Wednesday, December 18, 2013

బహుముఖప్రజ్ఞాశాలి బ్నిం గారు

జీవితంలో మనకు అనేక రకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. కొందరిని కలిసినప్పుడు, 'అబ్బా, వీళ్ళను ఎందుకు కలిసాంరా బాబూ..' అనిపిస్తుంది. మరికొందరిని కలిసినప్పుడు, 'అబ్బ, యెంత అద్భుతమైన వ్యక్తిని కలిసాము. వీరి నుంచీ నేర్చుకోవలసింది ఎంతో ఉంది,' అనిపిస్తుంది.అలా నేను ముఖపరిచయం లేకుండా ముఖపుస్తకం ద్వారా కలిసిన వ్యక్తే 'బ్నిం' లేక భమిడిపల్లి నరసింహమూర్తి గారు.

'నేను ఒకటో తరగతి కూడా చదువుకోలేదమ్మా, అసలు బడికే వెళ్ళలేదు,' వినయంగా అంటారాయన. కాని చందోబద్దంగా పద్యాలు వ్రాస్తారు. 'ఇది ఎలా సాధ్యం ?' అని మీరూ నాలాగే ఆశ్చర్యపోతుంటే, నాకు ఆయన చెప్పిన సమాధానమే చదవండి. ఆయన ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ బడి పేరు - అమ్మ ఒడి. ఆయన మాతృమూర్తి శ్రీమతి భమిడిపల్లి విజయలక్ష్మి గారు తెలుగు, సంస్కృత పండితురాలు. తన బిడ్డను తెలుగుజాతికే  ఆణిముత్యంగా తీర్చిదిద్దిన ఆ స్త్రీమూర్తికి పాదాభివందనం చెయ్యవచ్చు. అటువంటి స్త్రీలు పుట్టిన పుణ్య భారతంలో పుట్టినందుకు , ఒక స్త్రీగా నేను గర్విస్తున్నాను. 

తన ఊరు ఆత్రేయపురంలోనే చిన్నతనంలో చిత్రకళను కూడా అభ్యసించారు. అనేక కార్టూన్లు, పుస్తకాలకు ముఖచిత్రాలు, లోగోలు తీర్చిదిద్దారు. బాపు గారి గీతను, దర్శకత్వ శైలిని, ఆరాధించే బ్నిం గారు 'నా హృదయం బాపూ ఆలయం' అంటారు. బ్నిం గారంటే కూడా బాపు గారికి వల్లమాలిన అభిమానం. బ్నిం గారు, నేటి తరం మరచిపోతున్న 132 మందితెలుగు ప్రముఖులు గురించి వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చిత్రాలు గీసి, క్రింద నాలుగు లైన్ల కవితలతో వారికి నీరాజనం అర్పించి, తీర్చిదిద్దిన అద్భుతమైన పుస్తకం 'మరపురాని మాణిక్యాలు'. ఇందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో మొదలుపెట్టి, పింగళి వెంకయ్య గారి దాకా అనేక మంది తెలుగు ప్రముఖుల విశేషాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో వారిలోని రచయత, కార్టూనిస్ట్, చిత్రకారుడూ కలిసి ఒకేసారి కనిపిస్తారు. 

                                                 

16 ఏళ్ళకే ఆంధ్రపత్రిక వారు ఆయన కధను 'అచ్చేసి' వదిలేసారు. తరువాత ఆంధ్రజ్యోతి కూడా అవునని రెండోసారి అచ్చేసేసారు.అలా తన రచనా వ్యాసంగం మొదలుపెట్టిన ఆయన అనేక కధలు, కార్టూన్లు,నాట్య కళాకారుల కోసం 208 నృత్యరూపకాలు (యక్షగానాలు), టీవీ సీరియల్స్, పత్రికలకు సీరియల్స్, వ్యాసాలు వ్రాసారు. ముళ్ళపూడి వారి చమత్కార శైలి ఆయన అరువుచ్చుకున్నారు. 2010 లో 'కళారత్న' పురస్కారం, నాలుగు సార్లు నంది అవార్డులు గెల్చుకున్నారు. 

మామూలుగా, కాస్త పేరు రాగానే ఫ్యాన్ ఎక్కేస్తుంటాము. ఇంకాస్త పేరొస్తే, డాబా పైకి ఎక్కేస్తాము. మరికాస్త పేరొచ్చి,గుర్తింపు వస్తే,  రెక్కలోచ్చేస్తాయి. ఒకటో రెండో అవార్డులు వస్తే, మేఘాల పైన కూర్చుంటాము. ఇక బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక అవార్డులు పొందితే, తల వెనుక కనబడని విష్ణుచక్రం తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, 'నేను చాలా బిజీ' అంటారు, జనాలని గంటలు గంటలు వెయిట్ చేయిస్తారు. అలాగని బ్నిం గారు కూడా మేఘాల మీద ఉంటారని మీరు అనుకుంటే, తప్పులో కాలేసినట్టే!

ఎందరికో పుస్తకాలకు బొమ్మలు గీసి ఇచ్చారు. ఆంకర్ 'సుమ' కు తెలుగు ఉచ్చారణ నేర్పారు. ఎన్నో నృత్యరూపకాలు వ్రాసి ఇచ్చారు/ ఇస్తున్నారు. అడిగితే చాలు తప్పక సహాయపడతారు.

 నిగర్వి,స్నేహశీలి, హాస్యచతురులు, బహుముఖప్రజ్ఞాశాలి బ్నిం గారు. చక్కటి ఆత్మీయతతో, నిరాడంబరంగా మాట్లాడతారు. మెచ్చదగిన ప్రతీ అంశాన్ని గుర్తించి, మనసారా అభినందిస్తారు. ఇటువంటి అసాధారణ వ్యక్తిత్వం కల బ్నిం గారు ఎందరికో స్పూర్తిదాయకం.

No comments:

Post a Comment