Friday, October 4, 2013

కవిబ్రహ్మ తిక్కన

నన్నయ అసంపూర్ణంగా వదిలి వెళ్ళిన మహాభారతాన్ని, ఆ కధలోని వాస్తవికతను చూసి ముగ్డుడయిన తిక్కన, ఆ మహాకావ్యాన్ని పూర్తీ చెయ్యాలని సంకల్పించాడు. ఈయన వ్యాస, వాల్మీకులు ఇద్దరి సృష్టినీ సొంతం చేసుకున్నాడు. నిర్వచనొత్తర  రామాయణాన్ని వ్రాసాడు. ఆయన ఉభయకవిమిత్రుడు, కవిబ్రహ్మ, కృతికర్త మాత్రమె కాక, యజ్ఞాయాగాదులు చేసిన సోమయాజి. ఒక్క చేతిమీదుగా దాదాపు భారతంలోని పదిహేను పర్వాలను రమారమి 16,457 గద్యపద్యాలలో రసబందురంగా రచించాడు. తిక్కన వాన్గ్మయం లో యెంత ప్రసిద్ధుడో, సాహితీ గురు పీఠం  స్థాపించి, తన ఇంటిని ఒక విద్యా సంస్థగా సాహితీ మిత్రులకు వేదికగా మలచడం వాళ్ళ, చరిత్ర లోనూ, అంతే ప్రసిద్ధుడు.

నన్నయ అరణ్యపర్వంలో మూడు ఆశ్వాశాలు పూర్తీ చేసాడు. నాలుగో ఆశ్వాసంలో నూట నలభై రరెం డోవ పద్యం తరువాత రచన ఆగిపోయింది. తిక్కన, అరణ్య పర్వాన్ని వదిలి, విరాట పర్వం నుంచి మొదలు పెట్టి, పదిహేను ఆశ్వాసాలూ పూర్తీ చేసాడు. అరణ్య పర్వం ముట్టుకుంటే, ఆపదలు వస్తాయన్న నమ్మకం ఆ రోజుల్లో ఉండేది.

తిక్కన గారికి తనకు ఇష్టమైన పద్యాలు మళ్ళీ మళ్ళీ వాడుకోవడం సరదా... అటువంటి ఆంధ్రులు అందరికీ ఇష్టమైన ఒక పద్యం...

వచ్చినవాడు ఫల్గును డవశ్యము గెల్తు మనంగరాదు రా 
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే 
హెచ్చగు గుందగుం దొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లుగా
కిచ్చదలంచి యొక్క మెయినిత్తిరి బొందగు చేతయుం దగు (విరాట పర్వం 4- 234 )

అని భీష్ముడు చెప్తే,

విని కురుపతి దరహసితవదనుం డగుచు నిట్లనియె 

మనకు బాండురాజతనయవర్గమునకు 
నెట్లు వొందు గలుగు ? నేను రాజ్య 
భాగమీను, సమరభంగికి విక్రమ 
నిరతి బూను టిదియ నిశ్చయంబు 

ఇదే పద్యాన్ని యధాతధంగా తిక్కన గారు ఉద్యోగపర్వంలో వాడుకున్నారు.

పద్యాలలో నీతి సూక్తులు ఇమడ్చడం తిక్కన్న గారి ప్రత్యేకత. ఈ పద్యాలు చూడండి....

ఒరులేయవి యొనరించిన 
నరవర ! యప్రియము తన మనంబునకగు తా 
నొరులకవి సేయకునికియె
పరాయణము పరమ ధర్మ పధముల కెల్లన్ 

ధృతరాష్ట్రుని సచివుడైన విదురుడు గొప్పనీతివేత్త. "అన్ని ధర్మాలలో కెల్లా ఏది ఉత్తమ ధర్మం?" అని విదురుని ప్రశ్నించినప్పుడు, ఉత్తమ ధర్మాన్ని విదురుడు ఇలా వివరించాడు.

"ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకి కష్టం కలుగుతుందో అటువంటి పనిని నువ్వు ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమయిన ధర్మం ."

తనువున విరిగిన యలుగుల 
ననువున బుచ్చంగవచ్చు నతినిష్టురతన్ 
మనమున నాటిన మాటలు 
వినుమెన్నియుపాయములను వెడలునెయధిపా 

శరీరంలో నాటుకున్న బాణాలను ఉపాయంతో తొలగించవచ్చు. కాని, మిక్కిలి గట్టిగా మనసులో నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయాల చేతనైనా వెలికి వస్తాయా?




