Monday, September 2, 2013

వేములవాడ భీమకవి

వేములవాడ భీమకవి 

భీమకవి కాలం ఇంతవరకూ ఎవరూ నిర్ధారణ చేయలేదు కాని ఆయనగురించి చెప్పుకునే కథలు చాలా వున్నాయి. ముఖ్యంగా జననం గురించి. గోదావరిమండలంలో ద్రాక్షారామ భీమేశ్వరాలయం ప్రాంతంవాడని ఒకకథనం. ఆయన తల్లి బాలవితంతువు, సాటి చెలులతో కలిసి భీమేశ్వరస్వామి దర్శనసమయంలో స్త్రీలకోరికలు వింటూ నాకు నీవంటిపుత్రునివ్వమని కోరిందిట. స్వామి ఆవిడ అభీష్టం నెరవేర్చాడు. ఆవిడ తనముద్దుబిడ్డకి భీమన అని పేరు పెట్టుకుని పెంచుకుంటూంది. వూళ్లో ప్రజలు మాత్రం ఆమె మాట నమ్మక, వెలివేశారు. అ పిల్లవాడిని సాటిపిల్లలు రండాపుత్రుడని గేలి చేయగా, అతడు వచ్చి తల్లిని తనతండ్రి ఎవరని అడిగితే, ఆమె భీమేశ్వరుడేనని చెప్పిందిట. అంతట, ఆ చిన్నవాడు భీమేశ్వరాలయానికి వెళ్లి, “నన్ను వూళ్లో అందరూ తండ్రి లేనివాడని గేలి చేస్తున్నారు. నువ్వు నిజంగా నాతండ్రివవునో కాదో చెప్పకపోతే ఇక్కడే తలపగలగొట్టుకు చస్తాను” అని పట్టు బట్టాడు. అప్పుడు భీమేశ్వరుడు ప్రత్యక్షమయి, అతనితల్లిమాట నిజమేననీ, తానే తండ్రిననీ చెప్పి, అందుకు నిదర్శనంగా భీమన ఆడినమాట సత్యమవుతుందని వరం ఇచ్చాడుట.

 ఒకనాడు వేములవాడలో ఒక బ్రాహ్మణుని ఇంటిలోసంతర్పణ జరుగుతోంది. ఆ ఇంటి యజమాని అందరినీ ఆహ్వానించాడు, కానీ భీమన్నను మాత్రం ఆహ్వానించలేదు. భీమన్న పిలవకపోయినా సంతర్పణకు వెళ్ళారు. నేరుగా లోపలికి వెళ్ళి కూర్చొని, తనకు కూడా భోజనం వడ్డించమని అడిగారు. అక్కడి వారంతా భీమన్నను బయటకి పంపివేసి, నీవు లోనికి రావద్దని చెబుతూ తలుపులు వేసేశారు. బాలభీమన్న “భీమేశ్వరుని తనయుడనైన నన్ను విస్మరించి మీరు ఈ పూట భోజనం చేయలేరు” అని చెప్పి బయట అరుగుపై కూర్చొన్నారు. లోపల జరుగుతున్న తంతు అంతటినీ గమనిస్తూ వడ్డన ప్రారంభమయ్యేంత వరకు ప్రశాంతంగా ఉన్నారు. వడ్డన పూర్తీ అయిన వెంటనే ఈ క్రింది పద్యం చెప్పారు.  

     ఉ.    “గొప్పలు సెప్పుకొంచు ననుఁ గూటికి బంక్తికి రాకుమంచునీ 
              ద్రిప్పుడు బాపలందఱునుఁ దిట్టిరిఁ గావున నొక్క మాఱ మీ 
              యప్పములన్ని కప్పలయి యన్నము సున్నముఁ గాగ మాఱుచున్ 
              బప్పును శాకముల్ పులుసు బచ్చడులుఁ జిఱురాలుగావుతన్”

