Wednesday, December 18, 2013

కదంబం 1

'అచ్చంగా తెలుగు' ముఖ పుస్తక బృందంలో వివిధ సభ్యులు అందించిన విలువైన సమాచారం...



గంగావతరణం **Himaja Prasad

ఆకాశంబుననుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు
శ్లోకంభైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంభోధి పయోధినుండి పవనాంధోలోకంకముంజేరె గం
గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్టసంపాతముల్

కపిల మహాముని కోపాగ్నికి భస్మమైన తన పితరులకు పుణ్యలోక ప్రాప్తికై భగీరధుడు గంగనుగూర్చి తపస్సుచేయగా గంగ ఆకాశమునుండి శివునితలమీదకు,అక్కడనుండి హిమాలయపర్వతము మీదకు,అక్కడనుండి భువికి,భూలోకమునుండి సముద్రములోనికి,అటనుండి పాతాళలోకానికి చేరి సగరుల భస్మరాసులపై ప్రవహించి వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగించింది.

-- తెలుగు భారతం -- లీలా ప్రసాద్ గారు.

కం. క్రోధము తపముం జెఱచును,
క్రోధము యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధము ధర్మ క్రియలకు
బాధయగుం గ్రోధిగా దపస్వికి జన్నే.....

కం. క్షమలేని తపసితనమును,
బ్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రా
జ్యము భిన్నకుంభమున తో
యములట్టుల యద్రువంబులను నివియెల్లన్ ... 
------- నన్నయ్య

-- క్రోధము - క్షమలకు సంబంధించిన సూక్తులీ పద్యాలు :

క్రోధము వలన తపస్సు చెడిపోతుంది. అణిమాద్య సిద్దులు క్రోధం
వలన దెబ్బతింటాయి. తాపసికి, ధర్మాచరణకు క్రోధం ఆటంకం.

పగిలిన కుండలో నీళ్ళు నిలవనట్లే, క్షమాగుణం లేని తాపసితనం,
గర్విష్టి సంపదలు, అధర్మ పరుడైన రాజు యొక్క రాజ్యం నశిస్తాయి.

చెరుకు రామమోహనరావు 

ఇది బ్ర. శ్రీ. వే. జటావల్లభుల పురుషోత్తం గారి 'మౌక్తికము'
గంగా సమానః ఖలు శుద్ధ ధర్మః
సత్ కామ ఏవం యమునోపమశ్చ 
తన్మేళనం యత్ర తదేవ పూతం 
క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి 

ధర్మం అనే గంగ ,కామం అనే యమున ,దాంపత్యమనే అంతర్వాహినియైన సరస్వతితో కలిసి త్రివేణీ సంగమమై తనరారే ప్రయాగనే భార్య అట.ఎటువంటి సద్భావానో గమనించండి .

'సుందరాంగుడు సోమేశ్వరుడు ' == కృష్ణ శర్మ 

చూడరారండీ జన్మతరించ చూడరారండీ
ఎంతటి సుందరాంగుడో సోమేశ్వరుడు 
సూగల క్షేత్రమున వెలసిన గిరిజాప్రియుడు 
మా అమ్మ గౌరమ్మను పెండ్లాడ వచ్చినాడు 

రంగురంగులపట్టు పంచెనుకట్టి రత్నహారాలతో దివ్యాభరణాలతో 
అష్ట సిద్ధులు ముందునడువ బ్రహ్మాది దేవతలు వెనుకనడువ
నందీశ్వర వాహనముపై కోటి సూర్యుల వెలుగుతో
మూడుపదుల వయసుతో ఎంత అందమురా నీది

సుంగంధ పుష్పమాలా అలంకారములతో 
పచ్చకర్పూరపు తాంబూల సేవనముతో 
వనశంకరిగా వెలసిన మా అమ్మ గౌరమ్మను 
పెండ్లాడవచ్చినావు మన్మధుని మించిన అందగాడా 

పాడనీ నీ సుందర రూప వర్ణన కలకాలము
సుందరరూపా సుందరేశ్వరా కల్యాణసుందరా
ఏడేడు లొకాలలో దొరకడట సదాశివుడంటి విభుడు
నిను మించిన ప్రభువు వెరేవరురా నను నీ భక్తుని చేయరా 

