Thursday, February 12, 2015

జ్వాలాదేవి -నవదుర్గల ఆలయాలు -2

జ్వాలాదేవి -నవదుర్గల ఆలయాలు -
---------------------------------------------
భావరాజు పద్మిని 

మర్నాడు ఉదయం మా అత్తగారు, పిల్లలు, మేము బయల్దేరి అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా... అక్కడ దారిలో ఎర్రటి ముద్దమందారాలు అమ్ముతున్నారు. అన్ని మందారపూలు ఒక్క చోట దొరకవు. నాలాగా 108 పూల పూజ నోము పట్టిన వాళ్లకి మందారపూల సేకరణ చాలా కష్టం. వెంటనే నాకొక ఐడియా వచ్చింది. 110 ముద్దమందారాలు కొని, జ్వాలాదేవి గుడి బయట ఉన్న మహాలక్ష్మి ఉపాలయంలో పూజ చేసుకోవాలని. అనుకున్నాను. అదృష్టవశాత్తూ... హ్యాండ్ బాగ్ లో లలితా సహస్రం పుస్తకం వెనుక... లక్ష్మి అష్టోత్తరం ఉంది. కాని ఎవరైనా అడ్డగిస్తే... మనసులో చిన్న సందేహం. గురుజి ని స్మరించుకుని, లోపల కూర్చున్నా... ఆయన దయవల్ల, ఎవరూ ఏమీ అనలేదు. చక్కగా పూజ చేసుకుని, ప్రసాదం నివేదించి, బయటకు వచ్చాను. ఇక్కడ వీళ్ళు తెచ్చే ప్రసాదాలు విగ్రహాల నోటి నిండా పులిమి వెళ్తారు. ఎందుకో మరి... అలా అమ్మవారి దయతో ముద్దమందారాల పూజ పూర్తయింది.



తర్వాత జ్వాలాదేవి నుంచి ధర్మశాల కు బయల్దేరాము. దారిలో కాంగ్రా లోని వజ్రేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. 51 శక్తి పీఠాల్లో,ఇది సతీదేవి ఎడమ రొమ్ము పడిన ప్రాంతమని చెబుతారు. ఈ ఆలయాన్ని మహాభారత కాలంలో పాండవులు, అమ్మవారు స్వప్నంలో కనిపించి ఆదేశించడంతో, నిర్మించారట !  అక్కడినుంచి ధర్మశాల చేరుకొని, మేము ఉన్న హోటల్ కొండమీద ఉన్న ఆలయం దర్శించి, ఎక్కడో కొండల నడుమనుంచి వస్తూ, స్వచ్చమైన నీటితో రాళ్ళతో సయ్యటలాడుతూ ఉరకలేస్తున్న బ్యాస్ నది సొగసులు చూసాము. 

ఆ రోజు సాయంత్రం ధర్మశాల లోని దలైలామా ఆశ్రమం దర్శిద్దామని బయలుదేరితే, కొండ దారిలో విపరీతమైన యాత్రికుల రద్దీ వలన ట్రాఫిక్ జాం అయ్యి, 5 గంటలు అక్కడే ఇరుక్కుని, వెనుదిరిగి వచ్చాము. మర్నాడు ఉదయమే బయలుదేరి, మెక్ లియోడ్ గంజ్ లో ఉన్న దలైలామా ఆలయానికి వెళ్ళాము. ఆ ప్రాంతానికి ఆ పేరు అక్కడ ఒకప్పటి గవర్నర్ అయిన సర్ డోనాల్డ్ ఫ్రీల్ మెక్ లియోడ్ వలన వచ్చిందట.  1959 లో 14 వ దలైలామా అయిన టెంజిన్ గ్యాట్సో ను చైనా ప్రభుత్వం తరిమి కొడితే, భారత్ మెక్ లియోడ్ గంజ్ లో ఉన్న భవంతిలో ఆయనకు ఆశ్రయం ఇచ్చిందట. అప్పటి నుంచి అక్కడ దలైలామా ఆశ్రమం ఏర్పడింది.  ఇక్కడ టిబెటన్లు, బౌద్ధ సన్యాసులు ఎక్కువ. ఏమీ తెలియని పసి ప్రాయంలో తెచ్చి, పిల్లల్ని బౌద్ధసన్యాసులుగా మార్చి, వీళ్ళు మఠాలలో వేసేస్తూ ఉంటారు. 