భావము: తాము (సత్బ్రాహ్మణులమని) గొప్పలు చెప్పుకుంటూ, నన్ను భోజనమునకు రావద్దని ఈ బ్రాహ్మణులందరూ తిట్టారు. కావున ఒకసారి మీ అప్పడాలన్నీ కప్పలుగా, అన్నము అంతా సున్నముగా మారి, పప్పు, కూరలు, పులుసు, పచ్చడులు చిన్నచిన్న రాళ్ళుగా అవ్వుగాక!
          తక్షణమే వడ్డింపబడిన అన్నమంతా సున్నముగా మారింది. అప్పడాలన్నీ కప్పలై బెకబెక మంటూ గెంతుతూ, అటూ ఇటూ వెళ్తున్నాయి. పప్పు, పులుసు, పచ్చడి అన్ని చిన్నచిన్న రాళ్ళుగా మారిపోయాయి. ఈ వింత మార్పును చూసి భోజనపంక్తికి కూర్చున్న బాపలందరూ చాలా కలవరపడ్డారు. సంతర్పణ చేయిస్తున్న ఇంటి యజమాని అందరినీ  చూసి కలవరపడవద్దని చెప్పి, మళ్ళీ వడ్డించడానికి క్రొత్త విస్తరులను వేయించాడు. తీరా  అన్నపురాశి వద్దకు వెళ్ళి చూసేసరికి అక్కడ కూడా అన్నమంతా సున్నంగా మారిపోయి ఉంది. గంపలోని అప్పడాలేమో కప్పలయ్యి బయటకు ఎగురుతూ గెంతులేస్తున్నాయి. మిగితా వంటలన్నీ రాళ్ళుగా మారిపోయి ఉన్నాయి. ఆ ఇంటి యజమానికి ఎందుకిలా జరిగింది? ఏమి చేయాలి? అని దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అంతలో అక్కడి వారిలో భీమన్న చెప్పిన పద్యం విన్న ఒక బ్రాహ్మణుడు, ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్ళి ఆరుబయట కుర్చుని భీమన్ననే ఇవన్నీ ఇలా మారాలని పద్యం చెప్పాడనీ, ఇదంతా ఆ భీమన పలుకుల మూలంగానే జరిగిందనీ చెప్పాడు. అప్పుడు తెలిసింది ఆ యజమానికి  “నన్ను విస్మరించి మీరు ఈ పూట భోజనం చేయలేర”ని చెప్పిన భీమన్న మాటలకర్థం. 
        అతను వెంటనే భోజనానికి వచ్చిన బ్రహ్మణులందరినీ భీమకవి వద్దకు పిలుచుకొని వెళ్ళి, వాటిని తిరిగి భోజనపదార్థాలుగా మార్చమని అడిగాడు. అలా చేసినట్లయితే భోజనానికి రానిస్తామని చెప్పారు. వారికి భీమకవి అంతరార్థం ఇంకా అర్థం కాలేదు. భీమకవి “మీరందరూ గొప్పజాతి వారే కదా! మరి మీరే మార్చుకొవచ్చుగా. నేను మీ అంతటి వాన్ని కాదు కదా! నా వలన ఏమవుతుంది? చెప్పండి?“ అని అడిగాడు. ఆ బ్రహ్మణుల కన్నులు తెరచుకున్నాయి. వెంటనే వారు "భీమన్నా! మేము తప్పుగా ప్రవర్తించాము. నువ్వు మహానుభావుడివి. నిన్ను భోజనానికి రానివ్వకుండడం మా అందరి అపరాధము. మమ్మల్ని అనుగ్రహించి యథాప్రకారము వాటిని భోజనసముదాయముగా మార్చండి. అంతేకాక మీరు కూడా మాతో పాటి భోజనానికి కూర్చొని మమ్ము కృతార్థులను చేయండి. ఇప్పటి నుంచి మీతో గౌరవాభిమానాలతో నడుచుకుంటాము” అని నమస్కరిస్తూ వేడుకున్నారు. భీమకవి తిరిగి ఇంకో పద్యం చెప్పారు.
  
