Friday, June 14, 2013

అవకతవక మహారాజు కధ



అవకతవక మహారాజు కధ 
------------------------------------
పంచ మహాపాతక పట్టణాన్ని అవకతవక మహారాజు పాలిస్తూ ఉండేవాడు .రంగన్న అనే దొంగ అర్ధరాత్రి సోమయాజులు గారి ఇంటికి కన్నం వేసేందుకు గొయ్యి తవ్వి, లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. వానకు బాగా నాని ఉన్న మట్టి గోడ కూలి అతడు మరణించాడు. మర్నాడు రంగన్న పెళ్ళాం రంగమ్మ శోకండాలు పెడుతూ, ఈ విషయం మహారాజు వద్ద ఫిర్యాదు చేసింది. 

అవకతవక మహారాజుకు శిక్షలు వెయ్యడం మహా సరదా. ముందూ వెనుకా ఆలోచించకుండా, న్యాయ విచారణ జరపకుండా, తోచినది చేసేయ్యడమే ఆ రాజు గారి ప్రత్యేకత. ఫిర్యాదు వింటూనే, 'ఆ ఇంటి యజమానిని లాక్కురండోయ్ ..' అంటూ భటులను పంపాడు.

వాళ్ళు వెంకప్ప సోమయాజుల్ని లాక్కు వచ్చి, రాజు ముందు నిలబెట్టారు. సోమయాజులు వణికిపోతూ, తన పేరు చెప్పి, తాను పౌరోహిత్యం చేస్తూ ఉంటానని చెప్పాడు. 

"పౌరోహిత్యం చేసే వాడివి రంగన్నను ఎందుకు చంపావు ? " అని గద్దించాడు రాజు.
" మట్టితో అశ్రద్ధగా గోడ కట్టి, రంగన్నను చంపినందుకు నీకు మరణ దండన విధిస్తున్నాను ",అన్నాడు రాజు.
 

సోమయాజులు గడగడా వణికిపోయాడు . 
'మా ఇంటి గోడను నేను కట్టలేదు ప్రభూ . రామన్న మేస్త్రి కట్టాడు . తప్పంతా అతనిదే !'
'అయితే ఇతడిని వదిలేసి, రామన్న మేస్త్రిని తీసుకు రండి,' అన్నాడు రాజు '. 
బ్రతుకు జీవుడా అంటూ జారుకున్నాడు సోమయాజులు . భటులు రంగాన్న మేస్త్రిని తీసుకు వచ్చారు . 
'నువ్వు ఇంటి గోడ నిర్లక్ష్యం గా కట్టి, పాపం దొంగతనం చేసుకోడానికి వచ్చిన రంగన్న చావుకు కారణం అయ్యావు. అందుకు నీకు మరణ శిక్ష విధిస్తున్నాను,' అన్నాడు రాజు . 
రామన్న రావి ఆకులా వణికిపోయి, వెంటనే ఉపాయం ఆలోచించి, ఇలా అన్నాడు . 'ప్రభూ! అడుసు తొక్కిన అప్పన్న సరిగ్గా తోక్కక పోవడం వల్లే గోడ కూలింది, నా తప్పేమీ లేదు,' 
'అయితే, ఇతన్ని వదిలి అప్పన్నను తెండి, ' ఆజ్ఞాపించాడు అవకతవక రాజు . 
మరణ శిక్ష తప్పించుకునేందుకు అప్పన్న, ' మట్టిలో నీరు పోసిన నారిగాడు చానా పోసేసి పల్చగా చేసేసాడు, తప్పు వాడిదే,' అంటూ చెప్పి, తప్పించుకున్నాడు . 
వెంటనే నారి గాడిని సభకు తెచ్చారు. 'నేను నీళ్ళు పోసిన కుండ మూతి చాలా వెడల్పుగా ఉంది .  ఆ కుండ చేసిన కుమ్మరి గురవయ్యదే తప్పు ,' అన్నాడు . 
గురవయ్య రాజుతో, ' నేను కుండ చేస్తుండగా భోగం పిల్ల కలావతి టక్కు - టిక్కు నడుస్తా, నాకేసి సూస్తా యెల్లిన్దన్ది. తప్పు ఆ పిల్లదేనండి ,' అన్నాడు . 
కళావతి  రాజ సభలో మెలికలు తిరుగుతూ , ' నేను మామూలుగా ఆ కుమ్మరి వీధిలో చస్తే అడుగుపెట్టను . వస్తే నా ఇంటికి ఎవడయినా రావాలి కాని, ఒకడింటికి వెళ్ళే ఖర్మ మాకేంటండి ? ఆ కంసాలి కామయ్య రవ్వల హారం చేసిస్తానని , ఎంతకీ ఇవ్వలేదు , అందుకే తప్పు అతనిదే, ' అంది . 
రాజు కామయ్యకి మరణ శిక్ష ఖరారు చేసేసాడు . ఈ సంగతి తెలిసిన అతడి బావమరిది భద్రయ్య , అక్కడికి వచ్చి , ' దేవర వారు కామయ్యకు బదులుగా నన్ను ఉరితియ్యండి . ఈ నాడు సూర్య గ్రహణ సమయంలో , ఉరితీయబడ్డ వాడు , మళ్ళి జన్మలో ఈ దేశానికి రాజు అవుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది . ,' అన్నాడు . 
అంతా విన్న అవకతవక రాజు , 'ఓరి దొంగ వెధవల్లారా, నా సింహాసనానికే ఎసరు పెడతారా ? జన్మ జన్మలకీ ఈ రాజ్యం నాదే, ఇంకొకరికి దక్కనివ్వను , నేనే ఉరిస్తంబం ఎక్కుతాను,' అంటూ, ఉచ్చు మెడకు తగిలించుకుని, ఉరి పోసుకున్నాడు . 
[పుస్తక సేకరణ - రేపు మరో కధ ]



No comments:

Post a Comment