Saturday, February 25, 2017

కవితలు రాయండిలా !

కవితలు రాయండిలా !

కవితలు రాయడంలో నాకు తెలిసిన కొన్ని మెళకువలు చెప్పమని ఒకరు అడిగారు. ఎలాగూ చెప్పాలని అనుకున్నప్పుడు నాకు తెలిసినంత వరకు అందరికీ చెబితే, కొందరైనా, కనీసం ఒక్క అంశమైనా నేర్చుకుంటారు కదా, అన్న చిన్న ఆశ కలిగింది. అందుకే ఈ పోస్ట్ ! అసలు కవిత్వం ఎలా మొదలవుతుంది

ఏదైనా ఒక అంశం మన మనసుకు బాగా హత్తుకున్నప్పుడది, స్పందిస్తుంది. అలా స్పందించిన మనసు ఆయా సందర్భాలను బట్టి, అనేక రకాలైన భావోద్వేగాలకు గురౌతుంది. ఆ 'భావము' అనే ప్రవాహిని, మనసంతా నిండిపోయి, అక్షరాలై ప్రభావించాలని బలంగా అనుకున్నప్పుడు ప్రతి మనిషిలోంచి ఒక కవి పుడతాడు. అయితే, ఆ భావాలను వ్యక్తపరిచే విధానం ఆ వ్యక్తి పెరిగిన విధానం మీద, వాతావరణ పరిస్థితుల మీద, చదివిన పుస్తకాల స్థాయి మీద, విన్న కధల మీదా... వెరసి ఆ వ్యక్తి బాల్యంలో భావాలు సుసంపన్నమయ్యే దశలో అతనికి తారసపడ్డ వివిధ స్థితిగతుల మీదా ఆధారపడి ఉంటుంది. మంచి పాఠకుడే మంచి రచయత అవుతాడన్నది నిశ్చయం !  ప్రస్తుతం ఫేస్బుక్ వంటి మాధ్యమాల ద్వారా అందరికీ రాసేందుకు ఒక 'వేదిక' దొరకడంతో కొత్త కలాలు ఎన్నో రెక్కలు తొడుక్కుంటున్నాయ. అయితే, 'అదిగదిగో గోడ, గోడ పక్కన దూడ' వంటి కవితలకు కూడా ఓ ఇరవై లైక్ లు, ఓ పది కామెంట్లు ... నువ్వస్సలు తగ్గద్దు భయ్యా... రాయి, ఇంకారాయి, అని ప్రోత్సహించేవారు రావడంతో తెలుగు భాష ఒకానొక దీన స్థితికి దిగజారిపోతోంది. ఎవరో పెద్దాయన చెప్పిన మాటలు...  "భాషాదోషం వాఙ్మయానికి ముప్పు. వాఙ్మయదోషం సంస్కృతికి ముప్పు. సంస్కృతిదోషం సత్యస్థితికి ముప్పు." అలా జరిగినప్పుడు ఇక మానవజన్మ వలన ఉపయోగం ఏముంటుంది? అందుకే ఏది చేసినా, రాసినా సరిగ్గా నేర్చుకుని రాస్తే బాగుంటుంది కదా !

·         ముందుగా అసలు కవి ఏమి చెప్పదలచుకున్నారో, ఆలోచన స్పష్టంగా ఉండాలి. స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన భావాలకు, స్పష్టమైన భావం స్పష్టమైన భాషకు, వ్యక్తీకరణకు దోహద పడుతుంది. ఏదో ఒకటి రాయాలి కదా, అని రాసి పారెయ్యడం, గొప్ప కాదు. మనం అనుకున్నది మన భావంలో వస్తోందా, అది చదివేవారి మనసుకి హత్తుకునేలా ఉందా లేదా అని సమీక్షించుకోవాలి.