శ్రీ శ్రీనివాస్ రావినూతల 

శ్రీయన గౌరినాఁబరఁగు చెల్వకుఁ జిత్తము పల్లవింప పల్లవింప భ
ద్రాయుత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వముఁగొల్చెద నిష్ట సిద్ధికిన్
తిక్కన కాలంలో వైష్ణవులకూ, శైవులకూ మధ్య వైషమ్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అటువంటి సమయంలో "ఉభయ కవి మిత్రుడు" అనిపించుకొన్న తిక్కన తన భారతాంధ్రీకరణను హరిహర రూపమైన పరతత్వమును ఇష్టసిద్ధికై కొలుస్తూ ఈ పద్యం చెప్పాడు.

విరాట పర్వంలోని ఒక పద్యం:
సింహం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్య త్క్రోధమై వచ్చు నో
జం గాంతార వాస భిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్

ఉత్తర గోగ్రహణం జరిపిన కౌరవ సైన్యంపై అర్జునుడే యుద్ధానికి రావడం చూసి ద్రోణాచాఱ్యుడిలా అన్నాడు - సింహం గుహలో ఆకలితో ఉండి, ఒక్కసారిగా ఏనుగుల మందను చూచి ఉత్సాహంతో ఉరికినట్లుగా, అరణ్యవాసంతో భిన్నుడై వీడే, ఈ కుంతీ సుత మధ్యముడే యుద్ధానికి తయారై వచ్చాడు. - ఇక్కడ "వీడే" అన్న పదం మరింత శిష్య వాత్సల్యాన్ని సూచిస్తుంది.

తిగిచి కవుంగిలించి జగతీవిభు డక్కమలాయతాక్షి నె
మ్మొగము మొగంబునం గదియ మోపు; గరాంగుళులన్ గపోల మిం
పుగ బుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించు గ
ప్పగు మృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్తి 

తిగిచి - దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా కౌగిలించుకొని, అందమైన ఆ మొహానికి తన మొహం దగ్గర జేసి, చేతివేళ్ళతో బుగ్గలు పుణికి, మాటిమాటికీ తన కూతురిని అపురూపంగా చూస్తూ, ఆ అమ్మాయి నల్లని లేలేత ముంగురులను ప్రేమతో సవరించాడట.

తన కూతురేమో చక్కని చుక్క, బంగారు తల్లి. ఆమెకి యిప్పుడొక మంచి నాట్యాచార్యుడు దొరికాడు. తండ్రి మనసుకి ఎంత ఆనందం. ఆ పిల్ల మీద ఎంత ప్రేమున్నా తన రాచరిక వ్యవహారాల వల్ల ఆమెతో ఎక్కువ సమయం గడపలేడు కదా. అంచేత చూసినప్పుడల్లా ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే అపూర్వ విలోకనంబులు! తండ్రి మురిపెమంతా, అలా తల నిమురుతూ ముంగురులను సర్దడంలోనే ఉంది! ఎంత జగతీవిభుడయితే మాత్రం ఏమిటి. అతడొక ఆడపిల్లకు తండ్రి. ఆడపిల్ల తండ్రులకు మాత్రమే యిలాంటి ఆనందం దక్కేది. లోకాలకు ఏలికైనా కలగని ఆనందమది! అదీ పద్యంలో అచ్చుపోసి చూపించాడు కవిబ్రహ్మ తిక్కన. ఇలాంటి సందర్భంలో ఇంతటి సున్నితమైన సన్నివేశాన్ని ఊహించడం (యిది సంస్కృత భారతంలో లేదు), దాన్ని అంతే సుకుమారంగా, అత్యంత సహజంగా చిత్రించడం, తిక్కనకే చెల్లింది. ఇలాంటి పద్యాలు చదివినవాడెవడైనా, బుద్ధంటూ ఉంటే, ఆంధ్ర మహాభారతం వట్టి అనువాదం అని పెదవి విరుస్తాడా? ఇది నూటికి నూరుపాళ్ళూ అచ్చమైన కావ్య సృజన. ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలలో ఒక చిన్న పాత్రకొక కొత్త వెలుగు తీసుకురావడమన్నది సామాన్య విషయం కాదు. కావ్యంలో పాత్రలను సజీవం చెయ్యడమంటే యిదీ. ఆ కల్పనలో కూడా ఔచిత్యం ఉండాలి. విరటునికి తన కొడుకుపైన ఎంత ప్రేమో, ఎంత గురో మనందరికీ తెలుసిన విషయమే. కౌరవులను గెలిచింది తన కొడుకు కాదంటే, ఆడుతున్న పాచికలు కంకుభట్టు మొహాన కొట్టేంత పిచ్చి ప్రేమ అది. మరి అంతటి ప్రేమ కూతురు మీద మాత్రం ఉండదా. ఉంటుందని ఊహించడమే ఔచిత్యం. కథకు అవసరమని కొడుకు ప్రేమను మాత్రమే వ్యాసుడు చిత్రించి ఊరుకుంటే, తాను వ్రాస్తున్నది కావ్యం కాబట్టి, ఆ పాత్ర స్వభావానికొక సంపూర్ణతనీ ఔన్నత్యాన్నీ, యీ ఒక్క పద్యంతో చేకూర్చాడు తిక్కన. అదీ తిక్కన కవితా శిల్పం.

