Saturday, September 28, 2013

ఆదికవి నన్నయ్య -1

  
తెలుగు కవిత్వం 9 వ శతాబ్దం నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది. నన్నయ్య గారికి పూర్వం మల్లియరేచన, పంపన , నాగవర్మ వంటి కవులు ఉండేవారని, లభ్యమైన పద్యాల ద్వారా తెలుస్తోంది. అక్కడా, ఇక్కడా వీరి పద్యాలే తప్ప కావ్యాలు లభ్యం కాలేదు. తెలుగు భాషలోని ఎరువు పదాలను తొలగించేందుకు, శబ్దాలకు ఒక వ్యవస్థను ఏర్పరిచి, ఒక స్థిరమైన రూపం ఏర్పరచి, 'శబ్దశాసన ' బిరుదు పొందారు నన్నయ్య .నన్నయ్య కేవలం అనువాద కవి అని, బసవపురాణం వ్రాసిన పాల్కురికి సోమనాధుడే ఆదికవి అన్న వాదనలు కూడా లేకపోలేదు. అయితే నన్నయ్య భారతంలో స్వేచ్చానువాద పద్ధతిలో తెలుగు నుడికారాలు, సామెతలు, పలుకుబళ్ళు, ఉపమానాలు ఉపయోగించారు.తెలుగుదనపు మర్యాదలన్నీ భారతానికి తెచ్చారు. అందుకే విమర్శకులు, భాషాపరిశోధకులు నన్నయ్య గారికే ఆదికవిగా ఆమోదించారు. 

ఆదికవి నన్నయ్య

నన్నయ్య కు పుట్టుక, తల్లి తండ్రులు ఇంటిపేరు ఎక్కడా ప్రస్తావించలేదు.. కానీ ఇంటిపేరు వాడ్రేవు వారని చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ద్వారా తెలిసింది..నన్నయ్యను నన్నయ బట్టు అని కూడా అంటారు. రాజరాజ నరేంద్రుడు రాజ మహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో నన్నయ అతని ఆస్థాన కవిగా ఉండేవాడు. నన్నయ్యకు ఆదికవి, వాగమ శాసనుడు అనే బిరుదులున్నాయి.

 చంద్రవంశంలో జన్మించిన రాజరాజనరేంద్రుడు అనే రాజు వద్ద 'విద్యా విలాస గోష్ఠి'లో అపార శబ్దశాస్త్ర పారంగతులైన పౌరాణికులు, మహాకవులు, తార్కికులు ఉండేవారు. వాళ్ళలో లోకజ్ఞుడు, శబ్దశాసనుడూ, ఉభయకావ్య రచనా శోభితుడూ అయిన నన్నయగారిని చూసి 'మా చంద్ర వంశంలో ప్రసిద్ధులైన పాండవోత్తముల చరిత్రను వినాలనుకొంటూ ఉంటాను. బంగారు కొమ్ములున్న నూరు గోవులను ఉత్తమ బహువేద విప్రులకు దానం చేసిన ఫలం భారతం వింటే వస్తుంది, అంటారు. నా మనసు ఎప్పుడూ భారత కధా శ్రవణానికై  ఉవ్విళ్ళూరు తుంటుంది.కృష్ణద్వైపాయన మునిశ్రేష్ఠ విరచిత మహాభారతంలోని నిగూఢ అంతరార్ధం అందరికీ తెలిసేట్టు మీ తెలివితేటలు, ప్రతిభ చూపించి తెలుగులో రచించండి 'అన్నారు.  అందుకు నన్నయ 'అడుగు పెట్టడానికి వీలులేని నిగూడార్ధ జలాలున్న భారత భారతీ సముద్రాన్ని బుద్ధిబాహువుల బలంతో ఈదడం బ్రహ్మదేవుడికైనా చేతనౌతుందా? అయినా విద్వజ్ఞుల అనుగ్రహంతో నాకు తెలిసినట్టు రాస్తాను. ' అంటూ...

"అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేదశా
స్త్రముల యశేషసారము  మదంబున బొందను బుద్ది బాహువి
క్రమమున దుర్గామార్ధజల గౌరవ భారత భారతీ సము
ద్రము దరియగ నీ(దను విదాత్రు కైనను నేర బోలునే..."
అన్నాడు. అంటే "ఆకాశంలో కనిపించే నక్షత్రాలను లెక్క కట్టడం సర్వ వేద శాస్త్రాల అశేష సారాన్ని  సంతోషంతో పొందడం, అడుగు పెట్టడానికి వేలులేని నిగూడార్ధ జాలం ఉన్న ఈ మహాభారతీయ సముద్రాన్ని బుద్ది అనే బలంతో ఈదడం సృష్టికర్త అయిన బ్రమ్హకైనా  చేతనవుతుందా ? అని అర్థం.  



ఆ రోజుల్లో 'దేవభాషే' గాని 'దేశభాష ' పనికిరాదని హేళన చేసేవారు. ఆ రోజుల్లో విద్యాపరిషత్తులు ఉండేవి. వీటినే "సత్సభలు" అనేవారు. రాజే తలచుకున్నాడు కనుక విద్యా పరిషత్తుల ఆమోదం పెద్ద సమస్య కాలేదు. కావ్యారంభంలోనే ఆయన ఈ సభలకు నమస్కారం చేసారు. అవ్యవస్థితమైన తెలుగు శబ్దములకొక వ్యవస్థను ఏర్పరచి రూపస్థైర్యమునొసగాడు నన్నయ. 'ఆదికవి' చాలా విషయాలకు ఆద్యుడు. ప్రతి కావ్యంలోనూ, మొట్టమొదట చదివే ఇష్టదేవతా ప్రార్ధన, పూర్వకవి స్తుతి, కుకవినింద, గ్రంధకర్త స్వవిషయం, కృతిపతి వర్ణన, శాశ్త్యన్తాలు మొదలయినవి, నన్నయే మొదలుపెట్టాడు. అంటే కాక గురు పద్యవిద్యకు ఆద్యుడయిన వాల్మీకిని, వ్యాసుడిని, సత్సభలనూ కొనియాడారు.

'ఆదికవి' స్థానం నన్నయది కాదని నిరూపించేందుకు చాలా మంది కంకణం కట్టుకున్నారు. నన్నయ కేవలం అనువాదకుడు మాత్రమెనని, కవి కాదని, కొంత మంది అభిప్రాయం. రాజరాజు నన్నయను, భారతంలోని అంతరార్ధం తెలియచెప్పేలా రాయమన్నాడు కాని, అనువదించమనలేదు. అందుకే పాత్రల పరిచయాలప్పుడు వారి స్వభావ వర్ణన, అందుకు తగిన విశేషణాల ప్రయోగం, తెలుగుదనాన్ని చూపించే గౌరవసూచాకాలు వాడడం, ఎత్తి పొడుపులు, నూతన కల్పనలు, యతి-ప్రాస యతుల ప్రయోగం, శబ్దాలంకార అక్షర రమ్యత, మాటల్లో ఔచిత్యం, అన్ని కలిపి, సర్వాంగ సుందరంగా ఆంద్రభారత కావ్యకన్యను మలచారు నన్నయ్య . 'ఉపదేశం చెయ్యనిది కావ్యం కాదని' భావించిన నన్నయ, ప్రత్యేకించి సందర్భోచితంగా కధలో కలిసిపోఎట్టు, సుభాషితాలు చెప్పడంలో నేర్పును చూపించారు. ఆ సూక్తులను, మనం ఇవాళ కూడా విరివిగా వాడుతుంటాం. 'గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...., సిద్ధుల చరితంబులు అల్పులకు నేరుగ శక్యమే..., వృద్ధుల బుద్ధులు సంచలింపవే...' వంటివి కొన్ని ఉదాహరణలు. ఇలా, ఆంద్ర భాషకు కావ్యము, వ్యాకరణము రెండింటిని ప్రసాదించిన నన్నయ్య, భారతంలోని మొదటి రెండున్నర పర్వాలనూ ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణమునూ, మనకు అందించాడు.


                                              

శ్రీ Vvs Sarma గారు...

