Wednesday, October 7, 2015

అనుకోకుండా కేదారనాథ్ దర్శనం - పరిపూర్ణ గురుకటాక్షం

అనుకోకుండా కేదారనాథ్ దర్శనం - పరిపూర్ణ గురుకటాక్షం
-------------------------------------------------------------------
భావరాజు పద్మిని - 7/10/15 


"రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నాము గురూజీ. మా వారికి ఎప్పటినుంచో కేదారనాథ్ చూడాలని ఉంది. కాని ఒకప్రక్క పిల్లలు, ఒకప్రక్క పెద్దవాళ్ళతో వెళ్ళటం వీలుపడట్లేదు." అన్న సందేశం పంపించాను మా గురువుగారికి. 
బదులుగా చిన్న స్మైలీ వచ్చింది, అంతే. కాని, కనిపించిన ఆ స్మైలీ వెనుక, కనిపించని ఆయన అనుగ్రహం వర్షించడంతో, ఆ క్షణానే మా కేదారనాథ్ యాత్రకు, అన్నీ ఏర్పాటు అయిపోయాయి. క్షణాల్లో అసాధ్యాలని సుసాధ్యం చెయ్యగల ఆ కరుణామూర్తి దయ యెంత అపారమైనదో, నా చిన్ని బుర్రకు అప్పుడు తెలియలేదు.

మర్నాడు అమ్మా, నాన్నగారు, అత్తయ్యగారు, ఇద్దరు పిల్లలు, నేను, మా వారు అంతా కలిసి హరిద్వార్, రిషికేశ్ బయలుదేరాము. రాత్రికి హరిద్వార్ లోని  అవదేశానందగిరి స్వామి వారి ఆశ్రమంలో ముందుగా బుక్ చేసిన రూమ్స్ లో విడిది చేసాము. మేము వెళ్ళిన సమయానికి స్వామిజి అక్కడ లేకపోయినా, శిష్యులు చక్కగా అన్నీ ఏర్పాటు చేసారు. ఆశ్రమంలో ఉన్నవారికి ఉచితంగా భోజనం, అల్పాహార సదుపాయాలు అందించడం వారి ప్రత్యేకత. చక్కటి ఆశ్రమ వాతావరణం మమ్మల్ని ఆహ్లాద పరిస్తే, ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న 150 ఏళ్ళ చరిత్ర గల శివ పంచాయతనం కలిగిన మృత్యుంజయ ఆలయం, స్వామీజీ ఉండే గదిలో ప్రతిష్టించిన అతి పెద్ద పాదరస లింగం, రుద్రాక్ష చెట్టు చుట్టూ ప్రదక్షిణకు అనువుగా ప్రతిష్ట చేసిన శివలింగాలు మాలో భక్తిప్రపత్తులను ఇనుమడింపచేసాయి. మర్నాడు ఉదయమే, గంగా స్నానం, హరిద్వార్ లోని 'హరి కీ పౌడి' దర్శనానికి వెళ్ళాము.



మరకత మణుల ప్రవాహంలా ఆ గంగమ్మది ఏమి రంగో, ఏమి పొంగో. ఆ వేగం, వడి, స్వచ్చత చూసి, ఉప్పొంగిన కవి హృదయాలే వర్ణించడానికి పదాలు వెతుక్కుని, ... 'ఉత్తుంగ తరంగ రంగ...' అంటూ రాసారేమో. స్నానాలు, మా భావరాజు కుటుంబసభ్యుల (మొత్తం సుమారు 500 మంది పైనే ) క్షేమాన్ని కాంక్షిస్తూ, పితృదేవతలను స్మరించుకుని, తర్పణాలు వదిలాకా, దర్శనాలు ముగించుకుని, విడిదికి చేరాము. సాయంత్రం రిషికేశ్ చూసేందుకు వెళ్తూ ఉండగా, మా వారు మళ్ళీ ' నాకు కేదారనాథ్ చూడాలని ఉంది. అసలు ఈ జన్మకు అవుతుందో లేదో, ఇప్పుడే 40 లలో పడ్డాము. ఆనక ఓపిక ఉంటుందో లేదో!' అని మొదలుపెట్టారు. మే లో కాశికి వెళ్లి వచ్చాకా, ఆయనకు కేదారనాథ్ వెళ్లాలని, బలమైన సంకల్పం కలిగింది. అప్పటినుంచి ఆయన ఇలా అనటం బహుశా 30 వ సారేమో ! 