·         నిజమే, కవిత్వానికి ఏ లయ, ఛందస్సు లేదు. కాని మనం వాడే వాక్యాల్లోని, చివరి పదాలు ఒక ప్రాసలో కలిసినప్పుడు ఆ కవితకు ఒక అందం వస్తుంది. ఉదాహరణకు –
o    “గాఢపు మబ్బులు గగనము కమ్మెను 
మరలక తప్పని సూర్యుడు దాగెను
ఆర్తిగ సెగలతొ అవని వేచెను
గాలుల సవ్వడి సేదను దీర్చెను
ఎప్పుడెప్పుడని ఎదసడి అడిగెను
తొలకరి తపనలు తీర్చే తరుణం !”

o    ఇందులో కమ్మెను, దాగెను, వేచెను, తీర్చెను, అడిగెను... వంటి పదాలు చివర్లో వాడడం వలన కవితకు ఒక అందం వస్తుంది. కవిత వేరు, వచన వాక్యం వేరు. కవితల్లోని వాక్యాలను ఒక దాని ప్రక్కన మరొకటి పెట్టుకు చూస్తే, అది పారాగ్రాఫ్ చదివినట్లు ఉంటే కనుక, ఆ కవిత పండనట్లే.


·         కవితల్లో ఒక వాక్యం చాంతాడంత పొడుగ్గా, మరో వాక్యం మొలతాడంత పొట్టిగా ఉంటే బాగోదు. వాక్యాలన్నీ దాదాపుగా ఒకే నిడివిలో ఉండేలా చూసుకుంటే, కవిత శిల్పంలో ఒక అందం వస్తుంది.  రేపటి రోజున ‘మనం ఏం రాసామా ‘ అని వెనుదిరిగి చూసుకున్నప్పుడు, అప్పటికీ ఇప్పటికీ మనతో మనమే పోల్చుకున్నప్పుడు, ఒక పరిణితి కనపడాలి. ఆ దిశగా సాధన చెయ్యాలి. బాగా రాయట్లేదు అని మనకి అనిపించినప్పుడు, పెద్ద పెద్ద కవులు ఎలా రాసారా అని చదివి, తెలుసుకోవాలి, నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి.


·         "నేను రాసే ప్రతి అక్షరానికి నేను బాధ్యత వహిస్తాను. ఇక్కడ ఇది ఎందుకు రాసావు? అని ఎవరైనా అడిగితే, సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానో లేదో అని, నేను రాసిన వాటికి, నేనే విమర్శకుడిగా, ఒకటికి పదిసార్లు చదువుకుని చూస్తాను." - అన్నారొక ప్రముఖ రచయత. ఒక కవితను రాసాకాఅక్కడ ఆ పదం బదులు ఇంకో పదం పెట్టవచ్చా, అలా పెడితే నడక, భావం ఇంకా బాగుంటుందా అని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవాలి. అలాగే నేను సిరివెన్నెల గారిని కలిసినప్పుడు ‘మీ రచనలకు ఎప్పుడైనా విమర్శలు ఎదుర్కున్నారా?” అని అడిగాను. దానికి వారిచ్చిన సమాధానం – ‘లేదమ్మా, నాకు నేనే పెద్ద విమర్శకుడిని, ఒకటికి పదిసార్లు సమీక్షించుకుంటాను. అందుకే ఇంత వరకు, ఏ విమర్శా ఎదుర్కోలేదు,” అన్నారు. – అంతటి వారే ఇలా ఉంటే, మనమెంత చెప్పండి? ఆచరిద్దాం !

