Wednesday, April 19, 2017

పాట సాగుతూనే ఉంటుంది...


  ఊపిరాగిపోతుంది... కానీ పాట సాగుతూనే ఉంటుంది...

----------------------------------------------------------------
భావరాజు పద్మిని - 18/4/17
“పద్మిని గారు... నాకు పాటలంటే చాలా ఇష్టం, ఇక్కడ నేర్పేవారు ఎవరూ దొరకరు కదా ! వీలయితే, ఓ నాలుగు పాటలు నేర్పిస్తారా?”
ఏమని చెప్పాలి ఆవిడకి? జీవితం అందించిన బాధ్యతలతో చేసే అష్టావధానం వంటి విన్యాసాలతో నలిగిపోతూ, మధ్య మధ్య ఏ ప్రకృతి ఒడిలోనో సేద తీరుతూ, నాలో తిరిగి నిండిన జీవాన్ని అందరికీ అక్షరాలతో పంచే అన్వేషినని చెప్పాలా? కాలానికి -వేగానికి, దూరానికి – గమ్యానికి మధ్య నలిగిపోతూనే నాలోని అస్తిత్వాన్ని బ్రతికించుకునేందుకు అనుక్షణం నేను పడే తపన గురించి చెప్పాలా? గతంలో కొంతమందికి పాటలు నేర్పాను, కాని ఇప్పుడు... ‘వీలు కాదు’ అని చెప్పాలా? అసలు నేను పాటలు ఎలా నేర్చుకున్నాను? ఒక్కసారిగా అంతర్మధనం...
డిగ్రీతో పాటే శాస్త్రీయ సంగీతం, వీణ క్లాసులకు వెళ్ళేదాన్ని. ఉదయం కాలేజి, సాయంత్రం సంగీతం, ట్యూషన్లు. అప్పట్లో కళను గంటల్లో, కాసుల్లో లెక్కకట్టి కొలిచేవారు కాదు. విద్య నేర్పే గురువులు కేవలం విద్యనే కాక, విద్యార్ధి మానసిక స్థితిని, ఒత్తిడిని కూడా గమనించి, తగిన విధంగా మార్గదర్శకులై ఉండేవారు. తెనాలిలో నా మొదటి సంగీతం టీచర్ కామేశ్వరి గారు, సాయంత్రం కాలేజి నుంచి ఇంటికి వెళ్తే, పిల్ల ఎండనపడి వేళ్ళాడుతూ వచ్చిందని, ఏదో ఒకటి పెట్టేవారు. ఆవిడ పెట్టిన వంకాయ ఉప్మా, జన్మలో మర్చిపోలేను. వారమంతా క్లాసులు ఉండేవి, కాని ఆవిడ తీసుకున్న జీతం 30 రూపాయిలు. దురదృష్టవశాత్తూ, ఆవిడ చిన్న వయసులోనే(సుమారు 50సం.) చనిపోయారు. కాని, ఆవిడ నేర్పిన పాటలు, నా వీణ మీద, నా మానసవీధిలో ఇంకా మార్మ్రోగుతూనే ఉంటాయి. ఆ పాట పలికించినప్పుడు ఆవిడ తలపులూ అలా నన్ను అల్లేస్తూ ఉంటాయి.
అలాగే నేను ఎం.ఎస్.సి కెమిస్ట్రీ చదువుతూ ఉండగా, నా రెండవ సంగీతం టీచర్ బాపట్లలో కామేశ్వరి గారని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విద్య నేర్పారు. డబ్బు తీస్కోకూడదు అన్నది ఆవిడ నియమం. ఇక నాకు వీణలో సర్టిఫికేట్ కోర్స్ కు శిక్షణ ఇచ్చిన శారద గారు, వీణని మనసులు మీటేలా పలికించడం నేర్పుతూనే నాకు ఇంట్లోని వారితో సమానంగా వండి ప్రేమగా వడ్డించిన హేమాంబుజ గారు... వీరందరూ నాకు అత్యంత ఆప్తులు. వారు దూరంగా ఉన్నా, వారు అందించిన పాటల రూపంలో నాతో వారూ జీవిస్తూనే ఉంటారు. ఏ కళ అయినా శారదా మాత భిక్ష. కళాకారుడి ఊపిరి ఆగినా, ఆ కళ రూపంలో తన శిష్యులలో, అనేక మంది జ్ఞాపకాలలో, జీవిస్తూనే ఉంటాడు. ఆ భాగ్యం కళాకారుడికి మాత్రమే అందిన గొప్ప అనుగ్రహం. ఇటువంటి మహాద్భాగ్యాన్ని నేనెందుకు ఒదులుకుంటాను?
జీవితమే ఒక పాటగా పల్లవించండి... సుదూర తీరాలలో ఏదో ఒక గళంలో మ్రోగే పాటగా కుసుమించండి... బ్రతుకే ఒక పాటగా జీవించండి...
“మీ నంబెర్ ఇవ్వండి, వీలైనప్పుడు కాల్ చేస్తాను... అయితే ఒక నియమం, నేను ఊరికే నేర్పుతాను, మీరు నాకేం ఇవ్వద్దు.” అన్నాను. ఇవ్వాళే ఆవిడకో నాలుగు పాటలు నేర్పి, ఈ పోస్ట్ రాసే అర్హత సంపాదించుకున్నాను.
నేడు తమకు వచ్చినదంతా ఇతరులకు నేర్పేస్తే, వారు తమకు పోటీగా తయారౌతారన్న చిన్న స్వార్ధం నేడు కళాకారుల్లో కనిపిస్తోంది. ఇది మంచిది కాదు. “పంచితే కళ తరిగిపోదు... వారందరి రూపంలో అజరామరంగా జీవిస్తూ, ముందు తరాలకు అందుతుంది...” అందుకే వచ్చిన ఏ చిన్న విద్యనైనా, కాస్త తీరిక చేసుకుని, ఇతరులకు నేర్పండి. “ఇచ్చుటలో ఉన్న హాయిని” మీరూ అనుభూతి చెందండి...

No comments:

Post a Comment