Wednesday, April 29, 2015

వృక్షో రక్షతి రక్షితః...

'అరె ఈ మొక్క, ఇంకా ఎలా బ్రతికుంది ?' నాకు ఆశ్చర్యం, అంతకు మించిన ఆనందం. ఒకసారి దాని వద్దకు వెళ్లి ఆకుల్ని స్ప్రుశించాను. నాకు తెలుసు, మొక్కలు కూడా ప్రేమకు స్పందిస్తాయి. వినే మనసుంటే మాట్లాడతాయి, మనం పట్టించుకోవట్లేదని, అలుగుతాయి. మౌనంగా మాట్లాడే పక్షులు, వృక్షాలు ఈ సృష్టిలోని అతి గొప్ప నేస్తాలు నాకు.
మేము చండీగర్ వచ్చిన 6 నెలలకి గత డిసెంబర్ లో హైదరాబాద్ వెళ్ళాము. నాకు, మా అత్తగారికి మొక్కలంటే చాలా ఇష్టం. ఒక చిన్న పువ్వు పూసినా, చిట్టి గువ్వ కూసినా, ఇప్పటికీ ఆవిడ ఆనందంగా నన్ను పిలిచి చూపిస్తారు. హైదరాబాద్ లో మేము పెంచిన మొక్కలన్నీ ట్రాన్స్పోర్ట్ లో వేసేటప్పుడు, లారీ కాబిన్ లో జాగ్రత్తగా పెట్టించి, నీళ్ళు పోస్తూ, జాగ్రత్తగా తెమ్మని చెప్పాము. అయినా వాడు చేసిన ఆలస్యం వల్ల, అన్నీ చచ్చిపోయాయి. కాని వెళ్ళేటప్పుడు హైదరాబద్ లో, మా ఇంటి గుమ్మం వద్ద ఉండే ఆ క్రోటన్ మొక్కను మాత్రం అక్కడే వదిలేసాము.
6 నెలల తర్వాత కూడా ఈ మొక్క ఎలా బ్రతికుంది... అని దానికేసి చూస్తుండగా, మాకు నాలుగు ఫ్లాట్స్ అవతల ఉండే ఒక అరవావిడ వచ్చారు. 'మీ మొక్కకి నేనే నీళ్ళు పోసాను. మీ మొక్కకే కాదు, ఈ ఫ్లోర్ లో ఏ మొక్క ఎండిపోతున్నట్టు అనిపించినా, నీళ్ళు పోస్తాను, అది నా అలవాటు,' అన్నారు. ఆనందంతో ఆవిడకి కృతఙ్ఞతలు తెలిపాను.
యెంత గొప్ప అలవాటు ? ఇలా నేనూ చెయ్యగలనా ? నేనే కాదు, అంతా ఇలాగే చేస్తే యెంత బాగుంటుంది ? అనిపించింది. మంచిపని చేసేందుకు, చెడ్డ సమయం అంటూ ఏదీ ఉండదు కదా ! అందుకే, ప్రతి ఇంటివారు ఒక మొక్కని అయినా తప్పనిసరిగా పెంచాలి. చుట్టుప్రక్కల వారితో సంబంధాలు ఎలా ఉన్నా, మనం చేసే సేవ వృక్షాలకే కాబట్టి, తప్పనిసరిగా ఎండుతున్న మొక్కలకు నీళ్ళు పొయ్యాలి. ఇలా చేస్తామని, మనకి మనమే ప్రమాణం చేసుకుందామా...


1 comment:

  1. మిత్రులారా... మీ ప్రక్క పోర్షన్ వాళ్రు గాని పక్కింటి వాళ్లుగాని శెలవులకు ఊరెళ్లితే కనీసం వారింటి ముందుండే తులసి మెక్కకైనా నీళ్లు పోసి పుణ్యం కట్టుకోండి

    ReplyDelete