Friday, June 14, 2013

సరదా సమయం

'ఏవండి, ఇవాళ టీవీ లో ఈ కొత్త వంటకం చూపించారు. కష్టపడి చేసాను ,రుచి చూసి, చెప్పరూ.'

'ఓ ఏదీ ఇటివ్వు. ఆహా, చిన్నప్పుడు తిన్న సబ్బు ముక్కను గుర్తుకు తెచ్చావు, ఇంతకీ ఈ పదార్ధం ఏవిటి తల్లి ?'

'ఉ తీ కా హల్వా ' అండీ. అంటే, ఈ హల్వా లో ఉప్పు, కారానికి పచ్చి మిరపకాయలు, తీపికి బెల్లం,వెయ్యాలన్నమాట. మొదటి అక్షరాలు కలిపి ఆవిడే ఆ పేరు పెట్టిందట. '

'అలాగా, యెంత సృజనో, పిచ్చి తల్లికి. ఇంతకీ ఈ వంటకం వండాకా ఆ వండిన శాల్తీ తిందా?'

'లేదండి, ఆంకరమ్మ తిని యెగిరి గంతేసింది.'

'వెంటనే వెనక్కి తిరిగి ఉమ్మేసి ఉంటుంది. నీ లాంటి గొర్రెలు ఆ ఆంకరమ్మ హావభావాలు చూసి, వెంటనే కొత్త వంటలు వండేసి ,ఇలా మంగళ సూత్రాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదిగో, ఈ సారికి ఎలాగో నియంత్రించుకున్నాను గాని, ఇంకోసారి ఇలాంటి వంటకాలు చేసావంటే, ఇద్దరం ఎర్రగడ్డలో చేరాలి. నేను పేషెంట్ గా, నువ్వు నాకు ఆయాగా.'


=========================================================== 



'ఏంటి ఇప్పడిదాకా పడుకునే ఉన్నావా ? పొద్దుటే ఐదు గంటలకే లేచి, రెండు కిలోమీటర్ లు నడిచి, ఇంటికి వచ్చి, స్నానం చేసి, ఆరోగ్యకరమయిన అల్పాహారంతో చురుగ్గా రోజు ప్రారంభించాలి. లే లే '

'అంటే, మీరు రోజూ ఇలాగే చేస్తుంటారా ? ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ?'

'రేపటి నుంచీ మొదలుపెడదామని అనుకుంటున్నా !'
 ===========================================================================================
'నేను రచయిత్రిని కాదన్న వాళ్ళను రాయిచ్చుకు కొడతా!'

'అంత పని చెయ్యకు తల్లో , తమరు రచయిత్రే అని వప్పేసుకుంటున్నా.'

'భలే, అయితే,ఇప్పుడే పుట్టిన నవజాత కవిత, చకచకా చదివేస్తా,విని జన్మ ధన్యం చేసుకోండి. ముఖ్యంగా మీవంటి ఛాందసులు, నా వంటి కళాకారులు చేసే ఈ కొత్త ప్రయోగాల్ని చదివి అఘోరించాలి,'

'ప్రియా, హై వే లాంటి నా గుండె నిండా, నిర్దాక్షిణ్యంగా గోతులు తవ్వి వదిలేసావు. ఇప్పుడు ఆ గోతుల నిండా కన్నీళ్లు నింపుకుని, వానకు తడిసిన గుంతల రోడ్డులా ఉన్నాను. వచ్చి, నీ ప్రేమ మట్టితో పూడ్చేయ్యవూ,'

' ఇది కవితా, ఇది వినేకన్నా, ఆ రాయిచ్చుకు కొట్టించుకోవడమే మంచిది. నన్నొదిలెయ్ తల్లో , బ్రతికుంటే, బేబీ కార్న్ తిని బ్రతికేస్తా.'
============================================================================================





'మీ కవిగాళ్ళు ఉన్నారే, వీళ్ళంతా, కాల్పనిక ప్రపంచంలో బ్రతికేస్తుంటారు, '

'కావచ్చు పూబోణి, అందువల్ల నష్టం ఏముంది? ఇప్పుడు, నువ్వు గుత్తి వంకాయ కూర వండాలే అనుకో, వంకాయలు తేవాలి, కారం నూరాలి, కాయల్లో కూరాలి, వండాలి. మాకంత కష్టం ఏమీ లేదమ్మా, వర్ణనలతో చంపేస్తాం,'

'మరీ మంచిది, రేపటి నుంచి వంట చెయ్యను, ఆ కల్పనల్లో తినేసి రండి, సరిపోతుంది.'

'దేవీ, క్షమ , దయ, వంకాయ కూరాం దేహి. స్త్రీ సహనశీలి, స్త్రీ ఇంటి లాంతరు , స్త్రీ వంటింట్లో పొయ్యి,'

'పొయ్యిలో పిల్లేమీ కాదు, ఈ కాకా వేషాలకేమీ తక్కువ లేదు కాని, ఈ సారికి క్షమిస్తున్నా. అమ్మ పుట్టిల్లు మేనమావ దగ్గర ప్రదర్శించే ప్రయత్నాలు చెయ్యక, బుద్ధిగా శరణాగతి వేడండి. గుత్తి వంకాయ కూర ప్రాప్తిరస్తు!'


========================================================================


మా చిన్నప్పుడు పిల్లల వోప్పందాలు ఇలా ఉండేవి .