పద్మినీ
నీవు ఆదికవి నన్నయ్య భారతమునకు సముచిత స్థానం కలిగించే ప్రయత్నం చేస్తున్నావు. అభినందనలు. ఏదైనా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం 6 నెలలక్రితం వ్రాసిన నన్నయ భారత ఆంధ్రీకరణానికి సంబంధించిన విషయాలను, ముఖ్యంగా ఆకాలపు చారిత్రక నేపధ్యాన్ని తిరిగి ఇక్కడ ఇస్తున్నాను.ఇది ఉపయోగకరం కావచ్చు. నేటి నేపధ్యంలో పరిశీలించవచ్చు. 
1
రాజరాజ నరేంద్రుడు - నన్నయ - ఆంధ్రమహాభారతము 
మన చరిత్ర పుస్తకాలలో లో రాజరాజ నరేంద్రుని పేరు కనిపించదు. ఉత్తరభారతంలో ఘజనీ మహమ్మదు 17 పర్యాయములు దండెత్తి ముఖ్యదేవాలయాలు విధ్వంసం చేసే సమయంలో దక్షిణభారతంలో సనాతన ధర్మ ప్రతిష్ఠాపన జరుగుతూంది. ఆది శంకరుల అడుగుజాడలలో, దేశభాషలకు ప్రచారమిచ్చిన బౌద్ధ జైనాలకు దీటుగా, సనాతన ధర్మ గ్రంధాలను దేశభాషలలోనికి తీసుకొని రావలసిన అవసరం వచ్చింది.వేంగి దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు, రాజరాజ నరేంద్రునిచేత (సా.శ.1019–1061) ఆ కార్యక్రమం ప్రారంభింపబడినది. రాజమండ్రి అనే రాజమహేంద్రవరాన్ని స్థాపించి, పాలించినవాడాయన. తన మంత్రి, గురువు ఐన నన్నయ భట్టారకుని పిలిచి లక్ష శ్లోకాల సంస్కృతభారతమును తెనిగించమని కోరాడు. నన్నయ జన్మస్థలం తణుకు అని చెబుతారు. ఆయన భారతాంధ్రీకరణం మొదలుపెట్టి తన జీవిత కాలంలో ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని అనువదింఛాడు. 
1. కావ్యారంభం
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే
లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. అవిహితమైన స్త్రీ, పురుష యోగోద్భవమైన లోకముల స్థితి వారు కలిగించుచున్నారు. వేదస్వరూపులు, దేవతాపూజ్యులు, పురుషోత్తములు, అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక. -- మహాభారతాంధ్రీకరణలో మొదటిగా నన్నయ చెప్పిన సంస్కృత శ్లోకం ఇది. తెలుగు సాహిత్యానికి శ్రీకారం.
2. మహా భారత ప్రాశస్త్యం 
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని | యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని | కవివృషభుల్ మహాకావ్యమనియు 
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని | యైతిహాసికులితిహాసమనియు 
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ| యంబని మహా గొనియాడుచుండ 
వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు | డాదిముని పరాశరాత్మజుండు 
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై | పరగుచుండ జేసె భారతంబు 
3. సభలో ఎలా మాట్లాడాలి? 
మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్
తెలుగు మహాభారతం ఆంధ్రదేశమంతా బహుళ ప్రచారం పొందినది. "వింటే భారతం వినాలి" అనిపించింది. నేటి వరకు దీనిని మించినదిలేదు. గత వేయి సంవత్సరాలలో అభివృద్ధిచెందిన తెలుగు భాషకు, దానికి కారణమైన ఆంధ్రమహాభారత గ్రంధానికీ నిరాదరణ వస్తుందా? అనే అనుమానం 21వ శతాబ్దపు భారతదేశ లక్షణం. ఇప్పుడు 25-45 సం. వయస్సులోనివారు ఎందరికి కవిత్రయం భారతంతో పరిచయంఉంది? ఈ ప్రశ్నకు సమాధానం, నన్నయగారి శిలా ప్రతిమ కంటే ముఖ్యం. 5000 ఏళ్ళనాటి మహాభారతగాధను తెలుగు భారతం సామాన్యులకు అందించింది. దేశమంతా రామాయణము ప్రసిద్ధము,లోకప్రియము. కేవలము ఆంధ్రులకు భారతం అత్యంత ప్రియమైన గ్రంధం. 21వ శతాబ్దంలో భారతాన్ని చదువుకుంటే, శ్రీకృష్ణుని పూజిస్తే, భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని రక్షించుకోగలము. మహాభారతానికి, భారతదేశానికి మధ్య ఉన్నది అవినాభావ సంబంధం. 
