Sunday, October 27, 2013

శ్రీనాథ కవిసార్వభౌముడు 2

భావరాజు పద్మిని 

పెదకోమటి వేముడి ఆస్థానంలో విద్యాధికారిగా పద్దెనిమిది సంవత్సరాలు రాజభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు శ్రీనాధుడు. అతడు మరణించాకా, శ్రీనాధుడు 1424 ప్రాంతాల్లో పల్నాటి సీమకు రాజాశ్రయం కోసం వెళ్ళాడు. పల్నాడు వెనుకబడిన రాజ్యం. కొండవీటిలో రాజభోగాలు అనుభవించిన శ్రీనాధుడికి ఈ ప్రాంతం రుచించలేదు.

అది ఈ పద్యం వల్ల తెలుస్తుంది.

చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు- నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జజోన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు- పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.


తక్కువ తెలిసి ఉండి, గర్వంతో ఎక్కువ మాట్లాడే కుకవుల గురించి శ్రీనాథుడు వ్రాసిన పద్యం...

బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు 
శాంతి నిప్పుచ్చరంబు మచ్చరము ఘనము 
కూపమండూకములుబోలె గొంచె మెరిగి 
పండితంమన్యులైన వైతండికులకు. (భీమ ఖండం -1 -13 )

తనకు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోతాడు వ్యాసుడు. అతడిని శర్వాణి వారించే పద్యాలు...

భిక్ష లేదని ఇంత కోపింతురయ్య 
కాశికాపట్టణముమీద గాని నేయ !
నీమనశ్శుద్ది తెలియంగ నీలకంఠు 
డింత చేసేనుగాక కూడేమి బ్రాతి? (భీమ ఖండం 2-114 )

శివుడు నిన్ను శోధించడానికి భిక్ష పుట్టకుండా చేసాడని చెప్పేసింది. 

తెలుగు భాష గొప్పతనాన్ని మొదట చాటిన వాడు శ్రీనాధుడే ! క్రీడాభిరామం లోని ఈ పద్యం చూడండి...

జనని సంస్కృతంబు సకల భాషలకును - దేశభాషలందు దెనుగులెస్స 
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద - మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే ?

కంజీవరం వెళ్ళినప్పుడు అక్కడి తమిళుల విందులో శ్రీనాధుడి తిప్పలు అంతా ఇంతా కావు. 

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు జారు
చెవులలొ బొగవెళ్ళి చిమ్మిరేగ
బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవి గొన్న 
బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
యవిసాకు వేచిన నార్నెల్లు పసి లేదు
పరిమళ మెంచిన బండ్లు సొగచు
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
గంచాన గాంచిన గ్రక్కువచ్చు
నఱవ వారింటి విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు తమ తీరు సిగ్గు లేక
చూడవలసిన ద్రావిళ్ళ కీడు మేళ్ళు... 

అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనముతో ఎలాటి అవస్థలు పడ్డాడో కదా. ఆంధ్రుల భోజనములో పప్పు ప్రధానము. తమిళులకు చారు ముఖ్యం. అలవాటు లేని చారు అదీగాక మిరియపు చారు మొదటనే వడ్డించేసరికి కవి సార్వభౌముడికి చిర్రెత్తింది. 

బుడతకీచువారు(పోర్చుగీసువారు) మన దేశానికి రాకముందు మనకు మిరపకాయలు లేవు. కారానికి మిరియాలే వాడేవారు. మనకు పోర్చుగీసు వారివల్లనే మిరపకాయలు లభించాయి. మిరియాలకు బదులుగా కారానికి వాడేవి కాబట్టి వీటిని(మిర్యపుకాయలు) మిరపకాయలు అని పిలుస్తారు.

సన్నన్నం తినే అతనికి ఆ ప్రాంతం లోని జొన్న కూడు రుచించలేదు. దానికి తోడు, చింత కూర, బచ్చలి కూర కలిపి వండిన ఉడుకు పులుసు ఒకటి! ఆ చేదు శ్రీనాధుడు భరించలేకపోయాడు. తానేమిటి, తనను పుట్టించిన జేజమ్మ కూడా తినలేడు...శ్రీనాధుడు శ్రీకృష్ణుడిని ఇలా సవాలు చేసాడు.

" ఫుల్లసరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావినా

నల్ల దావాగ్ని మ్రింగితి నటంచును నిక్కేదవేల?

