Wednesday, December 18, 2013

మాటతీరు

'నేను కూడా అదే విషయం చెప్పాను, మరి నను చెప్పింది నీకు కటువుగా అనిపించింది, అతను చెప్తే నీకు హితవుగా అనిపించిందా ?' అడిగారు ఒకరు.

వెంటనే నాకు చిన్నప్పుడు విన్న కధ జ్ఞాపకం వచ్చింది.

అనగనగా ఒక రాజుగారు. ఆ రాజు గారికి తరచుగా తన నోటిలోని పల్లన్నీ ఊడిపోతున్నట్టు కల వస్తోంది. వెంటనే జోతిష్య పండితుడిని పిలిపించి , తన కలకు అర్ధం చెప్పమన్నాడు. 

అతను, 'రాజా! ఈ కల అశుభ సూచకంగా అనిపిస్తోంది. మీ వాళ్ళంతా, మీ కాళ్ళ ముందే రాలిపోతారు...ఇదే, ఈ కలకు అర్ధం' అన్నాడు.

రాజుకు వెంటనే బోలెడంత కోపం వచ్చేసింది, మరి రాజు తలచుకుంటే, దెబ్బలకు కొదవా? వెంటనే ఆ జ్యోతిష్కుడిని చెరలో వేయించాడు.

మరొక జ్యోతిష్కుడు వచ్చి, 'రాజా! కొంత కటువుగా అనిపించినా, వాస్తవం చెప్పక తప్పదు. త్వరలోనే నీవు నీ ఆప్తులను కోల్పోతావని, ఈ కల తెలియజేస్తున్నది,' అన్నాడు.

ఈ జ్యోతిష్కుడికి కూడా చేరసాలే గతి అయ్యింది... ఇలా రాజు గారి కల మహిమ వల్ల చాలా మంది శిక్షలు అనుభవించారు. అప్పుడు, లౌక్యం, మాటకారితనం కలబోసిన ఒక పండితుడు రాజ సభకు వచ్చి, ' రాజా! నీవు ఎంతో అదృష్టవంతుడివి. దీర్ఘాయువువి. మీ వంశం మొత్తంలోకీ నీవే చిరకాలం బ్రతుకుతావు. పూర్ణాయువుతో , ఆరోగ్యంతో, చల్లగా ప్రజలను పాలిస్తావు. ఇదే నీ కలకు అర్ధం...' అన్నాడు.

రాజు ఉప్పొంగిపోయి, ఆ జ్యోతిష్కుడికి అనేక మాన్యాలు, బహుమతులు ఇచ్చి పంపాడు.

అంతరార్ధం ఆలోచిస్తే, జ్యోతిష్కులంతా చెప్పింది వొకటే! కాని, చెప్పిన విధానంలో తేడా! 

చివరి జ్యోతిష్కుడు రాజు మనసును, ప్రవర్తనను తెలుసుకుని, ఆయన మనస్తత్వాన్ని అంచనా వేసి, విషయాన్ని చెప్పాడు. అందుకే, తనకు కావలసిన సంపదలని, రాజు మెప్పును పొందాడు. 

ఎవరయినా మాట్లాడే ముందు ఇలాగే ఆలోచించి, ఎదుటి వారి స్థితి అంచనా వేసి మాట్లాడితే, అసలు మనుషుల మధ్య విభేదాలే ఉండవు. పిల్లలతో మాట్లాడేటప్పుడు, మనం వారి స్థాయికి దిగి మాట్లాడాలి, స్త్రీలతో సున్నితంగా ప్రస్తావించాలి, పెద్దలతో, వారి స్థాయికి ఎదిగి మాట్లాడాలి. తొందరపాటు, దూకుడు మాటలతో కొందరు  ఇతరుల మనసులు చప్పున నొప్పించేస్తారు. వీటికే పుల్లవిరుపు మాటలని పేరు. ఇటువంటి వారికి అందరూ దూరమవుతారు. మంచి మాటతో మీరు మనసులు గెలుచుకుంటారు. మంచి మాట, చెప్పే పద్ధతిలో మీరు చెప్పగలిగితే, ఎవరినయినా మెప్పించగలరు. ఏమయినా సాధించగలరు. ఇది సత్యం. 

No comments:

Post a Comment