2
తెలుగు సాహిత్య చరిత్ర చెప్పుకుంటూ తూర్పు చాళుక్య రాజు, రాజరాజ నరేంద్రుణ్ణీ, ఆదికవి, వాగనుశాసనుడు నన్నయ్యని, రాజమండ్రీని , తణుకునీ తలచుకున్నాం. సమయం సా.శ. 1050 ప్రాంతం. ఎవరీ తూర్పు చాళుక్యులు? ఎక్కడనుండి వచ్చారు? తెలుగు చరిత్ర, సాహిత్యం గురించి మాట్లాడుకుంటే కటకం, పర్లాకిమిడి, రాజమండ్రి, వేములవాడ, వరంగల్లు, నెల్లూరు, చెన్నపట్టణం, కంచి, తంజావూరు, మధుర, హంపీ విజయనగరం, శృంగేరి, కోలారు, బళ్ళారి, ఎలహంక (బెంగుళూరు), బాదామి (వాతాపి), ఢిల్లీ, (హరప్పా, లాహోరు తో సహా) గుర్తుకు తెచ్చుకోవాలి. రాజకీయంగా రాజమండ్రీకి పూర్వరంగం కర్ణాటక లోని బాగలకోట జిల్లాలోని బాదామి (వాతాపి). చాళుక్యుల ముఖ్య ప్రదేశం. వాళ్ళే పశ్చిమ చాళుక్యులు. వాళ్ళే బాదామినుండి రాజమండ్రీ వరకు ఆరవ శతాబ్దమునుండి, పదకొండవ శతాబ్దము వరకు ఇప్పటి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలుగా చెప్పబడే ప్రాంతాన్ని పాలించారు. కన్నడభాషని సాహిత్యాన్ని పోషించారు. కన్నడ కవులు పంప, తరువాత రన్న, పొన్న అనేవారు హళెగన్నడ (పాత కన్నడం) అనే అప్పటి భాషలో కన్నడ సాహిత్యానికి ఆద్యులు. వీరు కన్నడ భాషకు కవిరత్నత్రయం. ఆదికవి పంప కన్నడభాషలో పంప భారతాన్ని వ్రాశాడు. దాని మరోపేరు విక్రమార్జున విజయం. ఈ పంప వేములవాడ నుండి వెళ్ళాడు. పొన్న వేంగీ దేశపు (ఏలూరు ప్రాంతం) వాడు. ఈయన భారతం పేరు గదాయుద్ధ (భారతయుద్ధం ఆఖరి ఘట్టం -భీమ దుర్యోధన యుద్ధం). నన్నయ పేరు నారాయణ శబ్దానికి తెలుగు వికృతి. ఈయన తన మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో భారత రచన చేశాడు. నారాయణ భట్టుకు ఈ కన్నడ సాహిత్యంతో పరిచయం ఉన్నది. కాని కన్నడ భారతాలు వ్యాస భారతం అనువాదాలు కాదు. ఆ కవులకు కూడా జైనమతంపై ఉన్న అనురక్తి సనాతనధర్మం పైలేదు. వాళ్ళ ముఖ్యగ్రంధాలు జైన పురాణాలు. వీరరస ప్రధానగ్రంధాలుగా వాళ్ళు భారత కథను వ్రాశారు. పైగా ఒకరు అర్జునుని నాయకుడుగా వ్రాస్తే, ఒకరు భీముణ్ణి నాయకునిచేశారు. వాళ్ళవాళ్ళ ప్రభువులను ఆయా నాయకులతోపోల్చారు. ఈ పంప చాళుక్యరాజు అరికేసరి ఆస్థానకవి. రాజును అర్జునునితో పోల్చినప్పుడు ద్రౌపదికి ఐదుగురు భర్తలంటే ఏంబాగుంటుంది? అందుకు ద్రౌపదిని అర్జునునికి ఒక్కడికే భార్యను చేశాడు. యుద్ధం తరువాత అర్జునునికే పట్టంకడతారు. పైగా సుభద్ర మహారాణి. జైన పురాణాలు, ఈ మార్చిన భారతకథలూ ఆంధ్ర దేశంలోకూడా ఈ కవి పండితులద్వారా ప్రచారమయ్యాయి. వీరంతా అన్ని రాజ్యాల రాజుల వద్దకూ వెళ్ళేవారు. రాజమండ్రీనుండి కటకంపై వరకు కళింగ సామ్రాజ్యం. ఈ రాజకుటుంబాలన్నీ వివాహ సంబంధాలు కలిగిఉండేవి. రాజ రాజనరేంద్రుని కాలానికి, గోరక్షనాథ ప్రభావం వలన జైనం స్థానంలో స్మార్త శైవం వచ్చినది. సారంగధర కథ మాళవదేశమునుంచి వచ్చినది. చరిత్ర గతిలో వ్యాస మహాభారతాన్ని యధాతథంగా తెలుగు ప్రజలవద్దకు తీసుకు రావలసిన అవసరం వచ్చినది. తెలుగు సాహిత్యపు శుభారంభానికి రాజమండ్రి కేంద్రమయింది. కాని రాజ రాజ నరేంద్రుని అనంతరం అనతికాలం లోనే సామ్రాజ్యకేంద్రం తంజావూరుకు, భాషా చరిత్ర కేంద్రాలు వరంగల్లుకు, వెలనాడుకు, నెల్లూరుకు తరలిపోయాయి.