పల్లవయుక్తమౌ నుడుకు బచ్చలిశాకము జోన్నకూటితో

మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీపస గానవాచ్చేడిన్ "

భావము: చిన్న నాడు పూతన ఇచ్చిన విషపు చేదు పాలు తాగానని గర్వంగా చెప్పు కుంటావే ... కృష్ణా, బచ్చలి ఆకులతో చేసిన ఈ జొన్న కూడు ఒక్క ముద్ద దిగ మింగి చూడు, నీ సత్తా తెలుస్తుంది.

భోజన, నిద్రా, మైథునాల్లో ఎలాటి లోపం కలిగినా భరించలేడు శ్రీనాథుడు. ఈ పద్యం చూడండి -

గొంగడి మేలు పచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్‌
జెంగట వాయుతైలము లజీర్ణపు మందులు నుల్లిపాయలున్‌
ముంగిట వంటకట్టియల మోపులు దోమలు చీముపోతులున్‌
రంగ వివేకి కీ మసర రాజ్యము కాపుర మెంత రోతయో
అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్‌
తేలాకాయెను బోనము
పాలాయెను మంచినీళ్ళు పడియుండుటకున్‌
నేలా కరవాయె నిసీ
కాలిన గురిజాల నిష్ట కామేశ శివా"

పల్నాట తనకు ప్రియమైనవి ఏమీ లేవంటూ వ్రాసిన ఈ పద్యం చూడండి...
" అంగడి యూరలేదు వరియన్నములేదు శుచిత్వమేమిలే

దంగన లిమ్పులేరు ప్రియమయిన వనంబులు లేవు, నీటికి

భంగాపడంగా బాల్పడు క్రుపావరు లేవ్వరులేరు దాతలె

న్నంగాను సున్నా, గాన బలనాటికి మాటికి బోవనేటికిన్?

రాసికుడుపోవాడు పాలనా- దేనగంగా రంభయైన నేకులేవడకున్

వసుధేసుడైన దున్నును- గుసుమాసృన్ డైన జొన్నకూడె కుడుచున్..."

ఇలా పల్నాటికి వీడ్కోలు పలికి, శుచిగా ఉండే పరిసరాలు కల  గోదావరీ తీరానికి వెళ్ళాడు.


                                                          

శ్రీమతి కొల్లూరు విజయాశర్మ అందించిన శ్రీనాధుడి పద్యాలు 

శ్రీనాధ కవిసార్వభౌముడు అనగానే సంస్కృత పద భూయిష్టమైన శైలి మెదలక మానదు మన మనసులో.. కానీ తీయతీయని తెలుగుపదాలతోకరుణ రసం తొణికిసలాడే ఈ పద్యాన్ని చూద్దామా.. నైషధం లో తనని నలుడు పట్టుకున్నప్పుడు హంస నలుడితో ఇలాఅంటుంది 

"తల్లిమదేకపుత్రక పెద్ద కన్నులు,
గానదిప్పుడు మూ(డుకాళ్ళముసలి 
ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెరుగదు ,
పరమపాతివ్రత్యభవ్యచరిత 
వెనకముందర లేరు నెనరైన చుట్టాలు ,
లేవడి యెంతేని జీవనంబు 
గానక కన్న సంతానంబు శిశువులు 
,జీవనస్థితి కేన తావలంబు 
కృప దలంప(గదయ్య యో నృపవరేణ్య ,
యభయమీవయ్య యో తుహినాంశువంశ 
కావగదవయ్య యర్దార్ది కల్పశాఖి 
నిగ్రహింపకుమయ్య యోనిశధ రాజ!"

పద్యం చదువుతుండగానే మనకళ్ళెదుట చక్కని దృశ్యం రూపు కడుతుంది. ఒక్కడే కొడుకు మీద పంచప్రాణాలూ నిల్పుకున్న మూడుకాళ్ళ ముసలి తల్లి,వ్యవహార జ్ఞానం లేని అమాయకురాలు,ఉత్తమురాలు,పరమ పతివ్రతా అయిన భార్య,లేక లేక కలిగిన పసిబిడ్దలు.. నిరాధారమైన ఒక సామాన్యుడి వ్యధ మెదులుతుంది.

