Saturday, September 14, 2013

చిలకమర్తి లక్ష్మీ నరసింహం

అటు తెనుగు సాహిత్య నాటక రంగాలకి, ఇటు సంఘ సంస్కరణోద్య మానికి మహోన్నత సేవలను అందించిన అపూర్వ వ్యక్తి కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. చిలకమర్తి పాఠశాలకు వెళ్లేటప్పుడే పద్యాలు రాయడం ప్రారంభించటమేగాక, ఆపై ఎన్నో రచనలు చేశారు. కీచకవధ ఆయన మొదటి నాటకం కాగా, ఆ తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలను రచించారు. నవలా రచనల్లో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇక హాస్య రచనల విషయానికి వస్తే.. "గణపతి" అనే నవల ఎన్నదగింది. 

22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చిలకమర్తి రచించిన "గయోపాఖ్యానం" అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయంగా చరిత్రలో నిలిచిపోయింది. పైగా ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేశారట. అందులోని ఒక పద్యం...


" అలరు గురువింద పూసలో నలుపున్నట్లు
గుణ గణముతోడ దోషముల్ గూడియుండు
ప్రాజ్ఞులు క్షమింతు రితరులు పరిహసింత్రు " - గయోపాఖ్యానం 
 
30వ ఏట నుండి రేచీకటి వ్యాధికి గురైనా ఏ మాత్రం బెదరకుండా, తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి చిలకమర్తి రచనలు కొనసాగించారు. 1908లో ఒక ప్రెస్ స్థాపించిన ఆయన... 1916లో మనోరమ, పత్రిక అనే పత్రికలను స్థాపించారు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర, సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. అలా ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చిలకమర్తిని "కళాప్రపూర్ణ పురస్కారం"తో సత్కరించింది.

 వీరి పేరు వినగానే, వెంటనే స్ఫురించేవి - నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు, వంటి పద్యోక్తులు, సామెతలు సంపాదించుకున్న ప్రాచుర్యాన్ని అందుకో జాలినవి. బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం: 

 భరతఖండంబు చక్కని పాడియావు
 హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి

అప్పటి దీన స్థితిగతులను తన స్వీయచరిత్రలో ఇలా వర్ణించారు...

'తెలుగు తెలియంగ దొరలకు తెలివి లేదు  ఇటువంటి దీన దశను తొలగించే దిక్కు దేశానికి కనపడటం లేదు. నేల దున్నుకొని బతకవచ్చుననుకొంటే భరించలేని వ్యవసాయం (శిస్తు) పన్ను. నీరు కావాలంటే నీటి పన్ను. వ్యాపారం చేయాలంటే ఆదాయపు పన్ను. సరకులమ్మాలంటే సంతపన్ను (వ్యాట్‌ పట్టణాలలో చూడబోతే మున్సిపాలిటీ పన్ను. పారిపోదామను  కుంటే బండి హాసీలు పన్ను, కొంప అమ్ముకోవాలంటే స్టాంపు పన్ను ఉన్నదేదో తిని ఉసూరుమంటూ బతుకుదామనుకుంటే ఉప్పు పన్ను. అధికారులకు లంచాలివ్వకపోతే ఏ పనీ కాదు. మునుసబు, కరణాలకు ముందుగా ముడుపులు ముట్టాలి. రైతుల కష్టాలు చూస్తుంటే వాళ్ళకు వ్యవసాయ ఫలం గడ్డి మాత్రమేలాగా కనపడుతున్నది. ఇళ్ళలో దరిద్ర దేవత వచ్చి తిష్ఠ వేసింది. ఏటేటా కాటకాలు తప్పటం లేదు. ప్రజలకు ఋణబాధ రోజు రోజుకూ అధికమవుతున్నది అని వేదన చెందారు చిలకమర్తి వారు.



 చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. అందుకే వాసురాయకవి చిలకమర్తి వారిది "ఫొటోజెనిక్ మెమరీ" అని ప్రశంసించారు. మంచి వక్త, శ్రోతలను బాగా ఆకట్టుకునే చిలకమర్తి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు. 
ప్రకాశం గారు,చిలకమర్తివారు   సహాధ్యాయులు.టంగుటూరి వారికి  వల్లెవాటు అలవాటు  చిన్నతనం నుండి ఉండేదట .ఆరోజుల్లో ధవళే స్వరంలో జరిగే ఉత్సవానికి ఇద్దరూ వెడుతూ వుండేవారట .ఒకసారి ఆ యాత్రలో టంగుటూరి వారిని వర్ణించారు చిలక మర్తివారు.ఆ పద్యం ఇది-
          సీ-     ఈగ వ్రాలిన గాని వేగా జారేడు నట్లు
                         మవ్వంపు కురులను దువ్వినాడు
               వరలలాటమునండు తిరు చూర్ణ రేఖను
                         ముద్దుగారేడు భంగి దిద్దినాడు
                అరుణ పల్లవ మట్లు  కరము రంజిల్లు,చెం 
                         గావి వస్త్రంబును గట్టినాడు 
                 చారలన్గారఖాను జక్కగా ధరియించి 
                         వలె వాటు కండువా వైచినాడు 
                    చెవుల సందున గిరజాలు చిందులాడ 
                     మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త 
                     టంగుటూరి ప్రకాశము రంగు మెరయ 
                       ధవళ గిరి తీర్ధము నకును  తరలివచ్చే!    

చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు తమ రచనలలో చమత్కారాన్ని అందంగా పొదుగుతూ ఉంటారు. మచ్చుకి ఒకటి ....

ఆడిదం సూరకవి యొకనాడు తాటియాకుల మీద వ్రాయబడిన మహాభారతమును చేతబట్టుకుని నడిచిపోవుచుండగా నొక వెలమదొర వానిని చూసి ' అయ్యా ! ఈ వేళ వర్జ్యమెప్పుడు ' అని అడిగెను. నేను కవిత్వము చెప్పుదును గాని పంచాంగము చెప్పను. అందుచేత నాకు తెలియదని సూరకవి ప్రత్యుత్తరమిచ్సెను.' అంత పెద్ద పుస్తకము చదువుకోన్నవాడవు. నీకు పంచాంగము చెప్పుట తెలియదా ' అని ఆ వెలమ దొర కవిని పరిహసించి తన దారిని పోయెను.

మరునాడు ఆ వెలమ దొర తన చేతిలో పెద్ద కత్తి పట్టుకొని పోవుచుండగా సూరకవి వానిని సమీపించి ' అయ్యా ! నాకు క్షురకర్మ చేయగలవా ? ' అని అడిగెను. వెలమదొర ఆ మాటలు విని ఆశ్చర్యపడి కోపముతో ' నేను మంగలి ననుకొంటివా ' అని పలికెను. సూరకవి ఆ మాటలు విని ' కత్తి ఇంత పొడవుగా వున్నది. క్షురకర్మ చేయుటకు పనికిరాని దీని ప్రయోజనమేమి? ' అని పరిహసించి పోయెను.

 "పకోడి" గురించి
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు. "కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:
వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!
కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!

  కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని, లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు. కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు. సాధారణంగా వాడుకలో చెప్పే, ఆసేతు హిమాచలం అన్న ప్రయోగాన్ని, తుహినాద్రి మొదలు సేతువుదాల అని పైనుంచి క్రిందికి వరస చెప్పటం చిలకమర్తిశైలి చమత్కారం అనే చెప్పాలి. 

No comments:

Post a Comment