Monday, September 29, 2014

వైజాగ్ విశేషాలు

వైజాగ్ విశేషాలు 
- రచన : భావరాజు పద్మిని 

మీరు అలా వైజాగ్ వెళ్లి వచ్చారు కదా, ఆ విశేషాలు కొన్ని చెప్పరూ... అని అడిగారు అవధానుల రామారావు గారు. సరే, ఆ చెప్పేది కాస్త సృజనతో కలిపి సరదాగా చెప్తాను. ఒక పల్లెటూరి అతనికి ఉన్నట్టుండి డబ్బు చేసింది. ఈ డబ్బు చెయ్యడం అనేది చాలా భయంకర వ్యాధి. తనకు యెంత డబ్బు చేసిందో, తను యెంత గొప్ప వాడిని అయ్యానో, అవతలి వాళ్లకి చూపించుకుంటే తప్ప వీళ్ళకి తృప్తి ఉండదు. ఆ ముచ్చట తీర్చుకోవాలని అతను తన చిన్ననాటి స్నేహితులను, విహార యాత్ర పేరుతొ పెద్ద 5 స్టార్ హోటల్ కు తీసుకెళ్ళాడు. అలా అతని వెంట మొట్టమొదటి సారిగా పెద్ద హోటల్ కు వెళ్ళిన ఒక మిత్రుడు తన భార్యకు ఇలా లేఖ వ్రాస్తున్నాడు..

లచ్చుమి,

నేను బాగుండాను, నువ్వు బాగుండావా. మనింట్లో ఫోన్ లేదు గందా .రూపాయి డబ్బా కాడ నువ్వు అంత సేపు నిల్చోలేవని ఈ చీటీ రాస్తాఉండాను. నారిగాడు ఇప్పుడు మారిపోయాడే! 'నార్...' అని పిలుస్తా ఉండారు. ఈ నారలు, పీచులు డబ్బుతో వస్తాయేమో! అంతా మాయగా ఉండాదే!

గొప్పోళ్ళు , ఉండోల్లు అంటారు గానోసే, నాకైతే, యెంత చెట్టుకు అంత గాలని అనిపిస్తా ఉంది. ఇక్కడ నాకో పెట్టె గది ఇచ్చారు... మనూళ్ళో మిరపకాయలు ఉంచే పెద్ద చల్ల పెట్టె గది (కోల్డ్ స్టోరేజ్ ) గుర్తుకోచ్చినాది. డబ్బాలో వేసి మూత పెట్టినట్టు ఉంది. ఒక ఫ్యాన్ కూడా లేదు. బయట గాలి పీల్చుకునే వీలు లేదు. తానానికి బక్కెట్టు కూడా లేదు, ఏదో చిల్లుల పళ్ళెం లా ఉంది గందా, అదే తిప్పుకుని పోసుకోవాల. పాపం తానాలగాదికి గొళ్ళెం కూడా ఎట్టించలేదు. ఇంత పెద్ద వొటేలు కట్టేది మాటలా... ఇలా ఖర్సు తగ్గించుకు ఉంటారు. 

లచ్చీ, సదూకున్నోడి కంటే చాకలోడు మేలని అంటారు... అదెలాగో నా మట్టి బుర్రకి అప్పుడు ఎక్కలేదే! ఇప్పుడే తెల్సినాది. ఇక్కడ గుడ్డలు ఆరేసుకునే వీలు లేదు కందా! వాల్లకేసేస్తే ఉతికి తెస్తారంట ! డ్రాయరు ఉతికితే డెబ్భై, బనీను ఉతికితే వంద.... చూడగానే నాకు ఆ డబ్బెట్టి కొత్తవే కొనుక్కోవచ్చు కదా, అనిపించినాది. ఇక ఇలాగే చొక్కా, పంట్లాము... బట్టలుతికి చాకలోడు ఇంత సంపాయిస్తా ఉంటే, మరి చాకలోడే మేలు గందే! 

