ఇదంతా  జీవితమనే ఆటలో ఒక భాగమేనని, నాకు బలంగా అనిపించింది. "నీ కాళ్ళల్లో శక్తి లేక ఒణుకుతున్నా, యెంత గాయపడినా, పాకుతూనో, డేకుతూనో, కుంటుతూనో, ఎలాగైనా అక్కడే ఉండాలి, మళ్ళీ అడుగు వెయ్యాలి...." ఇది నా కొడుకు నాకు నేర్పిన పాఠం... అప్పుడు ఏ కష్టం ఎదురైనా, నేను ప్రయత్నం మాననని, నాకు నేనే ప్రమాణం చేసుకున్నాను...

ఫ్రెండ్స్, యెంత గొప్ప సందేశమో కదా ! ఎప్పుడైనా నిరాశకు గురైతే, ఈ సంఘటన గుర్తుకు తెచ్చుకోండి... ముందుకు సాగండి...