Friday, June 14, 2013

తెనాలి రామలింగడు - లతాంగి కధ

తెనాలి రామలింగడు - లతాంగి కధ
----------------------------------
నెల్లూరుకు పూర్వం సింహపురి అన్న పేరు ఉండేది . అప్పట్లో వెలయాళ్ళు కూడా  శాస్త్ర పారంగతులయ్యి, నెరజాణలు అనిపించుకునే వాళ్ళు. సింహపురి లో లతాంగి అనే వెలయాలు మిక్కిలి అందచందాలు, పాండిత్య ప్రతిభ కలిగి, పండితులకు ఒక సవాలు విసిరింది. ప్రత్యక్ష రామాయణం కళ్ళకు కట్టినట్లు చెప్పిన వారిని తానూ వివాహం చేసుకుంటానని, తనకు నచ్చేట్టు అలా చెప్పలేని వాళ్ళు తనకు దాస్యం చెయ్యాలని, షరతు విధించింది . ఎందరో పండితులు ఏంటో రసవత్తరంగా చెప్పినా, ఆమె వంకలు పెట్టి, వాళ్ళ చేత దాస్యం చేయించుకునేది . ఈమె సంగతి తెలిసిన రామలింగడు, ఆమె వద్దకు వెళ్లి , ఇలా అన్నాడు . 

'సుందరీ, నీ ప్రతిభాపాటవాల గురించి విన్నాను. నీకు ప్రత్యక్ష రామాయణం హృద్యంగా వినిపించేందుకే వచ్చాను. అయితే, నాదొక నియమమ్. నేను కధ చెప్పటం ముగించే దాకా, నీవు మాట్లాడ కూడదు . ' దానికామె తన అంగీకారాన్ని తెలిపింది . 



రామాయణం అద్భుతంగా చెప్పసాగాడు తెనాలి రాముడు . ఆమె మాటిమాటికీ 'కళ్ళకు కట్టినట్టు చెప్పట్లేదు, ' అనసాగింది . రామలింగడు ఆమెను మాట్లాడవద్దని సైగ చేస్తూ , చివరికి 'లతాంగీ, ఇకపై కధ నీ కళ్ళకు కట్టినట్టే చెబుతా చూడు , ' అంటూ, 'హనుమంతుడు మహేంద్రగిరి కొండ ఇలా ఎక్కాడు, ' అంటూ ఆమె మంచం ఎక్కి నిల్చున్నాడు . అక్కడి నుంచీ ఇంకొక కొండ పైకి ఇలా దూకాడు, అంటూ, మరొక మంచం మీదకు గెంతాడు . తరువాత లంకా నగరం ప్రవేశించి , లంకిణి ని ఇలా గుద్దాడు, ' అంటూ లతాంగి వీపు మీద పిడిగుద్దులు గుద్దాడు . ఆమె గగ్గోలు పెట్టసాగింది . మధ్యలో మాట్లాడకు , పూర్తిగా విను అంటూ , 'సీతాదేవిని చూసి తిరిగి వచ్చేటప్పుడు లంకను ఇలా తగలబెట్టాడు, ' అంటూ కాగడా తీసుకుని, ఆమె మందిరం అంతా నిప్పు పెట్టి ,' చివరకు సముద్రం వద్దకు వెళ్లి, ఇలా హాయిగా స్నానం చేసాడు, 'అంటూ బావిదగ్గరకు వెళ్లి స్నానం చెయ్య సాగాడు . లతాంగి నెత్తి, నోరు బాదుకుని, న్యాయాధిపతి వద్దకు పరిగెత్తింది . అధికారి అందరి వాదనలూ విని, రామలింగడి తప్పేమీ లేదని తేల్చి, లతాంగిని మందలించి వదిలిపెట్టాడు . ఈ విషయం విన్న విజయనగర ప్రజలు ఘొల్లున నవ్వుకుని, రామలింగడి తెలివితేటలను అభినందించారు . 

No comments:

Post a Comment