సరళంగా,సూటిగా,వాగాడంబరం లేకుండా చక్కటి తెలుగులో పద్యాలు వ్రాయటం తిక్కన గారి కవితా లక్షణం.

భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త జా
లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్వాకలితంబుసైన్యమిదియే జేరంగ శక్తుండనే

ఈ పద్యం విరాటపర్వం,చతుర్ధాశ్వాసంలో ఉత్తరకుమారుడు కురుసైన్యాన్ని చూసి భయ భ్రాంతుడైన సందర్భంలోది. భీష్మద్రోణ కృపాదులవంటి అతిరధ,మహారధులు, వేసవిసూర్యుడి ప్రతాపం లాంటి శౌర్యంగల వీరులు నిండివున్న అపారమైన సేననుగూర్చి చెప్పేటప్పటి భాషకు ఎంతటి రాజసం ,హంగు ఉండాలో ఈ పద్యం చూపిస్తుంది. పైపెచ్చు చెబుతున్నది సముద్రంలాంటి సేనను చూసి భయభ్రాంతుడైన రాకుమారుడు ఉత్తరకుమారుడు. భయపడ్డ అతనికనులకు ఈ ఉద్దండమైన సేన మరీ ఉగ్రంగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. గుక్కతిప్పకుండా చక్కటి ఉచ్చారణతో ఈ పద్యం చదివితే ,పద్యం తాలూకు వాచ్యార్ధం పూర్తిగా తెలియకముందే ,ఈ పద్యానికి మూలభావం మనకు స్ఫురిస్తుంది. ఆ మూలభావం గొప్ప అబ్బురంతో , అడ్మిరేషన్ తో కూడిన భయం. “శస్త్రాస్త జా లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు” అనేసరికి ,ఆ మేఘగర్జనలాంటి సమాసపు ప్రౌఢ గంభీర శబ్ద సౌందర్యానికి అబ్బురపడతాం.అంటే వాచ్యార్ధం స్ఫురించే లోపే మూలభావన-రూట్ ఫీలింగ్ మన అనుభూతిలోకి వస్తుంది.ఇది ఆ పద్యం/కవి గొప్పదనం.

(అంతర్జాలం నుండి సేకరించినది.)

ఒకటిఁగొని, రెంటి నిశ్చల యుక్తిఁజేర్చి,
మూఁటి నాల్గింటఁగడు వశ్యములుగఁజేసి,
యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు
విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు

ఈ పద్యం శ్రీమదాంధ్ర మహా భారతము ఉద్యోగ పర్వం లోనిది. తిక్కన రచన.

సంజయ రాయబారం ముగిసింది. ఆ విశేషాలింకా ధృతరాష్ట్ర మహా రాజ చెవిని పడ లేదు. రాజు వ్యాకుల చిత్తుడై ఉన్నాడు. ఆందోళనతో తనకి నిద్ర పట్టడం లేదని, తన మనస్తాపం ఉపశమించేలా నాలుగు మంచి మాటలు చెప్పమనీ విదురుని కోరాడు. ఆ సందర్భంగా విదురుడు కురు మహా రాజుకి బోధించిన హిత వచనాలలో ఇదొకటి ....