'ఒరేయ్ నువ్వు జీళ్ళు కొనుక్కున్నావు కదా, నాకొకటి ఇవ్వవా?'

'ఇవ్వను, ఇవన్నీ నాకే'

'మరి నిన్న నేను మొక్కజొన్న పొత్తు కొనుక్కుని, నీకు కొన్ని గింజలు పెట్టలేదూ, ఇవ్వకపోతే, నా గింజలు నాకు కక్కు,'

'సరే, బడి వదిలి పెట్టాకా, ఒకటి ఇస్తాలే,'

బడి వదిలేసరికి పిల్లవాడి మనసు మారిపోతుంది. మళ్ళి జీడి ఇవ్వనంటాడు. రెండవ పిల్లవాడికి ఉడుకుమోతు తనం వచ్చేస్తుంది.

'ఒరేయ్ , ఆశ పెట్టి, ఇవ్వకపోతే, నీకు ఆశ కురుపులు వస్తాయిరా, తిను, అన్ని నువ్వే తిను, రేపు నేను కూడా మా నాన్నని అడిగి, డబ్బులు తెచ్చుకుంటా, ఆ, '

సదరు ఆశ కురుపులని నేను ఎప్పుడూ చూడలేదు కాని, చిన్నప్పుడు నమ్మేసి, భయపడే వాళ్ళం.

ఈ పేస్ బుక్ లో ఇడ్లీ లు, దోషాలు, పునుకులు, పాణి పూరీలు పెట్టె వాళ్ళని చూస్తే, నాకెందుకో ఇలాగే అనాలని అనిపిస్తుంది. ' ఇదిగో, ఈసురో మంటూ ఆఫీసుల్లో, కాలేజీల్లో కూర్చుని, బుద్ధిగా పని చేసుకుంటూ, మధ్య మధ్య ఆటవిడుపుకు, మొబైల్ లో పేస్ బుక్ చూసే వాళ్ళని, ఇలా ఊరిస్తే ఆశ కురుపులు వచ్చేస్తాయి, జాగ్రత్త!'


==========================================================================================


'అదేవిటి ? ఇందాకటి నుండీ ఆ పుస్తకం మీద రసం పోస్తున్నావ్?"

" వాక్యం రసాత్మకం కావ్యం...అన్నారు కదండీ, ఈ కాగితం రసం పీల్చుకుని, కావ్యం అవుతుందేమో చూద్దామని..."

=========================================================================================


నవ జాత ప్రేమ కవిత...

ఎవయ్యోయ్...

అడగా పెట్టకుండా నా గుండెలో తిష్ట వేసుకు కూర్చున్నావ్ 

గొంతుకు కూర్చుని కొండముచ్చులా తొంగి చూస్తున్నావ్ 
ఏవిటయ్యా నీ దాష్టీకం? 

తాడో పేడో తేల్చక ఏవిటీ ముసుగులో గుద్దులాట ?

అర్జంటుగా తెల్చలేదో అప్పడాల కర్రిచ్చుకు కొడతా 

నాన్చీ నాన్చీ నస పెట్టావో నాలుగు తగిలిస్తా, జాగ్రత్త !

జడ పడతావో, లేక నన్నే తొడ కొట్టి రమ్మంటావో కాసుకో,

మీ ఇంటికొస్తా, పక్కింటికోస్తా, ఎదురింటికి వస్తా, హ హ హ (ఇక్కడో వికటాట్టహాసం వేసుకోండి ...)

=================================================================================

'ఏంటి ఇప్పడిదాకా పడుకునే ఉన్నావా ? పొద్దుటే ఐదు గంటలకే లేచి, రెండు కిలోమీటర్ లు నడిచి, ఇంటికి వచ్చి, స్నానం చేసి, ఆరోగ్యకరమయిన అల్పాహారంతో చురుగ్గా రోజు ప్రారంభించాలి. లే లే '

'అంటే, మీరు రోజూ ఇలాగే చేస్తుంటారా ? ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ?'

'రేపటి నుంచీ మొదలుపెడదామని అనుకుంటున్నా !'

==========================================================
కెఎస్ఎన్ మూర్తి 

ఒక ప్రముఖ ఆంగ్లపత్రిక ప్రత్యేక శీర్షిక వారంవారం ఒక తెలుగు రచయిత లేదా రచయిత్రి గురించిన స్కెచ్లు ప్రచురిస్తున్నరోజుల్లో తన కసలే తగినంత గుర్తింపు రాలేదనుకునే ఒక కవి మిత్రుడు నండూరి రామ్మోహనరావుగారితో ""వీడెవడండి ప్రతి అడ్డమైనవాడి గురించి రాసి పారేస్తున్నాడు.."అని వేష్ట పడ్డాడు.వెంటనే నండూరివారు "ఇంకా మీ గురించి రాసినట్లు లేదు" అన్నారు చాలా కూల్ గా.

ఒక కోటీశ్వరుడు హాలీవుడ్ నవ్వుల రాజైన చార్లీ చాప్లీను ఒకపార్టీలో కలిశాడు.
"నేను నా జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రారంభించాను"అన్నాడు దర్పంగా కోటీశ్వరుడు.
"అలాగా!నేను నా జీవితాన్ని అసలు జేబే లేకుండా ప్రారంభించాను తెలుసా "అన్నాడు చాప్లిన్.







No comments:

Post a Comment