Saturday, April 21, 2012

మహాకవి కాళిదాసు


మహాకవి కాళిదాసు





'వాగార్దావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ'

పదానికి, ఆ పదపు భావానికి ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిదో, అలాంటిదే పార్వతీ...
పరమేశ్వరుల 

అనుబంధము. కవి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను, పదానికి, దానికి గల అర్ధానికి, తన కావ్యంలో పొందిక 

కుదిరేలా, ఆశీర్వదించమని అర్ధనారేశ్వరి స్వరూపమయిన ఆది దంపతులను వేడుకుంటాడు. అర్ధనారీశ్వర తత్త్వం 

అంటే, భార్యభర్తలు ఒకే మనసుతో, ఒకే తనువుతో, ఒకే ఆలోచనతో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉండడం.


కవితకు భావం ఎంత ముఖ్యమో, శబ్దసౌష్టవం కూడా అంతే ముఖ్యం. భావాన్ని బట్టి శబ్దం, అంటే, పద జాలం, 

మారుతూ ఉండాలి. గంభీరమయిన భావానికి గంభీరమయిన పదజాలం,లలితమయిన భావానికి లలితమయిన 

పదజాలం ఉంటేనే, ఆ కవిత ఆకట్టుకుంటుంది.
 'కవి కుల గురువు' గా చెప్పబడే కాళిదాసు, గొప్ప సంస్కృత కవి, మరియు నాటకకర్త. విక్రమాదిత్యుని 

కొలువులోని 'నవరత్నాల' లో ఒకరిగా ప్రసంసలు పొందారు. 'ఉపమాకాళిదాసః ..', అంటే పోల్చడం లో 

కాళిదాసును మించిన వారు లేరు.
కాళిదాసు రచించిన మూడు ముఖ్యమైన నాటకాలు మాళవికాగ్నిమిత్రము (మాళవిక మరియు అగ్నిమిత్రుని 

కథ), విక్రమోర్వశీయము (విక్రముడు మరియు ఊర్వశి కథ) మరియు అభిజ్ఞానశాకుంతలము (శకుంతలను గుర్తించుట).


*కావ్యాలు *


మేఘసందేశం
కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు, కర్తవ్య నిర్వహణలో తప్పిదం వల్ల, శాపానికి గురై, ఒక సంవత్సరం పాటు, 


మహిమలు పోగాట్టుకుని, దేశం నుంచి వెలివేయబడి, రామగిరి అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. విరహంతో ఉన్న 

తన ప్రియురాలికి, ఒక ఆషాడ మబ్బు తునకను , తన సందేశాన్ని ప్రియురాలికి అందించమని కోరతాడు. 

మేఘానికి వెళ్ళవలసిన దారిని, మధ్యలో కనిపించే రమణీయ దృశ్యాలను, అద్భుతంగా ,వర్ణించి చెబుతాడు.

'మిత్రమా! గాలి పాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. శుభ శకునాలు కనుపిస్తున్నాయి. హంసలు నీకు 


మానస సరోవరం దాకా తోడు వస్తాయి. దారిలో అలసిపోతే కొండ కొనలపై విశ్రాంతి తీసుకో. శక్తి ఉడిగితే మధురమైన 

నదీజలాలను ఆస్వాదించు.


మధ్యలో నెమళ్ళు అందంగా నిన్ను స్వాగతిస్తాయి. కాని మైమరచి కార్యాన్నివిస్మరించవద్దు సుమా!. నేను 

త్వరలోనే తిరిగి వస్తానని, దిగులు చెందవద్దని, నా ప్రియురాలికి,నా సందేశంగా చెప్పు.' దీనమయిన, అతని 

సందేశాన్ని విని, యక్షరాజు, శాపాన్నిఉపసంహరించుకుని, ప్రేయసి-ప్రియులను కలపడం, ఈ కావ్యానికి ముగింపు.

