Wednesday, December 10, 2014

పేర్ల గిన్నెలు

పేర్ల గిన్నెలు 
----------------
భావరాజు పద్మిని - 10/12/14 


అప్పట్లో నేను 6వ తరగతి చదువుతున్నా. నాన్నగారి ఉద్యోగరీత్యా మేము గుంటూరు జిల్లా భట్టిప్రోలు కు బదిలీ అయ్యి వెళ్లి, అక్కడి టి.ఏం.రావు  పాఠశాల లో చేరాము. అక్కా, నేను ఆటల్లో, పాటల్లో, నాట్యంలో, చదువులో మేటి. మమ్మల్ని 'ఆలూరి సిస్టర్స్ ' అనేవారు. స్కూల్ మధ్యమధ్య రకరకాల పోటీలు పెట్టి, బహుమతులు ఇచ్చేది. అప్పుడు మాచేత ప్రార్ధనా గీతాలు, నాటకాలు, స్వాగత నృత్యాలు చేయించేవారు. తర్వాత బహుమతుల కార్యక్రమం మొదలవగానే... ఒకటి తరువాత ఒకటిగా ప్రైజులు చాలా వరకు నాకూ, అక్కకే వచ్చేవి.
వాటిలో కొన్ని పుస్తకాలు ఉండేవి. కాని, ఆ ప్రైజుల్లో చాలా వరకూ ఊర్లో ఉన్న వారు స్పాన్సర్ చేసేవారు. అవి ఏమిటంటే...

పెద్ద స్టీల్ గ్లాసు, మగ్గు, గుండు చెంబు, పళ్ళెం, గిన్నెలు వంటివి. అప్పట్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం లేదు. అన్నీ స్టీల్ వే ! ఊర్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు సైతం పేరంటాళ్ళు స్టీల్ వస్తువులే న్యూస్ పేపర్ లో చుట్టి ,ఇచ్చేవారు. అలా 6,7,8, తరగతులు పూర్తి అయ్యేసరికి, మా దగ్గర ఒక చిన్న స్టీల్ కొట్టు పెట్టుకునేన్ని సామాన్లు పోగయ్యాయి. అమ్మ కొన్ని వాడేది, కొన్ని నీ కాపురానికి అని అటకమీద దాచేది(వాటిలో చాలా తుప్పు పట్టేసాయి)... కొన్ని ఇచ్చేసేది...



ఇక్కడితో కధ అయిపోతే సరదా ఏముంది ? ఇదివరలో తమ గిన్నెలు ఇరుగూ పొరుగూ పుల్ల కూర రుచి కోసం మార్చుకున్నప్పుడు, మారిపోకుండా, వాటి మీద పేర్లు రాసుకునే అలవాటు.   తాము ఇచ్చిన గిన్నె బహుమతి అందుకున్న వారు వేరే వారికి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో, స్టీల్ కొట్లో వస్తువు కొనగానే...' చి.ల.సౌ. దమయంతి వివాహ సందర్భంగా లక్ష్మీకాంతమ్మ, కాసులయ్య అందించిన కానుక ' అని రాసేవారు. అయితే, అప్పటికప్పుడు కానుకలు సిద్ధంగా లేనివారు, ఆ స్టీలు గిన్నె షాప్ కు తీసుకెళ్ళి, ఆ పేర్లు కొట్టించి, ఇంకో పేర్లు రాయించేవాళ్ళు. ఎవరైనా చనిపోతే, వారి జ్ఞాపకార్ధం కూడా స్టీల్ గిన్నెలు ఇచ్చేవారు.
మొత్తానికి, స్కూల్ దాకా వచ్చేసరికి ఆ గిన్నెలకు పేర్లు గొప్ప, గిన్నె కురచ లాగా ఉండేవి. అంతగా చదువుకోని ఆ ఊరి జనానికి స్టీల్ కొట్టు వాడే గతి. కొన్ని సార్లు ఒత్తులు, పొల్లులు ఎగిరిపోయేవి. అది చదవబోతే ఇలా ఉండేది.
'కీ.శే. అనంతరామయ్య పుష్పవతి అయిన సందర్భంగా  అందిస్తున్న కానుక..."
" కృష్ణమూర్తి గారి శ్రీమంతం సందర్భంగా వారి జ్ఞాపకార్ధం అందిస్తున్న కానుక..."
"దాని అమ్మ (దానమ్మ ) జ్ఞాపకార్ధం వారి కుమారుడు వెంకటరత్నం , కోడలు వెంకాయమ్మ అందిస్తున్న బహుమతి..."

ఇలా తీసివేతలు, కొట్టివేతల తో ఉన్న గిన్నెలు ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే, నా పెదాలపై చిరునవ్వు పూసేస్తుంది. ఏమైనా కష్టించి గెల్చుకున్న బహుమతి, కల్మషం లేని బాల్యం ఇవన్నీ జీవితపు పుటల్లో మధుర జ్ఞాపకాలు... కదూ !

No comments:

Post a Comment