Friday, June 14, 2013

బాలానాం రోదనం బలం

బాలానాం రోదనం బలం 
-----------------------------

ఈ మధ్య అందరూ మిడి మిడి జ్ఞానం ఉన్న పండితులే అయిపొయారండీ . ,మీరు మాటవరసకు 'జలుబు చేసింది, ' అన్నా సరే, వంద చిట్కాలు, ఉపాయాలు చెప్పెస్తారు. అటువంటి ఒక పండిత పుత్రుడు ఏమి చేసాడో ఈ కధ చెప్తోంది . 

పద్మనాభానికి తానొక గొప్ప పండితుడినని నమ్మకం . అక్కడా ఇక్కడా గాలివాటుగా విన్న విషయాలు వల్లే వేస్తూ, ఆచరణలో పెట్టేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటాడు . ఒక రోజు పద్మనాభం పొరుగింటి వాడయిన చెంచయ్యకు పొద్దుటే పిల్లల ఏడుపులు వినబడ్డాయి . ఏమయ్యిందో అని వెళ్లి చొస్తే, నిద్రపోతున్న పిల్లలను ఒక్కక్కరినే లేపి, నడ్డి మీద నాలుగు దేబ్బలేసి ఏడిపిస్తున్నాడు పద్మనాభం .కారణం అడగ్గా, 'బాలానాం రోదనం బలం ' అన్నారు కదా, అందుకే కొడుతున్నా , అన్నాడు . 


'ఆహా, ఏమి పాండిత్యమయ్యా నీది, ఆ వాక్యానికి అర్ధం అది కాదు, పూర్తీ శ్లోకం విను,' అంటూ ఇలా వివరించాడు . 

"పక్షీణాం  బలమాకాశం 
మత్స్యానా ముదకం బలం 
దుర్బలస్య బలం రాజా 
బాలానాం రోదనం బలం "

ఎవరికేది బలమో ఈ శ్లోకం చెబుతోంది . ఆకాశమే పక్షులకు బలం . ఆపద వస్తే ఆకాశంలోకి యెగిరి తప్పించుకుంటాయి . అలాగే చేపలకు నీళ్ళు బలం . బలహీనులను రక్షించడం రాజ ధర్మం కనుక బలహీనులయిన ప్రజలకు రాజే బలం . చిన్నపిల్లలు తమకు కావలసినవన్నీ ఏడ్చి సాధిస్తారు . ఏడుపే వాళ్ళ ఆయుధం . ఎంతటి కర్కోటకుడయినా పిల్లల ఏడుపుకి లొంగిపోతాడు కనుక , అదే వాళ్లకు శక్తి అన్న అర్ధంలో చెప్పిన శ్లోకం ఇది . అంతే  కాని, ఏడిస్తే పిల్లలకు బలం వస్తుందని కాదు . పిల్లల ఏడుపుకు లొంగిపోయి వాళ్ళను గారం చేసి చెడగొట్ట వద్దు అని పెద్దలకు చేసిన హితవు, అంతర్లీనంగా ఇందులో దాగి ఉంది,అని వివరించాడు చెంచయ్య . మీకూ  తెలిసింది కదూ... 


No comments:

Post a Comment