Sunday, March 1, 2015

తిరుమల దర్శనం

పవిత్రమైన తిరుమల కొండల దాకా వెళ్లి వద్దాం రండి...

పచ్చటి తివాసీలా ఉన్న ఒక కొండ గుండె గొంతుకలో కొట్లాడుతోంది...
అంతా నిశ్శబ్దం... ఆకు కూడా కదలట్లేదు. అప్పటి దాకా వగరు చిగురులు తిని, మధురంగా పాడిన కోకిల... ఎందుకో స్థబ్దుగా ఉండిపోయింది. సమస్త ప్రకృతి మౌనం వహించి, గుండె చేతబట్టుకుని ఎదురుచూస్తోంది... అవును మౌనం కూడా ఒక భాషేగా ! ముగ్ధమైన హృదయభాష !

పగలూ రేయి, భక్తుల విన్నపాలతో అలసిన స్వామి, కాస్తంత సేద తీరేందుకు ఆ కొండకు  విహారానికి వస్తున్నారట ! ఎంతటి శుభవార్త ! అనంతమైన తన రూపాన్ని, జీవకారుణ్యంతో ఆరడుగులకు కుదించుకుని, అరవింద లోచనాలతో ఆజానుబాహుడై, విచ్చేసిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు, అచటికి విచ్చెయ్యనున్నాడు. ఎంతో తపస్సు చేసిన యోగుల హృదయాల్లో గోచరించే ఆ దివ్యమంగళ రూపం, దుర్లభమైన ఆ మనోవాచామగోచరమైన దివ్యతేజస్సు దర్శనం, తమకు లభించబోతోంది. మానులైనా, మొక్కలైనా, మూగాజీవాలైనా, స్వామి మనసుతో పంపిన ఆ చల్లటి కబురు విని, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, ఇంద్రియాలు కైంకర్యం చేసి, వేచి ఉన్నాయి.

ఎక్కడో దూరంగా అడుగుల సవ్వడి. స్వామి వస్తున్నారన్న వార్తను మలయసమీరం అల్లనల్లన మోసుకు వచ్చి, అందించింది. స్వామి వచ్చే బాట వెంట ప్రకృతి పూల తివాసీ పరచింది. ఆయన మృదువైన పాద పల్లవం మోపిన చోటున,  పుడమి పులకించిపోతోంది. శిలలు స్వామికి స్వాగత తోరణాలు కట్టాయి. కృష్ణ జింకలు, లేళ్ళు, దుప్పులు చెంగుచెంగున గెంతుతూ తమ ఆనందాన్ని తెలియచేసాయి. పక్షులు రెక్కలు అల్లారుస్తూ, ఆయన నడిచే బాట వెంట సందడి చేస్తూ, ఎగురసాగాయి. నీలమేఘశ్యాముని చూసిన వన మయూరం, నీలిమబ్బును చూసినట్లు పరవశించి , పురివిప్పి ఆడసాగింది. గానం మరచిన కోకిల, గొంతు సవరించుకుని, తిరిగి మధురంగా పాడసాగింది.

చెట్లు తలలు లయబద్ధంగా ఊపుతూ, స్వామికి వీవెనలు వీచాయి. ఆకాశగంగ ఉరకలు వేస్తూ వచ్చి, ఆయన పాదాలు కడగాలని ఉవ్విళ్ళూరుతోంది. చిట్టిపొట్టి ఉడుతలు రామావతారం తర్వాత తిరిగి స్వామి స్పర్శకు నోచుకోవాలని, ఆయన చుట్టూ తిరగసాగాయి. కొండ అంచును తాకే మేఘాలు, చిరుజల్లులతో స్వామిని అభిషేకించ సాగాయి. అవి, రాలే పూల పరిమలాలతో కలిసి, పూలవానగా మారి, స్వామి తనువు తాకాలని తపిస్తున్నాయి.

పాములు, కొండ చిలువలు, చిరుతలు, ఏనుగులు వంటి క్రూర మృగాలు సైతం, తమ స్వభావాన్ని మరచి, జీవశక్తిని అంతా కళ్ళల్లో నింపి స్వామినే చూడసాగాయి. పగలూ రేయి కలిసే ఆ కెంజాయ రంగు తొలి సంధ్యలో, సూర్యచంద్రులు చెరో వైపూ చేరి, గగనాన విప్పారిన స్వామి నయనాల్లా వెలుగొందుతున్నారు. స్వామి తనను అధిరోహించాకుండానే వేం చేసారని, ఆయన ఆజ్ఞానువర్తి అయిన గరుడుడు విశాలమైన రెక్కలు చాచి, విహంగ వీక్షణం చేస్తూ,  ఆయన పిలుపుకై వేచిఉన్నారు.

