Sunday, February 1, 2015

‘రాతి మనసు చదివిన ‘ శిల్పి

‘రాతి మనసు చదివిన ‘ శిల్పి 
-----------------------------------
భావరాజు పద్మిని – 1/2/15 

ఒక స్వప్నంలో... అతనికి ఒక అడవిలో ఒక గొప్ప రాజ్యం గోచరించింది. అది గోచరించిన చోట చూస్తే, ఇప్పుడు అడవి ఉంది. ఆ అడవినే తన స్వప్నంలో కనిపించిన విధంగా మలిచేస్తే... అనుకున్నాడు. అతని వెనుక ఉన్న సైన్యం... అతనొక్కడే ! పోనీ అతను శిల్పా , అదీ కాదు. అయినా, పట్టువిడని అంతటి ఉక్కు సంకల్పం ఎలా కలిగిందో తెలీదు. అడవులు నరికాడు, రాళ్ళు తొలగించాడు... చక్కటి ఆకృతి ఉన్న రాళ్ళను తన సైకిల్ పై మోసుకొచ్చాడు. వ్యర్ధ పదార్ధాలు సేకరించాడు. అడవిలో తానుండి, పనిచేసుకునేందుకు ఒక రాతి పలకల గూటిని నిర్మించుకున్నాడు.  ఇవన్నీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే, సాయంత్రం తన బాధ్యతలు ముగియగానే, మొదలుపెట్టి, చేసేవాడు... అదీ, “రహస్యంగా !” ఇలా దాదాపు 18 ఏళ్ళు కష్టపడ్డారు...

ఫలితం... కష్టమైనా, ఇష్టమైన పనిని ఒక తపస్సులా, యోగనిష్ట లా చేసినందుకు... ఒక అద్భుతమైన రాతి సామ్రాజ్యం అక్కడ ఏర్పడింది. అతని శ్రమకు ఫలితంగా , అతనికి ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ని బహుకరించింది. ఆయనే ‘నెక్ చంద్’. 

నెక్ చంద్ ‘బెరియన్ కలాన్’ అనే గ్రామంలో 1924 లో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్థాన్ లో ఉంది. భారత విభజన సమయంలో వారి కుటుంబం భారత్ కు వచ్చేసింది. అయినా, అతని స్మృతి పధంలో అతని గ్రామం, అక్కడి ఇళ్ళు, జలపాతాలు అన్నీ అలాగే ఉండిపోయాయి. 



                            

చండీగర్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ‘నెక్ చంద్’ కు  ఒకరోజున ఒక మంచి కల వచ్చింది... ఒక గొప్ప ‘సుఖ్రాని’ అనే సామ్రాజ్యం ఒక అటవీప్రాంతంలో ఉన్నట్లు గోచరించింది. సభాస్థలి, సంగీతకారులు, నాట్యకారులు, ఆకాశ హర్మ్యాలు, సుందర జలపాతాలు... ఓహ్, అద్భుతం ! అయితే, ఆయన కలే కదా, అని దాన్ని, మర్చిపోలేదు, నావల్ల ఏమౌతుంది, అని వదిలెయ్యలేదు... తాను స్వప్నంలో కాంచిన ఆ గొప్ప రాజ్యాన్ని, అతను అక్కడే నిర్మించాలని అనుకున్నాడు. తన ఉద్యానవనానికై చాంద్ ,సుఖ్నా సరస్సు దగ్గరలోని అరణ్యాన్ని ఎంచుకున్నారు. ఆ సంకల్పం ఎట్టకేలకు , ఆయన 1957 లో రహస్యంగా, వ్యర్ధపదార్ధాలతో ఒక ఉద్యానవనం మొదలుపెట్టేలా చేసింది.

ఆయన ఉద్యోగ విధులు ముగిసాకా, శివాలిక్ కొండల దిగువన తిరుగుతూ, పక్షి ఆకృతిలో , వివిధ జంతువుల ఆకారాల్లో, మనిషి ఆకారంలో ఉన్న రాళ్ళను ఏరి, తన సైకిల్ పై తీసుకు వచ్చేవారు. తాను ఉండి, పని చేసుకునేందుకు వీలుగా ఒక రాతి గుడిసెను ఏర్పరచుకున్నారు. మొదటి ఏడేళ్ళు గృహాల నుంచి, ఇండస్ట్రీ ల నుంచి, వీధుల నుంచి వ్యర్ధ పదార్ధాల సేకరణలో గడిపారు. విరిగిన గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్, మాడిన బుల్బ్ లు, బాటిల్స్, మంగలి వద్ద నుంచి కత్తిరించిన జుట్టు, ఇవే అతని ముడి పదార్ధాలు. క్రమంగా అవన్నీ అద్భుతమైన 20,000 కళాకృతులుగా రూపుదిద్దుకున్నాయి. 12 ఎకరాల్లో నాట్యకారులు, సంగీత వాద్య కారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో  ‘సుఖ్రాని’ అద్భుత సామ్రాజ్యం నిర్మించారు. ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే, ముందర ఏమి ఒస్తుందో తెలియని ఉద్విగ్నత ! మరొక్క క్షణం ఆగితే, కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం... ఇలా సాగుతుంది చండీగర్ రాక్ గార్డెన్స్ లో సందర్శకుల పయనం. ‘ఒక్క మనిషి, ఇంత అద్భుతాన్ని సృష్టించగలడా ?’, అని ఆశ్చర్యపోనివారు ఉండరు. 

18 ఏళ్ళు చాంద్ మౌనంగా నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని, 1973 లో అడవిలో ఆంటి – మలేరియా టీం లో పనిచేస్తున్న ఎస్.కె. శర్మ గుర్తించారు. ఇది అటవీ ప్రాంతం కనుక, చాంద్ నిర్మాణాలు అన్నీ అక్రమమైనవని, తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, చాంద్ ప్రజాభిప్రాయం సేకరించి, ఇదొక గొప్ప పర్యాటక స్థలం కాగలదని నిరూపించాడు. 1975 లో దీన్ని అధికారికంగా గుర్తించారు. 1976 నుంచి ఇది సందర్శకుల కోసం తెరిచారు. తర్వాత ఈ  వనాన్ని మరిన్ని శిల్పాలతో విస్తృత పరిచారు. అటుపై,  చాంద్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పలు విదేశీ సంస్థలు ఆయన్ను సత్కరించాయి. విదేశీ మ్యుసియం లలో చాంద్ శిల్పాలు చోటు సంపాదించుకున్నాయి. ఇప్పుడు 90 ఏళ్ళ వయసులో, రాళ్ళతో రాగాలు పలికించిన ఆ మౌనశిల్పి, నవ్వుతూ, అప్పుడప్పుడూ, తన ‘సుఖ్రాని’ సామ్రాజ్యం లోనే దర్శమిస్తారు.
ఆయన్ను చూస్తే, ఎవరికైనా అనిపిస్తుంది. “మనిషి తలచుకుంటే, ఏమైనా చెయ్యగలడు !” అని. మీరూ చండీగర్ వస్తే, వ్యర్ధాలతో నిర్మించిన ఈ అర్ధవంతమైన  సుందర ఉద్యానవనం తప్పక సందర్శించండి !

No comments:

Post a Comment