రాయంచ యంచు (జీరకు జోక యగు(గాక 
పచ్చియేనిక తోలుపచ్చడంబు 
హరిచందనాస్పదంబగు హృదయము మీ(ద(
బట్టు ( జేకొను(గాక భసితధూళి 
కమనీయ చరణలాక్షారాగలేఖచే 
ముద్రితంబగు(గాక రుద్రభూమి 
కలితముక్తాఫలగ్రైవేయకంబుతో (
దులదూ (గు(గాక పెంజిలువపేరు 

శ్రీనాధుడి హరవిలాస కావ్యంలో కపట బ్రహ్మచారి రూపం లో వచ్చిన శివుడు శివుడ్ని వివాహమాడదలచింది అని విని పార్వతిని సందర్భం..." బాగుంది బాగుంది నీ రాజహంసలు ముద్రించబడిన పట్టుచీరకు దీటుగా వారి పచ్చిధనమైనా పోని యేనుగు తోలు వస్త్రం,ఘుమఘుమల గంధాన్ని అలదుకునే నీ హృదయం మీద విభూది కూడా ముద్రించబడుతుందిలే ... చక్కగా లత్తుక (పారాణి )పూయబడిన నీ పాదపద్మాలు శ్మశానం లోనా తల్లీ అడుగుబెట్టేది ?నువ్వేమో ముత్యాల హారాన్ని ధరించావు.. వారి మెడలో పెద్దపాము బాగుంది".. ... అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాట్లున్నా "

"కస్తూరికా కుంకుమ చర్చితాయై ,
చితారజః పుంజ విచార్చితాయ "

ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై 
స్ఫురన్మహాపన్నగ భూశణాయ 
శివాన్వితాయైచ శివాన్వితాయ "
అని ఆది శంకరుల వారిచేత స్తుతించబడిన అర్ధనారీశ్వర తత్వమే మనకి సాక్షాత్కరిస్తోంది కదా !-- 

శ్రీ రావినూతల శ్రీనివాస్ 

సీ. వేదండ వదన శుండాదండ గండూష
కాండ సిక్తాప్సరో మండలములు
గంధర్వ కన్యకా కనక సౌగంధిక
మాలికా లగ్న షాణ్మాతురములు
నందీశ్వర క్షిప్త నారంగ ఫలపాక
తరళ విద్యాద్ధరీ స్తన భరములు
గరుడ లీలావతీ కస్తూరికా పంక
పిహిత నిశ్శేషాంగ భృంగిరిటులు

తే. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ
ధవళితాకాశ చర వనితా ముఖములు
శాంభవీ శంభు మధుకేళి సంభ్రమములు
పొదలి వాసించుఁ గాత నా హృదయ వీధి

పై పద్యం కవిసార్వభౌముడైన శ్రీనాధుని హరవిలాస కావ్యం లోనిది. కావ్య ప్రారంభంలో, ఇష్ట దేవతా ప్రార్థన చేసే సందర్భంలో శివపార్వతులను సంభావిస్తూ రాసిన పద్యం. ఏ కవి అయినా దైవప్రార్థన చేసేటప్పుడు ఒక నమస్కారం పెట్టి ఊరుకోడు. ఆ దేవుడి ప్రభావాన్నీ, లీలలనూ ఉత్ప్రేక్షలతోనో, రూపకాలతోనో చమత్కారంగా వర్ణించి – అలాంటి దేవుడు నా కృతిభర్తనూ నన్నూ కాపాడుగాక అని వేడుకోవడం పరిపాటి. అలాంటిదే ఈ పద్యమున్నూ. ఇందులో కేవలం శివపార్వతులనే గాక శైవలోకం లోని ఇతర ప్రధాన పెత్తందార్లనూ, వారి చేష్ఠావిన్యాసాలనూ వివరిస్తూ పద్యాన్ని నడిపించాడు కవి. మొత్తం మీద ఒక సందర్భాన్నీ, సంఘటననూ ఈ దేవదేవులూ, వారి పరివారమూ ఎలా నిర్వహించుకున్నారో, ఆ సంబరాన్ని తెలిపేది ఈ పద్యం.