·         సమాజంలో ఉన్న రుగ్మతలను కవి ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిందే ! అయితే, ప్రతి భావానికి ఒక కట్ ఆఫ్ లైన్/బోర్డర్ లైన్ ఉంటుంది. మనం కవులం, కళాకారులం కాకపోయినా ముందు మంచి పౌరులవ్వడం, ఎవరినీ నొప్పించక పోవడం ముఖ్యం కదా ! కవి కోపంలో కాని, ఆందోళనలో కాని, ఆవేదనలో కాని, లేదా ఎటువంటి భావోద్వేగాలకు గురైనా ఆ ‘బోర్డర్ లైన్’ దాటకుండా జాగ్రత్త వహించాలి. దీని ద్వారా ఎవరైనా బలంగా నొచ్చుకుంటారా అని ఆలోచించాలి. లేకపోతే, పడగ్గదిని పబ్లిక్ కి తెచ్చే విచ్చలవిడి శృంగార కవితలు, క్షుద్ర కవితలు, శ్మశాన కవితలు, పైశాచిక ప్రేమ కవితలు తయారౌతాయి. దురదృష్టం ఏమిటంటే, ఇటువంటివి ప్రముఖ పత్రికలూ అచ్చు వేస్తున్నాయి. ఇటువంటి కవితలు రాయడం కంటే రాయకపోవడమే మంచిది. కవి తను రాసిన ప్రతి అక్షరాన్ని చెలియలి కట్ట దాటకుండా చూసుకోవాలి. అప్పుడే ఆ భావావేశం ఉత్తుంగతరంగం అవుతుంది.

·         వైవిధ్యమైన కవితలు రాయడం, సమకాలీన అంశాలను స్పృశించడం, రచనల్లో చాలా ముఖ్యం. అమ్మ, ప్రేమ, ప్రేమ వైఫల్యం వంటివి చాలామంది సాధారణంగా కవితా వస్తువులుగా తీసుకుంటూ ఉంటారు. అవే తీసుకున్నా, కొత్తగా, మనదైన కోణంలో ఏమైనా చెప్పగలిగామా అని చూసుకోవాలి, విభిన్న అంశాలపై రాయాలి. వీలయితే పామర భాష నుంచి పండిత భాష వరకు విభిన్న పోకడలను, ప్రాంతీయ యాసలను వాడే ప్రయత్నం చెయ్యాలి.

·         అన్నిటికంటే ముఖ్యంగా కవికి కావలసింది నిశిత పరిశీలనా దృష్టి. ముఖ్యంగా యువతరం కవితల్లో చాలా భాషా దోషాలు కనిపిస్తున్నాయి. తాను ఏవైనా పదాలు తప్పుగా రాసానా, అని గమనించుకుని, ఒక పుస్తకంలో వాటిని రాసుకుని, మళ్ళీ రాసినప్పుడు అదే పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. అలా క్రమం తప్పకుండా చేస్తే, రోజురోజుకూ భాషా జ్ఞానం మెరుగవుతుంది.

·         పెద్దలు, అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలను స్వీకరించండి. వీలయితే దిద్దుకోండి. అంతే కాని, వారేదో అసూయతో చెప్పారన్న అపోహలో ,మూస పద్ధతిలో రాసుకుంటూ పోవడం మంచిది కాదు. కటువైన విషయమైనా మెత్తటి చెప్పుతో కొట్టినట్లు చెప్పండి. అతిగా రాసే వారికి, అతిగా తిట్టేవారికి అంతా దూరంగా జరుగుతారని మరువకండి.

ఇంకా నేను ఏవైనా మరచి ఉంటే, పెద్దలు విన్నవించగలరు. నేను ఎప్పటికీ నిత్య విద్యార్దినినే. పలక పట్టుకు వెళ్తున్న పసిపాపలా అక్షరాలు చెరిపేసి, మళ్ళీ దిద్దుకోడానికి సిద్ధమే. నాకు తెలిసిన ఈ విషయాలు భావి కవులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. కృతజ్ఞతాభివందనలతో
భావరాజు పద్మిని
23/2/17