"ఒక్కరోజులో వెళ్లి రాలేమా ? కావలిస్తే, మనం అర్ధరాత్రే బయలుదేరదాము." అడిగాను నేను.

"ఇక్కడినుంచి 6 గంటలు (సుమారు ౩౦౦ కి.మీ ) గుప్త కాశి, లేక ఫాటా వెళ్తే, హెలికాప్టర్ ఉంటుంది. అందులో కేదారనాథ్ కు 10 నిముషాలు ప్రయాణం. ట్రై చెయ్యచ్చు, కాని, హెలికాప్టర్ దొరుకుతుందో లేదో, తీరా అంత దూరం వెళ్ళాకా లేకపోతే, మనం నిరాశగా వెనుదిరగాలి. అయినా, ఇప్పుడు 6 గం.కావస్తోంది, రేపు ఉదయాన్నే వెళ్ళాలంటే, ఎన్నో ఆలోచించాలి." అన్నారు మావారు. 

"ట్రై చెయ్యండి, ఆపై దైవానుగ్రహం." అన్నాను నేను. మా అమ్మా, నాన్నగారు 'పిల్లల్ని మేము చూస్తాము, హాయిగా వెళ్లి రండి' అన్నారు. వెంటనే మావారు కేదారనాథ్ స్వస్థలమైన వారి సహోద్యోగితో మాట్లాడారు. మెరుపు వేగంతో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మామూలుగా కొండ దారుల్లో అప్పుడప్పుడు జలపాతాల పారే నీటివల్ల రోడ్డు పాడయ్యి, ట్రాఫిక్ జాంలు అవుతూ ఉంటాయి. అందుకని, ఒక్కరోజులో  కేదారనాథ్ వెళ్లి రావటం (600km మొత్తం) అంటే కష్టమేమో నని, చీకటి పడ్డాకా, కొండదారుల్లో ప్రయాణానికి అనుమతించక ఆపేస్తారని, రాత్రి ఉండాల్సి వస్తే, అందుకు వీలుగా ఒక్కరోజుకు సరిపడా బట్టలు పెట్టుకోమనీ, వారు చెప్పారు. 

రిషికేశ్ లోని లక్ష్మణ్ ఝూలా, ఆలయాలు చూసి, రాత్రి 9 కల్లా, ఉదయం 4 గం. లకు మమ్మల్ని ఫాటా దాకా చేర్చాల్సిన వాహనం ముందుగానే ఆశ్రమానికి వచ్చి చేరింది. అప్పుడు పట్టుకుంది మావారికి భయం. స్వతహాగా తను భయస్తులు. కాని, కేదారనాథ్ చూడాలని కొండంత ఆశ. "పోనీ మానేద్దాం.. నాకు ఎందుకో భయమేస్తోంది." అన్నారు తను. 'మళ్ళీ ఇటువంటి అవకాశం మన జీవితంలో వస్తుందో లేదో, వెళ్ళాల్సిందే ' అంటూ నేను ఒప్పుకోక , స్కూల్ కు వెళ్ళను అని మొరాయిస్తున్న పసి పిల్లవాడిని చెవి పట్టుకు తీసుకెళ్ళే తల్లిలా ఆయన్ని తయారుచేసి, కారులో కూర్చోపెట్టి, తన ఒళ్ళో తలపెట్టుకు హాయిగా పడుకున్నా. ఆయన అలాగే చూస్తూ కూర్చున్నారు. కొండదారులు, చీకటి, ఘాట్. ఓ రెండు గంటల తర్వాత నేను నిద్ర లేచాకా నా చెయ్యి పట్టుకు కూర్చున్నారు.