          మ.     "ఘనుడౌ వేములవాడ వంశజుడు ద్రాక్షారామ భీమేశ నం 
                   దనుఁడీ భీమన యంచు గుర్తెఱింగినిందల్ మానినన్ గౌరవం 
                   బుననీ విప్రులుఁ జూచిరందువలనఁ బూర్వస్థితిన్ జెంది భో 
                   జన వస్తు ప్రకరంబులన్నియు యథాస్వస్థంబు లౌగావుతాన్"

భావం: ఈ బ్రాహ్మణులందరూ, గొప్పవాడువేములవాడ వంశస్థుడు, ద్రాక్షారామ భీమేశ్వరుని తనయుడీ భీమన అని తెలుసుకొనినిందించడం మాని, నను గౌరవంతో చూసారు. అందువలన ఈ భోజన, వస్తు సముదాయమంతా కూడా మునుపటి రూపు పొంది వాటి పూర్వస్థానానికి వచ్చును గాక!
           వెంటనే మునుపటిలా అన్నపురాశి ప్రకాశించింది. కప్పలన్నీ తిరిగి అప్పడాలుగా మారిపోయాయి. చిన్నచిన్న రాళ్ళన్నీ తిరిగి పప్పు, పులుసుపచ్చడులుగా మారిపోయాయి. విస్తరులన్నీ తిరిగి భోజనంతో నిండిపోయాయి. ఇది చూసిన ఆ బాపలంతా భీమకవి మహత్యానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. వెంటనే భీమకవిని తమతోపాటి భోజనానికి తీసుకుపోయి భోజనవరుసలో అగ్రస్థానాన కుర్చోబెట్టి గౌరవించారు. ఊరివారంతా ఈ భీమన్న ద్రాక్షారామ భీమేశ్వరుని వరపుత్రుడని తెలుసుకొని మసలుకున్నారు. ఇన్ని రోజులు నిందలు మోపి, వెలివేసి బాధ పెట్టినందుకు తమను మన్నించాల్సిందిగా మాచెమ్మను వేడుకున్నారు. నాటి నుంచి వారిపట్ల గౌరవాభిమానాలతో నడుచుకున్నారు.

వేములవాడ భీమకవి ఉద్దండకవీ, పండితుడనీ, తిట్లు కవియనీ ప్రసిద్ధిగాంచాడు. ఈయన రాజస్థానములకు వెళ్ళి రాజుల నుండి సత్కారములను పొంది, తనను గుర్తించని వారిని శపించి తిరిగి ఆ రాజు భీమకవిని ప్రాధేయపడితే శాపమును తిరిగి వెనుకకు తీసుకునేవాడని ప్రతీతి.

భీమకవి గొప్పతనాన్ని గురించి శ్రీనాథుడు కూడా పొగిడాడు. భీమకవి సందర్భాన్నిబట్టి పద్యాలు చెప్పడమేగానీ, నిలకడగా ఏ కావ్యమూ రాసినట్లు కనిపించదు. రాఘవ పాండవీయమనునది - కవిరాజాశ్రయమను ఛందో గ్రంథమును రాశాడని చెప్పుకుంటారు. 

 రాజసందర్శనాలను చేస్తూ కవిత్వమును చెబుతున్న భీమకవి ఒకనాడు సెజ్జనగరం వెళ్ళారు. కళింగగంగురాజు సెజ్జనగరాన్ని పాలిస్తునాడు. భీమకవి కళింగగంగు ఆస్థానానికి వెళ్ళి అక్కడి భటులతో “తమరిని కలవడానికి భీమకవి వచ్చారని కళింగగంగురాజుతో  చెప్పమని” కబురు పంపారు. కళింగగంగు నుంచి ఎటువంటి సమాధానం రాక పోగా మరుసటి రోజున కలుద్దామని ఆ రోజుకు వెనుదిరిగివెళ్ళారు.

