Sunday, April 14, 2013

సిద్ధాంత శిఖామణి శ్లోకం

రచన : శ్రీ వి. వి. ఎస్ . శర్మ గారు , బెంగళూరు .

శివయోగి శివాచార్యుని సిద్ధాంత శిఖామణి మొదటి శ్లోకం చూదాం. దీని వివరణ వీరశైవ సిద్ధాంత అవగాహనకు తోడ్పడుతుంది
ఓం నమః శివాయ 
శ్రీ జగద్గురు పంచాచార్యా ప్రసీదంతు 
త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే, 
సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః.
. శివునికి ఐదు ముఖాలు - సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ ఐదుగురి అంశలలో ఉద్భవించినవారు పంచాచార్యులు. వారు చారిత్రక వ్యక్తులో, కాదో తెలియదు. స్వయంభువులుగా చెప్పబడుతారు. వారిపేర్లు రేణుకాచార్య, మరుళారాధ్య, ఏకోరామారాధ్య, పండితారాధ్య, విశ్వారాధ్య అనేవారు.వారి అనుగ్రహాన్ని కోరుదాం. ఈ సిద్ధాంత శిఖామణి రేణుకాచార్య, అగస్త్య సంవాదంగా చెప్పబడుతుంది. ఈ వీరశైవ సామ్రాజ్యానికి ఐదు ముఖ్య పీఠాలున్నాయి. వానిని మొదట పాలించినది పంచాచార్యులు. అవి బాళేహెణ్ణూరు, ఉజ్జయిని (ఉజ్జిని)(కర్ణాటక), కేదారనాథ్ (ఉత్తరాఖండ్) , శ్రీశైలం, కాశీ.
మొదటి శ్లోకం మంగళాచరణం. అందులోనే తత్త్వం నిక్షిప్తమైఉంది. భిత్తి అంటే గోడ. అంటే పరమేశ్వరుణ్ణి ఒక గోడతో పోలుస్తున్నాడు. ఆ గోడ మీద రచింపబడినది (చిత్రించబడినది) త్రైలోక్యసంపదగా చెప్పబడే జగత్తు. ఆగోడ శాశ్వతం, దానిమీద చిత్రాలు మాత్రం కాలగమనంతో మారిపోతూ ఉంటాయి. కాని ఆగోడ సాక్షిగా, నిర్లిప్తంగా, శాశ్వతంగా ఉండనే ఉంటుంది. గోడలేక పోతే చిత్రమేలేదు. సంపద అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఈశ్వరలక్షణం. జగత్తులోని త్రిలోకాలే సంపద. అద్వైతులు జగత్తు మిథ్య అంటారు. సత్ పదార్థామైన ఈశ్వరుడు సత్యమైతే ఆయన సృష్టించి, సర్వదా వ్యాపించిఉన్న జగత్తు అసత్యము, మిథ్య ఎలాగ అవుతుందని శైవుల వాదం. పరమేశ్వరుడు ఒక గోడవలే స్థాణువుకాదు. శక్తితోకూడిన చైతన్య స్వరూపుడు. చైతన్య స్వరూపమే సచ్చిదానందము అవుతుందని రెండవ పాదములో నిరూపింపబడుతూంది.
సత్ అనేది శాశ్వతమైన ఉనికిని సూచించే పదము. ఆ ఉనికి ఎలా తెలుస్తుంది? చిత్ (చిత్తము వలన). ఇంద్రియాలు, మనస్సు ఈ చిత్ కి ఈ ఉనికికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తాయి. చిత్ ఉంటేనే ఆనందము. లోకంలో ఉండగలగడమే ఆనందం. అనంతమైన సచ్చిదానంద స్వరూపమే ఈశ్వరుడు. ఈ సందర్భాన్నే రమణమహర్షి సినిమాతెరమీద చలనచిత్రంతో పోలుస్తారు. మరిదుఃఖమో. అదితెరమీద పాత్రలది. జీవుడు శరీరాన్ని తాను అనుకోవడం వలన క్షణికమైన సుఖ దుఃఖాల అనుభవం ఊహించుకుంటాడు. తెరకు దీనితో సంబంధం లేదు. ఈ కాలంలో మనం Facebook Wall కూడా ఉపమానంగా తీసుకోవచ్చును. జీవుడు శివోహం అనేస్థితికి వస్తే అంతా ఆనందమే, దుఃఖం దరికిజేరదు. ఈ చిత్ అనేది పరమేశ్వరుని శక్తి. జీవునికికూడా చిత్తము ఉంటుంది. కాని నిద్రపోయినపుడు అది పనిచేయుటలేదు. జీవుని శక్తి పరిమితము. పరమేశ్వరుని చిచ్ఛక్తి అపరిమితము. అదియే ఆది పరా శక్తి. సచ్చిదానంద స్వరూపుడు, పరబ్రహ్మ తత్త్వ స్వరూపుడు, ఐన శివునికి నమస్కారము అనిచెబుతుంది ఈశ్లోకం. శైవులది యోగ మార్గం. మూలాధారస్థితుడైన గణపతినుండి ప్రారంభించి, కుండలినిజాగృతిపొంది చేసే సాధనా మార్గమే యోగము. (ఆధారం - సద్గురు శివానందమూర్తిగారి ప్రవచనం.)


No comments:

Post a Comment