Tuesday, October 22, 2013

శ్రీనాధుడి భీమఖండం


శ్రీనాధుడి భీమఖండం (భీమేశ్వర పురాణం)
------------------------------------------

మనరాష్ట్రంలో పరమ విశిష్టమైన త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షా రామం. చోళ, చాళుక్య వంశీయుల శిల్పశైలి ఈ ఆలయంలో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఇక్కడ రమారమి 381 శాసనాలు లభిం చాయి. క్రీ.శ.1080- 1484 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. అనేమంది తెలుగుకవులు ద్రాక్షారామంలో కొలువున్న భీమేశ్వరస్వామిని కీర్తిస్తూ పద్యాలు రచించారు. మూలవిరాట్టుగా పూజలందు కుంటున్న భీమేశ్వరస్వామి ఎత్తు 26 అడుగులు. కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఈ క్షేత్ర మహాత్యాన్ని తెలియజేస్తూ భీమఖండం(భీమేశ్వర పురాణం) అనే గ్రంథాన్ని రచించాడు.

భీమఖండం ఒక అద్భుత సృష్టి. మూలంలో ఈ కథ కొంత వున్నప్పటికీ ఇది చాలా భాగం శ్రీనాథ కల్పితం. ఐతే కళ్లు మిరుమిట్లు గొలిపే కల్పన ! ఈ పరిశోధకుల దృష్టిలో భీమేశ్వరుడు (అంటే, ఆ రూపం ఆవిర్భావం గురించిన కథ, స్థలపురాణాలు) కేవలం శ్రీనాథ సృష్టి. అనిదంపూర్వమైన ఘట్టాల్ని కల్పించటంలోను, పాత్రల్ని సశరీరులుగా పాఠకుల ముందు ప్రత్యక్షం చెయ్యటంలోను, వాళ్ల మనసుల్లోని సూక్ష్మభావాల్ని సైతం మనోహరంగా ప్రకటించటంలోను ఎంత శ్రద్ధ, పనితనం చూపాడో విశ్లేషించి చూపారు. 


శ్రీభీమనాయక శివనామధేయంబు
చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి
చూడంగనేర్చిన చూపు చూపు
దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తి
చేనింపనేర్చిన చెవులు చెవులు
తారకబ్రహ్మ విద్యాదాత యౌదల
విరులు పూన్పగనేర్చు కరము కరము

ధవళకరశేఖరునకుఁ బ్రదక్షిణంబు
నర్థిఁ దిరుగంగనేర్చిన యడుగు లడుగు
లంబికానాయక ధ్యానహర్షజలధి
మధ్యమున దేలియాడెడి మనసు మనసు.


ఈ పద్యం చదవగానే తెలుగువారికి "కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ" అనే పోతనగారి పద్యం చప్పున గుర్తుకు వస్తుంది. రెండు పద్యాలూ భక్తిభావ భరితములే! అయితే, శ్రీనాథుడు చెప్పే పద్ధతిలో రాజసం రాణిస్తున్నది; పోతన కవితలో పారవశ్యం లాస్యంచేస్తున్నది. వస్తుతత్త్వం ఒకటే అయినా, కవి వ్యక్తిత్వాన్ని బట్టి కవితలో భేదం కనిపిస్తున్నది. సీసపద్యపాదాలను సమవిభక్తం చేసి, పూర్వార్ధంలో భీమేశ్వరాకృతిని సమాసఘటనంతో సాక్షాత్కరింపజేసి, ఆ మూర్తిని అర్చించాలని ఆదేశిస్తున్నట్లున్నది శ్రీనాథుని సీసం. పోతన సీసం పురుషోత్తముని పేర్లు చెప్పి సంకీర్తనం చేస్తున్నట్లున్నది. లాటానుప్రాసాన్ని పాదాంతాల్లో నిలిపి పద్యానికి తూగు శ్రీనాథుడు కల్పిస్తే, పోతన ప్రతిపాదఖండాంతంలోనూ నిలిపి పునరావృత్తిని ద్విగుణీకృతం చేసి భక్తిమత్తచిత్తవృత్తిని వ్యంజింపచేశాడు. శ్రీనాథుని శైలిలో భక్తి మునిగిపోతుంది; పోతన శైలిలో భక్తి తేలియాడుతుంది.

                                           

పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదిట. ఈ విషయాన్ని శ్రీనాధుడు భీమేశ్వర పురాణంలో ఈ కింది విధంగా చెబుతాడు.

“హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్‌
ఖేటము లోహదండము నొగిం ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్‌”

క్షీరసాగర మధనసమయములో లోకభయంకరమైన హాలాహలం పుట్టింది. జగత్కుటుంబియైన పరమేశ్వరుడు లోకకళ్యాణార్థం దానిని మ్రింగడనికి చేయి చాచినాడు. ఫణిధరుని ప్రభావం వల్ల హాలాహలం క్రమంగా కుంచించుకుపోయింది. జగద్వ్యాపి యైనది మొదట జలధరమంత అయింది. తర్వాత క్రమంగా ఏనుగంత - వరాహమంత - కోకిలాకారమంత - నేరేడుపండంత - చివరికి చుక్కంత అయ్యింది. అది ఆదిదేవుని అంగిటిలో నిలిచి ఆవగింజంత మచ్చగా మిగులుతుంది! ఈ పరిణామాలంకారం అద్భుతరసమును ఆవిర్భవింప చేస్తున్నది. "ఇంతితై, వటు డింతయై " అన్న పోతన పద్యం ఈ పద్యానికి తిరుగవేత.

జలధర మంతయై, కదటి చందము గైకొని, సూకరాకృతి
న్నిలిచి, పికంబుతో దొరసి, నేరెడుపండును బోలె నుండయై
కలశపయోధి మంథనముఖంబున బుట్టిన యమ్మహా హలా
హలము క్రమంబున న్శివుని హస్తసరోరుహ మెక్కెఁ జుక్కగన్ !

No comments:

Post a Comment