భారతావతరణము -1 
నన్నయను స్మరించుకుంటే విశ్వనాథవారి రేడియో రూపకం భారతావతరణము గుర్తుకు వస్తుంది. ఇది 1961 సెప్టెంబరు 24న ఆకాశవాణి హైదరాబాదు వారు ప్రసారంచేశారు. తరువాత భారతిలో ఫిబ్రవరి 1962లో ముద్రింపబడినది. 
మొదటి రంగం - స్థలం - రాజమహేంద్రవరం. గోదావరి స్నాన ఘట్టం. ఆరోజు రాజనరేంద్రుని సభలో నన్నయ్యగారి ఆదిపర్వం ఆవిష్కరణ. 
ముగ్గురు బ్రాహ్మణుల సంభాషణ
మొదటివారు ద్రవిడ దేశంనుండి రాజపుత్రుడు కులోత్తుంగునితోబాటుగా ఈ సభకై వచ్చారు.
రెండవవారు దూర గ్రామం నుండి వచ్చిన సంస్కృత పండితుడు. మూడవవారు రాజాస్థానములోని కవి, పండితుడు.. 
1వ బ్రా.:- మీరాజావారి కులబ్రాహ్మణుడు నన్నయభట్టుగారు వ్యాస భారతమును మీభాషలోనికి అనువదించుచున్నారటగదా. ఆ సభకు కుమారుని అహ్వానించినారు.వారితో మేమును వచ్చినాము. 
2వ బ్రా :- నాకు తెలియదు. ఆంధ్రభాష వంటి జానపదుల భాషలో భారతమా? అసలు తగిన పదజాలమున్నదా? వ్యాకరణమున్నదా. చందస్సులున్నవా? ఈ మ్లేచ్చ భాషలో భారతమును ఎవరాదరింతురు? 
1వ బ్రా:- మా ద్రావిడభాషలో అనేక ప్రాచీన కావ్యములున్నవి. స్వతంత్రవృత్తములున్నవి. 
3వ బ్రా :- మా నన్నయగారి ప్రతిభనుగురించి మీ ఇరువురికి తెలిసినట్లులేదు. వారిప్పటికే పాణినీయ పద్దతిలో ఆంధ్రశబ్ద చింతామణిని కూర్చినారు. సంస్కృత శబ్దములు, దేశి ధాతువులతో మణిప్రవాళము వంటి భాషను నిర్మించినారు.తెలుగుకు తగిన సంస్కృత వృత్తములను నిర్ణయించినారు. 
2వ.: ఇది విఫలప్రయత్నమనే నా నమ్మకము. వాగ్దేవికి ఈభాషలు రుచించునా? ఆమెకు దుర్దినములు వచ్చినవి. 
3వ. బ్రా: నేను సభకుపోవుచుంటిని. నన్నయ్యగారు తెలుగులో వాల్మీకి మహర్షిని తలపించు ఆదికవిగా గుర్తింపబడుదురనే నా నమ్మకం. మీరిరువురూ నా వెంట రావచ్చును. 
1వ బ్రా: మీరెంత చెప్పినను నాకు నమ్మకములేదు. నేను యోగిని. నేను బ్రహ్మలేకమునకు పోయి అక్కడ సరస్వతీ దేవి ఈఔద్ధత్యమునకు ఎట్లు స్పందించుచున్నదో తెలుసుకొందును. 
2. వ బ్రా: - ఆ యోగప్రక్రియ నాకునూ తెలియును. నేను కూడా నా సందేహములను అక్కడనే తీర్చుకొందును. 

