Wednesday, October 30, 2013

పోతన భాగవత మధురిమలు

పోతన భాగవత మధురిమలు 
------------------------------
అపురూపమయిన నిధుల వంటి కావ్య సంపద మన భారతీయుల సొంతం. కావ్యాల ద్వారా నీతిని ఉపదేశించడం మన దేశంలో అనాదిగా వస్తున్నా ఆచారం. ఈ లోకంలో మానవులు పాటించి తీరవలసిన ఆత్మగౌరవం, సమయస్పూర్తి, ధర్మాచరణ, కార్య దీక్ష, సంఘ సేవ, దానం, పరోపకారం, త్యాగం, వంటి సద్గుణాలను అవి అతి రమ్యంగా, నర్మగర్భితంగా వివరిస్తున్నాయి. సంప్రదాయ సాహిత్యంలో వర్తమానకాలాన్ని సరిదిద్దగల ఉజ్వల సత్యాలు ఉన్నాయి. అటువంటి భక్తి రహస్యాలను, తత్వాన్ని బోధించే విశిష్టమయిన పురాణం భాగవతం. 

వేద విభజన, పురాణ రచన చేసినా వ్యాసుడికి అశాంతీ, అసంతృప్తి తొలగలేదు. నారదుడి ప్రేరణతో, వ్యాస మహర్షి అంతరంగం నుంచి ఉబికి వచ్చిన మధురామృత సారం భాగవతం. అసలే భక్త హృదయ భృంగాలకు మకరందం వంటి భాగవతం... 'పలికేది భాగవతమట ...పలికించు వాడు రాముడట...' అంటూ...రాసేది తానుకాదని, రామచంద్రుడేనని చెప్పుకుని, ప్రతి పద్యాన్ని రామాంకితం చేస్తూ, ఒక మమైక స్థితిలో పారవశ్యంతో, మహాభక్తుడయిన పోతన తెనిగించాడు.భాగవతం వేదమనే కల్ప వృక్షము నుంచి ఉద్భవించినది. శుక యోగీంద్రుని ముఖము నుండి భావుకుల రసాస్వాదనకు వేలివడిన అమృత రస ఫలము. శ్రీమద్భాగవతం సర్వపాపాహారం, శ్రవణానందకరం. అంతర్లీనంగా భాగవతంలో దాగున్న కొన్ని జీవిత సత్యాలను చదవండి.

అనుకోకుండా వచ్చి పడే ఆపదల అందకారాలు తోలగాలంటే, లక్ష్మీపతి స్తోత్రమనే సూర్య కిరణాలు కావాలి. భాగవత ఆరంభంలోనే, " కలియుగంలో మనుషులు శరీరబలం లేని నీరసులవుతారు. వారికి సత్కార్యాలు, తప్పస్సు, క్రతువులు చేసే శక్తి ఉండదు. అందుకే కలి యుగంలో తరించడానికి హరి నామస్మరణ, హరికధా శ్రవణం ఈ రెండే మార్గాలని" చెప్పబడ్డాయి. అందుకే శక్తి లేని వారు, చాందసంగా ఉపవాస దీక్షలు అవి పాటించనక్కర్లేదు. యే పని చేస్తున్నా, హరి నామ స్మరణలో మనస్సు లయం అయ్యి ఉంటే చాలు. అదే ముక్తికి మార్గం.

కాల ప్రభావము (ప్రధమ స్కందము ) : ఆకాశంలో మేఘాలు గాలి ప్రభావం వల్ల ఎలా కలుస్తూ, విడిపోతూ ఉంటాయో, ఈ ప్రంపంచంలోని సమస్త జీవులూ అలా కలిసివిడి పోతూ ఉంటారు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కాలమే అన్నీ నడిపిస్తూ ఉంటుంది. అతి విచిత్రమయిన ఈ కాలాన్ని దాటడానికి ఎంతటి వారికయినా సాధ్యం కాదు.

శ్రీహరిని చేరే మార్గము(ప్రధమ స్కందము): గోపికలు కామోత్కంతట వల్ల, కంసుడు భయం వల్ల, శిశుపాలాదులు విరోధంతో, యాదవులు బందుత్వంతో, శ్రీహరిని చేరుకున్నారు. ఎలాగయినా శ్రీహరిని చేరవచ్చు.

సృష్టి క్రమము ( ద్వితీయ స్కందము ): శ్రీహరి నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి జీవరాశులు, ఉద్భవించాయి. అన్నిటికీ మూలమయిన నారాయణుడు జన్మ- మృత్యువు వంటివి అంటని అనంతుడు, సర్వసంపన్నుడు, ఆదిమధ్యాంత రహితుడు. అతనిచే సృష్టించబడిన వాటిని గురించి తర్కించే వాళ్లకి దుర్లభుడు.

భగవంతుడిని పూజించే విధానం( చతుర్ధ స్కందము ): నారద మహాముని, శ్రీహరి అనుగ్రహం కోసం తపస్సు చెయ్యడానికి వెళుతున్న చిన్నారి ధ్రువుడితో ఇలా చెబుతున్నారు. ఆ శ్రీహరిని పూజించుటకు భక్తితో సమర్పించిన గడ్డి పరకలయినా చాలు. కలువకన్నుల ఆ స్వామికి కలువ పూవులయినా చాలు. తులసీదామధరునికి తులసి దళములయినా చాలు. ఆ నిర్మల చరితుడికి వన పుష్పాలే చాలు. ఆ పక్షి వాహనుడికి పత్రీపత్రాలే చాలు. ఆ ఆది మూలుడికి కంద మూల నైవేద్యమే చాలు. ఆ పీతాంబరుడికి నార వస్త్రాలే చాలు. అతిశయించిన భక్తితో, మట్టితో గానీ, రాతితో గానీ, చెక్కతో గానీ, చెయ్యబడిన విగ్రాహాల యందు, పుణ్య తీర్దాల యందు, పద్మనాభుడిని పూజించాలి. 

పాలకుల ధర్మము- అధర్మ పరిణామము (చతుర్ధ స్కందము): శ్రీమన్నారాయణుడు పృధు చక్రవర్తితో ఇలా అంటున్నారు. పాలకులకు ప్రజలను రక్షించడమే పరమ ధర్మం. ప్రజలు చేసే పుణ్య కార్యాలలో ఆరవ వంతు పాలకులకు లభిస్తుంది. ప్రజలను సక్రమంగా పాలించకపోతే, వారు చేసే పాపాల ఫలం పాలకులే అనుభవించ వలసి ఉంటుంది. ఇప్పటి పాలకుల గురించి ఆలోచించండి. పరిపాలన సరిగ్గా లేదు కనుక ప్రజలు అధర్మ వర్తనులు అవుతున్నారు. కాబట్టి పాలకులు ప్రజలు చేసే పాపాల ఫలం ఏదో ఒక రూపంలో అనుభవిస్తున్నారు. ఎలాగంటారా...నేటి పాలకులు నిత్య భయగ్రస్తులు. సప్తమ స్కందం లో అజగర వ్రతం చేస్తున్న ఒక ముని - ప్రహ్లాదునికి ఇలా చెబుతున్నాడు.

"ధనవంతులకు నిద్రాహారాలు ఉండవు. దొంగలు, రాజులూ తమ ధనాన్ని అపహరిస్తారని భయపడతారు. మిత్రులను కూడా సందేహిస్తారు. తాము అనుభవించలేరు, ఇతరులకు ఇవ్వలేరు. ధనవంతులకు, అక్రమార్జన పరులకు నిత్యమూ భయమే. ఆశ అటువంటిది. ఆశ వల్లనే శోకం, మొహం, భయం, క్రోధం, రాగం, శ్రమ కలుగుతూ ఉంటాయి." 

బాహ్య శత్రువులు- అంతశ్శత్రువు (సప్తమ స్కందము): ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో ఇలా అంటున్నాడు. దారి తప్పిన మనసు కంటే వేరే శత్రువు లేదు. లోకాలన్నింటినీ గడియలో జయించావు కాని, తండ్రీ, నీ లోపలే ఉన్నా అరిశాద్వార్గాలనే ఆరుగురు శత్రువులను, పంచేంద్రియాలను, మనస్సును జయించలేక పోతున్నావు. వాటిని కనుక జయిన్చావంటే, ఈ ప్రపంచంలో నీకు విరోధి అంటూ ఎవరూ ఉండరు.

జయాపజయాలు (అష్టమ స్కందము): జయాప జయాలు, సంపదలూ ఆపదల వంటివి. గాలికి ఊగే దీపపు జ్వాల లాగా చలిస్తూ ఉండేవి. చంద్ర కళలలా, తరగల్లా, మేఘాల్లా, మెరుపుల్లా నిలకడ లేనివి. అందుకే విజ్ఞుడయిన వాడు జయాపజయాలను సమ భావంతో స్వీకరించాలి.

తృప్తి( అష్టమ స్కందము): ఏదయినా కోరుకున్నది దొరకగానే పొంగిపోక, దొరికినది తక్కువని బెంగపడక, లభించినదే ఎక్కువ అనుకుంటూ తృప్తి చెందని మనిషికి సప్తద్వీపాలూ ఇచ్చినా సంతోషం ఉండదు. 

పరోపకారము (అష్టమ స్కందము): దీనుల, ఆర్తుల బాధలను పోగొట్టినప్పుడే పాలకుల కీర్తి వ్యాపిస్తుంది. రక్షణ కోరి వచ్చినా ప్రాణులను కాపాడడమే ప్రభుధర్మం. ప్రాణాలు క్షణికాలని భావించి, ఉత్తములు తమ ప్రాణాలనయినా ఇచ్చి, ఇతరులను కాపాడతారు. ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకూ ఇష్టుడవుతాడు. పరులకు మేలు చెయ్యడాన్ని మించిన ధర్మం లేదు.

                                                             

రావినూతల శ్రీనివాస్ గారు అందించిన పద్యాలు 

గరుడారోహకుడై గదాదిధరుడై కారుణ్యసంయుక్తుడై 
హరికోటిప్రభతో నొహో వెరవకుండంచుం బ్రదీపించి త 
ద్గిరి గేలన్ నవకుందకందుకముమాడ్కిన్ బెట్టె బక్షీంద్రుపై 
గరుణాలోకమున్ సురసురలప్రాణంబుల్ సమర్థింపుచున్ 

క్షీరసాగరమధన ఘట్టములో సాగరమధనము చేయుటకై దేవదానవులు మందరగిరి చుట్టూ త్రవ్వి పెకిలించి,దానిని క్షీరసముద్రమువరకూ తీసికొనిపోవు ప్రయత్నములో గిరిని ఎత్తలేక నిస్పృహ చెందినప్పుడు శ్రీహరి ఎలా వచ్చాడో పోతనగారు పై పద్యములో ఎంతో చక్కగా వర్ణించారు. ఆ శ్రీహరి ఎలా వచ్చాడంటే :

గరుడారూఢుడై,గదాధరుడై,కరుణాపూరితుడై,కోటి సూర్యప్రభతో వచ్చి,మీరేమీ భయపడకండి అని వారిని ఉత్సాహపరచి ఆ గిరిని సన్నజాజుల బంతి వలె చేతితో పట్టి ఎత్తి గరుడుని మూపుపై ఉంచి కరుణతో నిండిన అమృతచూపులతో సురాసురుల ప్రాణములు నిలిపాడు. తీర దేవదానవులు సాగరమధనము ప్రారంభించగా మందరగిరి మునిగిపోసాగెను. తాము చేసిన ప్రయత్నమంతా వమ్మైపోయిందని వారు శోకించుచుండగా శ్రీహరి లక్షయోజనముల విస్తీర్ణముగల మహాకూర్మమై సముద్రములోనికి చొచ్చి,ఆ పర్వతరాజమును వాసుకియను మహానాగముతో సహా ఒక చిన్న ముత్యపుచిప్ప నెత్తునంత లీలగా పైకెత్తగా ఇంద్రాదిదేవతలు,అసురులు భళి భళీ అని భూమ్యాకాశములు మారుమోగినట్లు హర్షము చూపిరి. మదనము కొనసాగిస్తుండగా సముద్రము నుండి హాలాహలము ఉద్భవించినది. అంత దేవదానవులు శివుడితో ఇలా మొరపెట్టుకున్నారట:

కొందరు కలడందురు నిను 
గోదరు లేడందు రతడు గుణిగాడనుచున్ 
గొందరు కలడని లేడని 
కొందలమందుదురు నిన్నుగూర్చి మహేశా!

హాలాహలము నుండి తమను రక్షింపమని బ్రహ్మాదిదేవతలు శివుని స్తుతించిరి. దేవదేవా మహేశా!నీవే మాకు శరణ్యము. కొందరు నీవు కలవని అంటారు. కొందరు నీవు సాకారుడవు కాదు అంటారు. కలవో,లేవో అని మరికొందరు తికమక పడుతుంటారు. నీ యొక్క నిజతత్త్వమును ఎవ్వరూ తెలియజాలరు కదా!పరమశివా!అని మొరపెట్టుకుంటూ ఇంకా శివుని ఇలా స్తుతించారు:

నీకంటే నొండెరుంగము 
నీకంటెం బరులు గావనేరరు జగముల్ 
నీకంటె నొడయడెవ్వడు 
లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా!

ఓ సర్వలోకపూజ్యా!మేము నిన్ను తప్ప ఇంకెవరినీ ఎరుగము. నీవు తప్ప ఇంకెవ్వరు ఈ లోకములను కాపాడలేరు. ఈ లోకములలన్నిటా నీకంటే గొప్పవాడు ఇంకెవ్వరు లేరు,అని పరిపరి విధములుగా పరమశివుని ప్రార్ధింపగా పరమశివుడు జాలిచెందినవాడై పార్వతితో ఇట్లనెను:

పరహితము చేయునెవ్వడు 
పరమహితుండగు భూతపంచకమునకున్ 
బరహితమె పరమధర్మము 
పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!

పుర్ణేందుబింబాననా!శరణు జొచ్చిన వారిని రక్షించుట ప్రభువుల కర్తవ్యము. పరహితము చేయువాడు,పంచభూతములకు,జీవరాసులకు పరమహితుడగును. పరహితము పరమధర్మము. అంతేకాక పరహితము చేసిన శ్రీహరి సంతసించును. హరి మదిలో ఆనందించిన జగములన్నీ ఆనందించును. శ్రీహరిని,సర్వలోకమును ఆనందింపచేయుటకు విషమును నివారింపచేయుటయే మంచిది కదా!ఈశ్వరీ ! అని పలుకగా,బదులుగా పార్వతీదేవి సమాధానము:

మ్రింగెడివాడు విభుండని 
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్ 
మ్రింగుమనె సర్వమంగళ 
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!

మూడులోకాలను దహింపనున్న హాలాహలజ్వాలలను తానే స్వీకరింపతలచుకున్న శివునకు శివాని,లోకకళ్యాణార్థమై అనుమతించెను. మింగవలసింది ఘోరమైన గరళమని తెలిసికూడా,మ్రింగెడివాడు తన పతిదేవుడే ఐనా,జీవరాసులను రక్షింపవలసి ఉన్నందున సర్వమంగళ ఐన ఆ శాంభవి,గరళమును మింగమని పతిదేవునకు అనుమతినిచ్చింది. ఆ సర్వలోకజనని,తన మాంగల్యబలమును ఎంతగా నమ్మిందో కదా!

తనచుట్టూ దేవతాసముహములు జయజయ ధ్వనులతో కేకలు వేస్తుండగా,పరమశివుడు హాలాహలమును అంతటినీ ఒకచోట చేర్చి,దానిని ఒక కబళముగా చేసి,నేరేడుపండువలె విలాసముగా ఆరగించాడు. 

ఉదరము లోకంబులకును 
సదనంబగుటెరిగి శివుడు చటులవిషాగ్నిన్ 
గుదురుకొన గంఠబిలమున 
బదిలంబుగ నిలిపె సుక్ష్మఫలరసముక్రియన్ 

తన ఉదరము లోకములన్నిటికీ నిలయమని ఎరిగిన మహేశ్వరుడు,విషాగ్నిని మ్రింగి తన కంఠమునందు పదిలముగా,అది ఒక చిన్న ఫలరసమా అనునట్లు నిలుపుకొనెను. ఏ చిన్న మచ్చా లేని శివుడు తన కంఠముపై ఏర్పడిన మచ్చతో ఆనాటినుండి గరళకంఠుడు,నీలకంఠుడు,శ్రీకంఠుడు అనిపించుకున్నాడు.

తనయందు నఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు 
పెద్దల బొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు 
కన్నుదోయికి నన్యకాంత లడ్డం బైన మాతృభావన సేసి మరలువాడు 
తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను దీనులగావ జింతించువాడు 

సములయెడ సోదరస్థితి జరుపువాడు 
దైవతములంచు గురువులదలచువాడు 
లీలలందును బొంకులు లేనివాడు 
లలితమర్యాడుడైన ప్రహ్లాదుడధిప 

నారదుడు యుదిష్టిరునకు ఇట్లా చెప్పెను: మహారాజా! హిరణ్యకశిపుని నలుగురు పుత్రులలో ఒకడైన ప్రహ్లాదుడు సమస్త ప్రాణులను తనవలెనే భావించుకొనుచు సమహితత్వమున ప్రవర్తించేవాడు. ఇతర స్త్రీలు కనిపిస్తే మాతృభావనతో పక్కకు తొలగిపోవుచుండేవాడు. దీనులను తల్లిదండ్రుల మాదిరిగా ధర్మవత్సలతతో ఆదరించేవాడు. స్నేహితులను సోదరులవలె చూసేవాడు. గురువులను దేవతా సమానులుగా చూచువాడు. పరిహాసమునకైనను ఎన్నడూ అసత్యము ఆడనివాడు. ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని స్మరణ చేస్తూ, హరికీర్తన చేస్తూ ప్రేమపూరిత భక్తి పారవశ్యముతో ఆనంద భాష్పములు రాల్చుచు పులకిత శరీరుడై ఉండెడివాడు. ధర్మరాజా! ప్రహ్లాదుడు ఇటువంటి ఉత్తమ గుణసంపన్నుడు. 

ఒకనాడు హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుడితో కుమారా! చదువుకొననివాడు జ్ఞానహీనుడగును చదువుకొన్నచో మంచి చెడుల విచక్షణ కలుగును. నాయనా! నిన్ను శ్రేష్ఠుల వద్ద చదివించెదను, నీవు చదువుకొనుము అని చెప్పి గురుశ్రేష్టులని పిలిచి వారితో "మీరు గురువులు, కరుణాచిత్తులు, గౌరవనీయులు, మాకు పెద్దలు, మా మాట మన్నించి ఈ బాలునకు చదువు చెప్పి, నీతులు నేర్పి, గ్రంధములు చదివించి రక్షింపుడు" అని హిరణ్యకశిపుడు గురువులైన చండామార్కులను కోరెను. 

కొంతకాలము పిదప తన కుమారుని విద్యలని పరీక్షించేటందుకు తన వద్దకు పిలిచి చేరదీసి, సంపూర్ణమైన వాత్సల్యంతో తన తొడపై కుర్చుండబెట్టుకుని అత్యంత కుతూహలంతో తన పుత్రుని 'వత్సా గురువులనుండి ఏమేమి విద్యలు నేర్చితివి? ఏమేమి వేదములు, శాస్త్రములు చదివితివి?" అని ప్రశ్నించెను. దానికి ప్రహ్లాదుడు ఓ దైత్య శ్రేష్టా! శ్రీహరిని మనసులో నిలుపుకుని ఇహలోకముతో సంబంధము లేక దైవ చింతనలో కాలం గడుపుటకు మించిన సుఖము ఏమున్నది? నేను ఎల్లవేళలా హరిచింతనముతో నా జీవితము గడుపుచున్నాను అని పలికెను. దానికి హిరణ్యకశిపుడు నాయనా! ఆలోచించి చూడగా నీ మాటలు నాకు విడ్డూరముగా ఉన్నవి ఈ బుద్ధి నీకే మనసులో కలిగిందా? లేక ఎవరైనా ఎక్కించారా? నాయనా ఆ హరి మనపట్ల అపరాధము చేసినవాడు. అతనిని పూజించవలసిన అవసరము మనకు లేదు. మనకు ఇతరులను బాధ పెట్టడము తగినది. అంతేకాని హరి, గిరి అనుకుంటూ మొహాంధుడవై చెడిపోరాదు అని చెప్పి ప్రహ్లాదుడిని గురువులకు అప్పగించి హరి భక్తిని పోగొట్టుమని చెప్పి పంపించెను. గురువులు ప్రహ్లాదుడితో హరిభక్తి విడిచి పెట్టమని, తన తండ్రి పట్ల భక్తితో ఉండి తండ్రి చెప్పినట్లు వినమని చెప్పారు. దానికి ప్రహ్లాదుడు గురువులతో ఇట్లా పలికెను :

మందారమకరందమాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు 
నిర్మలమందాకినీవీచికల దూగు రాయంచ సనునె తరంగిణులకు 
లలితరసాలపల్లవఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు 
బూర్ణేందుచంద్రికాస్పురితచకోరకం బరుగునే సాంద్రనీహారములకు 

అంబుజోదరదివ్యపాదారవింద 
చింతనామృతపానవిశేషమత్త 
చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు 
వినుతగుణశీల మాటలు వేయునేల 

మందార పుష్ప తేనెల మాదుర్యములో తేలియాడే తుమ్మెద ఉమ్మెత్త చెట్లవైపు వెళుతుందా? నిర్మలమైన గంగానది అలల్లో తేలియాడే రాజహంస వడిగా ప్రవహించు నదులలోకి ప్రవేశిస్తుందా? లేలేత మామిడి చివుళ్ళను తృప్తిగా ఆరగించే కోయిల కొండమల్లె తుప్పల వైపు వెళ్తుందా? నిండు పున్నమి వెన్నెలలో ఉత్తేజము పొంది విహరించు చకోర పక్షి దట్టమైన పొగమంచులో ప్రవేశించునా? లేదుకదా. ఆ విధంగానే పద్మనాభుని దివ్య పాదపద్మాలు అనే అమృతమును గ్రోలి మత్తెక్కిన నా మనస్సు ఇతర విషయములపైకి ఎట్లా పోగలదు? అది అసంభవము. వెయ్యి మాటలెందుకు నాకు హరి భక్తే సర్వస్వము అని చెప్పెను. 

గురువులు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకెళ్ళి సకల విద్యలను నేర్పి తిరిగి హిరణ్యకశిపుని దగ్గరకు తీసుకుని వచ్చారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో నీ గురువులు ఏమి నేర్పించారు?, ఏవిధంగా బోధించారు? ఆ విద్యా సారమును నాకు చెప్పు. నీవు తెలుసుకున్న శాస్త్రములలోని ఒక పద్యము చెప్పి దాని అర్ధ,తాత్పర్యములను చెప్పు అని అడుగగా ప్రహ్లాదుడు ఇట్లా చెప్పెను : 

చదివించిరి నను గురువులు 
సదివితి ధర్మార్ధముఖరశాస్త్రంబులు నే 
జదివినవి గలవు పెక్కులు 
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!

తండ్రీ! గురువులు నాచే చక్కగా చదివించిరి. నేను ధర్మశాస్త్రము, అర్ధశాస్త్రము, మొదలైన ముఖ్య శాస్త్రములను అన్నిటినీ చదివితిని. నేను చదివినవి అనేకములున్నవి. చదువులలో సారమంతా చదివితి తండ్రీ, చదువుతో పాటు హరిభక్తి పెంపొందించుకుంటిని అని పలుకగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని శిక్షింపదలచి రాక్షస వీరులతో ఇట్లనెను : శరీరాంగములలొ ఏదో ఒక అంగము చెడిపోయినచో వైద్యుడు దానిని ఖండించి ఇతర శరీర భాగములను కాపాడునట్లు ఈ కులద్రోహిని, దుర్జనసంగుని, హరిపక్షపాతిని చంపించి వంశమును దోష రహితముగా గొప్ప వీరుడనని ఖ్యాతి పొంది, నా వంశమును పవిత్రము చేసుకొందును, ఓ రాక్షస వీరులారా వీడిని చంపుటకు ఆలోచించాల్సిన పని లేదు, పసి బాలుడని జాలి పడక వీడిని వధించి రండి అని చెప్పాడు. అంత ఆ సైనికులు ప్రహ్లాదుడిని తీసికొని వెళ్ళారు

ఒకమాటు దిక్కుంభియూథంబు దెప్పించి కెరలి డింభకుని ద్రొక్కింబబంపు 
నొకమాటు విష భీకరోరగశ్రేణుల గడువడి నర్భకు గరవబంపు 
నొకమాటు హేతిసంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయబంపు 
నొకమాటు కూలంకషోల్లోలజలధిలో మొత్తించి శాబకు ముంపబంపు 

విషము బెత్తబంపు విదళింప గాబంపు 
దొడ్డకొండచరుల ద్రోయబంపు 
బట్టి కట్టబంపు బాధింపగాబంపు 
బాలు గినిసి దనుజపాలు డధిప 

ప్రహ్లాదుడిని ఏనుగులతో తొక్కించారు,భయంకర సర్పములతో కరిపించారు,ఘోరమైన అగ్నిమంటలలో పడేసారు,బాగా కొట్టి సముద్రములో పడవేశారు,విషము పెట్టి,పర్వతముల నుండి కింద పడవేయించి,బండరాళ్ళు మీద పడేసి,ఇంకా ఎన్నెన్ని విధములగానో ఆ చిన్నారి బాలకుని చిత్రహింసలపాలు చేశారు ఆ రాక్షసవీరులు. ఎన్ని విధములుగా చంపాలని చూసినా ప్రహ్లాదుడు నిరంతర హరి నామస్మరణతో మెలగుటచే,హరి అతనిని అన్ని వేళలా కాపాడుచుండెను. అంత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఎక్కడున్నాడు నీ హరి అని ప్రశ్నించగా ప్రహ్లాదుడిట్లు పలికెను:

కలడంభోధి గలడు గాలి గల దాకాశంబునం గుంభినిం 
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోతచంద్రాత్మలం 
గలడోంకారమునం ద్రిముర్తులం ద్రిలింగవ్యక్తులం దంతటం 
గలడీశుండు గలండు దండ్రి!వెదకంగా నెల ఈయాడన్ 

ఇందుగల డందు లేడని 
సందేహము వలదు చక్రి సర్వోపగాతుం 
డెందెందు వెదకి చూచిన 
నందందే గలడు దానవాగ్రణి!వింటే 

తనతో వాదిస్తూ,తనకు బోధించుచున్న ప్రహ్లాదుని మాటలకు విసుగుచెంది,కోపగించుకున్న దానవరాజు ఆ హరిఎక్కడున్నాడురా అని గద్దించి అడుగగా ఆ బాలుడు:తండ్రీ!ఆ పరమేశ్వరుడు సముద్రంలో,గాలిలో,ఆకాశంలో,భూమిలో,అగ్నిలో,అన్ని దిశలలో,పగటిలో,రాత్రిలో,ఆత్మలో,ఓంకారంలో ఇక్కడ అక్కడ అని కాదు ఎచ్చట చూసినా అక్కడే ఉన్నాడు దానవశ్రేష్టా!అని బదులు చెప్పగా హిరణ్యకశిపుడు ఈ స్థంబములో ఉన్నాడా నీ హరి చుపించుమనగా ప్రహ్లాదుని ప్రార్థననాలకించి హరి నరసింహస్వరూపుడై స్థంబం నుండి ఇలా బయటకు వచ్చారట,ఆ వర్ణనని పోతన గారు ఇలా చెప్పారు:

పంచాననోధ్ధూతపావకజ్వాలల భూనభోంతరమెల్ల బూరితముగ 
దంష్ట్రాంకురాభీలధగధగాయితదీప్తి నసురేంద్రునేత్రము లంధములుగ 
గంటకసన్నిభోత్కటకేసరాహతి నభ్రసంఘము భిన్నమై చరింప 
బ్రళయాభ్రచంచలాప్రతిమభాస్వరములై ఖరఖరోచులు గ్రమ్ముదేర 

పటలు జళిపించి గర్జించి సంభ్రమించి 
దృష్టిసారించి బొమలుబంధించి కెరలి 
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి 
పట్టె నరసింహుడా దితిపట్టి నధిప!

భీషణాగ్నిజ్వాలలు ముఖమునుండి వెలువడుతూ దంతముల ధగధగ మెరుపులు మెరియుచుండ వాడి అయిన కాలి గోళ్ళ మెరుపులు విద్యుల్లతల వలె ప్రకాశించగా జూలు విదిలించి విజృంభించి హిరణ్యకశిపుని ఒడిసి పట్టి గడప పై కూర్చుని అతని ఉదరమును తన గోళ్ళతో చీల్చివేసి సమ్హరించెను.

పోతన గారు గజేంద్రమోక్షమును ఈ కింది పద్యముతో మొదలుపెట్టారు:

నీరాటనాటములకు(
బోరాటం బెట్లు గలిగే(బురుషోత్తముచే 
నారాట మెట్లు మానెను 
ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్ 

పరీక్షిన్మహారాజు శ్రీశుకునినిట్లు ప్రశ్నించెను:మహాత్మా!నీటిలో సంచరించు మకరికి,వనములో సంచరించు కరికిని పోరాటమెట్లు?ఎందుకు సంభవించెను?ఆ ఘోరారణ్యములో ఆ మదగజమునకు శ్రీహరి వలన వ్యథ ఎట్లా తొలిగెను? 
అంట శుకుడు ఇట్లా చెప్పెను:అతి భీకరముగా కన్పించు అడవిలో ఏనుగులమంద ఒకటి మదించిన శరీరములతో,పెద్దపెద్ద కొండగుహలనుండి,విహారార్థమై బైటకు వచ్చి చల్లని జలములో జలక్రీడలాడుటకు ఒక పెద్ద మడుగులో ప్రవేశించి,తొండములను నీతితో నింపుకొనుచు,పరస్పరము చెక్కిళ్ళపై చల్లుకోనుచు,గళగళ శబ్దములు చేస్తూ,స్థూలమైన కడుపులను నింపుకొనుచు,నీరు త్రాగుతున్నవి. అంతలో:
భుగభుగాయితభూరిబుద్భుదచ్చటలతో గదులుచు దివికి భంగంబు లెగయ 
భువనభయంకరఫూత్కారరవమున ఘోరనక్రగ్రాహకోటి బెగడ 
వాలవిక్షేపదుర్వారఝంఝానిలవశమున ఘుమఘుమమావర్త మడర 
గల్లోలజాలసంఘట్టనంబుల దటీతరులు మూలములతో ధరణి గూల 

సరసిలోనుండి పొడగని సంభ్రమించి 
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి 
భానుగబళించి పట్టుస్వర్భానుపగిది 
నొక్కమకరేంద్రుడిభరాజు నొడిసిపట్టె 

భుగభుగ ధ్వనులతో పెద్దపెద్ద నీటిబుడగల ప్రవాహమును కలిగించుచు,భువనములకు భయము కలిగించుచు,"ఫూత్కార"శబ్దములు చేయుచూ,మడుగులోనున్న మొసలి సమూహములు కూడా హడలిపోవుచుండ,కరిరూపమును గాంచి,ఊపిరి బిగపట్టి,శీఘ్రముగా లంఘించి హుంకరించి,సూర్యుని కబళించిన రాహువువలె ఒక మకరేంద్రుడు వచ్చి గజేంద్రుడిని ఒడిసి పట్టుకొనెను. మకరి తన కాళ్ళను పట్టుకున్నాను ధృతిమంతుడు,శూరుడు ఐన గజరాజు తప్పించుకొని తన దంతములతో ఆ మకరియొక్క ముడుకు చిప్పలను,పాదములను పొడిచి పొడిచి,చెదరగొట్టగా ఆ మకరి కరిని నీటిలోనికి లాగును,మకరిని కరి ఒడ్డునకు లాగును,ఇట్లా కరి మకరిలు పరస్పరము భయముతోను,బరువైన మనస్సుతోను నతలాకుతలమగుచు,తమతమ భ్రుత్యులు ఆదరిపోయేటట్లు పోరాడసాగిరి. 

జీవనంబు దనకు జీవనంబై యుంట 
నలవు చలము నంత కంత కెక్కి 
మకర మొప్పె డస్సె మత్తేభమల్లంబు 
బహుళపక్షశీత భానుపగిది 

జలమే తనకు జీవనమైయుండుటచేత,మకరికి స్థానబలముచే శక్తి,సులువు అంతకంతకు ఎక్కువయి,ధైర్యము కలిగెను. కరికి నిలకడ తప్పి అలసట వచ్చి,కృష్ణపక్ష చంద్రునివలె శక్తి సన్నగిల్లెను. ఇట్లా అనేక సంవత్సరములు గజేంద్రుడు మకరితో పోరాడుతూ తనలో తను ఇట్లా అనుకున్నాడు:

నానానేకప యూధముల్ వనములోనం బెద్దకాలంబు స 
న్మానింపన్ దశలక్షకోటికరిణీనాధుండ నై యుండి మ
ద్దానాంభఃపరిపుష్టచందనలతాంతచ్చాయలం దుండలే 
కీ నీరాశ నిటేల వచ్చితి భయం బెట్లోకదే,యీశ్వరా!

అనేకానేకములైన కుంజరయూధములు,వనములో నన్ను చిరకాలము నుండి ప్రభువుగా మన్నించుచుండ,అసంఖ్యాకులైన ఆడఏనుగులకు నేను నాధుడనై యుండ,అరణ్యమునందు దట్టముగా నున్న చందనాదివృక్షలతా కుంజముల చల్లని నీడయందు సంత్రుప్తుడనై యుండలేక జలక్రీడ కాంక్షతో ఈ మడుగులో నేల జొచ్చితిని?ఈ భయ నివారణమెట్లు జరుగునో కదా!యీశ్వరా!

ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై 
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు మూలకారణం 
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానైన వా 
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్ 

లోకంబులు లోకేశులు 
లోకస్థులు దెగినతుది నలోకంబగు పెం 
జీకటి కవ్వలనెవ్వం 
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్ 

కలడందురు దీనులయెడ 
గలడండురు పరమయోగిగణములపాలన్ 
గలడందురన్నిదిశలను 
గలడు గలండనెడువాడు గలడో లేడో 

అని భగవంతుడిని ప్రార్థిస్తూ,గజేంద్రుడు నిస్పృహ చెంది,దేవునికి నా మోర వినపడలేదా?దీనులయెడల దయ కలిగి ఉంటాడు అంటారు కదా?
భగవంతుడు అంతటా,అన్ని దిశలను యుండునని చెప్పెదరు గదా!ఉన్నాడు ఉన్నాడని అందరూ చెప్పే ఆ భగవంతుడు నిజముగా ఉన్నాడో లేదో?అని అనుకుంటూ 

లావొక్కింతయు లేదు,ధైర్యము విలోలంబయ్యె,బ్రాణములున్ 
ఠావుల్ దప్పెను,మూర్చ వచ్చె,దనువున్ డస్సెన్,శ్రమం బయ్యెడిన్ 
నీవేతప్పనితఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ 
రావే యీస్వర!కావవే వరద!సంరక్షింపు భద్రాత్మకా! 

అని ప్రార్థింపగా 
సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే 
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం 
తరధంమిల్లము జక్కనొత్తడు వివాదప్రోథ్థితశ్రీకుచో 
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి యై 

అడిగెదనని కడువడి జను 
నడిగిన దను మగుడ మడుగడని నడయుడుగున్ 
వెడవెడ సిడిముడి తడబడ 
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ 

గజేంద్రుడి ప్రార్థన విన్న శ్రీహరి లక్ష్మితో చెప్పక,సంఖచాక్రములను చేతిలో ధరింపక,అనుచరులనెవ్వరినీ పిలువక,పక్షిరాజైన గరుత్మంతుడిని అధిరోహించక,శ్రీదేవి పైటచెంగు కూడా విడిచిపెట్టకుండా వడివడిగా ఆకాశమార్గములో నడిచి వెళ్ళిపోవుచుండగా కదులాడు చెవి కమ్మలతో,ఆచ్చాదన తొలగిన కుచములతోను,సంకోచముతో నిండిన హృదయముతో శ్రీహరిని అనుసరించుచూ,చిరుకోపమును తెచ్చుకొనుచూ,అడుగులను వడిగా వేయుచూ,వడి తగ్గించి మందగమనము చేయుచూ దేవి,తన పతి వెంట సాగిపోవుచుండెను. 

కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె స 
త్వరితాకంపితభూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా 
పరిభూతాంబరశుక్రమున్ బహువిధబ్రహ్మాండభాండచ్చటాం 
తరనిర్వక్రము బాలితాఖిలసుధాంధశ్చక్రముం జక్రమున్ 

కరుణాసాగరుడైన శ్రీహరి మకరిని ఖండించుటకు తన సుదర్శనమును పంపించెను. ఆ సుదర్శనము సాధుజనులను రక్షించునట్టిది,భుమండలమును కంపింపజేయగల వేగముగలది,పెక్కు బ్రహ్మాండబాండములను కాంతిపుంజములతో నింపివేయగలది,తిరుగులేనట్టిది ఐన ఆ సుదర్శనచక్రము పోయి పర్వతములాంటి మేనుగల మకరితలను త్రుంచివేసెను.


No comments:

Post a Comment