Monday, December 15, 2014

వెరైటీ తిళ్ళు

వెరైటీ తిళ్ళు 
-------------------
భావరాజు పద్మిని 

పొద్దుటే నిద్రకళ్ళు నులుముకుంటూ వంటింటి అధ్యాయానికి తెర తీస్తుండగా, కళ్ళ ముందు లీలగా కదిలింది...'భామా రుక్మిణి' సినిమాలో కమలహాసన్ లాంటి ఒక బామ్మ.

"ఏవిటే 'కుక్కు'తున్నావ్... అంది దబాయింపుగా..."

"బామ్మా, మనిషికి స్వప్న జాగృత్ సుషుప్తి అవస్థలు అని, 3 రకాల అవస్థలు ఉంటాయని నాకు తెలుసు. కాని, ఇవేవీ కాని 'స్కూలావస్థ ' లో మగ్గుతుంటే, ఇటులొచ్చి లేడీ నాగార్జున లాగా ప్రశ్నలు అడుగుట పాడియా ? చెప్పు ? "

" పాడి, కాదు పశువు కాదే అమ్మా ! పైలోకంలో కాసిన్ని మంచి పనులు చేసానా, యముడు మెచ్చి, అలా ఒక్కరోజు నీకు ఇష్టమైన చోట తిరిగి రా ! అని స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. గూగుల్ సెర్చ్ లో బాగా కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరా అని వెతికితే, 'కబుర్ల పోగు - భావరాజు పద్మిని' అని చెప్పింది. అందుకే ఇలా వచ్చా ! కాసేపు కబుర్లాడితే దీవించి వెళ్ళిపోతా అంతే ! "

" ఐతే ఓకే బామ్మా, టీ తాగుతావా..."

"వద్దు, ఆత్మలకి ఆకళ్ళు ఉండవు కాని, ఏవిటీ నలకల్లా కూరలు తరుగుతున్నావ్ ?"

"బామ్మా ! ఎన్నని చెప్పను నేటి అమ్మల కష్టాలు ? సొత్ , నార్త్ ఇండియా దాటి, చైనీస్, ఇటాలియన్, పొరుగింటి పుల్లకూరలు భారత్ కు వలస వచ్చేసాయ్. రకాలు పెరిగిన కొద్దీ, పిల్లల కోరికలు పెరిగాయి. ఇదిగో, రాత్రి ఇవాల్టి మెనూ లో 'హక్కా నూడుల్స్' కావాలని చెప్పి, పడుకున్నారు పిల్లలు. చైనా చింకి కళ్ళకి కనపడాలనేమో, కూరలు ఇలా నలకల్లా తరుక్కు చస్తారు. వాళ్ళని చూసి, మేమూ వాతలు పెట్టుకుంటున్నాం."

"ఎలాగెలాగ... హక్కు నూడలస్సా... అంటే ఏమిటి ? అసలు అచ్చ తెలుగు పిల్లవి, ఆ వంట ఎలా చేస్తావ్..."

"ఏముంది బామ్మా, మార్కెట్ లో పొడవాటి తాళ్ళ లాంటి ఈ ప్యాకెట్ దొరుకుతుందా, దీన్ని తెచ్చి, సగం ఉడకబెట్టి, సన్నగా తరిగిన ఈ కూరలు వేయించి, అందులో మాలాంటి అజ్ఞానుల కోసం చైనా వాడు కనిపెట్టిన 'చింగుల ఫార్ములా ' వెయ్యాలి ?"

"ఏవిటో నీ గోల, దీనికంటే, నరకంలో కేకలే బాగున్నాయ్... పాపాత్ములని కుండలో ఉడకబెట్టినట్టు, ఈ సగం ఉడకడం ఏవిటే అమ్మా, చిరుగుల ఫార్ము అంటే, కోళ్ళ ఫారం లాంటిదా ?"

"కాదు బామ్మా, అదొక పోట్లంలో పొడి. అది వేస్తే, ఆ రుచి వస్తుందన్నమాట . సగం ఉడికిన నూడుల్స్ అంటే, మళ్ళీ నూనెలో వేస్తే, అంటుకు పోకుండా, అలా ఉడకబెట్టాలి... ఒక్క ఐటెం వింటేనే  అలా కుదేలైపోతే ఎలా బామ్మా ? ఇంకా వేపుడు బియ్యం, వేడి కుక్క, పిజ్జా లు, బర్గర్ లు, పాస్తా లు, మంచురియా, మోమో లు, కేకు లు ... ఇలా నేటి అమ్మలు ఎన్ని చెయ్యాలో తెల్సా... "

"ఏవిటే ఇవన్నీ... కుక్కలూ, పిచ్చలూ నా ? ఈ తిళ్ళు అన్నీ వచ్చాకే రోగాలు ఎక్కువ అయ్యయేమో. ఎవడూ తేలిగ్గా చావడే . హాస్పిటల్లో మగ్గీ, మగ్గీ... వీళ్ళకి నరకంలో శిక్షలు అంటే కూడా ఎద్దేవా అయిపొయింది. మొన్నొకడు, నూనెలో వేగుతూ... హ హ కితకితలు... హైదరాబాద్ ఎండల కంటేనా ... అన్నాడు. ఇంకోడు కొండ మీద నుంచి దొర్లిస్తుంటే... హ హ... రోలరు కోష్టరు రైడ్ కంటేనా, అది తిరగేసి, మరగేస్తుంది అన్నాడు..."



"అవును బామ్మా, ఇప్పుడు మనుషులకి బోలెడు తిళ్ళు, బోలెడు కష్టాలు ! చిన్న వయసుల్లో షుగర్ లు, రోగాలు, హార్ట్ ఎటాక్ లు... బయటి తిళ్ళు... కాని, ఎన్ని తిన్నా నేను జన్మలో మర్చిపోలేని తిండి ఒకటుంది చెప్పనా ?"

"ప్రొసీడ్...."

"వెన్నెల్లో పీటేసుకుని, చుట్టూ మనవళ్ళని, కొడుకుల్ని, కోడళ్ళని, మనవరాళ్ళని కూర్చోపెట్టుకుని,  చద్దన్నంలో బెల్లపావకాయ కలిపి, ఓ గిన్నెడు నెయ్యి పోసి, దబ్బపండంత ముద్ద కలిపి, మా చేతిలో పెట్టేది మా బామ్మ. రెండు ముద్దలు తింటే, కడుపు నిండిపోయేది. ఆ రుచి, ఇప్పుడు ఎన్ని రకాలు తిన్నా రాదనుకో..."

"అవునే పిల్లా, నిజమే !"

"మరి బామ్మా, నీకు బోలెడు కబుర్లు చెప్పాగా, నాకు నరకంలో శిక్షలలో స్పెషల్ డిస్కౌంట్ ఇప్పిస్తావా ?"

"హమ్మా, ఎక్కడన్నా బామ్మ కాని, బాసు యముడి దగ్గర కాదేవ్... ఇంకాసేపు ఉంటే, వరాలు కూడా అడుగుతావేమో ! నేను డింగ్... నువ్వు చింగ్..."

" బామ్మా , దీవించడం మర్చిపోయావ్.... ఆగాగు..."

1 comment: