Friday, September 13, 2013

కొల్లూరు విజయశర్మ

ఈ అక్కయ్య నాకు ముఖ పుస్తకం ద్వారా పరిచయం అయ్యారు. మంచి అభిరుచి కల పాఠకురాలు. తను అందించిన సేకరణలు అన్నీ ఒక చోట పోస్ట్ చేస్తున్నాను....

ప్రేమకుం గల్గు కారణంబేమనగల?
మింతిరో నిన్నుజూడ ప్రేమించూటె సుమీ!
ఇంతియే గాని వేర్వేర నెంచి చూచి 
అందపు దళ్కులనె ప్రేమనందగలమె?
తెలియుమాత్మను ఆత్మను కలిపి కుట్టు 
దారమే నాడు ప్రేమకు కారణమని"

బసవరాజు అప్పారావు 

ఎంత అందమైన,అద్భుతమైన నిర్వచనం ప్రేమకి. అనేది.ఽపురూపమైన భావన. ఎందుకు పుడుతుందో కారణం తెలియదు. అది అందపు తళుకులకి అతీతం అయినది. ఆత్మని ఆత్మని కలిపి కుట్టే దారమే ప్రేమ.


----------------------------------------------------------------------------------------------------------------------------------------

గుత్తునా యని జాతిముత్యాల్ 
గుచ్చినాడే మేలిసరముల
ఇత్తునాయని తెలుగుతల్లికి 
ఇచ్చినాడే భక్తితో:
నవవసంతము నవ్యవనరమ 
మావికొమ్మల కమ్మచివురులు 
పాటపాడెది పరభ్రుతంబును 
ఎవ్వరాపుదురో :
పొడుపు మల పయి రంగవల్లిక 
మింటి నడుమ ప్రచండ తేజము 
సంజమబ్బుల పైని కెంపులు
చూడరైతిరిగా"
రంగవల్లిక మాయమయ్యెను
చండ తేజము మాసిపోయెను 
సందెకెంపులు సాగిపోయెను 
వెదకుచున్నారా?:
కారు చీకటి క్రమ్మినపుడే 
చదలు మబ్బులు కప్పినపుడే 
మిణుగురైనను మెరవనప్పుడె 
వెదకుచున్నారా?:
చుక్కలన్నియు సోక్కివాలేను 
గిరులు కదలెను,తిరుగపాడెను
లోకమోహన మధురగానా 
స్వాదమోదముగ 

యుగయుగంబులనుండి మ్రోగెడు
విశ్వగాన వియత్తరంగిణి
భంగముల నుప్పొంగు నాతని
గీత శీకరముల్
పాట పాడిన పరభృతంబును
మూగవోయిన ముద్దు కోయిల
జిన్ని పికములు చిఱుత పాటలు
బిలుచుచున్నవియా


కృష్ణ శాస్త్రి(గురజాడ వారిని ఉద్దేశించి రాసిన గేయం)


----------------------------------------------------------------------------------------------------------------------------------------

శీత వేళ రానీయకు శిశిరానికి చోటీయకు 
ఎదలోపలి పూలకారు-ఏనాటికి పోనీయకు 
ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ 
మబ్బులలో ప్రతి మాయమయేవేళ 
ముసలితనపుటదుగుల సడి ముంగిటవినబడేనా 
వీటలేదని చెప్పించు వీలు కాదని పంపించు. 

కృష్ణ శాస్త్రి 

ఎంత చక్కని భావన..వయసు కాదు మనసు ప్రధానం.నిత్య యవ్వనం మనసులో ఉంటే అది మన జీవితం లో అను నిత్యం తొణికిసలాడుతుందింఅనసులో ఎప్పుడు వసంతం వెల్లివిరియాలి.కలల రెక్కలని రాల్చేసే శిశిరాన్ని మనసులోకి,జీవితం లోకీ రానివ్వకూడదు. అసలు అయిన భావన ఎవరికైనా అంతకు ముందు కలిగిందా?ముసలి తనపు అడుగుల చప్పుడు వినిపిస్తే అబ్బెబ్బే లేదు లేదు,రాడు రాడు అని చెప్పాలట. మనసుని ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంచుకోగలిగితే,నిత్య యవ్వనం జీవితం లో ఆరు ఋతువులలో ఆమని నే విరబూస్తుంది. అలా అని కవి కి మరణం అంటే భయమా?కానే కాదు.. మరణాన్ని ప్రియుడు పంపిన" ప్రణయ పల్లకీ"అంటారాయన.


--------------------------------------------------------------------------------------------------------------------------------------
నా కవిత్వం కాదొక తత్వం 
మరికాదు మీరనే మనస్తత్వం 
కాదు ధనికవాదం, సామ్యవాదం 
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ 
జాజిపువ్వుల అత్తరు దీపాలూ 
మంత్ర లోకపు మణి స్తంభాలూ 
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ 
ధర్మవీరుల కృత రక్తనాళాలూ 
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి 
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు 
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు 
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

తిలక్ 



భూమధ్యరేఖ నా గుండెలోంచి పోతోంది 
భ్రుకుటి లోపల నక్షత్ర గోళం తిరుగుతోంది 
ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు 
సూర్యుడిని చూడు నా తలమీద పువ్వు 

అట్లాంటిక్ కల్లోల తరంగాల మేను వాల్చింది నేను 
పసిఫిక్ లోతులలో రత్నాలని వెదకి తీసింది నేను 
ఉత్తధృవాన ఒకపాదం దక్షిణ ధృవాన మరోపాదం 
సర్వం సహా చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను. 

సంకుచితమైన జాతిమతాల సరిహద్దుల్ని చెరిపివేస్తున్నాను నేడు
అకుంటితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు 
చరిత్రల రక్త జలధికి స్నేహసేతువు నిర్మిస్తున్నాను రండి 
కవివచ్చస్సవితృకాంతిపూరమిది స్వేచ్చగా జలకమాడండి 

తిలక్ (వసుధైక గీతం )


మన సంస్కృతి నశించిపోతూందన్న 
మన పెద్దల విచారానికి మనవాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం. 
మనగలినదీ 
కాలానికి నిలబడగలిగినదీ వద్దన్నా పోదు. మరణించిన అవ్వ నగలు
మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్తుకోదు. 
యుగ యుగానికీ స్వభావం మారుతుంది.
అగుపించని ప్రభావాలకి లొంగుతుంది. 
అంత మాత్రాన మానని మనం చిన్నబుచ్చుకున్నట్లు ఊహించకు 
సంతత సమన్వయావిష్క్రుత వినూత్న వేషం ధరించడానికి జంకకు 

మాధుర్యం,సౌందర్యం ,కవితా 
మాధ్వీక చషకం లో రంగరించి పంచిపెట్టిన 
ప్రాచేతస కాళిదాస కవిసమ్రాట్టులనీ 
ఊహా వ్యూహోత్కర భేదనచణ 
ఉపనిషదార్ధ మహోదధినిహిత మహిత రత్నరాశుల్నీ 
పోగొట్టుకునే బుద్ధి హీనుడెవ్వడు?

ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు 
నైక నదీ నాదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు 

తిలక్.


"కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేయాలి. 
అమృతం చల్లినా,అగ్ని వర్శించినా 
అందం,ఆనందం దాని పరమావధి"-- 
తిలక్ 


"నేను నిర్మించుకున్న ఆశాచంద్రశాలలో 
కాలం కరిగి వెన్నెలయింది 
నా భావం వీణా నిక్వాణమయింది 
నా గీతం రటన్నటన్నూపుర నినాదమయింది 
నేను యౌవనాన్ని ఆనంద జీవన వనాన్ని 
ఒక్క నిశాంత నీహార కణం సోకినా 
ఒక్క కౌముదీ శీతల కిరణ రేఖ జాల్వారినా 
ఒక దయామయి అడుగు సవ్వడి పలుకరించినా 
కోటి పువ్వుల్ని పూస్తాను 
కోటి నవ్వుల్ని జల్లుతాను 

తిలక్ (అమృతం కురిసిన రాత్రి )


చావుపుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితం లో నలువైపులా అంధకారం 
మంచి గంధం లా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం 
మలుపు మలుపుకీ అలిసిపోతున్నాం 
మజిలి మజిలీ కీ రాలిపోతున్నాం 

ఆశల నులివెచ్చని పంపుల మీద స్వప్నాల చల్లుకుని 
ఆదమరిచి కాసేపు హాయిగా విశ్రమించడానికి 
అనుమతీయి తండ్రీ !

తిలక్ (అమృతం కురిసిన రాత్రి)



గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ 
జాజి పువ్వుల అత్తరు దీపాలూ 
మంత్ర లోకపు మణి స్తంభాలూ 
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు 

అగాధ బాధా పాథః పతంగాలూ 
ధర్మ వీరుల కృత రక్తనాళాలూ 
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతి సూక్తి 
నా కళా కరవాల ధగద్ధగ రవాలు. 

నా అక్షరాలూ కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు 
నా అక్షరాలూ ప్రజాశక్తుల వహించే విజయైరావతాలు 
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. 

తిలక్(అమృతం కురిసిన రాత్రి)

---------------------------------------------------------------------------------------------------------------------------------------

దేవులపల్లి వారి "ఏల ప్రేమింతును "కి ప్రేరణ నిచ్చిన డి గా చెప్పబడిన బసవరాజు అప్పారావు గారి కవిత. 

"చెట్టునకు మొగ్గ దొడిగెడు చేష్టగలదు 
కోరకమునకు వికసించు గుణముగలదు 
విరికి వలపులు వెదజల్లు విద్యగలదు
దేనికోరకిదియంతయు దేనికొరకు 
ప్రేమకొరకు ప్రేమకొరకు ప్రేమకొరకు 

కోకిలంబూరకయ పాడుకొనుచునుండే 
స్వరలహరిలోన నమృతంబు గురియుచుండె 
నమృత రసమెంతో మాధుర్యమగుచునుండె 
నెందు కొరకిదియంతయు నెందుకొరకు 
ప్రేమకొరకు ప్రేమకొరకు ప్రేమకొరకు 
(ఆరు పద్యాలలో మొదటి రెండు ) 


హృదయములు రెండు ప్రేమచేనేకమైన 
లీల :శృతి లోన వేణువులీనమయ్యె :
విశ్వమేల్లను నిండిన ప్రేమరాగ
మట్లు ,నీ రాగమెల్లరనావహించె ;

ఒక్కపరి కోకిలమ్మ
టు,లోక్కసా
రి గరుడ గంధర్వ కిన్నరీ గాన ఫణితి ,
బాలపవనుడు పూలనుయ్యాలలూపు 
నట్ల నీ పాటవమునూపె నౌర కృష్ణ !

పవనుకౌగిలి జొచ్చిన పల్లవమ్ము 
లట్తులను,నాలిచింతలనన్ని మరచి 
భవదమృఊతవేణుగానాతి పారవశ్య 
మున నచేతమటులైతిమోయి కృష్ణ !

బసవరాజు అప్పారావు.



------------------------------------------------------------------------------------------------------------------------------------------

రోజూ కనబడే నక్షత్రాల్లోనే 
రోజూ కనబడని కొత్తదనం చూసి
రోజూ పొందని ఆనందానుభూతి 
పొందడం అంటేనే కవిత్వం. 
మనకన్నా లక్షయేండ్లు పెద్దది 
మన నెత్తిమీదున్న ఆకాశం 
దూదిపింజల్లాంటి కొత్త మబ్బులతో 
తొంగిచూడ్డమే పునర్నవం"

దాశరధి.




పరిమళాలనెవడాపును,
పైరగాలినెవడాపును 
ఎవడాపును మానవతా 
రవి రుక్కును,కవి వాక్కును?

డాక్టర్ దాశరధి


నవబాష్ప ధారలో నవ్వు కాగలవు 
ముళ్ళ తీగలలోన పువ్వు కాగలవు 
యత్నించి చూడమని అంటాను నేను 
రాళ్ళ రాశులలోన రవ్వ కాగలవు 
దాశరధి


------------------------------------------------------------------------------------------------------------------------------------------

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లోనీరు తుడిచీ కమ్మని కలలిచ్చిందీ
రమ్యంగా కుటీరానా రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోనాదీపంలావెలిగింది. 
శూన్యమైనవేణువులోఒక స్వరం పలికి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది.

గుంటూరు శేషేంద్ర శర్మ.. (ముత్యాల ముగ్గు లో బాపు గారు ఈ కవిత ని పాట గా పెట్టారు.)


విత్తనం లో ఉన్న నేను 
ఒక రాగం విన్నాను:
బయటికి వచ్చి 
ఆకాశాన్నీసూర్యుడ్నీచూద్దామనీ,
చూచి ఆశ్చర్యామృతం
తాగుదామనీ అంకురించింది.
నేను చెట్టునయ్యాను 
కొమ్మల్లో చెట్టు కలనయ్యాను. 
అంటే!
రాగ రస గంధాలు
మిళితం చేసుకున్న 
పువ్వునయ్యాను.

గుంటూరు శేషేంద్ర శర్మ( ఆధునిక మహాభారతం)


ఈ ఆకాశం లో నక్షత్రాలు 
చినుకులై రాలితే
భూగోళానికి కాంతినిచ్చేది
సూర్యచంద్రులకు బదులు
ఒక ఇంద్రధనుస్సు అయితే
ఓహ్

గుంటూరు శేషేంద్ర శర్మ. 


చైత్రమాసపు గాలి వీచిందో లేదో 
చెట్లన్నీ పూయడానికే నిర్ణయించుకున్నాయి 
పూలు పెదవులు విప్పాయి 
పుప్పొడి రహస్యాలను వినిపించడానికి .
ఇప్పుడు ప్రతి చెట్టూ ఒక దేవాలయం. 
పక్షులన్నీ ఎగిరే దేవతలు 
కొమ్మ కొమ్మలో పాటల పోటీలు 
గడ్డిపోచలో కూడా గంధర్వలోకాలు 
సితారు సోకితే చాలు శబ్దాలు అప్సరసలు .
ఈ పువ్వుల్ని ఎవరు లేపారో
అవి నా వెంట పడుతున్నాయి. 
ఏవో తీపి జ్ఞాపకాలకు 
నన్ను క్రూరంగా అప్పగిస్తున్నాయి. 
ఈ కోకిలల్ని ఆ మామిడి కొమ్మ మీద 
ఎవరు పెట్టారో అవి లోకానికి 
నిద్రపట్టనీయడం లేదు. 
వసంతాన్ని తెచ్చి ఇచ్చి కోకిల్ని ఊరుకోమంటే 
ఊరుకుంటుందా?

గుంటూరు శేషేంద్ర శర్మ.


పక్షులు గాలుల్లో ఎగురుతున్న పూలు 
పూలు కొమ్మల్లో ఇరుక్కున్న పాటలు 
చైత్రం లో చెట్లు శిశువుల్నో దేవతల్నో పూస్తాయి 
గొంతుకోసి వాజులో గుచ్చిన పూలు 
నాగరికతల్ని శపిస్తున్నాయి. 

గుంటూరు శేషేంద్ర శర్మ



ఉత్తరాలు విప్పాను 
పేజీల్లోంచి వెన్నెల రాలింది . 
వాక్యాలు శారికలై చకోరికలై ఎగిరిపోయాయి 
నేనూ ధవళమూ మిగిలేము పేజీల మీద 
ఇవాళ నా హృదయం
ఒక కొత్త భావచ్చ్చాయకు అతిధి అయింది
తారల గ్రామాలలోకి 
చంద్రుడు వెన్నెల మందలను 
తోలుకొచ్చాడు. 

గుంటూరు శేషేంద్ర శర్మ. .


నేను ఒక పాటని 
అడవిలో సరిగమలు అల్లుతూ 
ముత్యాల గుంపులా పరుగులెత్తే
వాగుని 
నీలిమలో మధురిమ చల్లుతూ 
రెక్కల మీద తేలిపోయే 
పక్షిని 
తోటలో వసంతం గుండెలో గ్రీష్మం 
ఎటుపోవాలో తెలీని 
బాటసారిని 
నా వాక్యం ఒక పిల్లనగ్రోవి 
లోపల గాలి తప్ప అర్ధం ఉండదు 
గొంతు మాత్రం
ఎందుకు అంత తీయగా ఉంటుందో ?

గుంటూరు శేషేంద్ర శర్మ. 


నా ముందొక కిటికీ పెట్టు 
దాని ముందొక పచ్చలుమిసే 
పచ్చిక నేల పరువు 
దాని మీద పూలు కురిసే 
ఒక పొగడ చెట్టు పెట్టు 
దాని మీదికి కెంపులొలికే 
ఒక పూల తీగ అల్లిపెట్టు
దాని మీద ఒక రంగుల పద్యంలా 
సంచరించే సీతాకోకచిలుక 
వదిలిపెట్టు .... అంతే 
నా జీవితం 
వాక్యం లా పరిగెత్తుకుపోయి 
అక్కడ తన ఫుల్ స్టాప్ ను కలుస్తుంది. 