సరస్వతీ కటాక్షమున్న కవులన్న ఎంతటి నిర్లక్ష్యభావం” అని అతని గర్వానికి కారణమైన అతని సిరిసంపదలు కోల్పోయేలా, శాపం పెడుతూ ఈ పద్యమును భటులతో రాజుకి అందించమని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

          ఉ       వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగ గంగు తా
                   సామము మాని కోపమున సందడిఁదీఱిన రమ్ము పొమ్మనెన్
                   మోమునుఁజూడ దోషమిక ముప్పది రెండు దినంబు లావలన్
                   జామున కర్ధమందతని సంపద శత్రుల పాలుగావుతన్

భావము: వేములవాడ భీమకవి వేగిరపాటు (తొందర) చూసిన తర్వాత కూడా కళింగ గంగు కనీసం ఉభయకుశల ప్రశ్నలు వేయకుండా, కోపముతో ఇప్పుడు వెళ్ళి సందడి తీరిన తర్వాత రమ్మన్నాడు. మోము చూడని తప్పుకు(నను ఆలకించని తప్పుకు) ముప్పది రెండు దినాల తర్వాతి వేకువజాములోపు అతని సంపద (రాజ్యం) శత్రువుల పాలు గాక తప్పదు.

        భీమకవి శాపమును తప్పించడానికి ఎవరికి సాధ్యం? శాపము పెట్టిన మరుసటి రోజే వంగదేశాన్ని పాలించు విక్రమదేవుడను రాజు నలబై వేల కాలినడక సైన్యమును, మూడు వందల ఏనుగుల బలమును, నాలుగు వందల తొంబై ఐదు గుర్రాల సైన్యమును, నాలుగు వందల శతఘ్నులను(వందమందిని చంపగల యోధులను) సమకూర్చుకొని, సెజ్జనగరముపై దాడిచేసి కోటను ముట్టడించాడు.
        కళింగగంగు తన పూర్తీ సైన్యముతో ఎదుర్కొని విక్రమదేవునితో యుద్ధము చేసాడు. దాదాపు ఇరవై ఎనిమిది రోజులపాటు ఘోరయుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో కళింగ గంగు సైన్యము ప్రాణాలొడ్డి పోరాడారు. విక్రమదేవుని సైన్యములో సగభాగము కళింగగంగు సైన్యముచే నాశనము అయ్యింది. ఇరవైతొమ్మిదవ రోజున జరిగి యుద్ధంలో అనుకోని విధంగా విక్రమదేవుని సైన్యం విజృంభించి పోరాడింది.  కళింగగంగు విక్రమదేవునికి దొరకిపోయాడు. రాజు శత్రువుల చేతికి దొరికేసరికి మిగిలిన సైన్యము నాలుగు దిక్కులా పలాయనమయ్యింది. విక్రమదేవుడు ఇక యుద్ధాన్ని ఆపివేసి, కళింగగంగును బంధించి తన శిబిరానికి తీసుకు వెళ్ళాడు. మిగిలిన సైన్యం తమ రాజును విడిపించుకోవడానికి వచ్చే అవకాశము ఉన్నందున కళింగనగరములోకి ప్రవేశించే వరకు శత్రువులను ఎదుర్కొనేవిధంగా సైన్యాన్ని  అప్రమత్తపరచి జాగ్రత్తపడ్డాడు. మరుసటి రోజున సెజ్జనగరం ప్రవేశించి, కళింగగంగును కారాగారంలో బంధించి, పట్టము కట్టుకున్నాడు.
        “రవి చంద్రులు గతి తప్పిన లవలేశము తప్పబోవు నా వచనంబుల్” అన్న భీమకవి మాటలు వ్యర్థము కావు కదా? ఖచ్చితంగా 32 రోజుల తర్వాత తెల్లవారే లోపు కళింగ గంగు రాజ్యబ్రష్టుడైయ్యాడు.