'హిమగిరి సొగసులు' అన్న పాటను గుర్తుచేసేలా ఉన్నాయి పరిసరాలు. మాతో గంగమ్మ ౩౦౦ కి.మీ మేరా ప్రయాణించింది. నదీ గమనాన్ని బట్టి, రోడ్లు వేస్తారా అనిపించింది. దేవప్రయాగలో భాగీరధి, అలకనంద సంగమం, రుద్ర ప్రయాగ లో అలకనంద, మందాకినీ, కర్నప్రయాగలో సరస్వతి, భాగీరధి నదులు కలుస్తాయట. ఇవన్నీ కలిసి, గంగగా హరిద్వార్ కు వస్తాయి. రుద్రప్రయాగ, దేవప్రయాగ లోని సంగమాలు చూసాము. కేదారనాథ్ లో నివసించే మావారి సహోద్యోగి బంధువు, మాకు హెలికాప్టర్ ఏర్పాటు చేసారు, మేము దిగేసరికి అక్కడ సిద్ధంగా ఉంటానని ఫోన్ చేసారు. వారు అక్కడ పండా (పూజారి)గా తరతరాలుగా ఉన్నారు. కాసేపట్లో ఫాటా చేరుకుంటాము అనగా, జరిగిందొక అద్భుతం !

ముందు నాకళ్ళు చూసేది నమ్మలేదు. ఏదో హెలికాప్టర్ ఏమో అనుకున్నాను. కాస్త దగ్గరికి వచ్చాకా తెలిసింది, సుమారు ఐదడుగుల వెడల్పు ఉన్న అతి పెద్ద గరుడ పక్షి, రెక్కలు బారజాపి, మావైపే వచ్చింది. గోధుమ, బ్రౌన్ రంగులు కలగలిపి, యెంత మనోజ్ఞంగా ఉందో ! దానివేనుకే, అటువంటి మరో పక్షి. ఆశ్చర్యంతో నేను తేరుకుని, ఫోటో తీద్దాము, అనుకునే లోపే , వెనుదిరిగి, కొండల్లోకి మాయమయ్యాయి. 




సాధారణంగా గరుడ పక్షుల దర్శనం దుర్లభం. అలా కనిపిస్తే, అది చాలా మంచి శకునమని, పాపాలు అన్నీ పటాపంచలు చేస్తుందని, మింటనున్న దేవతల ఆశీర్వాదం తీసుకువస్తుందని, ఒక నమ్మకం. అటువంటిది... రెండు గరుడ పక్షులను మావైపే ఎగురుతూ వచ్చి, మమ్మల్ని పలకరించి వెళ్లినట్టు చూడడం ఒక మరపురాని అద్భుతం ! నిశ్చయంగా మా దంపతులపై ప్రసరించిన శివానుగ్రహం.

ఫాటా కాసేపట్లో చేరుకుంటాము అనగా, దూరాన కనిపిస్తున్న మంచు కొండలు మాకు కనువిందు చేసాయి. అక్కడికి వెళ్ళగానే, దిగిన పావుగంటలో, హెలికాప్టర్ సిద్ధంగా ఉంది.  విమానాప్రయాణం అలవాటే అయినా, చలిగా ఉన్నప్పుడు, 'ఏమే, ఆ ఫ్యాన్ తగ్గించు, హెలికాప్టర్ కింద పడుకున్నట్టు ఉంది,' అనటం తప్ప, ఎప్పుడూ హెలికాప్టర్ ఎక్కలేదు. సూర్యకిరణాలకు మెరుస్తున్న తళతళ లాడే గుండుతో పైలట్ గారు రంగ ప్రవేశం చేసారు, ఇదో గమ్మత్తు. "ఎక్కడుంటారు?" అన్నారు రాగానే. "చండీగర్" అన్నాము మేము. "ఆహా, నేను పంచకుల లో ఉంటా" అన్నాడు అతను. "మేమూ అక్కడే, సెక్టార్ -20 లో " అన్నారు మావారు. "హబ్బ, నేనూ అక్కడే, " అన్నాడు అతను. "మా ఫ్లాట్స్ లోనే అని కూడా అనకండి, "అన్నాము ఇద్దరమూ నవ్వుతూ. "లేదండి, మీకు దగ్గరలో ఉన్న ఆర్మీ సొసైటీ లో ఉంటాను, ఎప్పుడైనా కలుద్దాము,"అన్నారు ఆయన కూడా మాతో నవ్వుతూ.

