Thursday, September 12, 2013

బారిష్టర్ పార్వతీశం

మీరెప్పుడైనా లండన్ వెళ్ళరా? వెళితే ప్రయాణానికి ఏమి సర్దుకుంటారు? ఇదిగో, ఈ బారిష్టరు గారు ఏమి సర్డుకున్నారో లిస్టు చదవండి...

దంత ధావనానికి - 10 కచ్చికలు నలిపిన పొడుం, నాలిక గీసుకోడానికి తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు, సీసాలో కొబ్బరి నూనె, దేశవాళీ దువ్వెన్న, బొట్టుకు కొబ్బరి చిప్పలో చాడు, మొహం చూసుకోడానికి పావలా పెట్టి అడ్డం, బట్టలు, 15 రూ . బట్ట ఇవ్వగా టైలర్ తనకు మిగుల్చుకుని మిగతా దానితో కుట్టగా కురచయిన కోటు, జపాన్ సిల్కు యెర్ర తలగుడ్డ, నారింజ రంగు వేసిన ట్రంకు పెట్టె, మడత మంచం, బొంత, మంచి నీళ్ళకు మర చెంబు, అట్లాపెనం, గోధుమపిండి, ఆవకాయ.... 

నాకు తెలుసండీ మీరు పట్టేస్తారని, నిజమే, ఇవన్నీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు 'బారిష్టర్ పార్వతీశం ' నవలలో పార్వతీశం లండన్ వెళ్ళే సన్నివేశంలో రాసినవి. ఈ హాస్య నవల 1924 లో మొదటి భాగం ప్రచురితం అయ్యింది. తెలుగు హాస్య నవలా చరిత్రలోనే మూడు భాగాలుగా ముద్రించబడి, చిరస్థాయిగా నిలిచిపోయింది. 

ఇక ఈ నవల కధాంశం తెలుగు తప్ప మరొక భాష తెలియని పార్వతీశం, స్నేహితుల ద్వారా లండన్ వెళితే బారిష్టర్ చదవచ్చు అని తెలుసుకుని, ఇంట్లో చెప్పకుండా కొంత డబ్బు సమకూర్చుకుని బయలుదేరతాడు. అవిగో, ఏమి సర్డుకోవాలో తెలియక పైవన్నీ సర్దుకుంటాడు. ఇక స్టేషన్లో టిక్కెట్లు ఇచ్చే అరవ్వాడిని " నేను ఎక్కడికి వెళితే నీకెందుకు, టిక్కేట్టియ్యి, నీ మొహం చూస్తే ఉలి ఆడిన తిరగట్రాయి (అతని మొహం నిండా స్పోటకం మచ్చలుట) , నీ తలకాయ చూస్తే సున్నం పిడత గుర్తొస్తున్నాయి," అంటూ వర్ణించడం కడుపుబ్బా నవ్విస్తాయి. ట్రైనేక్కి బట్టలు ఆరేసుకునేందుకు తెచ్చిణ కొబ్బరి తాడుతో రైలు చైనుకు మడత మంచం, సామాను కడతాడు. రైలాగిపోయి, జరిమానా కట్టమన్న గార్డుని దబాయించి , చెన్నపట్నం చేరి, కొలంబో వెళ్ళే స్టీమర్ ఎక్కుతాడు. అందులో, భోజనానికి పెట్టిన రొట్టేముక్కలో, చివర పళ్ళున్న చెంచా (ఫోర్క్) ను దభీ మని దించగా, రొట్టె యెగిరి, నాలుగు ప్లేట్ల అవతల తల దాచుకోగా, పళ్ళెం విరుగుతుంది. ఇలా అమాయకత్వంతో కూడిన గడుసుదనంతో ఆద్యంతం నవ్విస్తూ కొలంబో నుంచీ లండన్ చేరి, బారిష్టర్ చదివి, స్వాతంత్ర్య పోరాటానికి కృషి చేస్తాడు. ఈ నవల ఎంతగా ప్రాచ్ర్యం పొందిందంటే, మొక్కపాటి వారి పేరు మరచి, 'పార్వతీశం సృష్టికర్త' అని పిలిచేవారట. 

ఈ నవల మొదటి భాగం పొందినంత ఆదరణ మిగిలిన రెండు భాగాలూ పొందకపోయినా, తెలుగు హాస్య నవలల్లో ఇదొక మణిపూస అని చెప్పవచ్చు. ఎప్పుడైనా ఈ పుస్తకం దొరికితే తప్పక చదవండి....

                                             

No comments:

Post a Comment