ఆ రీతి ననువుంచి,శివా నిను దరిజేర వరమీయరా
దేవ దేవ మహాదేవ శివశంకరా శంభోశంకరా

శ్రీదేవి == అలంపురం కవిత 

అలంపురమొక ప్రాచీనక్షేత్రం 
చాళుక్య రాజైన పులకేశిచే నిర్మితం 

ప్రాకృతిక అందాలెన్నిటికో నెలవు 
శిల్పకళలకు ఇది చక్కటి కొలువు 

గడియారపువారు చేసిన సేవలు 
క్షేత్రాభివృద్ధిలో అపురూప ఘట్టాలు 

శక్తిపీఠంగా అలంపురం విలసిల్లె 
ముక్తిరూపిణిగా జోగులాంబ భాసిల్లె 

అడుగిడినవారు అలంపురము నందు 
ముక్తిని పొందుదురు ఇహపరము నందు

                                       

శ్రీనివాస్ మంచిరాజు

ఛాయా సోమేశ్వర ఆలయం ఒక అద్భుతం.... ఇక్కడ రోజు మొత్తం ఏదో ఒక స్థంభం నీడ శివలింగం మీద పడుతుంది.... ఈ గుడి లోని శిల్ప కళను చూడడానికి రెండు కళ్ళు చాలవు.... ఈ గుడి నల్గొండ ఊరి చివరలో ఉన్న పానగల్లు అనే ఊరిలో ఉంది.... NH - 9 నుండి కేవలం 15 కిలో మీటర్ల లోపు ఉంటుంది.

                                

భావరాజు పద్మిని 

చిన్నప్పుడు మా తెలుగు వాచకంలో ఉండేది...

బళ్ళారి రాఘవ ఒకసారి గుడివాడలో హరిశ్చంద్ర నాటకం వేస్తున్నప్పుడు కాటి సీనులో ఎక్కడి నుండో ఒక కుక్క స్టేజీ మీదకు అకస్మాత్తుగా ప్రవేశించిందిట. అంతా అవాక్కయి పోయేరు. ప్రేక్షకులు గొల్లున నవ్వేరు. రాఘవ సమయస్ఫూర్తితో నాటకంలో లేని ఓ డైలాగు ... ‘‘ ఓ శునక రాజమా !నీకును నేను లోకువయిపోతినా; పొమ్ము ’’ అని దానిని అదిలించే సరికి అది అక్కడి నుండి పారి పోయిందిట. ఈ విధంగా మహా నటుడు రాఘవ ఆ నాటి నాటకం రసాభాసం కాకుండా చేసారుట.

శ్రీనివాస్ రావినూతల - నీతి కధ 

ఒక వర్తకుడు బేరగానికి తేనె అమ్ముతున్నాడు. అకస్మాత్తుగా అతని చేతిలోనుంచి తేనేగిన్నె జారి కింద పడిపోయింది. గిన్నేలోనుంచి తేనె వొలికి నేలమీద పడింది. వ్యాపారి సాధ్యమైనంత తేనెను గిన్నేలోనికి పైపైన ఎత్తి పోసుకున్నాడు. కానీ ఇంకా కొంత తేనె నేలమీద ఉంది. తేనె తీపిదనానికి ఆశపడి ఈగలు గుంపులు గుంపులుగా వచ్చి తేనె మీద వాలాయి. తియ్యని తేనె రుచి మరిగి ఈగలు గబగబా తేనెను జుర్రుకోసాగాయి. 

కడుపునిండిన తర్వాత ఈగలు ఎగిరిపోవాలని ప్రయత్నించాయి. కాని రెక్కలు తేనెకు అంటుకుపోయ్యాయిగా! అవి ఎగరాలని ఎంతగానో ప్రయత్నించాయి. కానీ ఎగరలేకపోయాయి. పైకెగరాలని ప్రయత్నించే కొద్దీ తేనెకు మరింత అంటుకుపోయాయి పాపం!

ఎన్నో ఈగలు తేనెలో విలవిలలాడుతూ చనిపోయాయి. అయినా తేనె మీది ఆశ కొద్దీ కొత్తగా ఈగలు గుంపులు గుంపులుగా రావడం మానలేదు. విలవిలలాడుతున్న,చనిపోయిన ఈగలను చూసి అయినా అవి బుద్ది తెచ్చుకున్నాయా?