Wednesday, February 15, 2017

మానవ సేవే మాధవ సేవ

ప్రేమ...ఎండా వానను కలిపే హరివిల్లు. ఆ హరివిల్లు రంగులు ఇరువురి జీవితాల్లో శాశ్వతంగా నిలచినప్పుడు, పెళ్ళనే రంగవల్లిలో లక్షణంగా వొదిగినప్పుడు జీవితం రమణీయం, రాగరంజితం. కానీ, విధి వశాన ,హరివిల్లులా, ప్రేమ కేవలం కొంత కాలమే విరిసి మటుమాయమయితే....ఆ మనసులు పడే బాధ వర్ణనాతీతం. అవే హరివిల్లు రంగులను పదే పదే అన్వేషిస్తూ...జీవితం శూన్య ఆకాశంలా...ఎండమావిలా...అనిపిస్తుంది.
అయితే ...ఈ రోజుల్లో ప్రేమ అన్న పదం హాస్యాస్పదంగా మారింది. సినిమాలు, టీవీ ల ప్రభావంతో తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లలు ప్రేమను 'తిండి, బట్ట, ఇల్లు...' వంటి కనీసావసరాలలో ఒకటిగా భావించి, విధిగా ప్రేమించాలేమో అని భ్రమ పడుతున్నారు. యువత కాలక్షేపం ప్రేమలు, చీకట్లో చెరువుగట్టు ప్రేమలు, కాపురాలు కూల్చే స్వార్ధపు ప్రేమలు, అసభ్య ప్రేమలు చూస్తే 'ప్రేమ' అన్న పదం వింటేనే రోత పుడుతోంది.
ప్రేమ విఫలం అయ్యింది. విపరీతమయిన నిరాశ, నిస్పృహ....గుండెలు పిండే బాధ . అమ్మాయి మోసం చేసింది. అసలు ఈ అమ్మాయిలే అంత. అమ్మాయిల్ని నమ్మకూడదు. అసలు దానికి విలువలు లేవు. అంతే...ఆ ప్రేమికుడి ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. నాణానికి మరో వైపులా , అమ్మాయి కోణం నుంచీ ఆలోచించే వాళ్ళు ఎంతమంది. అరచేతుల్లో పసిబిడ్డగా వోదిగినప్పటినుంచీ, అపురూపంగా, కళ్ళలో వత్తులు వేసుకు పెంచిన తల్లిదండ్రులు...తనకు చిన్న కష్టం కలిగితే విలవిల్లడిపోయి ఎన్నో మొక్కులు మొక్కి, తన ముచ్చటలు తీర్చేందుకు ఎన్నో త్యాగాలు చేసిన అమ్మానాన్నలు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేసి, వాళ్ళ గుండెల మీద తన్ని, అమ్మాయి వచ్చెయ్యాలి. తెలిసీ తెలియని యువకుడు తనను బాగా చూసుకుంటాడా ? అసలు పోషించగలడా ? ప్రేమ పేరుతో బందిస్తాడా , స్వేచ్చని ఇస్తూ గౌరవిస్తాడా ? అతని తల్లిదండ్రులు తనను నిందిస్తే....ఒక వేళ కష్టపెడితే , ఎవరితో చెప్పుకోవాలి? ఇటువంటి సందేహాలన్నీ అధిగమించి, అమ్మాయికి మీ పై సంపూర్ణ విశ్వాసాన్ని అందించగలిగినప్పుడే , ఆ ప్రేమ సఫలం అవుతుంది. ఒకవేళ ప్రేమ విఫలం అయితే, ఆ అమ్మాయి మనసులో తాను అంత నమ్మకాన్ని కలిగించలేక పోయానని అర్ధం.
సరే, అయ్యిందేదో అయిపొయింది. ఒక అల తీరం దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్తవ్యమ్? ఆ అమ్మాయిని హృదయపూర్వకంగా మీరు ప్రేమించినట్లయితే ఆమెకు మీరు ఇచ్చే కానుక....టన్నుల కొద్దీ విఫల ప్రేమ కవితలు ...అంతేనా? అదే భావంలో, అదే వేదనలో ఆగిపోవడమేనా. ఇలా అంటున్నందుకు క్షమించాలి....ఒకటో ఆరో విఫల కవితలు పర్వాలేదు...కాని మీరు అటువంటి కవితలు రాసే ప్రతీ క్షణం నిరర్ధకం. కాలం ఎంతో విలువయినది. దాన్ని ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకూడదు. మరి ఏమి చెయ్యాలి?
మన జీవితాలని తిరిగి సవ్య దిశలో మలచుకోవాలి. ఇందుకు పెట్టుబడి...' దేహం, ప్రాణం, రక్తం, సత్తువ...' ఇంతకు మించిన సైన్యాలు విజయానికి అక్కర్లేదు. ఈ లోకంలో ప్రేమకు నోచుకోని ఆనాధాలు, రోగగ్రస్తులు, వికలాంగులు, వృద్ధులు ఎందరో ఉన్నారు. వారితో రోజులో ఒక్క గంట గడపండి చాలు. వారిని ఆత్మీయంగా పలకరించండి. బ్రతుకులోని మాధుర్యం తెలిసి వస్తుంది. ఇది మీరు ప్రేమించిన మనసుకు మీరిచ్చే ముగ్ద నివాళి. మంచి పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడండి. మీరు కోల్పోయిన ప్రేమ ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. ఇది నిజం....మానవ సేవే మాధవ సేవ.