గుంటూరు శేషేంద్ర శర్మ. .. 


వసంతం అంటే
అందరికీ తెలియదు:
కోకిలల్ని కోల్పోయిన 
కొమ్మలకే తెలుసు;
పాటల్ని కోల్పోయిన
పక్షులకే తెలుసు 
వసంతం వసంతం కాదు 
పూలు నిట్టూర్పులు 
విడుస్తున్న ఋతువు 

గుంటూరు శర్మ.


ప్రేమని గురించి ఉత్ప్రేక్షలు పేనుతుంటే 
గుండెని కోకిల తన్నుకుపోయింది.
గజల్ గురించి రాద్దామని కూర్చుంటే
రాత్రి కవిత్వం లో తడిసిపోయింది.

గుంటూరు శేషేంద్ర శర్మ


ఒక పువ్వు వికసించిందని పిలుపు వస్తే
వెళ్లి దర్శనం చేసుకున్నాను.
సూర్యోదయం లా ఉంది. చేతులు జోడిమ్చాను నాకు తెలియకుండానే
ఎవడో తన గొంతు కోకిలలకు జన్మస్థానం అయిన వాడు
గొంతెత్తి పాడుతున్నాడు.

గుంటూరు శేషేంద్ర శర్మ. 
(ఈ కవిత వాల్మీకి రామాయణాన్ని ఉద్దేశించి రాసినది.. కావ్యం ఒక పూవు.అది సూర్యోదయం లా ఉందిఽంటే జ్ఞాన మయం. పాపాలనే,అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలుతుంది. ఆ కావ్యాన్ని ఆలపించినది ఎవరు?తన గొంతు కోకిలలకు జన్మ స్థలం అయిన వాడు(కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం).. వాల్మీకి రామాయణమే తోలి రామాయణం దానిని అనుసరించి ఎన్నో రామాయణాలు పుట్టాయి.అందుకనే తన గొంతు ఎన్నో కోకిలలకు జన్మ స్థానం అయిన వాడు అన్నారు కవి. ధ్వని ప్రాదానమైన కవిత లలోఇంత అందం ఉంటుందిఽస్వాదించే హృదయం ఉండాలే గానీ


---------------------------------------------------------------------------------------------------------------------------------------
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై 
పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి 
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో 
లతలకు మారాకులతికి యతికి 
పూలకంచాలలో రోలంబములకు రే 
పటి భోజనము సిద్ధపరచి పరచి 
తెలవారకుండ మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి 
తీరికే లేని విశ్వ సంసారమందు 
అలసిపోయితివేమొ దేవాదిదేవ!
ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని 
రమ్ము!తెరచితి మా కుటీరమ్ము తలుపు. 

కరుణశ్రీ


కూర్చుండ మా యింట కురిచీలు లేవు:నా 
ప్రణయాంకమే సిద్ధపరచనుంటి 
పాద్యమ్మునిడ మాకు పన్నీరు లేదు:నా 
కన్నీళ్ళతో కాళ్ళు కడగనుంటి 
పూజకై మా విటా పుష్పాలు లేవు:నా 
ప్రేమాంజలులె సమర్పింపనుంటి 
మాకు నారికేళము లేదు:
హృదయమే చేతి కందీయనుంటి 
లోటు రానీయనున్నంతలోన నీకు:
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి 
అమృత ఝరి చిందు నీ పదాంకముల యందు 
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి !

కరుణశ్రీ


లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర 
దీపాలు గగనాన త్రిప్పలేక 
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు 
మామూలు మేరకు మడవలేక 
పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె 
గడియారముల కీలు కదపలేక 
అందాలు చింద నీలాకాశ వేదిపై 
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక 
ఎంత శ్రమ నొందుచుంతివో యేమొ స్వామీ !
అడుగిడితివెట్లో నేడు మా గడపలోన 
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు 
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను 

కరుణశ్రీ




----------------------------------------------------------------------------------------------------------------------------------------

నా నోట నీ మాట గానమయ్యే వేళ
నాగుండె నీవుండీ మ్రోగింపవా వీణ
రాగమెరుగని వీణ రక్తినేరుగని వీణ
తీగపై నీ చేయి తీయకే గడియేని"

అంతరాంతరము నీ అమృత వీణేయైన
మాట కీర్తనమౌనుమనికి నర్తనమౌను!
ఈయనంత ప్రథాననేచోటికాచోట
నీయాలయమ్మౌను,నీ యోలగమ్మౌను"

కృష్ణ శాస్త్రి


----------------------------------------------------------------------------------------------------------------------------------------


సీతారముల్లాంటి విజయ అక్క దంపతులు 
                                         


ఆగష్టు 13 
ఎన్ని పరిమళాలో 
తోట 
తన జ్ఞాపకాలను 
ఆరవేసుకుంటుంటే :
ఎన్ని మధురిమలో 
సరిగమలు 
స్వగాతాలను 
కలబోసుకుంటుంటే :


ఆగష్టు 27 .2013 

స్వామీ ! ఎవరు చెప్పు విశ్వ మోహన దివ్య వేణు నాదం తో ఆబాల గోపాలాన్నీ వివశుల్ని చేసినది?ఎవరు చెప్పు భాషలకు అతీతంగా భారతీయ వాజ్మయం లో రస రమ్య కావ్య సృష్టికి ఆలవాలమైనది?ఎవరు చెప్పు పసిపాపల ముద్దు పాదాలు నడయాడే ప్రతి ఇంటా తన లీలా విహారాలు సాగిస్తున్నది?
ప్రపంచ సాహిత్యం లోనే నీ గాధలను మించిన మధుర మనోహర కావ్యగానాలు ఉన్నాయా కన్నయ్యా!మాటల కందని నీ త్రిజగన్మోహన రూపాన్ని ,లీలలని వర్ణించడానికి నేనెంత దానినయ్యా!
లీలా శుకుల వారి స్తుతి లోనే నిన్ను స్మరిస్తాను. 
"మధురం మధురం వపురస్య విభో 
ర్మధురం మధురం వదనం మధురమ్ 
మధుగన్ధి మృ దుస్మిత మేతదహో 
మధురం మధురం మధురం మధురమ్ "
అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు


ఆగష్టు 19 
ప్రియమైన అందరికీ..
ఒక చిన్న మాట...
జీవితం ఎంతో అందమైనది,ఎంతో చిన్నది కూడా..ఆ చిన్ని జీవితంలో.ఎన్నో మరువలేని,మరపురాని మధుర జ్ఞాపకాలు...గుంటూరి శేషేంద్ర శర్మ గారు..అంటారు"నిన్న మన జీవితంలో రంగులు కురిపించి,రాగాలు పలికించిన రోజులే నేడు నిర్జీవతారీఖులై..కేలండర్ లో వేలాడుతున్నాయి"అని..ఆమాట అక్షరసత్యం.ఒకొక్క అనుభవమ్ కొన్నాళ్ళ తర్వాత కేవలం అనుభూతిగా మాత్రమే మిగులుతుంది.ఆ అనుభూతికి మళ్ళీ ప్ర్రాణం పోయాలి అంటే..ఆ జ్ఞాపకాన్ని భద్రం చేసుకోవాలి.చిన్న నాటి తీపి గుర్తులు,పెళ్ళి,పాపాయి పుట్టిన రోజు...ఒకటేనా?....జీవితంలో ఒక్కొ క్షణం..ఒక్కో మధుర ..జ్ఞాపకమే.
ఈ ఉపోద్ఘాతం అంతా..ఎందుకంటే..కొంతమంది..ఫోటో లకి ప్రాధాన్యతే ఇవ్వరు.కొంతమంది తీసుకుంటారు..కానీ ఆ శ్రద్ధ దాచుకోవడంలో ఉండదు.ఈ మధ్య డిజిటల్ కెమెరాలు వచ్చాకాఅన్ని ఫోటోస్..సీడీ లలో...సిస్టమ్స్ లో మాత్రం..దాక్కుంటున్నాయి...సరే ..మీ టైమ్ అంతా..వృధా చేయకుండా టక టక..చెప్పేస్తాను.
మీ చిన్నప్పటి ఫోటో లని..ఒక్కసారి చూసుకోండి.ఎంత బావుంటాయి.వాటిని మన పిల్లలు,రేపు మన మనవలు చూసి ఎంత థ్రిల్ అవుతారు?ఇన్నేళ్ళ్ల్ల జీవితం,మన జీవితంలోని ప్రతి మార్పు కళ్ళ ముందు మెదులుతాయి కదూ?(మా పెదనాన్నగారి అబ్బాయి..మురళి..ఆ పనే చేసాడు.చిన్నప్పటి...ఫోటోలన్నింటినీ పదిలం చేసెసాడు...మా పెద్ద మరిది గాయత్రి....అలాగే భద్రం చేస్తాదు)..
పెళ్ళైన కొన్నేళ్ళ తర్వాత..ఆ ఫోటోస్ చూస్తుంటే ఎంత బావుంటూంది?ఆ మధుర క్షణాలాన్నీకళ్ళముందు నిలుస్తాయి.నేను ,శర్మ ఇద్దరం తీరుబాటుగా ఉన్నప్పుడల్లా..చూస్తూనే ఉంటాం.మమ్మల్ని మేం చూసుకోవడమే కాదు..ఫోటో లు అంటే కేవలం రూపాలే కాదువాటి వెనుక ఎన్నో జ్ఞాపకాలు,గుర్తులు..కొన్ని తీపి,కొన్ని చేదు.మా పెళ్ళి ఫోటోస్ లో ఉన్న వాళ్ళు కొందరు ఇప్పుడు లేరు.వాళ్ళని తల్చుకుంటే గుండె బరువెక్కుతుంది.వాళ్ళూ లేరు,కానీ వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయి ,అందుకే జీవితం..ఇంత సాఫీ గా సాగుతోంది అనిపిస్తుంది.అలాగే చాలా మందిలో ఎంతో మార్పు.మా పెళ్ళి టైమ్ కి చిన్నపిల్లలంతా.ఇప్పుడు ఇంజినీరింగ్ లు,మెడిసన్ లు,..ఇంకా రక రకాల కోర్సుల్లో ఉన్నారు.కొంత మందికి పెళ్ళీళ్ళు కూడా అయిపోయాయి.అవన్నీ చూస్తుంటే భలే గా ఉంటంది.
మీ పాపాయి లేదా చిన్నారి బాబు..ఫోటో లు కొన్నాళ్ళు ఆగి చూడండీ.ఒక పిల్ల తెమ్మెర మిమ్మల్ని తాకినట్టనిపించకపోతే చెప్పండీ.ఎంతలో పెద్దవాళ్ళయిపోతారో..వాళ్ళు.మరివాళ్ళ అలకలు,అల్లర్లు,బుంగమూతీ..అవన్నీ...ఆ ఫొటొ లలోనే కదా పదిలం.అందుకనే ఆ అందమైన జ్ఞాపకాలని అపురూపంగా దాచుకోండి.మీ మనసులోనే కాదు...సీడీ లుగా ,సిస్టం లో మాత్రమే అంతకంటే కాదు..మంచి ఫోటోలని చక్కగా ప్రింట్స్ తీయించండి.ఇప్పుడే....
విజయ
విజయా శర్మ