రెండవ రంగము - బ్రహ్మలోకము - సరస్వతీదేవి అత్యవసర సమావేశము.
ఆహూతులు వశిష్ఠ వామదేవాది మహర్షులు, కాళిదాసు, భవభూతి, మురారి, ప్రత్యేక ఆహ్వానితులు వాల్మీకి, వ్యాసుల వారు. 

 భారతావతరణము -2 
రెండవ రంగము - బ్రహ్మలోకము - సరస్వతీదేవి అత్యవసర సమావేశము.
ఆహూతులు వశిష్ఠ వామదేవాది మహర్షులు, కాళిదాసు, భవభూతి, మురారి, ప్రత్యేక ఆహ్వానితులు వాల్మీకి, వ్యాసుల వారు. 

బ్రహ్మలోకము - వాణీ హిరణ్యగర్భుల సభావేదిక - ఆహూతులు వచ్చు చున్నారు. రంభ నృత్యము చేయుచున్నది. మేనక సరస్వతీదేవి చరణములకు పారాణి అలంకరిస్తున్నది. దేవఋషి నారదుడు తన వీణయైన మహతిని వాయిస్తూ హరినికీర్తిస్తున్నాడు. హంస సరస్వతీదేవి రాజమహేంద్రవర సభకు ప్రత్యక్షముగా వెళ్ళదలచినచో వెంటనేవెళ్లుటకు సిద్ధముగా ఉన్నది. ఆహూతులు ఒకొకరే వచ్చుచున్నారని ద్వారపాలిక తెలిపినది. మొదట కవివరులు కాళిదాసు, భవభూతి, మురారి వచ్చినారు. సప్తమహర్షులు వచ్చినారు. సృష్టికర్త స్వస్థానమునకు వచ్చికూర్చున్నారు. వాల్మీకి, వ్యాసాదులు వేంచేసినారు.
బ్రహ్మా - సరస్వతీ నీవు మారిపోవుచున్నావు. గీర్వాణము తప్ప అంగీకరించని నీకు క్రొత్తభాషలమీద మోజు పెరిగినది.
సర:- స్వామీ అనంత కాలచక్రములో యుగములు, మహాయుగములు, కల్పములలో తమరు మారుటలేదా?

బ్రహ్మ:- ఇప్పుడే వాల్మీకి మహర్షులు వచ్చుచున్నారు.
వాల్మీకి:-దేవీ, భూలోకమున నాకొక ప్రత్యర్థి ఉదయించినాడు. ఆయనకూడా ఆదికవియేనట.
సర:- నన్నయగారు తమకు ప్రత్యర్థులా?
వాల్మీకి:- ఆయన నన్ను గురించి ఏమన్నారో చూడండి
హరిహరాజగజాననార్క షడాన్య మాతృ సరస్వతీ
గిరిసుతాదిక దేవతాతతికి నమస్కృతిఁజేసి దుర్భర
తపోవిభవాధికున్ గురు పద్యవిద్యకునాద్యు నం
బురుహగర్భవిభున్ బ్రచేతసుపుత్రు భక్తిఁదలంచుచున్
సర: అంబురుహగర్భవిభున్ - నిన్ను బ్రహ్మ అంతవానివి అన్నాడుకదయ్యా!
వాల్మీకి : దుర్భరతపోవిభవాధికున్ అనుటలో నాకవిత్వ ప్రసక్తి ఎక్కడ ఉన్నది? పద్యవిద్యకు ఆద్యుడని అన్నాడు. కవిగా నన్ను మెఛ్ఛుటకాదే. ఇది నేను తిరస్కారముగనే భావింతును.
భవభూతి:- మనందరమూ నేర్చినది పద్యవిద్యయే కదా. మనము వేదమంత్ర ద్రష్టలము కాదు. వేదాంగములను స్మృతులను నిర్మాణముచేసినవారముకాదు కదా!
వాల్మీకి:- ఆయన వ్యాసులవారిని ఎలా కీర్తించాడో గమనించండి.
భారత బారతీశుభగ భస్తిచయంబులఁజేసి ఘోరసం
సారవికారసంతమన జాలవిజృంభము వాపి సూరిచే
తోరుచిరాబ్జబోధనరతుండగు దివ్యుఁ బరాశరాత్మజాం
భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్