Sunday, February 12, 2017

అభిజాత్యం కాదు... అభిమానం!


అభిజాత్యం కాదు... అభిమానం!
నేను ఇతర పత్రికలకు, పోటీలకు రాయను... ఎందుకంటే...
ఒక అజ్ఞాత వ్యక్తిని నడిరోడ్డు మీద నిలబెట్టి, అతని గుణగణాలు, విలువ ఎంతో తెలియని వారిని అంచనా వేసి చెప్పమంటే ఏం చెప్తారు? జీవిత సారాన్ని కాచి వడపోసిన విజ్ఞులు ముందుకొచ్చి చెప్పినా కూడా అది అసంపూర్ణ వ్యాఖ్య అవుతుందే కాని, సంపూర్ణం కాదు. అలాగే నాకు సరస్వతి అమ్మవారు పెట్టిన ఈ అక్షరభిక్షను ఏదోఒక పోటీల్లో నిలబెట్టి, ‘నా అక్షరాల విలువ నువ్వు తేల్చి చెప్పు’ అని అడగడం అంటే, నేను నాకామె ఇచ్చిన వరాన్ని తక్కువ చెయ్యటమే కదా ! (ఇది నా వ్యక్తిగత భావన). అందుకే నేను ఏ అక్షరాన్ని తక్కువగా చూడను, పత్రిక పెట్టిన మూడేళ్ళలో తిప్పి పంపిన రచనలు ఏ మూడో నాలుగో ఉంటాయి, అంతే. వాటికీ తగిన కారణాన్ని సున్నితంగా చెప్పానే కాని, దుడుగ్గా సమాధానాలు ఇవ్వలేదు. ఎప్పుడు పోటీలు పెట్టినా అందిన ప్రతి రచననూ ప్రచురించాను కాని, వృధా చెయ్యలేదు. ప్రతి అక్షరాన్ని, అక్కున చేర్చుకుని, ఆదరించాను.
అసలు పత్రికల ‘అంచనా/పోలిక’ అన్న విషయంలోనే ఎన్నో మెలికలు ఉంటాయి. వారికి సన్నిహితులు, ఆప్తులైన ప్రముఖ రచయతలకు మొదటి ప్రయారిటీ, రెగ్యులర్ గా రాసే వారికి మరో ప్రైయారిటి, ఆశాజనకమైన కధలే వెయ్యాలనీ, లేకపోతే ప్రతులు అమ్ముడుపోవన్న మరో ప్రయారిటీ, మరో కధలో వాళ్ళు రూపొందించిన కొన్ని ‘కీ వర్డ్స్’ ఉండకూడదన్న ప్రత్యేక ప్రైయారిటి, ఇలా చాలా ఉంటాయి. ఆ అభ్యంతరకర చిన్న పదం ఏమిటో, బ్రహ్మ దేవుడికి ఎరుక. ఇక వారు చెప్పే ‘సో కాల్డ్ జడ్జీల’ భావాలు కూడా వారి మనస్తత్వాలను అనుసరించి పెర్వర్టేడ్ గా ఉండడాన్ని నేను స్పష్టంగా గమనించాను.
ఇలా ఉన్నా సరే... ఈ మూసపోసిన పాత మార్గంలో వెళ్లకపోయినా సరే, నా అక్షరం ఖండఖండాంతరాలు దాటింది. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వారంతట వారే గుర్తుపట్టి, నావద్దకు వచ్చి, పలకరించేలా చేసింది. ‘భావరాణి’ గా నాకు పట్టం కట్టేలా చేసింది. నాకొక అస్తిత్వాన్ని, గౌరవాన్ని ఇచ్చింది. పలువురు సాహితీ దిగ్గజాల, సినీ ప్రముఖుల మన్ననలు అందుకుంది. వారంతట వారే నాకు ఫోన్ చేసి, అభినందిస్తారంటే మీరు నమ్ముతారా? ఇవన్నీ నా బాధ్యతను మరింత పెంచాయి. నా కలానికి సంతులనం నేర్పాయి. సామాన్యుడైనా, సమ్మాన్యుడైనా, వారు చదివి, చలించి, స్పందించి చెప్పే ఆ ఒక్క మాటా చాలు నాకు. అక్షరాల మీద ఆదాయం వద్దు, సన్మానాలు, పురస్కారాల కోసం పావులు కదిపి, పళ్ళాలు కొట్టే వెంపర్లాట నాకొద్దు. అక్షరం నాకందించిన మర్యాదకి, ఆ అక్షరాన్ని అమ్మలా ఆరాధిస్తూ, సమాజానికి సామాజిక మాధ్యమాల ద్వారా ఉపయుక్తమైన సందేశం ఇవ్వగలిగితే చాలు.
జీవితం నవరసాల సమ్మేళనం అయితే, కటువైన వాస్తవాలు కూడా ఉంటాయి, మరి కధలన్నీ తియ్యగానే, పంచదార తిన్నట్టే ఎలా ఉంటాయి? నవరసాల సంగమమే కదా జీవితం ! చివరికి కుప్పలు తెప్పలుగా వచ్చిన రచనల మధ్య అస్తిత్వాన్ని వెతుక్కోలేక మరుగున పడుతుంది. ఆ కధ స్వీకరించబడిందో లేదో తెలుసుకునే లోపల కన్నెపిల్లలు పెళ్లిళ్ళు చేసేసుకుని, తల్లులు కూడా అయిపోతారు. ఇలా నా కలాన్ని, కాలాన్ని వృధా చెయ్యటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పోటీలకు, ఇతర పత్రికలకు దూరం. విలువలు, కట్టుబాట్లు గురించి ‘ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి’ అని హితబోధలు చెయ్యలేదు. అలాగని, దేనికైనా తెగించే విశృంఖల సాహిత్యానికీ ఆజ్యం పోయ్యలేదు. నా మనసును స్పందింప చేసిన అంశాన్ని, నా భావాల్లో హృద్యంగా పెట్టి అందించాను. మిత్రులు ఎవరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అడిగినప్పుడు సామాజిక బాధ్యత కల ఒక రచయిత్రిగా కధలు, కవితలు ఉచితంగానే రాసిచ్చాను. ఇప్పటికీ ఇదే నియమానికి కట్టుబడి రాసిస్తాను. ఊరికే రాయించుకుని, పక్కన పారెయ్యకుండా, అక్షరానికి ఒక మర్యాద, గౌరవం ఇచ్చే వారికోసం రాస్తాను.
భావరాజు పద్మిని
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా భావాలను మీకు సుస్పష్టం చెయ్యాలనే ! నిరంకుశత్వం కాదు, నేను నమ్మిన భావాలకు కట్టుబడే నిబద్ధత ! నాది అభిజాత్యం కాదు, అక్షరం మీద ఎనలేని అభిమానం. అర్ధం చేసుకుంటారు కదూ !
మీ

Monday, February 6, 2017

సోషల్ మీడియా ప్రాణాలు తీస్తుందా ?

సోషల్ మీడియా ప్రాణాలు తీస్తుందా ?