ఆగష్టు 17 
ఈ మధ్యే నేను కూడా ఒక క్లబ్ మెంబర్ ని అయాను. ఇన్నేళ్ళుగా అలవాటు లేకపోయినా... ఆ వ్యసనానికి దాసురాలిని అయిపోయాను. అసలు ఆ పదం వింటేనే పశ్చిమ కనుమల నుండీ తేలివచ్చే ఘాటైన,కమ్మని పరిమళం మనసుని మైమరపించేస్తుంది. ఇక చేతిలో ఆ అద్భుత పదార్ధం ఉండగా,మరో చేతిలో పేపర్ గానీ,కనీసం కంప్యూటర్ గానీ ఉంటేనా.. స్వర్గం భూమి మీద అవతరించినట్లే.. 
పేపర్ అనగానే అర్ధం అయిపోవాలి కదండీ.. నేను మాట్లాడుతున్నది కాఫీ క్లబ్ గురించి.. 
ఒకప్పుడు అందరూ లేస్తూనే కాఫీ కాఫీ అని అలమటించి అర్రులు చాస్తుంటే"యేంటో "అనుకునేదాన్ని. మెల్లమెల్లగా ఇక్కడి చలికి అలవాటు పడి.. నేనూ శాశ్వత సభ్యురాలిని అయిపోయాను. మంచి కాఫీ పడకపోతే.. ఏదో వెల్తి.. అది కూడా ఫిల్టర్ కాఫీ రుచిని వర్ణించడం నా తరమా?
ఇంతకీ కాఫీ ప్రియురాలిని అయ్యానే కానీ అందులో ఉండే రకాలు పెద్దగా తెలియవు.తెలిసినదల్లా గ్రీన్ లేబిల్,బరు వారి ఫిల్టర్ కాఫీనే.. కాస్త స్తృఆంగ్ గా. 
మొన్న మధ్య హైదరాబాద్ అయిర్పోర్త్ కి మా చెల్లెలి కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. తెల్లవారు ఝాము. అమెరికా ఫ్లయిట్ లు వచ్చే సమయం అదే కదా.. ఆ చల్లదనానికి కాఫీ తగాలనిపించిందిం. మా వారిని,మా అమ్మగారిని కూడా బ్రతిమాలినా.. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ,ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాగరు. ఇంట్లో,అదీ సమయపాలనం చేస్తూ మాత్రమే సేవిస్తారు. ఇక లాభం లేదని అలిగి ఘుమ ఘుమలతో నన్ను ఆహ్వానించిన కాఫీ స్టాల్ కి వెళ్ళాను. ఫ్లేవర్స్,రకాలు తెలిసి ఏడిస్తే కదా?"వెళ్ళి "మంచి కాఫీ "అన్నాను. అబ్బో మొత్తానికి ఏదో చేసి పీద్ద గ్లాసు నా ఇచ్చాడు ఆ రకాలుంటాయనీ తెలిస్తే కదా,, కాఫీ అది. "బాబూ ! !ఒక్కరికే "అన్నాను. ఆ వినయంగా ఒక్క కాఫీనే మేడమ్ "అన్నాడు. సర్లే మరేం చేస్తాం అని తీసేసుకున్నా .. చాలా మర్యాదగా బిల్ ఇచ్చాడు. చూద్దును కదా... కళ్ళు బైర్లు కమ్మేయి. అక్షరాలా 495 రూపాయలు. ... నమ్మలేక మళ్ళి అడిగాను. కన్ఫర్మ్ చేశాడు. ఆర్డర్ వెనక్కి తీసుకొడట. మరో గ్లాస్ అయినా ఇవ్వరా బాబూ అని బ్రతిమాలేను. సారీ అన్నాడు. మా మంచి చేసుకుందాం అని ..కొంచేం మీరు తాగి ఇవ్వండి అని బ్రతిమాలినా.. "అబ్బే.ఽచ్చంగా అంతా నీకే .పాపం అసలే కొత్తగా కాఫీ తో ప్రేమలో పడ్డావు"అంటూ తిరస్కరించేశారు. 

ఆ కప్ లో ఉన్న కాఫీ లో పావు వంతు కూడా తాగలేకపోయానుఽంత వేడి వేడి కాఫీ చల్లారిపోయింది. 
ఇదొక్కటే కాదు. ఇలాంటి చేదు కాఫీ అనుభవాలు చాలానే జరిగాయి. 
ఐ మధ్యనే మా బెంగళూరు లో హత్తి కాఫీ అని కనిపెట్టాను. చాలా బావుంది. పెద్ద పెద్ద మాల్స్ నుండీ బెంగళూఋ విమానాశ్రయం లో కూడా ఉంది. మహా అయితే 15 రూపాయలు. అన్నట్లు చిన్న కప్ లో కాఫీ.. 

నేను టీ బాగా చేస్తానని అందరూ అంటారు. మనం కలిస్తే మాత్రం కప్పు కాఫీ ఇస్తే పరమానంద భారితురాలిని అయిపోతాను సుమండీ



ఆగష్టు 21. 2013 
"మగడు మెచ్చిన చాన కాపురంలోనా 
మొగలిపూలా గాలి ముత్యాల వాన"
ఎంత అందమైన,అద్భుతమైన భావన... అసలు ఊహించటానికే ఎంత బావుంది. ముత్యాల జల్లులలో తడుస్తూ మొగలి పూల సుగంధం మనని కమ్ముతూ... ఆరుద్ర గారు ముత్యాల ముగ్గు లో టిఅటిల్ సాంగ్ లో రాసిన చరణం. .. అసలు ఈ పాటకి మూలం జానపద సాహిత్యం లో ఉంది. 
"వీధినెందరు ఉన్న వీచదే గాలి 
గడప నెందరు ఉన్న కురియదే వాన 
మా చిన్ని అబ్బాయి వీధి నిలుచుంటే 
మొగలిపూలా గాలి ముత్యాల వాన"
అని ఒక తల్లి తన బిడ్డ గురించి మురిసిపోతూ ఉంటుంది. 
ఆ మాటనే ఆరుద్ర గారు "ముత్యమంతా పసుపు"పాటలో పొదిగారు.ఎంత అందంగా పొదిగారు నాకయితే ఆరుద్ర గారు చెప్పిన మాటే నచ్చింది. అన్యోన్యత,పరస్పర స్నేహం ఉన్న జంట జీవితం లో ప్రతి క్షణం మొగలిపూల గాలి ముత్యాల వానే కదండీ .