కొండ దారి వెంట సాగుతున్న ఆ లీలామానుష వేషధారిని, ఆ సింహేంద్ర మధ్యముడిని చూసిన ఒక గోవు గోముగా ఆయన్ను ఇలా అడిగింది " స్వామి ! కృష్ణావతారంలో నీవు సమ్మోహనంగా వేణువు ఊదావు కదా ! ఏదీ ! మరొక్కమారు మాకోసం ఆ మురళీరవం వినిపించవూ !"
కరుణా సముద్రుడైన స్వామి , దాపునున్న ఒక వెదురు కర్రను  అందుకున్నారు. క్షణాల్లో అది తనను తాను శూన్యం చేసుకుని, వేణువు గా రూపాంతరం చెందింది... స్వామి మోవి స్పర్శకై సన్నద్ధమవుతూ, నిలువెల్లా ఆయన ఊపిరిని నింపుకొవాలన్న ఆత్రంతో , ఆర్తిగా పరితపిస్తూ !


చిగురుమోవిని  వెదురుకు ఆన్చి, జీవనాదాన్ని శ్వాసగా పంపారు స్వామి. ఓహో, ఎంతటి మధుర రవళి. చంచల హృదయాల్ని సైతం క్షణాల్లో నిలువరించే వీనుల విందైన అమృతపాతమది. నెమ్మదిగా, మంద్రంగా మొదలై... ఒక్కొక్క ప్రాణిని అల్లేస్తోంది. కొండలూ, లోయల్లో ప్రతిధ్వనిస్తోంది. జీవాత్మల్నిఆవరించేస్తోంది... వేణుగానం తారాస్థాయికి చేరుకుంది...

ఏవీ , ఇప్పుడా మొక్కలు, పక్షులు, జీవాలు అన్న వివక్ష ఏది ? అన్నీ స్వామే ! అంతా స్వామే ! తమనుతాము మరచిన జీవులు ఒక అద్భుతమైన ప్రశాంతతలో లయమయ్యాయి. జీవాత్మ పరమాత్మతో మమేకమయ్యే అలౌకిక స్థితి అది.

ఇంతలో ఎక్కడో అందెల సవ్వడి. స్వామి వేణుగానానికి అలమేలుమంగమ్మ కూడా కదిలి, కొండెక్కి వచ్చింది. తన దేవేరిని అక్కున జేర్చుకుని, నెమ్మదిగా నడవసాగారు స్వామి. మెరుపుకు మేఘం తోడైనట్లు ఆ చక్కని జంటను, కన్నుల పంటగా చూడసాగాయి జీవులన్నీ.
అందరినీ మైమరపింప చేసిన స్వామి, తన దేవేరితో కలిసి, నెమ్మదిగా అదృశ్యమయ్యారు. చిత్రంగా, ఆయన పాదముద్రలు మాత్రం అలాగే ఉన్నాయి... వేల గుండెల్లో.

తిరుమలకు వెళితేనే స్వామి దర్శనం కలుగుతుందా ? ఆర్తితో కన్నులు మూసుకుని, 'స్వామీ !' అని ప్రేమగా పిలిస్తే, ప్రతి మనసులోనూ, సాక్షాత్కరిస్తుంది, ఆ సహస్ర చంద్రసమభాసుని దివ్య దర్శనం. రండి, మనోవేగంతో తిరుమల కొండల్లో విహరిద్దాం ! ఆకులో ఆకుగా, చినుకులో చినుకుగా మారి... ఆ కొండగాలులతో కలిసి పాడదాం. 'గోవిందా ! గోవిందా !' అని నిత్యం మార్మ్రోగే ఆ ఆనందనిలయంలో, గోవింద నామంతో మమేకమవుదాం. కళ్ళముందు కానవచ్చే వైకుఠం తనివితీరా చూసి, జన్మలు ధన్యం చేసుకుందాం !

(దూరమో, భారమో తిరుమలకు వెళ్లి, 3-4 ఏళ్ళ పైనే అయ్యింది. మా కోసం చండీగర్ లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు, స్వామి ఎదుట ఉండగా, నాలో కలిగిన భావనలు - భావరాజు పద్మిని.)

No comments:

Post a Comment