ఫ్రెండ్స్, ఈ మధ్యనే బెంగళూరులో ఓ 18 ఏళ్ళ కుర్రాడు తాను పనిచేసే టైల్స్ షాప్ లో పనికి సైకిల్ పై వెళ్తూ, KSRTC బస్సు గుద్దెయ్యడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఆ కుటుంబానికి ఆ కుర్రాడే ఆధారం. అతను మరణ వేదనలో ఉండగా, చుట్టూ ఉన్న జనం ఓ 40 నిముషాల పాటు అతని ఫోటోలు, వీడియోలు తీస్తూ నిలబడి ఉన్నారట ! ఎంతటి శోచనీయమైన విషయం? అవతలి మనిషి చావు బ్రతుకుల్లో కొట్టు మిట్టాడుతుంటే, రక్షించాల్సింది పోయి, తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఏమి చేసుకుంటాము ? రానురాను ఇటువంటి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ మనం మరచిపోతున్న విషయం ఏమిటంటే – ప్రమాదాలు అనేవి ఎప్పుడైనా ఎవరికైనా జరుగవచ్చు. అందుకే బాధ్యతగల పౌరులుగా చదవండి, షేర్ చెయ్యండి.
అసలు ప్రమాదం జరిగిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లకపోవడానికి మొదటి కారణం ఏమిటి ? తమనే అనుమానంగా చూసి, కేసులు బనాయిస్తారన్న భయమే కదా ! అందుకే కొత్తగా సుప్రీం కోర్టు ఆమోదించిన చట్టాన్ని గురించి, గోల్డెన్ అవర్ యొక్క ప్రాధాన్యతను వివరించడానికి, ఈ వ్యాసం రాస్తున్నాను.

గోల్డెన్ అవర్ అంటే ఏమిటి ?
ఎవరికైనా, ఎటువంటి ఆరోగ్య సమస్య వల్లనైనా అత్యవసర పరిస్థితి సంభవించినప్పుడు మొదటి కొన్ని నిమిషాలు తీసుకోవాల్సిన వైద్య సంబంధమైన చర్యలు అత్యంత ముఖ్యమైనవి. వీటికి సకాలంలో, సవ్యంగా చేపడితే చాలావరకు ప్రాణహానిని లేదా సమస్య వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు. ఇలా అత్యవసర పరిస్థితిలో వైద్య సహాయం అందాల్సిన మొదటి సమయాన్నే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు(ట్రామా), గుండెపోటు, పక్షవాతం, సెప్సిస్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మనం తప్పక ముందడుగు వేసి, బాధితులను సమీప ఆసుపత్రికి చేర్చాలి.
రోడ్డు ప్రమాదాల వల్ల ట్రామాకు గురైనప్పుడు వీలైనంత తొందరగా వైద్య సహాయం అందించగలిగితే ప్రాణహాని నుంచే కాకుండా, ఇతరత్రా శాశ్వత సమస్యలు సంభవించకుండా నివారించవచ్చు. ఉదాహరణకు వెంటనే ఆక్సిజన్ అందించడం, ఏదో ఒకవిధంగా రోగి ఊపిరి తీసుకునేటట్లుగా చేయడం, అవసరమైతే శ్వాసనాళంలోకి గొట్టం వేయడం, రక్తస్రావాన్ని ఆపడం, స్లైన్ ఎక్కించడం.. ఇవన్నీ అడ్వాన్స్‌డ్ ట్రామా లైఫ్ సపోర్టు (ఏటీఎల్‌ఎస్) చర్యలుగా చెబుతారు. వీటిని ఎంత తొందరగా అందిస్తే రోగిని బతికించుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. మొదటి గంటలోనే అందించగలిగితే బతికే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా రుజువులున్నాయి. దీన్నే ట్రామా గోల్డెన్ అవర్ అంటారు. అవసరాన్ని బట్టి తొందరగా సర్జరీ చేయడం దీనిలో ముఖ్యాంశం.
ఇండియాలోని ట్రౌమా కేర్‌ సెంటర్‌లు:
వీటి లక్ష్యం ఏంటంటే ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు సాధ్యమైనంత త్వరగా వైద్య సహాయం అందించడం, ఆ వ్యక్తి లేదా వ్యక్తులు మృత్యువాత పడకుండా కాపాడడం. రహదారి ప్రమాద బాధితులు సులభంగా దగ్గరలోని అన్ని సదుపాయలున్న వైద్య కేంద్రానికి చేర్చడమే కీలకం. మన దేశంలో ట్రౌమా కేర్‌ సెంటర్‌లు మూడుస్థాయిల్లో పని చేస్తున్నాయి.
ఒకటవ స్థాయి: జిల్లా ఆసుపత్రులు
రెండవ స్థాయి: మెడికల్‌ కాలేజి ఆసుపత్రులు
మూడవస్థాయి: అత్యాధునిక ఆసుపత్రులు (AIIMS), నిమ్స్ వంటివి
ఈ ట్రౌమా కేంద్రాలలో పనిచేసేందుకు సిబ్బందిని కూడా నియమించింది.
ఆ వ్యక్తి, వ్యక్తుల గురించి మీకు ఏ విధమైన సమాచారం దొరక్కపోతే 100, 108 లకి సమాచారం ఇవ్వండి. ఆసుపత్రిలో చేర్చండి. 108 అంబులెన్సె ఎంత చక్కటి సేవలు అందించిందో మనకి తెలుసు. ఒకవేళ అంబులెన్సె లేనట్టయితే, ప్రమాదం బారిన పడిన వారికి వెంటనే ప్రధమ చికిత్చ అందించి, దగ్గరలోని జిల్లా ఆసుపత్రికి చేర్చండి. అక్కడ చికిత్స అందుతుంది. లేదా రహదారికి దగ్గరలోని వైద్యకళాశాల ఆసుపత్రి ఉంటే అక్కడ చేర్చండి లేదా ఈ విషయాలపైన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించండి.