సెప్టెంబర్ 2 .2013 
కొన్నేళ్ల క్రితం మన పండగలు వస్తున్నాయి అంటే చాలా భయపడే దాన్ని. కారణం హార్మోనల్ తేడాల వల్ల తొమ్మిదేళ్ళ క్రితం మా అబ్బాయి డెలివరీ టైములో... జీవనమాధుర్యం తో పాటు రక్తం లో కూడా తీయదనం బయటపడింది. అమ్మ కి లేదు,నాన్నగారికి లేదుఽసలు మూడు తరాలలో ఎవరికీ లేదు. షుగర్ అన్నమాట వినగానే ప్రపంచం తలక్రిందులైనట్లనిపించింది. అప్పటికి ముప్ఫయ్ రెండు నా వయసు. డాక్టర్స్ చెప్పే జీవన విధానం అంటే యే కారణాలతో వస్తుందని చెప్తారో అలాంటి లక్షణాలు నేనే లేవు. ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లినదే లేదు .ఇక వ్యాయామమా?ఒక క్లాస్(అప్పటికి ఉద్యోగం చేస్తున్నాను)ఒక బిల్డింగ్ లో నాలుగో అంతస్తులో ఉంటే మరో క్లాస్ మరో బిల్డింగ్ లో నాలుగో అంతస్తులో ఉండేవి మా సిద్ధార్ధాలో. అంటే కనీసం రోజులో పదహారు అంతస్తులు ఎక్కి దిగెసేదాన్ని. అంతా సాత్వికం ,ఆరోగ్యం అయిన జీవన విధానం. ఆందోళనలు ,ఒత్తిళ్ళు ఉన్నాయా అంటే అవీ లేవు.సాఫీ గా,ప్రశాంతంగా సాగిపోతున్న మధ్య తరగతి జీవితం. అర్ధం చేసుకునే జీవిత భాగస్వామి,బంగారు తల్లి మా అమ్మాయి.. కాకపోతే అబ్బాయి హడావిడి గా ఏదో నెలలో పుట్టేశాడుఽదీ అరకేజీ బరువుతో (కేవలం అరకేజీ).. వాడ్ని నాలుగో నెలకి ఆలా భీముడ్ణి చేసేశాననుకోండీ . 

డయాబెటిస్ అని తెలిసిన కొత్త లో జీవితం ముగిసిపోయిందనుకున్నాను. హైపో థైరాయిడిజమ్ కూడా వచ్చి,విపరీతం అయిన డిప్రెషన్ లోకివెళ్లిఫోయాను. అప్పట్లో పత్రికల్లో షుగర్ వస్తే ఇక నీ జీవితం అంతమైపోయినట్లే అన్నట్లు ఒకటే వ్యాసాలూ వచ్చేవి. అవి చదవడం,టీవీ లాలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు చూడడం.. మరింత కుంగిపోవడం.. దాదాపు ఒక ఏడాది ఇలాగే గడిచింది. హైదరాబాద్ డాక్టర్ మోహన్ డయాబెటిస్ డైరెక్టర్ డాక్టర్ శాస్త్రి గారు మా డాక్టర్.\
ఆయన ఎంతో ధైర్యం చెప్పేవారు,ఎన్నో ఉదాహరణలు ఇచ్చేవారు.. ఒక స్థితిలో మైల్డ్ యాంటి డిప్రెజంట్ కూడా ఇచ్చారు. ఇక మావారు,మా అమ్మానాన్నగారూ సరే సరి.. వాళ్లు ఎప్పుడూ నాలో ఊపిరిపోస్తూనే ఉండే వారు మాటల్లో. యేడాది తర్వాత వాస్తవాన్ని అర్ధం చేసుకున్నాను. తీపి తినకూడదు అన్నంతలో జీవన మాధుర్యాన్ని పోగొట్టుకోము.. ప్రపంచం లో ఎందరో దురదృఊశ్తవంతులున్నారు.నిజానికి ఇది చిన్న డిజార్డర్. సవ్యంగా అదుపులో పెట్టుకోవడం మన చేతుల్లో ఉంది అనే విషయం బాగా అర్ధమైపోయింది. చదువులోలాగే షుగర్ కంట్రోల్ లో కూడా నాది మంచి రిపోర్ట్స్ ఎప్పుడూ>. డాక్టర్ హైదరాబాద్ లోనే ఉన్నా బుద్ధిగా మూడు నెలలకి అవసరం అయిన అన్ని టెస్ట్స్ చేసుకుంటాను.. అంతా బావుంది. 

కానీ రెండేళ్ళ క్రితం వరకూ పండగలు వస్తున్నాయంటే భయం. టిఫిన్ చేసి పూజలు చేయలేను,నైవేద్యానికి వందలేను... అలా అనీ మానేయనూ లేను. ఏదో తప్పక చేసే దాన్ని..వంట అయి పూజకి కూర్చునే సరికి కళ్ళు తిరిగేవి,మనసు భగవంతుడి మీద,పూజ మీద లగ్నం అయ్యేది కాదు. శ్రవణం నుండీ సంక్రాంతి వరకూ ఒకలాంటి అలజడి.. విపరీతం అయిన టెన్శన్. అలాగే షుగర్ ఉందనే కాదు.చిన్నప్పటి నుండీ ఇప్పటివరకూ కాస్త ఎక్కువ తినలేను. కొద్ది కొద్దిగా నాలుగు సార్లు.తింటాను. బయటికి వెళ్తే ఎలా గడుస్తుంది?