కళింగగంగు నానా దేశాలు తిరుగుతూ కూటికి, గుడ్డకు నోచుకోని పేదవాడయ్యాడు. సుఖాలకు బాగా 
అలవాటుపడిన వాడగుటచే కూలి పని చేయలేక బిచ్చమెత్తుకుంటూ జీవితం గడిపాడు. ఇతర రాజ్యాలలో తననెవరూ చూసి ఎరుగరు కాబట్టి తనకు ఎటువంటి స్వాభిమానము అడ్డురాలేదు. వంట చేసుకొనే ఓపిక సత్తువలేక అన్నమో, గంజో యాచించుకొని పొట్ట నింపుకుంటూ కాలము గడిపాడు. కళింగగంగు భార్యలు ముగ్గురూ సిరియాళుడి వద్ద ఊడిగము చేసుకుంటూ గడిపారు. 
కళింగగంగు, భీమకవిని క్షమించమని అడిగి ఈ కష్టాలనుంచి బయటపడాలని తపించాడు. శాపవిమోచనముకై ప్రార్థించి, తన తప్పును సరిదిద్దుకొనే అవకాశము కోసం ఎదురుచూసాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక కళింగగంగు ఊరూరు తిరుగుతూ పెద్దాపురం చేరాడు. ఒకనాటి రాత్రి భీమకవి బంధువుల ఇంట్లో భోజనం చేసి వీధి అరుగుపై చేయి కడుక్కోవడానికి వచ్చారు. అపుడు రాత్రి నాలుగు ఘడియల సమయం. కళింగగంగు తిండి కోసం ఇల్లిల్లూ తిరుగుతూ భీమకవి ఉన్న ఇంటి వైపుకు వచ్చాడు. వస్తుండగా మార్గమధ్యంలో జొన్నలు పాతరనేయుటకై త్రవ్వబడిన ఒక పాత గోతిలో పడ్డాడు. వెంటనే అయ్యో ఒక కాలిదివిటీ కూడా లేకపొయేనే! ” అని గట్టిగా అరిచాడు. భీమకవి ఆ చీకటిలో అతని వైపుకు చూసి బిచ్చమెత్తుకొనువాడికి కాలిదివిటీ ఎక్కడి నుండి వస్తుంది. బిచ్చగాడే అయితే కాలిదివిటీ ఎందుకు గుర్తొచ్చింది. ఇతడిట్లు అన డానికి ఏదో బలమైన కారణమే ఉంటుందని గ్రహించి, “ఎవరు నువ్వు? దివిటీ కావాలంటున్నావు?” అని అడిగాడు. కళింగగంగు “అయ్యా! నేను వేములవాడ భీమకవి చేసిన బికారిని. పూర్వము అష్టైశ్వర్యములను అనుభవించి ఉండటం వల్ల అప్రయత్నంగా దివిటీ అయినాలేదే అన్నాను. నా దర్శనార్థం సాక్షాత్తు భీమేశ్వరుని వరపుత్రుడగు భీమకవి వచ్చారు. కనీసం ఆ మహానుభావుని దర్శనం కూడా చేసుకోలేదు. అందుకు తగిన ఫలితాన్ని ఇలా అనుభవిస్తున్నాను. అయ్యా! తమరెవరో మహానుభావుడిలా ఉన్నారు. ఈ ఒక్కపూటకు నాకు భోజనము పెట్టించండి. ఆకలితో కడుపు దహించుకు పోతోంది. ” అని ధీనస్వరంతో అడిగాడు.
భీమకవికి మహారాజును ఈ పరిస్థితిలో చూడగానే ఎంతో జాలి కలిగింది. ఇక ఇతన్ని ఈ అవస్థలో చూడకూడదని తలచి, తిరిగి తన రాజ్యాన్ని పొందేలా ఆశీర్వదిస్తూ, ఈ క్రింది పద్యమును చెప్పారు.

ఉ వేయి గజంబులుండఁబది వేల తురంగములుండఁ నాజిలో
రాయలగెల్చి సెజ్జనగరంబునఁ బట్టముఁ గట్టుకోవడిన్
రాయకళింగ గంగు! కవిరాజభయంకరమూర్తిఁజూడగా
బోయిన మీనమాసమునఁ బున్నమవోయిన షష్ఠినాఁటికిన్

