Sunday, June 23, 2013

తెనాలి రామలింగడు - కోలాహల పండితుడి కధ

కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారు . ఈ ఎనమండుగురు కవులను చిటికెన వేలితో ఓడించి , వాళ్ళు దిగ్గజాలు కాదు, చిట్టెలుకలు అని రుజువు చేస్తానని, దమ్ముంటే సభ ఏర్పాటు చెయ్యవలసిందని , లేకపోతే ఓడిపోయినట్టు వప్పుకుని సంతకాలు చేసి ఇవ్వమని , వర్తమానం పంపించాడు . దీనితో సభలో కలకలం మొదలయ్యింది . 

" యెంత ధైర్యం ?"
"అష్ట దిగ్గజాలు అంటే ఏమనుకుంటున్నాడు ?"
"మరీ ఇంత గర్వమా ?"
" ఆ కొలాహాలుడి మదం అణచాల్సిందే !"

ఈ విధంగా అందరూ తలో మాటా అన్నారు. కాని, కోలాహలుడు మాత్రం తక్కువ వాడు కాదు. ఆరు శాస్త్రాల్లోనూ నిధి అని ఎన్నో బిరుదులు గెలుచుకున్నాడు . అతడి ముందు గెలవలేమని , ఎవరికి వారే భయపడసాగారు. ఈ రొంపి లో నుంచి, తమను బయట పడవేయగలవాడు తెనాలి రామలింగడు ఒక్కడే అని తీర్మానించుకుని, తమ మధ్య విభేదాలు మరచి, ఏదో దారి చూపవలసిందని , రామలింగడిని కోరారు. 

రామలింగడు పశువుల కాపరి వేషం వేసుకుని, ఊరి బయట చెరువు గట్టు దగ్గర చెట్టు మొదలుకి జేరబడి, పిల్లన గ్రోవి ఊదుతూ, కోలాహల పండితుడి రాక కోసం ఎదురు చూడసాగాడు . తూరుపు తెల్లవారుతుండగా, కోలాహాల పండితుడు పేరుకు తగ్గట్టు కోలాహలంగా, వంద మంది శిష్యులను వెంటబెట్టుకుని వస్తూ కనిపించాడు.

అతడు రామలింగడిని చూసి, 'ఏయ్, ఇలా రా,' అంటూ నిర్లక్ష్యంగా పిలిచాడు. 
 
                                       

రామలింగడు సంభ్రమంగా లేచి, తలపాగా సర్దుకుని, వినయంగా వంగి, 'దండాలండి', అన్నాడు . 
' విజయనగరానికి వెళ్ళాలి . దారి తెలుసునా?'
'తెలవకేవండి , నాకు ఊరంతా కొట్టిన పిండేనండీ బాబయ్యా!'
'అష్టదిగ్గజాల పేరు విన్నావా?'
'ఇనక పోడం  ఏటి బాబయ్యా, వాళ్ళలో చిన్నాయన,  తెనాలి రామలింగయ్య గారి కాడే నేను పాలేరు పని జేసేది.'
'ఆయన గొప్ప కవి అని విన్నాను, నిజవేనా?'
'ఆరింట్లో అంటా కవులెనన్దీ. ఆరి సావాసం వల్ల నాక్కూడా, పజ్జాలు అల్లడం వచ్చేసినాదండి . '
'ఆహా, ఏది మచ్చుకు ఒకటి చదువు, విని, నీలాంటి జానపదుడికి కాస్త డొక్కా శుద్ధి అయినందుకు సంతోషిస్తా!'

నరసింహ కృష్ణ రాయని
కర మరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభి త్తురంగ కమనీయంబై !