ఒక దానిని స్వీకరించి, రెండింటిని స్థిర పరచుకుని, మూడింటిని నాలుగింటి చేత వశపరచుకుని, ఐదింటిని జయించి, ఆరింటి గురించిన ఎఱుక గలిగి, యేడింటిని ఎవడు విడిచి పెడతాడో, అతడే వివేకధనుడని స్థూలంగా ఈ పద్యం చెబుతోంది ....

ఈ అంకెల మర్మం తెలుసుకుంటే నిగూఢమైన తాత్త్వికార్ధం సుబోధకమవుతుంది.

పెద్దలు ఈ పద్య భావాన్ని ఇలా విడమరిచి చెప్పారు. చూడండి ...

ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రం ( ఆలోచన), ఉత్సాహం అనే రెండింటినీ స్థిరంగా చేసుకుని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాల వారినీ సామ దాన భేద దండోపాయాల చేత ( ఈ నాలుగింటి చేత) పూర్తిగా వశం చేసుకుని, పంచేంద్రియాలనూ ( త్వక్కు, చక్షువు,శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము) జయించి, సంధి, విగ్రహము, యానము,ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము లను తెలుసుకుని, సప్త వ్యసనాలను ( స్త్రీ, జూదము, పానము, వేట, కఠినముగా మాటలాడుట, తగని వెచ్చము, కఠిన దండము ) విడిచి పెట్టి ఎవడయితే ప్రవర్తిస్తాడో, అతడు వివేకవంతుడు.

దీనికి మన పెద్దలు ఇంకా వేరే విధమైన వ్యాఖ్యానాలు కూడ చేశారు. 
ఈ పద్యానికి ఇంకో విధమైన అర్ధం యిలా చెప్పారు ...
బుద్ధిని కలిగి ఉండి, వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో ఒకటిగా చేర్చి, ధర్మార్ధ కామాలనే మూడింటినీ, బ్రహ్మచర్య, గార్హ్యస్థ వానప్రస్థ, సన్యానములనే నాలుగింటితో వశపరచుకుని, వాక్, పాణి,పాదము,,వాయువు, గుహ్యము అనే కర్మేంద్రియాలను అయిదింటినీ గెలిచి, యజన,యాజన. అధ్యయన, ఆధ్యాపన, దాన, ప్రతిగ్రహములు అనే ఆరు స్మార్త కర్మలనీ తెలుసుకుని, పంచభూతాలూ, బుద్ధి, అహంకారం అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకవంతుడు.


నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో
త్రావనిభృద్దిశాకరుల కారయ నూఱటపట్టు గాదె సం
భావన భూజనంబులకు బండువు గాదె మహోగ్ర కోప రే
ఖా విభవంబు వైరులకు గాలము చేరువ కాదె పావని 

వలమూపు - కుడి భుజం, లావు - బలం

ఎత్తుకోడంతోనే "నీ వలమూపులావు" అనే అందమైన అచ్చతెలుగు సమాసంతో పద్యాన్ని ఎత్తుకుంది ద్రౌపది. ఎందుకు? ఇక్కడొక భార్య తన భర్తతో మురిపెంగా మాట్లాడుతోంది. ఆప్యాయంగా మాట్లాడుతోంది, ఆంతరంగికంగా మాట్లాడుతోంది. ఆ మురిపెం అంతా ఆ చక్కని తెలుగు సమాసంలో ఉంది. పైగా "నీ" అని ముద్దుగా ఏకవచన ప్రయోగం కూడానూ!
భీమునితో అతని గురించే చెపుతోంది. అందుకే యీ చనవు.

మును నేల వహించిన - ఇంతకుముందు భూమిని మోసిన (అంటే ఇప్పుడు మొయ్యటం లేదన్న మాట!). ఎవరు?