భావము: రాజ కళింగగంగు! మహా రాజులకు సైతం వణుకు పుట్టించగల కవి అయిన నేను, భవిష్యత్తును చూస్తూ పోతే వెయ్యి ఏనుగులు, పదివేల గుర్రములు నీ చెంత ఉన్నాయి. త్వరగా యుద్ధంలో రాయలను గెలిచి, మీన మాసములో పున్నము తర్వాత వచ్చే షష్ఠి రోజుకంతా సెజ్జనగరమున పట్టము కట్టుకో.
కళింగగంగు అమితానందభక్తి పరవశుడై, భీమకవికి సాష్టాంగ ప్రణామము చేసాడు. జరిగిన తప్పుకు మన్నించమని వేడుకొని నిలబడ్డాడు. కళింగగంగును భీమకవి లోనికి పిలుచుకు వెళ్ళి భోజనము పెట్టించారు. మరుసటి రోజున కళింగగంగునకు పెద్దాపురము నుంచి సెజ్జనగరము వెళ్ళుటకు దారి బత్తెము ఖర్ఛులకు సరిపడా డబ్బు ఇచ్చి పంపారు. కళింగగంగు ఆవస్థను బట్టి రూపము మారిపోవడం వలన సెజ్జనగరంలో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. అతని తలంతా పెరిగిపోయిన జుట్టుతో, దుమ్ముధూలితో జడలుగా కట్టుకుపోయింది. గడ్డము, మీసాలు బాగా పెరిగిపోగా, బక్కచిక్కిపొయి ముడతలుపడ్డ శరీరముతో ఉన్న కళింగగంగును మహా రాజుగా, మకుటధారిగా చూసిన జనం ఇప్పుడెలా గుర్తు పట్టగలరు.
చాలా రోజులుగా పగటివేషగాళ్ళు కొందరు సెజ్జనగరానికి వచ్చి ప్రభువు విక్రమదేవుని సందర్శించి, వీధుల్లో పగటివేషాలను వేస్తూ, వారి నైపుణ్యంతో పట్టణప్రజను ఆనందడోళికల్లో ముంచెత్తుతున్నారు. రాజకళింగగంగు సెజ్జనగరము చేరునప్పటికి సిరియాళుడు ఆ నగరమును పాలించుటలేదు. సిరియాళుడు వైరాగ్యము కలగడంతో, రాజ్యమును వదిలి తపోవనాలకు వెళ్ళిపోయాడు. విక్రమదేవుడికి, సిరియాళుడి తర్వాత సరైన పరిపాలనాదక్షుడు దొరకలేదు. వంగదేశము పాలించుటకు తన పెద్దకుమారుడైన ఆనందదేవుని నియమించి సెజ్జనగరానికి తిరిగివచ్చాడు.
విక్రమదేవుడికి పగటివేషాలన్నా, వీధినాటకాలన్నా చాలా ఇష్టము. అందువల్ల ఆ పగటివేషగాళ్ళకు కావలసినంత డబ్బిచ్చి వారిచే బ్రాహ్మణ, సన్యాసి, వేశ్యాది వేషములను వేయిస్తూ సంతోషముగా కాలము గడిపేవాడు. ఒకనాడు వారిని తన వేషము వేసి వినోదింపచేయమని ఆదేశించాడు. రాజు ఆదేశము ప్రకారమే వారి నాయకుడు విక్రమదేవుని వేషమును వేయగా తక్కినవారు సభాపతుల వేషమును వేసి అందరినీ అలరించారు. ఇంకో రోజు కళింగగంగు వేషమును వేసుకురావలసినదిగా, అలా చేసి తనను అలరించినట్లయితే విశేషద్రవ్యమును బహుమతిగా ఇచ్చెదనని ప్రకటించాడు. ఆ వేషగాళ్ళు కళింగగంగు రాజసము, అతని ఠీవిని గురించి వినడమే కానీ, ఎన్నడూ చూసి ఎరుగరు. అందుకు వారి నాయకుడు “ మహారాజా! మాకు ఒక నెల రోజులు గడువు ఇవ్వండి. అభ్యాసము చేసి చక్కగా కళింగ గంగు వేషమును వేసి అలరింపచేస్తాము ” అని ప్రార్థించాడు. విక్రమదేవుడు కూడా అందుకు సరే