Wednesday, September 25, 2013

కూచి నరసింహం

'సింహత్రయం' గురించి చెప్పుకుంటున్నాము కదా! ఇప్పుడు మూడవవారైన కూచి నరసింహం గారి గురించి తెలుసుకుందాం...

కూచి నరసింహం (1866 - 1940) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి,  వీరికి ఆంగ్ల సాహిత్యంలో మంచి ప్రవేశం ఉన్నది. వీరు ఎలమంచిలి, నరసాపురం, నూజివీడు పట్టణాలలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. తరువాత పిఠాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చాలాకాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
అనంతరం పిఠాపురం మహారాజా వారి సూర్యారాయాంధ్ర నిఘంటువు కార్యాలయంలో కొంతకాలం పనిచేశారు. వీరు శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, గౌరాంగ చరిత్ర (1912) లను రచించారు. ప్రముఖ ఆంగ్ల నాటకకర్త విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. వనవాసి మరియు రూపలత అనే రెండు నాటకాలను రచించారు.

 'కొత్త తెనుగొచ్చింది' అన్న పద్యాలను వ్రాసినట్లు సమాచారం. వీరు రామచంద్రప్రభు శతకం రాసినట్లు తెలుస్తోంది. 


శ్రీ కూచి నరసింహం గారు శ్రీ రామకృష్ణ పరమహంస బోధలను పద్యాలుగా వ్రాసేటప్పుడు , అక్కడక్కడా వారు గౌరాంగ భక్తిని గురించి చెప్పిన విషయాలను చదివి గౌరాంగ చరిత్రను వ్రాయాలని సంకల్పించారు. వారు రాసిన  'గౌరాంగ చరిత్రము ' అనే పుస్తకం 1912 లో ప్రచురించబడింది. గౌరాంగుడు స్వయానా శ్రీకృష్ణుడి అవతారమేనని చెప్పబడుతుంది. అటువంటి గౌరాంగుడి జననం నుంచీ, ఆయన అవతార విశేషాలను పద్య రూపంలో ఈ పుస్తకంలో కూచి నరసింహం గారు రచించారు. అందులోని కొన్ని పద్యాలు....

పుట్టగానే గౌరాంగుడు కరిగించిన బంగారంలా మెరవడం చూసిన భక్తులు 'గౌరాంగుడు' అని నామకరణం చేసారట.

కరగించిన బంగారము 
తెరగున మిసమిసలుగ్రక్కు దివ్యతనువుతో 
మెరయుటచే దధ్భక్తులు 
గరమర్మిలి బిలుతురతని గౌరాంగాఖ్యా । 

పిల్లలు ఏడుస్తుంటే, ఏదో ఒక విధంగా ఓదార్చేందుకు తల్లిదండ్రుల మనసు విలవిల్లాడుతుంది . ఏదో విధంగా కావలసినవి ఇచ్చి, పిల్లల్ని ఓదారుస్తారు. ఆ విధంగా ఏడ్చి, కావలసినవి పిల్లలు సాధించుకుంటారు కదా. కాని, గౌరాంగుడు చిన్నప్పుడు హరి నామం వినగానే ఏడుపు మానేవాడట .నాలుగైదేళ్ళ ప్రాయంలో తల్లి తెల్లటి బట్టలు తొడిగి, బడికి పంపబోగా, వెళ్లక అతడు పారవశ్యంతో నాట్యం చేస్తుంటే, చూసే వారికి ఆనందభాష్పాలు రాలేవట.

నాలుగైదేళ్ళ ప్రాయంపు బాలుడౌచు 
జూపరందరు వివశులై చూడనతడు 
నర్తనముసేయు; వారలానందభాష్ప 
ములను రాలుతు రైహికంబులను మరచి 

ఈ పుస్తకం అంతర్జాలంలో చదివేందుకు, పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేందుకు , క్రింది లంకెను ఉపయోగించగలరు.

No comments:

Post a Comment