  ప్రత్యేక కోటాలో బయలుదేరినట్టు, మేము ఇద్దరం, ఒక పైలట్ మాత్రమే హెలికాప్టర్ లో బయలుదేరాము. ఆ సమయంలో వేరే ప్రయాణికులు లేకపోవడం ఇంకో చిత్రం. బడాబడా హెలికాప్టర్ చప్పుడు చేస్తున్నా, నాకు అసలు భయం అన్నది లేకపోవడంతో, గురుస్మరణతో  ప్రయాణం ఆస్వాదించసాగాను. త్రోవ పొడవునా పైలట్, ప్రక్కనే కూర్చున్న నాకు కేదారనాథ్ కు వెళ్ళే కాలిబాటను చూపారు. అసలు భక్తి అంటే, కొండలూ, గుట్టలూ నడకతో,గుర్రాలపై 14 km ప్రయాణించి, నానాకష్టాలు పడి, శివదర్శనం చేసుకునే వారిదే కదా, అనిపించింది. ఇలా 3 నిముషాలు వెళ్ళగానే, "ఓహ్..!!!" కళ్ళముందు మరో అద్భుతం.



గురువు మీద గురి ఉంటే... గాల్లో తేలచ్చు, అద్భుతాలు చూడచ్చు, చెయ్యచ్చు, మనసారా జీవితాన్ని ఆస్వాదించవచ్చు, అనిపించింది, ఆ క్షణం ! మంచుకొండల మధ్య కైలాశ శిఖరంలా, కళ్ళముందు సాక్షాత్కరించిన భూలోక కైలాశం లాగా, దూరాన కేదారనాథ్ ఆలయం కనిపించింది. మనసు ఆనందంతో ఉప్పొంగింది. సరిగ్గా 10 వ నిముషంలో మేము అక్కడ దిగగానే, పూజారి మమ్మల్ని వచ్చి కలిసారు. మమ్మల్ని గుడి వంక తీసుకు వెళ్ళారు.

విలయానికి మౌనసాక్షిలా మిగిలిన ఆ ఆలయంలో ఎనలేని ప్రశాంతత, అద్భుతమైన శక్తి తరంగాలు. నా ఒళ్ళు దివ్యశక్తి తరంగాలతో ఊగిపోయేలా ఉంది. ఒక ప్రక్క గణపతి రూపులా, మరోప్రక్క అమ్మవారి శ్రీచక్రంలా, మరోప్రక్క శివలింగంలా అనిపిస్తూ, శివ పరివారాన్ని మొత్తంగా ప్రతిబింబించేలా ఉంటుంది కేదారేశ్వర జ్యోతిర్లింగం. పూజాసామాగ్రి తీసుకుని, ఆలయంలోకి వెళ్ళాకా, ఒక ప్రక్కగా కూర్చుని, సుమారు 15 నిముషాల పాటు అభిషేకం చేసుకున్నాము. మా పూజ పూర్తి అయ్యేదాకా, గర్భగుడిలో జనం అట్టే లేరు. మా పూజ అవ్వగానే, బిలబిల మంటూ వచ్చిన జనసందోహంతో కనీసం నిల్చునే స్థలం కూడా లేకుండా అయిపొయింది. ఇదొక విచిత్రం మాకు.