నాగ కూర్మ గోత్రావనిభృత్ దిశాకరులకు ఆరయ ఊరటపట్టు కాదె :

నాగ - ఆదిశేషువు, కూర్మ - తాబేలు, గోత్ర అవనిభృత్ - అవనిభృత్ అంటే భూమిని ధరించేవి అంటే పర్వతాలు. కుల పర్వతాలు, దిశాకరులు - ఎనిమిది దిక్కులా ఉండి భూమిని మోసే దిగ్గజాలు. 
చూద్దునుకదా, వీటన్నిటికీ నీ ఒక్క కుడి భుజ బలమే ఊరటపట్టు అయింది కదా! అంటే ఇప్పుడు భూభారాన్నంతా నువ్వే నీ కుడి భుజం మీద మోస్తున్నావు అని భావం. రాజు తన భుజ బలంతో భూభారాన్ని వహిస్తాడు అని కవిసమయం. అది ఆ రాజు పరాక్రమానికి చిహ్నం. 
"వలమూపులావు" అన్న చిన్న తెలుగు సమాసం తర్వాత "నాగకూర్మ..." అన్న పెద్ద సంస్కృత సమాసం. ఎందుకు? అంత పెద్ద, భారమైన పనిని ఇంత చిన్న చేత్తో (భుజంతో) నువ్వు చేస్తున్నావని ధ్వనించడానికి. అది భీముని పరాక్రమాన్ని మరింతగా ధ్వనిస్తోంది కదా!
శబ్దశక్తి తెలుసున్న కవిత్వం ఇది. వాక్శక్తి తెలిసినవాడు కాబట్టే తిక్కన కవిబ్రహ్మ అయ్యాడు. ఎక్కడ తెలుగు పదాలు వెయ్యాలో, ఎక్కడ తద్భవాలు వాడాలో, ఆ రెంటినీ పద్యాలలో ఎంత సొగసుగా అతకాలో తిక్కనకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. దానికి యీ పద్యం ఒక మచ్చుతునక. మన ప్రాచీన సాహిత్యమంతా వట్టి సంస్కృతభూయిష్టమే అనుకోడం శుద్ధ భ్రమ. అది ఉత్త అనువాదమనో లేదా అర్థంకాని భాష అనో నిరసించి చదవనివాళ్ళనీ, చదవక్కరలేదనేవాళ్ళనీ చూసి జాలిపడ్డం తప్ప వేరే చెయ్యగలిగింది ఏమీ లేదు. 

సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, ఇంకా ద్రౌపది ఇలా అంటోంది.

సంభావన - దానధర్మాలు, భూజనంబులకు పండువు కాదె - ప్రజలందరికీ పెద్ద పండగే
అతను ప్రజలకి చేసే దానధర్మాలతో వాళ్ళు నిత్యం పండగజరుపుకుంటారట.

మహోగ్ర కోప రేఖా విభవంబు - భీకరమైన కోపం అతను రేఖామాత్రంగా చూపించినా, దాని ఆధిక్యానికి
వైరులకు కాలము చేరువ కాదె - శత్రువులకి కాలం దగ్గరపడినట్టే!
భీముడు తన కోపం రేఖామాత్రంగా చూపించినా అది అతని శత్రువులకి కాలం దగ్గరపడ్డట్టే అని. ఈ కాలం దగ్గరపడ్డం ఇప్పటికీ మనం వాడే పలుకుబడి (కొంచెం ఆధునికంగా చెప్పాలంటే టైం దగ్గరపడిందిరోయ్ అన్నది).

ఇక్కడితో చెప్పవలసిందంతా అయిపోయింది. భీముని భుజబలం, అతని దాతృత్వం, అతని శౌర్యం అన్నీ పొగిడింది. కాని పద్యం పూర్తవ్వలేదు. ఆ చివర్న ఏ మాట వెయ్యాలి? ఇక్కడ మళ్ళీ తిక్కనగారికి శబ్దం మీద ఉన్న పట్టు కనిపిస్తుంది. చివర్న యీ "పావనీ" అన్న సంబోధన ఎంత ఆత్మీయంగా వినిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. "నీ"తో మొదలుపెట్టిన పద్యాన్ని మళ్ళీ "నీ"తోనే ముగించాడు. పావని అంటే పవన కుమారుడు, వాయుపుత్త్రుడు. ఇది సాధారణంగా హనుమంతునికి వాడతారు. కాని భీముడుకూడా వాయువు కుమారుడే కదా. అక్కడ ధర్మరాజు గురించి చెప్పిన పద్యంలో "ధర్మసుతుడు" అని పూర్తయ్యింది. ఇక్కడ పావనీ అని. భీముని దైవాంశని ద్రౌపది సూచిస్తోందన్న మాట! ఈ పదంలో ఇంత ప్రత్యేకత ఉంది.

తిక్కనలాంటి కవి మన తెలుగుసాహిత్యానికి దొరకడం మనం చేసుకున్న అదృష్టం. ఆ కవిత్వాన్ని మనం నిలుపుకుంటామా లేదా అన్నది మన చేతుల్లో ఉంది.