అన్నాడు. అంతేకాక వారికి నెల రోజులకు వసతినీ, సరిపడా కావలసిన వంటపదార్థాలను ఇచ్చాడు. ఆ వేషగాళ్ళందరు కళింగగంగు వేషానికి సాధన మొదలుపెట్టారు. కానీ వారిలో ఒక్కరిలో కూడా ఆ రాజఠీవి కనపడలేదు. విక్రమదేవుడు ఇచ్చిన గడువు దగ్గరపడుతోంది, కానీ వారికి ఆ వేషం వేయగల సమర్థుడు మాత్రం దొరకనేలేదు. వారి ధైర్యము కూడా రోజు రోజుకు తగ్గిపోతోంది. చివరకు వేషము వేసే వాడికి వేయి గద్యాణములు బహుమతిగా ఇస్తామని చాటింపు కూడా వేయించారు. ఈ చాటింపు అప్పుడే సెజ్జనగరములో అడుగుపెట్టిన కళింగగంగు చెవినపడింది. ఆ వేషగాళ్ళ నివాసస్థలానికి వెళ్ళాడు. వారితో “ఈ వేషమును నేను వేయగలను. కళింగగంగును చూసిన వాడిని. అంతేకాక నేను ఆ రాజు పోలికలు కలిగినవాడిని. మా ఊరి వారంతా నేను అచ్చం కళింగగంగులా ఉంటానని చెబుతారు. ఆ ద్రవ్యమేదో నాకు ఇప్పించండి. ఆ వేషమును నేను వేస్తానని” వారిని ఒప్పించాడు. ఈ వేషమును వారు ఎందుకు వేయాల్సివచ్చిందో అడిగి తెలుసుకున్నాడు. విక్రమదేవునిపై ఎత్తువేయడానికి తగిన అదను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వేషగాళ్ళు కళింగగంగుకు భోజనవసతులను కల్పించారు. వారము రోజులలోనే బక్కచిక్కిన అతని దేహము పుష్ఠిగా అయ్యింది. వేషమును వేసే రోజుకంతా మునుపటి తేజస్సును పొందాడు. కోటలోనే ఉన్న కళింగగంగు దుస్తులను, ఆభరణాలను, ఆయుధాలను, గుర్రాన్ని రాజుగారికి కబురు పంపి తెప్పించుకున్నాడు. విపరీతముగా పెరిగిపోయిన గడ్డాన్ని తీసివేయించడానికి మంగలిని పిలిచించుకున్నాడు. ఆ మంగలితో కళింగగంగుకు మునుపు ఎలా క్షవరము చేసేవాడివో తనకు కూడా అలానే చేయమని చెప్పాడు. అర్ధక్షవరము అవ్వగానే ఇతను స్వయాన తన రాజు కళింగగంగేనని గుర్తుపట్టాడు. తమ రాజుపట్ల అభిమానమున్న వాడు కావున “మహారాజా నేటికి తమరి దర్శన భాగ్యము కలిగినది” అని సంతోషముతో బదులిచ్చాడు. కళింగ గంగు అతనిని ఈ విషయమును ఎక్కడా ప్రస్తావించకుండా, మనసులోనే ఉంచుకొని, జరగబోయేది చూడమని ఆదేశించాడు. స్నానాదికాల తర్వాత వస్త్రాధ్యాలంకారములు ధరించి, తన వజ్రాయుధమును తీసుకొని తాను పూర్వము ఎక్కే గుర్రమును అధిరోహించి వీధిలోకి వెళ్ళాడు. వేషగాళ్ళందరూ వాళ్లకు తగిన మంత్రి, సామంతాది వేషాలను వేశారు. గుర్రం కూడా తన యజమాని కళింగగంగును గుర్తుపట్టి మిక్కిలి ఉత్సాహముతో కదంతొక్కింది. చూసినవారందరూ అచ్చం కళింగగంగురాజులానే ఉన్నాడే అని ఆశ్యర్యపడ్డారే, కానీ ఒక్కరు కూడా అతడు కళింగగంగురాజేనని ఊహించలేకపోయారు. రాజకళింగగంగు తిన్నగా కోటలోకి ప్రవేశించి, విక్రమదేవుని ఎదుటకు వెళ్ళి, గుర్ర్రంనుంచి దిగి