వేర్వేరు పెద్ద మందిరాలలో ఉన్న వీళ్ళ ప్రధాన గురువులైన సఖ్యముని, అవలోకితేశ్వర, పద్మసంభవుడి అద్భుతమైన విగ్రహాలు, చుట్టూ ఉన్న అందమైన చిత్తరువులు, మనకు కనువిందు చేస్తాయి. ప్రతి మందిరంలోనూ ఇరువైపులా, టిబెటన్ల పవిత్ర గ్రంధాలైన కంజుర్(బుద్ధుడి బోధనలు ) , తంజుర్(బుద్ధుడి బోధల వ్యాఖ్యానాలు ) అనేవి ఉంటాయి. వీళ్ళు ఉపాసించేది అవలోకితేశ్వరుడికి సంబంధించిన ఒక్కటే మంత్రం – దీన్ని మణి మంత్రం అంటారు. ‘ఓం మణి పద్మే హుం’ అనే ఈ సంస్కృత మంత్రం . ఈ మంత్ర జపం జ్ఞానోదయానికి దారి చూపుతుందని వీరి నమ్మకం. ఈ మంత్రాన్ని అనేకమార్లు రాసి, సన్యాసులు ఒక ‘ప్రేయర్ వీల్ (ప్రార్ధనా చక్రం లేక మణి చక్రం ) లో వేస్తారు. ఇది ధర్మ చక్రానికి ప్రతీక అని, దీన్ని తిప్పడం వల్ల, ఒక మనిషికి, ఆ చక్రపు పెట్టెలో ఉన్నన్ని మార్లు, ఆ మంత్రాన్ని చదివిన ఫలం దక్కుతుందని, వారి నమ్మకం. ఇటువంటి ఎన్నో మణి చక్రాలు ఆలయం చుట్టూ అమర్చి ఉండగా, వాటిని యాత్రికులు తిప్పుతూ ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడి నుంచి, ప్రసిద్ధమైన ‘దాల్ లేక్’ ను చూడవచ్చు, ఇది అంత చూడదగ్గ విశేషం కాదు.

మెక్ లియోడ్ గంజ్ నుంచి తిరుగు ప్రయాణంలో కాంగ్రా లో ఉన్న చాముండా దేవి ఆలయాన్ని దర్శించాము. చండముండాసురులను సంహరించినందున దేవికి ‘చాముండా’ అనే పేరు వచ్చింది. ఆలయం పక్కనే పూర్తి వడితో ప్రవహించే ‘బన్ గంగా ‘ నది నయన మనోహరంగా ఉంటుంది. ఈ నదిలో స్నానం సకల పాపహరమని నమ్మే భక్తులు, నది వడికి కొట్టుకుపోకుండా, ప్రభుత్వం నదిలో ప్రవేశాన్ని నిషేధించి, నది పక్కనే, యాత్రికుల స్నానాలకు , నది నీటితో ఒక కొలను ఏర్పాటు చేసింది. అక్కడి మనోజ్ఞమైన వాతావరణం, దేవి ఆశీస్సులతో, మా యాత్ర ముగించుకుని, అర్ధరాత్రికి తిరిగి చండీగర్ చేరుకున్నాము. నవదుర్గలను దర్శించాలని భావించే వారికి, ఆ ఆలయాల జాబితా -

వజ్రేశ్వరి దేవి - కాంగ్రా 
బగాళాముఖి - బన్ ఖండి 
చాముండా దేవి - కాంగ్రా 
చింతపూర్ని దేవి - చింత్పూర్ని 
జ్వాలా దేవి - జ్వాలాముఖి 
నైనా దేవి - బిలాస్పూర్ 
శీతల దేవి - ధర్మశాల మహంతన్ 
వైష్ణో దేవి  - జమ్ముకాశ్మీర్.
మానసా దేవి - పంచకుల, హర్యానా .

ఈ వ్యాసం మొదటి భాగం క్రింది లింక్ లో చదవండి...

“అమ్మ దయ ఉంటే, అన్నీ ఉన్నట్లే ! శ్రీ మాత్రే నమః “ శుభం భూయాత్. 



No comments:

Post a Comment