కొల్లూరు విజయ శర్మ 

తిక్కనగారి మనోహరమైన పద్యాలలో ఒక రత్నం.

అభినవ జలధర శ్యామంబు లగునెడ 
లాకు జొంపంబుల ననుకరింప 
సాంధ్య రగోపమ చ్చాయంబులగు పట్లు 
కిసలయోత్కరముల( గ్రేణిసేయ 
రాజమరాళ గౌరములగు చోటులు 
తరచు (బూ (బోడాల చందంబు నొంద 
హారిద్ర్ద్ర రుచి సమానాకృతులగు ఠావు 
లడరెడు పుప్పొడులట్లు మెరయ (

గలయ నెగసి ధరాధూళీ లలితవనము 
దివికి నలి(గా (పువోయెడి తెరగు దాల్ప 
గోగణము ముంగలిగ నేల గోడి వడ(గ 
నడుచు కౌరవరాజ సైన్యంబు(గనియె 

ప్రచండమైన కౌరవ సేన విరాటుడి గోగణాన్ని తరుముకుని (తోలుకుని)వెళ్తోంది. గోగణాన్ని వెనక్కి తరలించుకుని రావడానికి బృహన్నల రూపం లో ఉన్న అర్జునుడు రధ సారధిగా ఉత్తరుడు యుద్ధభూమికి వెళ్తున్నాడు.. నిజానికి అది భయానక దృశ్యం కానీ తిక్కన.. కౌరవ సైన్యం గోగణాన్ని తరలించుకుని వెళ్తున్నప్పుడు వారి రధాల,గుర్రాల తాకిడికి రేగిన ధూళిని అద్భుతంగా వర్ణించారు. అప్పుడే ముసురుతున్న మేఘాల వలే నల్లగా ఉన్న భూమి మీద రేగుతున్న ధూళి కొమ్మలని తలపిస్తూ ఉంది. . . అలాగే ఎఱ్ఱని మట్టి మీద రేగుతూ లేతచిగురాకులను పోలుతోంది. రాజహంసలని తలపిస్తోన్న తెల్లని మట్టి మీద ధూళి పూపొదలను ఉండగా పసుపు పచ్చని నేల మీద రేగుతున్న ధూళి .పుప్పొడిలాగా మెరుస్తూ ఉంది. ఈ సుందర దృశ్యమంతా చూస్తుంటే భూమి మీద ఉన్న మనోహరమైన ఉద్యానవనం ఏదో స్వర్గానికి తరలిపోతోందా అనే భావన కలిగిస్తోంది. 

6 comments:

  1. ధన్యవాదాలు, చాలా చక్కటి పద్యాలకు మంచి వివరణలు యిచ్చారు. అల్లాగే, ఉత్తర గోగ్రహణములో అర్జునుడు దుర్యోధనునితో చెప్పే “ఏనుఁగునెక్కి” పద్యాన్ని కూడా వివరించగలరా, దయచేసి.

    ReplyDelete
  2. పైన ఒరులేయవి యోనరించిన పద్యం ధృతరాష్ట్రుడు విదురిని అడిగిన మాటకు జవాబు కాదు.ధర్మరాజు ఏది ధర్మము ఎట్టిదో అనే ప్రశ్నకు విదురుడు చెప్పిన మాట ఆ పద్యం

    ReplyDelete
  3. ఇంత చక్కని విశ్లేషణ తెలుగు వారు అందరూ ౘదవాలి. ధన్యవాదాలు

    ReplyDelete
  4. పైన పేర్కొన్న "ఒరులేయవి యొనరించిన
    నరవర ! యప్రియము తన మనంబునకగు తా
    నొరులకవి సేయకునికియె
    పరాయణము పరమ ధర్మ పధముల కెల్లన్" ఈపద్యం భీష్ముడు ధర్మరాజుతో చెప్పబడినది. శ్రీమదాంధ్రమహాభారతం లోని శాంతిపర్వం పంచమాశ్వాసము లోని 220 వ పద్యం.
    ధన్యవాదములు.

    ReplyDelete
  5. తిక్కన గారు పద్యాలలో 'పేడి మూతి . అనే మాట ఉన్న పద్యం పూర్తి పద్యం పోస్ట్ చెయ్యగలరు.

    ReplyDelete