నిలబడ్డాడు. విక్రమదేవుడు కూడా అందరిలాగే అచ్చం రాజకళింగగంగులానే ఉన్నాడని అతన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. కళింగగంగు “మహారాజా! తమరు అనుమతిస్తే కళింగగంగు రాజఠీవిని, గాంభీర్యాన్ని ప్రదర్శించి చూపిస్తాను” అని చెప్పాడు. విక్రమదేవుడు మిక్కిలి ఉత్సాహముతో, అలానే త్వరగా చేసి చూపించమని అడిగాడు. కళింగగంగు నిండు సభలో తన గుర్రాన్ని ఆ వైపు నుంచి ఈ వైపుకు, ఈ వైపు నుంచి ఆ వైపుకు దుమికిస్తూ, మధ్యమధ్యలో తన వజ్రాయుధమును తీసి ఝుళిపిస్తూ, విక్రమదేవుని దగ్గరగాపోయి రెప్పపాటిలో తన ఆయుధంతో విక్రమదేవుని తల నరికేసాడు. వేషగాళ్ళందరూ తమకు ఏ శిక్ష పడుతుందో ఏమోనని భయపడగా, కళింగగంగు అక్కడివారందరినీ ఉద్దేశించి “ నేను వేషగాడిని కాదు. మీ కళింగగంగురాజును. భీమకవిని కలిసి, ఆయన్నుంచి శాపవిమోచనము పొందివచ్చాను. ఆయన ఆదేశానుగ్రహాల వలన ఈవిధంగా మన శత్రువును తుదముట్టించి మన రాజ్యమును చేజిక్కించుకోగలిగాను. ఇక అందరూ అప్రమత్తులై జరుగాల్సిన పనుల చూడమని ఆదేశించాడు. విక్రమదేవుని దహన సంస్కారాలను జరిపించాడు. ఈలోపు విక్రమదేవుని అనుచరగణము, అతని సైన్యము ఏకమై, కళింగగంగుపై యుద్ధానికి సిద్ధపడ్డారు. విక్రమదేవుని సైన్యంపోగా, భీమకవి భవిష్యత్తు చూసి చెప్పిన ప్రకారముగానే 1000 ఏనుగులు 10,000 గుర్రలసైన్యము కళింగగంగు పక్షాన నిలిచింది. ఈ సారి భీమకవి ఆశీర్వాదబలము ఉన్నందున కళింగగంగు తిరుగులేని విజయముతో షష్ఠిలోపు పట్టాభిషేకము చేసుకొని సింహాసనము అధిష్టించాడు.
పట్టాభిషేకము తర్వాత తనకు సహాయం చేసిన వేషగాళ్ళను, మంగలిని తగిన పారతోషికము ఇచ్చి సంతోషపెట్టాడు. భీమకవిని తానే స్వయంగా వెళ్ళి తన ఆస్థానమునకు సభక్తియుక్తంగా పిలుచుకువచ్చి పూజించాడు. తగిన విధంగా సత్కరించాడు. నాటి నుండి భీమకవి కొంత కాలము అతని ఆస్థానమునే ఉండి, రాజ్యపాలనలో సహాయపడుతూ కళింగగంగును అనుగ్రహించారు. ప్రజలు కూడా తమ సమస్యలకు పరిష్కారములము పొందుతూ మిక్కిలి భక్తియుక్తులతో మెలిగేవారు.





1 comment:

  1. పద్మిని భావరాజు గారికి నమస్కారం

    శ్రీ వేములవాడ భీమకవి చరిత్రకు సంబంధించి సమాచారాన్ని మీ బ్లాగులో చాలా చక్కగా టఫా చేసారు. అందుకు మీకు ధన్యవాదాలు

    శ్రీ వేములవాడ భీమకవి జీవితం మీద శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం వారు అధ్యయనం చేస్తున్నారు

    శ్రీ వేములవాడ భీమకవి జీవిత వివరాలకు : www.shribheemalingeswaraswamy.org సందర్శించండి

    మీ విలువైన సలహాలను sbsdevastanams@gmail.com ద్వారా మాతో పంచుకోగలరు.

    ReplyDelete