ఈ పద్యం వింటున్న కోలాహల పండితుడు ఆశ్చర్యంతో నోరు తెరచి, ముయ్యడం మరచిపొయాడు . ఆయన శిష్యులు రెప్ప వెయ్యడం మరచిపొయారు. వారిలో చాలా మందికి ఇది అర్ధమే కాలేదు . కోలాహలుడు , 'అందరిలోకి చిన్నవాడయిన రామలింగడి పాలేరుకే ఇంత పాండిత్యం ఉంటే , ఇక పెద్దవాడయిన అల్లసాని పెద్దన పాండిత్యం అంచనాలకు అందనిది, అందరిలో అవమానపడడం కంటే, వెనక్కి మర్యాదగా వెళ్ళిపోవడమే మంచిది ' అనుకున్నాడు . ముందుకు అడుగు వేసేందుకు కూడా అతడికి ధైర్యం చాలలెదు. పల్లకి వెనక్కి తిప్పించుకుని పారిపోయాడు . ఇంతకీ ఆ పద్యం అర్ధం ఏమిటంటే .... 

కీర్తిని తెలుపు రంగుతో పోల్చడం కవుల అలవాతు. ఆ నరసింహ దేవరాయల కొడుకయిన శ్రీకృష్ణదేవరాయల కీర్తి ఎలా ఉందంటే, క్రింది తెల్లని వస్తువుల వలె , ఆ జాబితా ... 
 
కరిభిత్ = కరి అంటే ఏనుగు , భిత్ అంటే చంపినవాడు, ఏనుగుని భేదించినవాడు .. గజాసురుని అంతమొందించిన శివుడు, వేదాలలో శివుని  కీర్తి లాగా. 
గిరిభిత్ కరి = గిరి అంటే కొండ . పర్వతాలను భేదించినవాడయిన ఇంద్రుడి     తెల్లనైన ఏనుగు ఐరావతము లాగా . 
కరిభిత్ గిరి = ఎల్లప్పుడూ తెల్లని మంచుతో కప్పబడిన శివుని పర్వతం .... కైలాసము లాగా . 
గిరిభిత్ = పర్వతాలను చేదించడానికి వాడిన ఇంద్రుని వజ్రాయుధం, దాని తెల్లని రంగు లాగా . 
కరిభిత్ తురంగ = ఇక్కడ తురంగమంటే మనం వాహనంగా అర్థం చేసుకోవాలి. కనుక శివుని వాహనమైన తెల్లటి నంది లాగా . 
గిరిభిత్ తురంగ = ఇంద్రుని అశ్వము ఉచ్చైశ్రవము, ఇది కూడా తెలుపు. ఆ  దివ్యాశ్వం లాగా . 

ఇలా కృష్ణదేవ రాయల వారి కీర్తి తెల్లగా మనోహరంగా ఉన్నదట . కరి, గిరి, భిత్ అనే మాటలను తిరగేసి , మరగేసి ఎన్నో రకాల అర్ధాలు వచ్చేలా పద్యం అల్లి, కోలాహల పండితుడు పలాయనం చిత్తగించేలా చేసాడు రామలింగడు . 
 
 

2 comments:

  1. నా చిన్నతనంలో ..మా నాన్నగారు...చెప్పే కధలలో తెనాలి రామకృష్ణుని కధలే యెక్కువగా ఉండేవి. అంటే ప్రస్తుత పరిస్తితుల్ని ,,వాస్థవ రూపంలో మాకు అర్ధం అయ్యే విధంగా ఈ కధలని చెప్పేవారు...ఈ కధ చాలా బాగుంది. రచయితకు కృతజ్నతలు...


    వైద్యనాథ్, పాలకొల్లు.

    ReplyDelete
  2. ఈ కథ, పద్యము చదివి చాలా సంతోషం కలిగింది పద్మినిగారూ. మా ఏడు సంవత్సరాల అమ్మాయికి ఈ కథ, పద్యము చదివి వినిపించి ఆనందించాను.

    పద్యము అనేది తెలుగు వారి నిజమైన వారసత్వ సంపద. ఒక అందమైన పద్యాన్ని అందరితో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.

    ReplyDelete