ఈగల అవస్థ చూసి వర్తకుడు ఇలా అన్నాడు---'జిహ్వ చాపల్యానికి,లోభానికి గురయ్యేవారు ఈ ఈగల్లాగానే మూర్ఖులు. క్షణికమైన ఆనందాన్ని ఆశించి,లోభం కొద్దీ తమ ఆరోగ్యం పాడుచేసుకుంటారు. నానా రోగాలతో అవస్థపడుతుంటారు. త్వరలో చావు తెచ్చుకుంటారు.

నీతి:లోభం కష్ట నష్టాలకు గురిచేస్తుంది. జిహ్వను అదుపులో ఉంచాలి.

సనాతన ధర్మం

రమణ మహర్షి: బంధాల గురించి

బంధాలు నలుగు రకాలుగా చెప్పుకోవచ్చు - ‘విషయ ఆసక్తి లక్షణం’, ‘బుద్ధి మాంద్యం’, ‘కుతర్కం’ మరియు ‘విపర్యయ దురాగ్రహం’. 

‘విషయ ఆసక్తి లక్షణం’ అంటే వస్తువుల(ఇల్లు,స్తలాలు...) పై బాగా కోరికలు ఉండటం. 
‘బుద్ధి మాంద్యం’ అంటే గురు చెప్పిన భోదనలను సరిగ్గా అర్ధం చేసుకోవక పోవడం.
‘కుతర్కం’ అంటే మూర్ఖముగా గురు చెప్పిన భోదనలను అర్ధం చేసుకోవడం.
‘విపర్యయ దురాగ్రహం’ అంటే అహంకారముతో "నేను పండితుదుని", "నేను వేదాలు చదివిన జ్ఞానిని" , "నేను సన్యాసిని" అని గర్వంగా ఉండటం.

భక్తుడు: వీటిని ఎలా అధికమించు కోవాలి?

రమణ మహర్షి: 

‘విషయ ఆసక్తి లక్షణం’ ఉపశాంతము తో జయించవచ్చు . మనస్సుని చెడు మార్గాలు లోకి వెల్లకండ చూసుకుంటూ,ఫలితం లేకుండా పని చెయ్యడం ద్వారా జయించవచ్చు.
‘బుద్ధి మాంద్యం’ ని గురువు యొక్క భోదనలు వినగా వినగా జయించవచ్చు.
‘కుతర్కం’ ని ఆలోచన లేక ధ్యానము ద్వారా జయించవచ్చు.
‘విపర్యయ దురాగ్రహం’ ని అత్యంతముగా ఆలోచన మీద ద్యానము ద్వారా జయించవచ్చు.

ఏ పని ఐతే మనకి రాబొయ్యే కాలములో మళ్ళి మళ్ళి చెయ్యాలి ,అనే కోరిక కలగదో అలాంటి పనులు మాత్రమే మనం చెయ్యాలి.

కళ్యాణి గౌరీ కాశీభొట్ల - గేయం "వందనమో ఆంధ్ర ధరిత్రీ 

వందనమో..ఆంద్ర ..ధరిత్రీ...
అందుకొనుము.. కీర్తి ..ప్రశస్తి.....

1.తేట..తేట,,తెలుగు మాటలూ..
పూట..పూట..పిండివంటలూ
ఊట లూరు....కవిత ధారలూ..
విరిసే తెలుగు జానపదాలూ//వందనమో//

2.గోదావరి..తరంగ లాస్యం...
కృష్ణ వేణి..నృత్యవిలాసం...
తెలుగుజాతి గుండె రవళిలో..
పలకించిన...ఐక్య..రవమ్ములు..//వందనమో//

3.కూచిపూడి..కులుకు నర్తనం..
త్యాగ రాజు ..మధుర ..కీర్తనం
వేమరాజు నుడివిన...శతకం..
తెలుగు వెలుగు కీర్తి..కిరీటం..//వందనమో//

4.మంచితనం..మానవత్వం....
సహకారం..మమకారం..
.ఆత్మీయ..పరిమళాలు..పూసి
.అతిశయించు..అమర నందనం....//వందనమో//

భమిడి పాటి కళ్యాణగౌరి.......28/12/13.,,ముంబై...

No comments:

Post a Comment