ఈ మధ్యనే అంటే ఏడాదిన్నర క్రితం డాక్టర్ ఈ గ్లూసెర్నా ఎస్సార్ ఇచ్చారు. వెనీలా ఫ్లేవర్ లో ఉంటుంది. వేలకి తినలేని వాళ్ళు హాయిగా చల్లని నీళ్లలో మూడు నుండీ అయిదు స్పూన్స్ వేసుకుని కలిపి తాగేయచ్చు ఆనందంగా.. షుగర్ లెవెల్స్ పెరగవు సరికదా...ఇన్స్తేంట్ శక్తి ఇస్తుంది. మూడు గంటల వరకూ కాస్తుంది. అవసరాన్ని బట్టి రోజులో మూడు నాలుగు సార్లు తీసుకోవచ్చు...(వేళకి భోజనం,టిఫిన్ చేయలేనప్పుడు మాత్రమే). 

అలాగే షుగర్ పడిపోతున్నప్పుడు పంచదార,స్వీట్,పళ్ళ రసం తీసుకుంటారు కదా.ఽలా కాకుండా.. హైపోటేబ్ Hypo-Tab అనే మాత్ర దొరుకుతుంది. నేను ఇన్సులిన్ తీసుకోవడంలేదు కానీ ఇది ఇన్సులిన్ మీద ఉండేవారికి బాగా పనికొస్తుంది. ఇది కూడా డాక్తర్ ఇచ్చినదే. లో షుగర్స్ ని ఆపడమే కాకుండా అనవసరంగా హాయ్ కి వెళ్ళకుండా చేస్తుంది. .వాడేయమని చెప్పట్లేదు.నేను వాడుతున్నాను వీటిని..ంఈ డాక్టర్స్ ని ఒక మాట అడగండి. 

డయాబెటిస్ ని నేను దాచుకోకపోగా దండోరా వేసి మరీ చెప్పుకుంటున్నా ఎనిమిదేళ్ళుఆ.. మహా అయితే అనుభవాలు,సలహాలు,సూచనలు కలబోసుకుంటాం అంతే కదా అని.. కానీ ఉన్న విశయం చెప్పేను కదా అని మీ ఇంటికి వచ్చినప్పుడు కాఫీ మాత్రం శుగా లేకుండా ఇవ్వద్దు..ప్లీజ్. అస్సలు తాగలేను.స్వీట్స్ అక్కర్లేదు కాని.ంఈ తీపి కబుర్లతో పాటు కాఫీలో పంచదార కలిపే ఇవ్వంది.


ఆగష్టు 8 
ఎక్కడో ఎప్పుడో చదివిన కధ...చాలా చాలా నచ్చింది. అనగనగా ఒక ధనవంతుడు ఉన్నాదు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు.ఇంకా బయటి ప్రపంచం తెలియని వాడు. ఆ ధనికుడికి తాము ఎంత సంపన్నులమో,ఎంత అదృఊశ్తవంతులమో కొడుక్కి తెలియచెప్పాలనిపించింది. తన దగ్గిర పని చేసే పాలేరు ఇంట్లో మూడు రోజులు ఉండమని కొడుకుని పంపించాడూ. నాలుగో రోజు కొడుకు పాలేరు ఇంటి నుండీ తిరిగి వచ్చాడు. 
తండ్రి :బాబూ !ఎలా ఉందిరా నువ్వు చూసిన ప్రపంచం ?
కొడుకు :"నాన్నగారూ !మీరు నన్ను బయటికి పంపడం వలన నేను చాలా తెలుసుకున్నాను. మన ఇంట్లో చాందినీలు ఉన్నాయి... వాళ్లకి సూర్యచంద్ర దీపాలున్నాయి. మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్లకి చల్లగా పారే సెలయేరు ఉంది. మనకి అవసరానికి డబ్బు ఉంది,వాళ్లకి . స్నేహితులున్నారు. మనకి చిన్న పూల తోట ఉందిఽక్కడ ప్రపంచమే పెద్ద ఉద్యానవనం. మీరు కనుక నన్ను పంపించకూండా ఉంది ఉంటే మనం ఎంత పేదవారిమో నాకు ఎప్పటికీ తేలిసేదే కాదు నాన్నగారూ "


'గోదావరి' సినిమాలో ఈ గేయం కొంత వినే ఉంటారు... 

ఉప్పొంగిపోయింది గోదావరి తాను 
తెప్పున్న యెగసింది గోదావరి 
కొండల్లో ఉరికింది కోనల్లు నిండింది 
ఆకాశగంగతో హస్తాలు కలిపింది "''ఉప్పొంగి "'''

అడవిచెట్లన్నీని జడలోన తురిమింది 
ఊళ్ళు దండలు గుచ్చి మెళ్ళోన తాల్చింది 

వడులతో సుడులతో గరువాల నడలతో 
పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ వచ్చింది 

శంఖాలు పూరించి కిన్నెరలు మీటించి 
శంకరాభరణరాగాలాప కంటియై (ట కి వత్తు రావాలి మహాప్రాణం టైపింగ్ లో రావట్లేదు)

నరమానవుడి పనులు శిరమోగ్గి వణికాయి 
కరమెత్తిదీవించి కదలికే నడిచింది 
ఉప్పొంగిపోయింది గోదావరి తాను 
తెప్పున్న ఎగసింది గోదావరి 

ఆడవి బాపిరాజు గారు (గోధూళి )

No comments:

Post a Comment