ఆయనకు నాకంటె వ్యాసుడనిన అధిక భక్తి ప్రపత్తులు. ఆయన - ఘోర సంసారవికారసంతమసజాల విజృంభము - ఘోరమైన సంసారవికారమనే కటికచీకట్ల ప్రభావమును వాపినవాడట. సూరిచేతో రుచిరాబ్జ బోధనరతుండగు అంభోరుహమిత్రుడట - పండితుల హృదయపద్మములను ప్రకాశింపచేయు సూర్యుడట, దివ్యుఁడట, మునిపూజితుడట, భూరియశోవిరాజితుడట.
వ్యాసుడు - ఆయన నిన్ను బ్రహ్మ యంతటివాని వన్నాడు. నేను వ్రాసినదంతయు తారుమారుచేసినాడు. నాకావ్య రచనా శిల్పమును గౌరవించలేదే.

భారతావతరణము -3

భవభూతి - మహర్షి వాల్మీకీ! తమ మధుర కవితారసమును పానము చేయని భారతీయుడుండునా?
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్
వాల్మీకియను కోకిల కవితా వృక్షశాఖపై కూర్చుండి రామ రామ అను మధురాక్షరములు పలుకుచున్నది.
కాళిదాసు - వాల్మీకేర్ముని సింహస్య కవితా వనచారిణః - వాల్మీకి యను మునిసింహము కవితావనములో విహరిస్తూ తన గర్జనతో రామకథను వినిపించెనట. నన్నయ బెదరినాడేమో.
వాల్మీకి : నన్నయ ఆంధ్రీకరించునది భారతము. అతనికి వ్యాసుడనిన అధిక గౌరవము.
సర:- అందరకు స్వాగతము. కాళిదాస కవీంద్రా తమరు ఈసభకే వచ్చితిరా?
కాళిదాసు - వ్యాసులవారినుండి బ్రహ్మ వైవర్తమును విని ఉన్నాము. ఈనాడు తమ వివర్తశోభను తిలకించుటకు వచ్చితిమి.
సర:- నీ వివర్తశోభ రఘువంశములోనూ, భవభూతిది ఉత్తరరామచరితములోను మేముచూడ లేదా?
భవభూతి :- సిద్ధ చారణులు ఈయాంధ్రభాషా వివర్త రామణీకమును పొగడుచున్నారు.అతడి ప్రయత్నమును చూచి ధన్యులమౌదుమని వచ్చియున్నాము.
సర: అందరూ ఆసీనులుకండు. రాజమహేంద్రవరమున గ్రంధావిష్కరణ సభ ప్రారంభమగుచున్నది.

మూడవ రంగము
రాజ మహేంద్రవరము - రాజ రాజనరేంద్ర బిరుదాంకితుడైన చాళుక్య ప్రభువు విష్ణువర్ధనుని విద్వత్సభ.
సభాసదులందరూ ఆసీనులై ఉన్నారు. వైతాళికుల జయజయధ్వానాల మధ్య మహారాజు వచ్చి సింహాసనారూఢులైనారు.
నిశ్శబ్దం.
… …

బ్రహ్మలోకములోని సభలోని అందరి దివ్యదృష్టి రాజమహేంద్రవరము రాజ సభలోనే కేంద్రీకృతమై ఉన్నది.