బయటికి వచ్చాకా, మా పూజాపాత్రలో ఉన్న సామాగ్రి చూస్తే, అందులో ఉన్న బ్రహ్మ కమలం అచ్చంగా గణపతి రూపులా అనిపించింది. గుడి వెనుక భాగంలో ఉన్న 'దివ్య శిల' ను చూపించారు పూజారి గారు. 2012 లో వరదలు వచ్చే ముందు, పైన ఉన్న చెరువు గట్టు తెగి, వరద పారే ముందు, సరిగ్గా ఈ ఆలయమంతే  వెడల్పు ఉన్న పెద్ద శిల దొర్లుకుంటూ వచ్చి, గుడి వెనుక భాగంలో అడ్డంగా నిలబడి, వరదలకు ఆలయం కొట్టుకుపోకుండా కాపాడిందట ! ఆలయానికి అటూ, ఇటూ ఉన్న ఇళ్ళు, కొట్లు అన్నీ ఆ ఉధృతికి నామరూపాలు లేకుండా పోయాయట. దైవలీలలు ఎంచడానికి మానవ మేధస్సు సరిపోదు.



పూజారి గారు దూరంగా ఉన్న తమ ఇంటిని చూపి, ఇలా అన్నారు," ఒక అంతస్థు మొత్తం మడ్డిలో కూరుకు పోయింది. మా ఇంట్లో 3 వ అంతస్తులో నేను, మావాళ్ళు , మరో 80 మంది దాకా, 3 రోజులపాటు అలాగే వరద, బురద, వానలో కూరుకుపోయి, ఆలయం వంకే చూస్తూ ఉన్నాము. శివుడి లీలలు విచిత్రమైనవి. వరదలో కొట్టుకు పోతున్నవాడిని ఈవలకు, మావద్దకు పడేసాడు. మావద్దనే కూర్చున్న వాడిని, వరదలో పడేసి, తీసుకుపోయాడు. అదృష్టం, చావో రేవో ఆయన దయ, ఎలాగైనా చేరేది ఆయన్నే అని నమ్మి అక్కడే ఉన్న 80 మందీ బ్రతికిపోయారు. అసలు అప్పటినుంచి నేను ఇక్కడ తక్కువే ఉంటున్నాను. రెండు మూడు రోజుల క్రితమే ఏదో పనిబడి ఇక్కడికి వచ్చాను. ఇదిగో, ఇలా మిమ్మల్ని కలిసి, దర్శనం, అభిషేకం చేయించమని, శివుడే పంపాడేమో !"

ఈ ప్రపంచంలో చెడునడవడి కల బిడ్డలు ఉంటారు కాని, చెడ్డ తల్లులు ఉండరు. అలా తల్లీ, తండ్రీ అన్నీ తామే అయ్యి,అవ్యాజమైన ప్రేమానురాగాలు వర్షించే ఆ దైవానికి ,ఈ చరాచర జగత్తులో మనం ఏమి సమర్పించినా, అది ఆయన సృష్టే తప్ప, మన సృష్టి కాదు కదా ! ధ్యానం, అవాకాశం ఇచ్చినప్పుడు చిన్నపాటి గురుసేవ చేసుకునే భాగ్యం దక్కిన నావంటి వారికి గురుఅనుగ్రహంతో దక్కిన అరుదైన వరం కేదారేశ్వరుడి దర్శన భాగ్యం.

బయటికి రాగానే  అమృతతుల్యమైన కేదారనాథ్ లోని పంపు నీరు మరికొంత తాగి, క్రింద ఉన్న చిన్న హోటల్ లో భోజనం ముగించుకుని, బయటికి వచ్చిన 10 నిముషాల్లో మా తిరుగు ప్రయాణపు హెలికాప్టర్ వచ్చేసింది. మధ్యాహ్నం 2.15 కు బయలుదేరి, తిరిగి, రాత్రి 9 గం. కల్లా, హరిద్వార్ చేరుకొని, మర్నాడు మధ్యాహ్నం చండీగర్ వెనక్కు వచ్చాము. అనుకోకుండా ఆన్నీ సమయానికి ఏర్పాటు కావటం, దుర్లభమైన శివ దర్శనం, అరుదైన అనుగ్రహాలు... కేవలం, గురుకటాక్షం. నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం.
//శివాయ గురవే నమః //