Friday, January 8, 2016

కాగులో నీళ్ళు

ఇక్కడ గత ఏడాది ఉన్నంత చలి లేదు. అయినా, ఉదయం పాపను స్కూల్ కి దింపేందుకు వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ వేసుకున్న చలిమంట వద్ద కూర్చున్నాము. మమ్మల్ని చూసి, అతను మర్యాదతో కూడిన మొహమాటంతో పక్కకి తప్పుకున్నాడు. ఇక నా ఆగడాలు మొదలు. పక్కనున్న ఎండుటాకులు, కట్టె పుల్లలు, మంటలో వేస్తూ ఆడుకుంటుంటే, మా అమ్మాయి,"ఏంటమ్మా ? చెయ్యి కాలుతుంది కదా ?" అంది. వెంటనే నేను ఓ 32 ఏళ్ళు వెనక్కి దూకి, నీ వయసులో నేనూ... అంటూ మొదలుపెట్టాను.

"మా చిన్నప్పుడు గీజర్లు లేవే. ఇలాగే మంట మీద నీళ్ళు కాచుకుని, పోసుకునేవాళ్ళం. అసలు స్టవ్ కూడా లేదు తెల్సా, వంట కూడా ఇలాగే చేసేవారు." అని చెబుతుండగా, దాని స్కూల్ బస్సు వచ్చి, అది వెళ్ళిపోయింది. నేను మాత్రం అలాగే జ్ఞాపకాల్లో ఉండిపోయాను.

ఏడాది అంతా చెట్లూ, చేమల నుంచి రాలిన పుల్లలు, కొట్టేసిన కొబ్బరి మట్టలు, ఎండుటాకులు, ఒలిచిన కొబ్బరి చితుకులు, కొబ్బరి చిప్పలు, పిడకలు, అన్నీ ఒక చోట పోగేసి, పెట్టేవాళ్ళు. ఇక అమ్మమ్మలు, బామ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఒకటే సూత్రం చెప్పేవారు. 'కాచుకున్న వాళ్ళవే వేన్నీళ్ళు.'

ఒక కాగు నిండా నీళ్ళు పోసి, ఒక విసనకర్ర ఇచ్చి, పక్కన దహన సామాగ్రి పెట్టి, మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టేవారు. ఒక పావుగంటలో నీళ్ళు కాచాలి అన్నమాట. కాని, మా మర్కట మంద ఊరికే ఉంటుందా ? కాగితాలు, ఆకులు, జడపిన్నులు, గుడ్డ ముక్కలు, అన్నీ తెచ్చి, అందులో వేస్తూ, నానా హడావిడి చేసేసరికి మంట ఆరిపోయేది. మళ్ళీ పెద్దవాళ్ళని తెచ్చి, వెలిగించి, కూర్చున్నాకా, ఇంకాసేపటికి, కాగులో నీళ్ళు పొయ్యిలో ఒలికిపోయి మళ్ళీ పొయ్యి ఆరిపోయేది. అప్పుడు యుద్ధ ప్రాతిపదికన చుట్టూ ఉన్న 5-6 మంది పిల్లలు, శరవేగంతో పోటీలు పడుతూ విసనకర్రలు ఝులిపించగానే, మళ్ళీ వెలగబోతున్న మంట కాస్త, ఆరి కూర్చునేది.  ఇలా ఒక గంట పాటు ట్రయిల్ అండ్ ఎర్రర్ పధ్ధతి కొనసాగాకా, కాస్త గోరువెచ్చగా నీళ్ళు కాగేవి అన్నమాట.

ఆ తర్వాత, బాయిలర్లు వచ్చాయి. ఆ గొట్టం మధ్యలో, దాని ముక్కుకి ఊపిరాడకుండా, చితుకులు కూరేస్తే, మండలేక ఆరిపోయేది. అప్పుడు కింద ఉన్న జల్లెడ లాంటి ప్లేట్ లాగి, చితుకులు బయటికి లాగి, మాకో మొట్టికాయ బహుమతిగా ఇచ్చి, వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇదంతా ఒక సందడి, ఒక సరదా. మగ్ తో వయ్యారంగా స్నానం చేసామా ? ఏకంగా గంగాళంలోకి దిగిపోయేవాళ్ళం. మా ఇళ్ళల్లో పిల్లల కోసం నేల మీద కాకుండా, గోడల మీద, చెట్ల మీద వెతుక్కునేవారు. మేము చాలా మంచి పిల్లలం అని మీరు నమ్మి తీరాలి మరి.


ఈ తరానికి ఇన్ని జ్ఞాపకాలేవి, ఇంత సమయం ఏది ? లేస్తే, ప్రతి పనికి ఒక స్విచ్, బటన్, అందుబాటులో ఉంటుంది కదా. ఎంతైనా, ఈ గాడ్జెట్ యుగం కంటే, ఏమీ లేనప్పుడు - ప్రకృతితో, మనుషులతో ఒక అనుబంధం కలిగిఉన్నప్పుడు గడిపిన  నా బాల్యం, నా జ్ఞాపకాలే గొప్పగా అనిపిస్తాయి. మీకూ ఇటువంటి అనుభూతులు ఉన్నాయా మరి ?


No comments:

Post a Comment