Saturday, February 21, 2015

అండగా నిలబడండి

అండగా నిలబడండి 
- భావరాజు పద్మిని 21/2/15 

మా వారి ఉద్యోగరీత్యా, మేము బెంగుళూరుకు రెండు సార్లు వెళ్ళటం జరిగింది. మొదటి సారి ఉన్నప్పుడు, మహాలక్ష్మి లేఔట్ లో ఒక మూడంతస్తుల ఇంట్లో రెండవ అంతస్తులో ఉన్నాము. అప్పుడు క్రింది రెండు వాటాల్లో ఉన్నవారితో మాకు మంచి స్నేహం ఉండేది. అంతా, దాదాపు సమవయస్కులమే !ఏడాది తిరిగేసారికి, కాన్పూర్ బదిలీ అయ్యి, వెళ్ళిపోయాము. తర్వాత విజయవాడ లో ఉండగా, మళ్ళి బెంగుళూరు వెళ్ళవలసి వచ్చింది. అందరికంటే క్రింది వాటాలో ఉన్న స్నేహితురాలు, అప్పటినుంచి అక్కడే ఉంది. అంతేకాక, మునుపు మేమున్న పైవాటా నే మళ్ళీ ఖాళీ అవుతోందని తెలిసింది. ఆ కాలనీ లో ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు, అక్కడి కన్నడం వారంతా నా వద్దకు వచ్చి, ఆత్మీయంగా పలకరిస్తుంటే, మా వారు ఆశ్చర్యంగా చూసారు,నిన్నుఇంత మంది అభిమానిస్తారా, అనుకుంటూ !
మళ్ళీ రెండవసారి అదే ఇంట్లో దిగాము. క్రింది వాటాలో ఉన్న స్నేహితురాలు సుమన్ గత 5 ఏళ్ళుగా అక్కడే ఉంది. మేము వెళ్ళాకా, తను ఉద్యోగాలకై ప్రయత్నిస్తుంటే, అక్కడి 'ప్లానెట్ కిడ్స్' అనే స్కూల్ లో తనకు ఉద్యోగం వచ్చింది. అప్పటిదాకా సాధారణ గృహిణిగా ఉంటూ, వెన్నెల్లా నవ్వే ఆమెలో మార్పు వచ్చింది. వాతావరణం మారేసరికి అందరిలాగే... ఆమెకు డబ్బుజబ్బు చేసింది. ఎక్కువ మాట్లాడేది కాదు, కాస్త టెక్కు చూపేది. నేనూ, అర్ధం చేసుకుని, కాస్త దూరంగానే ఉండేదాన్ని. అయితే, మొదటి అంతస్తులో ఉన్న 'ముక్త' అనే స్నేహితురాలు ఒకసారి ఆసుపత్రిపాలైతే, నేను వారి కుటుంబానికి, పిల్లలకు కాస్త సాయం చేసాను. అందుకే ఆమెకు నేనంటే మనసు నిండా ప్రేమ. అక్కడి నుంచి వెళ్ళిపోయినా, ఎక్కడున్నా, ఆమె నాతో మాట్లాడుతూనే ఉండేది. సుమన్ మాత్రం నా నెంబర్ ఆమెకు తెలిపినా, దూరంగానే ఉండేది.
కొన్నేళ్ళకి మేము హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడి నుంచి చండీగర్ వచ్చాకా, నా నెంబర్ మారి వారితో సంబంధాలు తెగిపోయాయి. అయినా, వాట్స్ ఆప్ లో ముక్త నెంబర్ కనిపిస్తే, పలకరించాను. ఆమె చాలా సంతోషించిది. నాతో మాట్లాడాలని ఉందని, మనసారా ప్రార్ధించానని, దైవమే మరలా మార్గం చూపారని, మురిసిపోయింది. తనే నా నెంబర్ సుమన్ కు ఇచ్చింది. అయినా, సుమన్ పెద్దగా మాట్లాడేది కాదు. ఒక సారి హై అంది, అంతే. తర్వాత మధ్య మధ్య మాత్రం ఇటువంటి మెసేజ్ లు వచ్చేవి.
'సాయి బాబా దీవెనలు. ఇది సాయి బాబా ఒరిజినల్ ఫోటో. ఇది 50 మందికి షేర్ చెయ్యకపోతే, మీకు చెడు జరుగుతుంది. లేకపోతే మంచి జరుగుతుంది...' నన్నే ఎంచుకుని మరీ పంపాలా ? భేతాళుడు 'రాజా ! నీ తల వెయ్యి ముక్కలౌతుంది' అనే డైలాగు గుర్తు తెచ్చుకుని, నవ్వి ఊరుకునేదాన్ని.


రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 3 రోజుల క్రితం తన నుంచి మెసేజ్ వచ్చింది. 'పద్మిని, ఎలా ఉన్నావ్, పిల్లలు ఎలా ఉన్నారు...' అని. నేను ఆశ్చర్యంగా బాగున్నారు, అనగానే... 'నాకు ఆరోగ్యం బాలేదు, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, హాస్పిటల్ లో ఉన్నాను. నా కోసం ప్రార్దిస్తావా ?' అంది. తప్పకుండా, అంటూ తనతో మాట్లాడుతూ ధైర్యం చెప్పాను. నిన్న కూడా మాట్లాడుతూ... 'ఏవిటో ఇప్పుడు మనుషులకు ఒకరికోసం ఒకరికి టైం లేదు, ముక్త ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది, అంతా బిజీ, అంది. వెంటనే నేను తనతో ఇలా అన్నాను...
'సుమన్ ... నీకో సంగతి చెప్పనా, నేను ఇప్పుడు రచనా రంగంలో స్థిరపడ్డాను. నాకంటూ కాస్త చోటు సంపాదించుకున్నాను. ఒక పత్రిక పెట్టాను. 3 రోజుల్లో వార్షిక సంచిక విడుదల. రోజుకి కేవలం 6 గంటలు నిద్రపోతూ పనిచేస్తున్నాను. అయినా, నీకు ఇదంతా చెప్పకుండా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా ?
మా గురుజి దయ వలన నాకు మనుషుల్ని మేధతో, కళ్ళతో చూసి అంచనా వెయ్యకుండా, మనసుతో చూసే గుణం అలవడింది. తను చిన్న సమస్యే అని చెప్పినా... తను ఆగాగి మాట్లాడుతుంటే, తన కంట్లోని కన్నీరు నా మనసుకు గోచరిస్తోంది.నువ్వు చాలా అవసరంలో ఉన్నావు. నీకు ఎమోషనల్ సపోర్ట్ కావాలి. కేవలం డబ్బు, వస్తువులు ఇవ్వటమే దానం కాదు... అవసరమైనప్పుడు కాస్తంత ఆత్మీయత, వాళ్లకు నీ సమయం, నీ ప్రేమ, నీ ఓదార్పు, ఇవన్నీ ఇవ్వటం కూడా దానమే అని చెప్పారు మా గురూజి. ఆయన మాటలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాను. ఒకవేళ నాకు దైవం ఇటువంటి అవకాశం ఇస్తే, ఖచ్చితంగా వదులుకోను. అండగా నిలబడతాను, ప్రార్ధిస్తాను, మీరు కోలుకుని బాగుంటే, నన్ను మర్చిపోయినా, ఆనందంగా చూస్తుంటాను.
ముక్త , ఇంకా ఇతరులు ఎలా ఉన్నా, మనుషుల తప్పొప్పులు ఎంచకుండా బేషరతుగా మనం ప్రేమించాలి. వారు ఆనందంగా ఉన్నప్పుడు పార్టీ లకు వెళ్లి డాన్సులు చెయ్యకపోయినా సరే, దుఃఖం లో, అవసరంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ చెయ్యి గట్టిగా ఒడిసి పట్టుకోవాలి. నీది ఎంతో మంచి మనసు, అపురూపమైన వ్యక్తిత్వం, నిన్ను అందరూ ప్రేమిస్తారు. ధైర్యం కోల్పోవద్దు. నీ సమస్య పెద్దదే కావచ్చు ! కాని, దైవానుగ్రహం అపారమైనది. ఇది గుర్తుంచుకో. ప్రేమను పంచుతూ మసలుకో !'
'నిన్ను చూస్తే, నాకు గర్వంగా ఉంది పద్మినీ !'
' ఇందులో నా గొప్ప ఏమీ లేదు. గర్వపడాల్సింది అంతకంటే లేదు... అంతా గురుఅనుగ్రహం అంతే ! మనిషిలో అంతర్గత మార్పు కేవలం సద్గురువే తీసుకురాగలరు. నీ అభినందనలు ఆయన పాదాలకు సమర్పిస్తున్నాను. సుఖంగా ఉండు.'
ఈ కధ మీకు చెప్పడంలోని అంతరార్ధం మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఎవరైనా, ఇబ్బందుల్లో, వేదనలో ఉన్నప్పుడు, వాళ్ళు గతంలో చేసిన పనులనే నెమరు వెయ్యకుండా, అన్నీ మరచి, వారికి అండగా నిలబడండి. వారికై ప్రార్ధించండి. ప్రేమగా ధైర్యం చెప్పండి. దైవం మీపట్ల చాలా కృప చూపుతారు. ఇది ముమ్మాటికీ నిజం !

No comments:

Post a Comment