కుమార సంభవం


దక్ష యజ్ఞం, సతీ దేవి ఆత్మాహుతి, శివుని ఘోర తపస్సు, మన్మధుడిని భస్మం చెయ్యడం, పార్వతి శివుని తపస్సు 


ద్వారా ప్రసన్నం చేసుకోవడం, శివపార్వతుల కల్యాణం, తారకాసుర సంహారానికి, కుమార స్వామి జననం, 

తారకాసుర సంహారం మొదలయినవి ఈ కావ్యంలో చక్కగా వర్ణించారు.


రఘువంశము

రఘువు ఇక్షాకు వంశంలోని ప్రముఖ చక్రవర్తి. ఇతని వంశ క్రమాన్ని *రఘు వంశము* అంటారు.


ఋతు సంహారం

ఇది ఆరు ఋతువులకు(గ్రీష్మ, వర్ష, శిశిర,శరత్, హేమంత , వసంత ) సంబంధించిన పద్యాల సంకలనం.


వసంత ఋతువుకు సంబంధించి, ఋతు సంహారం లోని ఒక పద్యం.


ద్రుమాః సపుష్పాః సలిలం సపద్మం
స్త్రియః సకామాః పవనః సుగంధిః
సుఖా ప్రదోషాః దివసాశ్చ రమ్యాః
సర్వం ప్రియే చారుతరం వసంతం

(ఋతుసంహారం కాళిదాసు)

(చెట్లు పువ్వుల్తోనూ, సరస్సుల్లో నీళ్ళు తామరపువ్వుల్తోనూ నిండి ఉన్నాయి.స్త్రీలు కోర్కెలతో నిండి ఉన్నారు. గాలిలో సుగంధం నిండి ఉంది. సుఖవంతమైన సాయంత్రాలూ, రమ్యమైన పగళ్ళూ.. ఓ ప్రియా! వసంతం చాలా అందంగా ఉంది.)

రాజు- కవి వివాదం

ఒక సారి భోజరాజుకి కాళిదాసుకు కొంచెం మాట తేడా వచ్చి కాళిదాసు రాజు గారి మీద అలిగి చెప్పా పెట్టకుండా 


ఎక్కడికో వెళ్ళిపోయాడట! కాళిదాసు ఆచూకీ తెలుసుకోవాలంటే ఒకటే మార్గమని తలచి ఈ సమస్యను తయారు 

చేసి చాటింపు వేయించాడు.

'కుసుమే కుసుమోత్పత్తిహి శ్రూయతే నతు దృశ్యతే '
పువ్వులోంచి పువ్వు పుడుతుంది అనేమాట వినడమే కానీ చూడలేదు....! ఈ సమస్యను పూరించిన వారికి గొప్ప నజరానా అని ప్రకటించాడు.
ఎక్కడో ఒక వేశ్య సముఖంలో ఉన్న కాళిదాసు, ఆ సమస్యను ఇలా పూరించారు.
బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవర ద్వయం'
'బాలా, నీ ముఖమనే తామరపూవులో రెండు నల్ల కలువలు కనిపిస్తున్నాయి' వెంటనే, కాళిదాసును గుర్తించిన భోజరాజు, ఆయనకు క్షమాపణ చెప్పి, తిరిగి తన కొలువులోనికి తీసుకువచ్చాడట. ప్రకృతి సౌందర్యం, సాఘిక విషయాలతో పాటు, రాజుల నాయకత్వ లక్షణాలు, స్త్రీ యొక్క బాహ్య, మానసిక సౌందర్యాలను కూడా తన కావ్యాల్లో వర్ణించారు. 'రాజు మరణించే రాతి శాసనములందు... సుకవి జీవించే ప్రజల నాలుకలయందు...' కవికుల చిరంజీవి, కాళిదాసు.


References:

http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81
http://www.eemaata.com/em/issues/200105/642.html
http://vihanga.com/?p=3615

No comments:

Post a Comment