సందర్భం మధుకేళి. అంటే వసంతోత్సవం. హోలీ పండగన్నమాట. రంగులు పులుముకోవడం, పిచికారీలతో రంగునీళ్ళు చిలకరించుకోవడం ఈ పండగలోని ప్రధాన కార్యక్రమం. ఇలాంటి సందర్భాల్లో చిన్నా పెద్దా తేడాల్లేకుండా, ఉల్లాసంగా అందరూ కలిసిపోవడం ఆనవాయితీ. అంతే కాదు, మర్యాద కోసం మనసులోనే దాచి వుంచుకొని బైటికి తెలుపుకోలేని కోరికలనూ, ఆశలనూ కొంచెం బయట పెట్టుకునే అవకాశం లభించేది ఇలాంటి సందర్భాల్లోనే. ఈ ఉల్లాసాన్నంతా ఈ పద్యంలో చూపించాడు శ్రీనాధుడు.

హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫురచ్చండికా
పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌,
సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులన్‌
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్‌! (భీమ 1-11)

(ఆహా! ఎంత అద్భుతమైన కల్పన! ఒక వంక హరచూడా హరిణాంకుడి వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం ఎలా కలిపాడండీ ఈ రెండిటినీ!)

వక్రత కాఠిన్యం సరసత అనేవి తన కవితా గుణాలుగా శ్రీనాథుడు పేర్కొన్నాడు.

ఉ. కంటికి నిద్రవచ్చునె సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటివాడు గల్గినన్

చదువుతుండగనే అర్థమైపోతూ ఏ వివరణ అక్కర్లేని పై పద్యం శ్రీనాధుడిది. కాశీఖండం అనే కావ్యం లోనిది.

కం. ఒక వర్ష శతంబున నొం
డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము
బొక దివసంబున నానం
ద కాననము నందు సర్వదా సిద్ధించున్! (121)

తా. కాశీ కంటే వెరొక తీర్ధమునందు ఒక నూరు సంవత్సరములకు లభించెడి ప్రయోజనము ఆనందదాయకమైన కాశీ యందు ఒక్క దినమునందే యెల్లప్పుడూ సిద్ధించును.

కం. నేమంబున నొక ప్రాణా
యామంబున నరుడు పడయునట్టి ఫలశ్రీ
సామాగ్రి యొండెడ ముని
గ్రామణి ! సాష్టాంగయోగ గతి గనరు నరుల్! (122)

నేమంబున = నియమముతో; ఒండెడన్ = వెరొక తీర్ధమునందు.

తా.కాశీ క్షేత్రములో ఒక్క ప్రాణా యామము వలన మనుష్యుడు పొందెడి సమగ్ర ఫలసమృద్ధిని అన్య క్షేత్రమునందు అష్టాంగసహిత యోగ మార్గమున కూడా పొందజాలరు.

సీ! చక్రవాళ పరీత సర్వం సహా
పరమ తీర్ధములలో బెరువ కాశి
కాశికా పట్టణ క్రోశ పంచక తీర్ధ
సమితి లో సారంబు జహ్ను కన్య
జహ్ను కన్యా తీర్ధ సముదాయమున యందు
గడు బెద్ద మణికర్ణికా హ్రదంబు
మణికర్ణికా తీర్ధ మజ్జన ఫలము కం
టెను విశ్వనాధు దర్శన మధికము.

తే!గీ! విశ్వపతి కంటె గైవల్య విభుని కంటె
గాలకంఠుని కంటె ముక్కంటి కంటె
దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల
సత్యమింకను సత్యంబు సంయ మీంద్ర! (123)

తా. లోకాలోక సర్వ భూమండలము నందలి పరమ తీర్ధములలో..కాశీ పెరువ. కాశికా నగర పంచ క్రోశ మధ్యమునందుగల తీర్ధ సముదాయములలో జహ్నవి సారభూతమైనది. జహ్నవీ తీర్ధ కదంబములలో మణికర్ణిక మిక్కిలి గొప్పది. మణికర్ణికా తీర్ధ స్నాన ఫలము కంటే, శ్రీ విశ్వనాధుని దర్శన ఫలము గొప్పది.కైవల్య నాధుడైన విశ్వనాధుని కంటే, కాల కంఠుని కంటే, ముక్కంటి కంటే అధికమైన తీర్ధములు,దైవములు భూర్భువస్సువర్లోకములు మూడింటి యందును లేవు. ఇది సత్యము. మరియూ సత్యము.