భవభూతి : సభామర్యాదలు పూర్తి అయినవి. నన్నయ గారు లేచి నిలభడి భారతపఠనము ఆరంభించినారు
నన్నయ:
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే

కాళిదాసు: ఏదో క్రొత్త భాషయన్నారు. ఇది సంస్కృతమే. మరియొక సంస్కృత భారతమా?
భవభూతి : - వ్యాసుల కావ్యారంభము చిత్తగించండి:
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం
దేవీంసరస్వతీంచైవ తతోజయముదీరయత్
లోమహర్షణ పుత్రః ఉగ్రశ్రవాః సూతపౌరాణికో నైమిశారణ్యే శౌనకస్యకులపతేర్ ద్వాదశవార్షిక సత్రే
సమాశీనాన్ అభ్యాగచ్ఛద బ్రహ్మర్షీన్ సంశితవ్రతాన్
వినయావనతో భూత్వా కదాచిత్ సూతనందనః …
తెలుగా సంస్కృతమా అనేది ప్రశ్నకాదు. మొదటిశ్లోకంలోనే నన్నయగారి కవితామృతాన్ని ఆస్వాదన చేయండి. వ్యాసులవారు మొదట 8000 శ్లోకాలలో జయమును క్లుప్తముగా వ్రాసినారు. వారివద్ద విపులముగా విన్న వైశంపాయనుడు, జనమేజయుని సర్పయాగ సమయంలో భారతమును విస్తరించినాడు. ఆ సభలో రోమహర్షణుడు వినినాడు. ఆయన పుత్రుడు సూతుడు నైమిశారణ్యమున ద్వాదశ వర్ష సత్ర సమయమున చేసిన ప్రతిదిన ప్రవచనము లక్ష శ్లోకముల మహాభారతముగా వివర్తమొందినది. నన్నయగారు అనుసృజన చేసినది ఇది.

సర: - మనము తరువాత ముచ్చటించుకొనవచ్చును ఈ లోపల నన్నయ్యగారు "పాయక పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు" తనకు బహుభాషాకోవిదుడైన నారాయణ భట్టు తనకు తోడై నిలిచాడని చెప్పారు.
భవభూతి: - ఇంతకూ ఎవరు రచించినారు?
సర:- ఇంతకూ భారత యుద్ధమెవరు చేసిరి? పార్థుడా? పార్థ సారథియా?
… …
నన్నయ: -
సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకవితార్థ యుక్తి లో
నారసి మేలునానితరులక్షర రమ్యత నాదరింప నా
నారుచిరార్థ సూక్తినిధి నన్నయభట్టు దెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్

భవభూతి: - సంహితా అనుపదములోనే నన్నయ తనరచనకు పంచమవేద ప్రతిపత్తి కల్పించినాడు.

వ్యాసుడు (తనలో):
పురాణసంశ్రితః పుణ్యాః కథా వా ధర్మసంశ్రితాః
ఇతివృత్తం నరేంద్రాణాం ఋషీణాం చ మహాత్మనాః
తస్యాఖ్యానా వరిష్ఠాస్య విచిత్రపదపర్వణః
సూక్ష్మార్థ న్యాయాయుక్తస్య వేదార్థైర్భూషితస్య చ
బారతస్యేతిహాసస్య పుణ్యం గ్రంధార్థసంయుతాం
సంస్కారోపగతాం బ్రాహ్మీం నానాశాస్త్రోపబృంహితాం.

నన్నయ గారు చదువుతున్నారు
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని | యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని | కవివృషభుల్ మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని | యైతిహాసికులితిహాసమనియు
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ| యంబని మహా గొనియాడుచుండ
వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు | డాదిముని పరాశరాత్మజుండు
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై | పరగుచుండ జేసె భారతంబు

1 comment:

  1. అయ్యా... పద్మిని భావరాజు గారి విశ్లేషణలో...
    " అమలిన తారకా......." పద్యము 4వ పాదము ముద్రణ లోపము లున్నవి. గమనించ ప్రార్ధన.....నమస్సులు

    ReplyDelete