మన నారిగాడు ఊరంతా తిప్పినాడు. వొటేలు గది కిటికీ లోంచి సముద్రం కనిపిస్తా ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, సుడిగుండాలు ఉన్నా,యెంత గంభీరంగా ఉంటాది సముద్రం. మడిసి మనసు కలత పడితే, కళ్ళు మూసుకుని, ఆ సముద్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, గొప్ప ధైర్యం వస్తాదని అనిపించినాది. ఇక యేవో 'బొర్రా గుహలంట ' ఎల్లినాము. ఒక పెద్ద పందికొక్కు నేలలో కన్నం తవ్వేస్తే ఎలాగుంటాది ? అలాగున్నాయి ఇవి. పైనుంచి పడే నీళ్ళచుక్కలు, రాళ్ళ లో ఎన్ని రంగులో, ఆకారాలో పుట్టించాయి. గోస్తనీ నది పారడం వల్ల కొన్ని లచ్చల సంవత్సరాలుగా రాళ్ళు కరిగి ఇలా వచ్చినాయంట. ఆవు ఒకటి అడవిలో తిరుగుతూ, ఈ కంతలో పడి అరుస్తుంటే, ఇవి కనిపేట్టినారంట. భలే బాగుండాయే. దేవుడి కంటే గొప్ప కళాకారుడు ఎవరున్నారు చెప్పు. ఈ పాలి నిన్నూ తీసుకెళ్తా !

ఇక ఇక్కడ వొటేలు, తిండి ఈ గొలేంటో పెద్ద గందరగోళం అనుకో! కరువెక్కి పోయినట్టు ఇరవై ముప్ఫై రకాలు ఉంటాయి. పస లేని కూడు. ఉప్పూ కారాలు మితం. నిముసానికి ఓ పాలి ఒక మడిసి వచ్చి, 'తిండి నచ్చిందా?' అనడుగుతాడు. 'ఏం చెప్పేది ? తిండంటే ఎలాగుండాల? నోట్లో పెట్టుకోగానే ఆ రుచి నరాల్లో పాకి, హబ్బా, అదిరిపోయింది అని నోరు దానంతట అదే అనాల. అంతేగాని ఈ అడుక్కోడాలు ఏందో ! ఇక్కడికొచ్చిన తెల్లోళ్ళని చుస్తే నవ్వొస్తాది. అన్ని రకాలు ఉన్నా, రొట్టె ముక్కలే పీక్కు తింటారు.అంత తిన్నాకా అరగాలి గందా ! అందుకే వ్యాయామం చెయ్యడానికి ఇందులోనే 'జిం ' ఉండాది. మరి రాత్రైతే అంతా తాగుడే, వాగుడే ! ఆ తాగినోళ్ళ కోసం గొంతు చించుకు పాడతా ఉండారు. వాళ్ళ బుర్రకి ఏమి ఎక్కుతాది? డబ్బుంటే, ఎన్ని పన్లేని పన్లు చెయ్యాలో చూసినావా ? తినాల, అరగాల... తిరగాల, చెడ్డ అలవాట్లు మరగాల... తర్వాత ఆసుపత్రుల్లో పడి మగ్గాల. అంతా వింత లోకం !

మన ఇల్లు, పగలు పొలం పని చేసి వచ్చి అలసి మడత మంచం వాలిస్తే, చల్లగా సేద తీర్చే పైరగాలి , ప్రేమగా నువ్వు అందించే బువ్వ... పుడమి తల్లితో, పంచభూతాలతో బంధం. నాకదే బాగుందే ! ప్రకృతికి దూరమైన కొద్దీ మనిషి పశువుకు దగ్గర అవుతున్నాడని అనిపిస్తా ఉంది. నాకిక్కడ అసలు నచ్చలేదు. అంతా ఏదో తెలియని కృత్రిమత. ఇక తొందర్లోనే బయల్దేరి వెనక్కి వస్తాను... నాకోసం సూస్తా ఉండు.

శీనయ్య.



No comments:

Post a Comment