Friday, March 6, 2015

హోలీ రంగులు సహజ" సిద్ధం" గా

హోలీ రంగులు సహజ" సిద్ధం" గా... హెల్దీ హోలీ - హేపీ హోలీ
                                                                               తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
పసుపు
ఇది చాలామందికి తెలిసిన చిట్కా. పసుపుపొడిని నీళ్లలో కలిపితే చాలు. అవి చిక్కగా, పెద్దమొత్తంలో కావాలంటే ఆ నీళ్లలో శనగపిండి కలుపుకోవాలి. ఆ ద్రావణంతో స్నానం ఎంతో ఆరోగ్యకరం. పసుపు యాంటిబయాటిక్గా పనిచేస్తుంది. శనగపిండి మనశరీరంపై పట్టి మట్టిని శుభ్రం చేస్తుంది. సాధారణంగా నలుగుపెట్టుకోవడానికి ఈ పిండినే వాడతారన్నది అందరికీ తెలిసిందే. దీనికి కాస్త రోజ్వాటర్, కస్తూరి దట్టిస్తే ఇక ఆ సువాసన మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ శనగపిండి ఇష్టం లేదనుకోండి...మైదా, గోధుమ, వేరుశనగ పొడినీ వాడుకోవచ్చు. లేదంటే పసుపుచామంతి, పసుపు బంతిపూలు, తంగేడు పూల పొడిని నీళ్లలో కలుపుకోవచ్చు. ఈ పూలపొడిని లేదా పూలను నీళ్లలోవేసి మరగబెడితే రంగు స్పష్టంగా కన్పిస్తుంది.
ఎరుపు
ఎర్రచందనం పొడిని, ఎర్ర మందార పువ్వుల పొడిని ఎర రంగుకోసం వాడుకోవచ్చు. ఈ పొడికి మన ఇళ్లలో ఉండే ఏ పండిని కలిపినా పెద్దమొత్తంలో రంగును సిద్ధం చేసుకోవచ్చు. సింధూరపళ్లతోనూ ఎరుపురంగు ద్రావణం తయారుచేసుకోవచ్చు. ఎర్ర దానిమ్మ గింజలు, లేదా తొక్కలను నీళ్లలో మరగనిస్తే ఎర్రటిరంగునీళ్లు సిద్ధం అవుతాయి. రాత్రంతా ఎర్రమందార పూలను నీళ్లలో నానబెట్టి ఆ తరువాత వేడిచేస్తే చక్కటి ఆరోగ్యకరమైన ఎర్రటినీళ్లు సిద్ధమవుతాయి.
కాషాయరంగు
మోదుగ పూలతోకూడా కాషాయ రంగు నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు మోదుగపూలతో తయారుచేసిన రంగునీళ్లతోనే హోలీ ఆడాడని పురాణాలు చెబుతున్నాయి.. ఎండబెట్టిన మోదుగ పూలను, వాటి బెరడునుకూడా రంగుల తయారీకి వాడుకోవచ్చు.
నీలిరంగు
నీలి మందార పూలు, నీలిరంగులో మెరిసిపోయే జకరందా పూలతో పొడిని తయారు చేసుకోవచ్చు.
మెజంటా
బీట్రూట్ ముక్కలను రాత్రంతా నీళ్లలో నాననివ్వండి, పొద్దునే్న వాటిని మరిగించండి. చక్కటి మెజంటా రంగులో నీళ్లు సిద్ధం. ఇక ఎర్ర ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో రాత్రంతా నాననివ్వండి. పొద్దునే్న ఆ ముక్కల్ని తీసిపారేయండి. నీళ్లుమాత్రం ఎర్రగా మెరుస్తూంటాయి.
నలుపు
రాసి ఉసిరికాయలు, మామూలు ఉసిరికాయలని ఇనుపగినె్నలో మరిగిస్తే నల్లని నీళ్లు సిద్ధమవుతాయి. చల్లారాక వాటిని రాత్రంతా నిల్వ ఉంచితే పొద్దున్నకల్లా మరింత నల్లగా తయారవుతాయి. వాటివల్ల ఆరోగ్యంకూడా బాగుంటుంది. ఇక నల్లని ద్రాక్షపళ్ల గుజ్జును నీళ్లలో కలిపితే నల్లనిరంగు నీళ్లు తయారవుతాయి. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి. ఇక మందార ఆకుల పొడి, రంగురంగుల క్యాబేజీలు, క్యారెట్లు, బీర ఆకుల పొడి, గుమ్మడి గుజ్జుతోకూడా రంగరంగుల నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. గోధుమరంగు
కిళ్లీలో ఎర్రటి రంగుకోసం వాడే కాసు - ఆ బెరడును నీళ్లలో మరగనివ్వాలి. దానికి కాస్త కాఫీ ఆకులు కలిపితే మంచివాసన, మంచి రంగు పడతాయి.
ఆకుపచ్చ
పొడిరంగు కావాలనుకుంటే గోరింటాకుల పొడిని, కాస్త మైదా, లేదా వరి పిండిలో కలుపుకుంటే చాలు. దీనికి ఎట్టిపరిస్థితిలోనూ నిమ్మరసం కలపొద్దు సుమా. అది కలిస్తే వచ్చే ఎరుపురంగు వచ్చేసి ఓ పట్టాన వదలదు. గుల్మొహర్ పూలనుకూడా ఎండబెట్టి పొడిచేసి ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు. గోధుమగడ్డిని ముద్దచేసి నీళ్లలో కలిపితే అదికూడా ఆకుపచ్చరంగులోనే ఉంటుంది. పుదీనా ఆకులనూ ముద్దగా నూరి నీళ్లలో కలిపితే ఆకుపచ్చరంగునీళ్లు సిద్ధం. పైగా ఇవి మంచి వాసననూ కలిగి ఉంటాయి. టమాటా, కొత్తిమీర ఆకులనూ ఇలా ముద్దగా చేసి నీళ్లలో కలపొచ్చు. గోరింటాకు పొడిని నీళ్లలో కలిపితే అవీ ఆకుపచ్చగా కన్పిస్తాయి.
ఓపిక లేని వాళ్లు ఈ ప్రకృతి ప్రసాదించిన పళ్లు, పూలు, కూరగాయలు, ఆకులతో తయారైన పొడిని అమ్మే ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి సరసమైన ధరలకు కొనుగోలు చేసుకోవచ్చు.

No comments:

Post a Comment