ఇందులో మనకు ఏమైనా రిస్క్ ఉంటుందా ?
సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సాయం చేయడానికి, వారిని ఆస్పత్రిలో చేర్చడానికి అనేకమంది వెనుకడుగు వేస్తూ వుంటారు. దీనికి కారణం ఆలా సాయం చేయాలని ముందుకు వచ్చే వారిని అటు పోలీసులు కానీ ఇటు డాక్టర్లు కానీ అనంత ప్రశ్నలతో వేధించి చంపడమే. పైగా వారిని అనుమానంగా చూస్తూ, వారి తీరును తప్పుపడుతూ వ్యవహరించడమే ప్రధాన కారణం.


ఈ చట్టం కింద రూపొందించిన మార్గదర్శక సూత్రాలకు అటు పోలీసులు, ఇటు ఆస్పత్రి అధికారులు తప్పనిసరిగా కట్టుబడి వుండాల్సిందే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీని ముసాయిదాను రూపొందించింది. ఒకవేళ ఎవరైనా ఈ మార్గదర్శక సూత్రాలకు కట్టుబడకుండా ఉల్లంఘిస్తే వారికి శిక్ష కూడా వుంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే 48గంటల వరకు చికిత్స అంతా ఉచితంగా జరుగుతుంది.
· రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా ఆసుపత్రిలో చేర్చవచ్చు.
· పోలీసులు మిమ్మల్ని ఏవిధమైన ప్రశ్నలు అడగరు.
· రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యులు వెంటనే వైద్యం అందించాలి.
ఈ చట్టం గురించిన మరిన్ని వివరాలను క్రింది లింక్ లో చూడండి.


గుర్తుపెట్టుకోండి ... రోడ్డు ప్రమాద బాధితుల్ని అలా వదిలేసి వెళ్ళకండి. ప్రమాదం జరిగిన మొదటి గంటలో వారికి వైద్యసహాయం అందివ్వగలిగితే మరణాన్ని నివారించవచ్చు.