ఈ విధమైన కాశీ మహాత్మ్యములు "శ్రీనాధ మహాకవి" ప్రణీతంబైన "శ్రీ కాశీ ఖండం"లో సప్తమాశ్వాసమునందు చెప్పబడెను. ఈ పద్యములు విన్నా,చదివినా సకల ఐశ్వర్యములు సిద్ధించును.

శ్రీ చెరుకు రామమోహనరావు గారు 


కవి సార్వభౌముని చాటువు 

కొందరు భైరవాశ్వములు కొందరు పార్థుని తేరి టెక్కెముల్ 
కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు పార్థుని ఎక్కిరింతలున్ 
కొందరు కృష్ణ జన్మమున కూసినవారాలు ఈ సదస్సు లో 
అందరు నందరే మరియు నందరు నందరు నందరే గనన్ 

భావము : భైరవుని రథానికి పూన్చేది కుక్కలను, అర్జనుని రథ పతాకము పై గల గుర్తు 'కపి రాజు' ఆంజనేయుడు,సముద్రములో మునుగు భూమిని లేవనెత్తినది వరాహాహావతారములో విష్ణువు అంటే ఇక్కడ అన్వయములో మాత్రము పందులు, కృష్ణ జన్మ సమయమున కూసినవి గాడ్దెలు,(వసుదేవుడు-గాడ్దె కాళ్ళు), సభలో కూర్చున్నవారంతా ఈ జంతువులతో సమానమని నర్మగర్భంగా వంగ్య పూరితమైన ఈ పద్యాన్ని, ఒక రాజు,సభలో గల తన ఆస్థాన కవులను గూర్చి గొప్పగా చెప్పంటూ ఈ సమస్య ఇస్తే,శ్రీనాధులవవారు పై విధంగా తెలిపినారు .

శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు 

పరమకల్యాణి! యోభాగీరథీగంగ! వార్థిభామిని! పోయివత్తునమ్మ!
అమరేంద్రులార! లోలార్క కేశవులార! వనజసంభవ! పోయివత్తునయ్య!
శ్రీవిశాలాక్షి! దాక్షిణ్య పుణ్యకటాక్ష! వాసవార్చిత! పోయివత్తునమ్మ!
శ్రీపూర్ణభద్ర పారిషద నాయకులార! వటుకభైరవ! పోయివత్తునయ్య!

తీర్థ సంవాసులార! కృతార్థులార!
పాశుపతులార! భాగ్యసంపన్నులార!
మందిరోద్యాన వాటికా మఠములార!
పోయివచ్చెద మీకాశిపురము విడిచి||

కలహంసి! రారాదె కదలి నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
కదళికాకాంతార! కదలి రాననుగూఁడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
నాతోడఁ గూడి యంతర్గేహ! యేతెమ్ము, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

రండు ననుఁగూడి యోపరివ్రాట్టులార!
వత్సలత గల్గి మీరేల వత్తురయ్య!
పరమ నిర్భాగ్యుఁడైన నాపజ్జఁబట్టి
కటకటా! సౌఖ్యజలరాశిఁ గాశిఁబాసి.

ఆగస్త్యముని కాశీనగరాన్నివదలి వెళ్ళేసందర్భంలో శ్రీనాధుని "కాశీఖండము" నుండి.

నీకతంబునఁ గాదె లోకభీకరులైన, త్రిపుర దానవుల మర్ధింపఁ గలిగె
నీకతంబునఁ గాదె కాకోల విషవహ్ని, యలవోకయును బోలె నార్ప గలిగె
నీకతంబునఁ గాదె నిరవగ్రహస్ఫూర్తి, నంధకాదుల గర్వ మడఁపఁగలిగె
నీకతంబునఁ గాదె నేఁడు వారాణసీ, సంగమోత్సవ కేళి సలుపఁ గలిగె

నాత్మజుఁడవన్న మిత్త్రుండ వన్న భటుఁడ
వన్న సచివుండవన్న నాకెన్న నీవ
నిన్ను నెబ్భంగి వర్ణింప నేరవచ్చు?
కంఠపీఠాగ్ర కరైరాజ! డుంఠిరాజ!

శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి.

కమలలోచన మనుజుఁ డొక్కటిఁదలంప
దైవమొక్కటిఁ దలఁచు టెంతయు నిజంబు
కాశిఁ బెడఁ బాయనని యేను గదలకుండఁ
గాశిఁ బెడఁబాపె దైవంబు కరుణలేక

శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి

No comments:

Post a Comment