Thursday, March 14, 2013

శర్మ గారి వచన కుసుమాలు

పెద్దలు శ్రీ Vvs Sarma గారి వచన కుసుమాలు....అందరూ చదివేందుకు ఇక్కడ పదిలపరుస్తున్నాను.

శ్రీకృష్ణ నిర్యాణానంతరం భారత వర్షంలో ఒకరకమైన శూన్యం ఏర్పడినది. వాయువ్యదిశన, గాంధార, మద్ర మొదలైన దేశాలనుండి, దక్షిణ దిశన, ఆంధ్ర, చోళ, చేర, పాండ్యుల వరకు, ఈశాన్యాన, విదేహ మొదలైన దేశములవరకు ఒక చీకటి యుగం నడిచింది. 54 దేశాల రాజులు తమ తమ సైన్యాలతో కౌరవ పాండవ యుద్దములో పాల్గోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. హస్తినాపురానికి ప్రభుత్వం ఏర్పడినా కురు భూములుతప్ప మిగిలిన దేశాలన్నిటిలో అరాజకం ప్రబలింది. కొన్నిచోట్ల దోపిడీ దొంగలు చెలరేగారు. కొన్నిచోట్ల సింహాసనం కై కుట్రలు జరిగాయి. మరికొన్ని చోట్ల అనుభవశూన్యులైన పిల్లలను గద్దె పై ఎక్కించి వెనుకనుండి ఎవరో నడిపారు. అధర్మము, అన్యాయము, దోపిడీ యథేచ్చగా సాగాయి. కాని వ్యక్తిగతమైన ధర్మం అవడం వలన కొంతవరకు వైదిక మతం, సంస్కృతి రక్షింపబడ్డాయి. కాని యజ్ఞము, మంత్రము మొదలైనవి వ్యక్తుల స్వార్థము కొరకు ఉపయోగింపబడడం మొదలైనాయి. కాని ఆ భారత యుద్ధము వలన కలిగి అశాంతి ప్రజలనుండి పోలేదు. తర తరాలుగా ఆవిద్వేషాలు రగులుతోనే ఉన్నాయి.. వైదిక కర్మకాండలను సద్వినియోగ పరచుకోలేదు. ఒక రకమైన దృక్పథం ప్రజలకు వచ్చినది. భగవంతుని ఉనికి, వర్ణ వ్యవస్థ, యజ్ఞాది కర్మల ఉపయోగం ఇలాటి వాటి మీద ప్రశ్నలు బయలుదేరాయి. భాగవత, భారతాలు కొంతవరకు ప్రచారంలోనికి రావడం వలన చరిత్ర తెలిసింది. ఇంకా భక్తి మార్గానికి అంత ప్రచారం రాలేదు. ఆనాటి ప్రజలకు అప్పటిభాషలో ధర్మ బోధ చేయగలిగిన బోధకులు అవసరమైనారు. తపస్సు మీద ఇంకా నమ్మకం ఉన్నది. నన్నయ చెప్పినట్లు "గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్" అనే నిరాశ ప్రబలింది. అప్పుడు తాపోపశమనానికి అహింసను, శాంతినీ, సత్ప్రవర్తననీ బోధించే మతాల అవసరం కలిగినది. పరం కంటే ఇహం పైనే వారు ఎక్కువ దృష్టి పెట్టారు. బోధిసత్త్వులు, బుద్ధుడు, తీర్థంకరులు, మహావీరుడు, బౌద్ధ, జైన మతాలను స్థాపించారు. భాగవతం వీరు విష్ణువు అవతారాలేనని చెప్పినది.
(భాగవతం - 1.3.24)
తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురాద్విషామ్
బుద్దో నామ్నా జినసుతా కీకటేషు భవిష్యతి
తరువాత కలియుగంలో సురద్వేషులైన నాస్తికులను సమ్మోహన పరచుటకు కీకట దేశంలో బుద్ధుడనే పేరుతొ జినసుతుడుగా ప్రభవిస్తాడు.
ఇదంతా కలియుగంకొరకు ఉద్దేశింపబడిన శ్రీకృష్ణుని గురుతత్త్వ ప్రభావమే!




రాజకీయనేతలకు దశ దిశానాథులిచ్చిన ఆదేశములు 
1. ప్రాచీదిశ -ఇంద్రుడు - నీ వర్గమునకు ఒకడే దైవముండవలెను. వేరెవరు కూడదు. 
2. దక్షిణదిశ -యముడు- నీదేవుని విగ్రహములు తప్ప ఇతరవిగ్రహా రాదనను సహింపకుము. 
3. ప్రతీచీదిశ - వరుణుడు - నీదేవుని నామమునే సదా ఉచ్చరింపుము. 
4.ఉదీచీదిశ - కుబేరుడు - నీకు పదవి లభించువరకు విశ్రాంతిలేదు.
5. ఈశాన్యము - ఈశానుడు - నీకు దీర్ఘకాలము పదవి లభించుటకు పితృ దేవతలను పూజింపుము.
6. ఆగ్నేయము - అనలుడు - నీచేతులతో హత్యలు చేయకూడదు.
7 నైరుతి - నిరుతి - నాతిచరాసి
8. వాయువ్యము - అనిలుడు - అవినీతి నిషిద్ధము. నీ వ్యాపారమునకు పెట్టుబడులు స్వీకరింపవచ్చును.
9. ఊర్ధ్వదిశ - చతుర్ముఖ బ్రహ్మ - అన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానము.
10. అధో దిశ - విష్ణువు - ఇతరుల ఆస్తులు కోరకుము. నీవి అనంతములగును

1 comment:

  1. నమస్కారం పద్మిని గారు !!
    మీ వ్యాసాలు చాలా బాగుంటాయండీ!! ఈ పై వ్యాసంలో చివర ఇచ్చిన దిశా, దిశానాథుల వివరాలు సరిగ్గా అర్థం కాలేదండీ!! మొదట్లో రాజకీయ నాయకులకు .... అని పేర్కొన్నారు.

    మరింత వివరణ ఇవ్వగలరని అభ్యర్థిస్తున్నానండీ!!
    భవదీయుడు
    - శశికుమార్

    ReplyDelete