Sunday, October 27, 2013

'సహజకవి ' పోతన

పరవస్తు నాగసాయి సూరి 

అమ్మా! మన్ను దినంగనేశిశువనో? యాకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు గొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాగం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.

ఈ పద్యం పూర్తిగా తెలియకపోయినా... నా చిన్నతనం నుంచి మొదటి వాక్యం మాత్రం ఎప్పుడూ నోటి మీద నానేది. బాలకృష్ణుడు అచ్చంగా యశోదమ్మతో ఇలాగే చెప్పావాడా... కన్నయ్య అచ్చంగా తెలుగువాడేనా అన్నంతగా జనాల్లో నాటుకుపోయింది. ఈ ఘనతలో పావు భాగం చిన్ని కృష్ణుడికి, మిగతా పావుభాగం రాయించిన శ్రీరాముడికి, సగభాగం రాసిన పోతన్నకు దక్కుతుంది.

నన్నయ లాంటి మహా కవులు భాగవతం రాయకుండా ఉండడం నన్ను కరుణించడానికే అనేంత గొప్ప మనసు పోతన సొంతం. అంతేనా భాగవతం రాసింది నేను కాదు... రాయించింది ఆ శ్రీరాముడే అంటూ... అచంచల భక్తి ప్రపత్తులు ప్రదర్శించిన భక్తాగ్రేసరుడు పోతన.

"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"

అంటూ ఆ శ్రీరామ చంద్రుడే తన చేత భాగవతం రాయించాడని చెప్పకనే చెప్పాడు. ఆ దేవదేవుని కథను పలికితే భవహరమౌతుందట. వేరే ఎవరి గాధో పలకడం దేనికి అంటూ ప్రశ్నించారు కూడా.

సహజంగానే భక్తుడు, కవి అయిన పోతన భక్తి తత్వానికి పరాకాష్ట. అందుకే భగవద్భక్తుల చరిత్ర అయిన భాగవతాన్ని రాసే అవకాశాన్ని ఆ దేవుడు పోతనకు కల్పించాడేమో అనిపిస్తుంది.

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌"

అంటూ నవవిధ భక్తి మార్గాలను తొలుత ప్రవచించింది వ్యాసుడే. వాటిని ఇంతకు రెండింతలుగా విస్తరించి...

"తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా
ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!"

అంటూ ప్రహ్లాదుని నోట పలికించాడు. ఇవన్నీ అచ్చంగా కూర్చుని రాస్తే వచ్చేవి కావు. పరమేశ్వరుని జటాజూటం నుంచి పొంగి వచ్చే గంగా ధారలా... వాటంతట అవే జాలువారాలి. మనసా, వాచా, కర్మణా... భక్తి ప్రపత్తులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.

రచయితలు అనే వారు పోతనను చూసి ఎంతో నేర్చుకోవాలి. అంతటి భాగవతాన్ని ఇంకెంతో చేసి... తెలుగు వారికి అందించిన పోతన ఏనాడూ గర్వపడలేదు. పైపెచ్చు...

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు."

అంటూ... తనకేమీ తెలియదని, నిమిత్తమాత్రుడనని, పెద్దలు చెప్పిన దాన్నే మీకు అందిస్తానని ప్రకటించారు. ఇక భాగవతాన్ని రాసే విధానంలోనూ తన శైలిని పోతన స్పష్టంగా తెలియజేశారు.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;
గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."

కొందరు తెలుగు నచ్చుతారు, ఇంకొందరు సంస్కృతము మెచ్చుతారు. అంతరినీ మెప్పిస్తానంటూ పోతన ప్రతిజ్ఞ చేశారు. భాగవతంలోని ఏ పద్యం చదివినా... తెలుస్తుంది పోతన అచ్చతెలుగు తనం, సంస్కృత గుణం. రాముడి మీద అచంచల భక్తిభావం గలిగిన పోతన శ్రీకృష్ణుడి గురించి రాస్తూ....

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"

ఆ నల్లనయ్య అల్లరి గురించి ఇంత అందంగా చెప్పిన కవి మరొకరు కానరారు. అద్భుతానికే అద్భుతమనిపించేలా భాగవత రచన చేశారు పోతన.

ఇంత చేసీ పోతన జీవనం సాగించింది వ్యవసాయం మీదే. ఒక సారి ఎవరో ఆయనతో అన్నారట. నీ ఏ ఒక్క కవితనైనా... ఏ రాజుకైనా అంకితమిస్తే... నీకు ధనరాశుల్ని దారాదత్తం చేస్తారని. దానికి పోతన...

" బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపు(గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమల( గందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై"

అంటూ కావ్యకన్యను అమ్ముకుని... పడుపుకూటితో సమానమైన విందుని తినడం కంటే... భార్యా, సుతుల్ని పోషించుకోవడానికి నిజమైన కవి వ్యవసాయం చేసుకోవచ్చు లేదంటే... కందమూలములు తిని బతకవచ్చు అంటూ తన వైఖరిని చాటారు. అంతేనా.... పోరపాటున తాను అలాంటి పని చేస్తానేమో అనుకుని సాక్షాత్తు సరస్వతీదేవి ప్రత్యక్షమై కన్నీరు కారిస్తే... 

"కాటుక కంటినీరు చనుకట్టు పయింబడనేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భు రాణి! నిను నా(కటికిం గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాట కీచకుల కమ్మ(, ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!" 

అంటూ ఆమెను ఓదార్చారట. ఇక పోతన భాగవతంలోని ఆణిముత్యాల్ని ఏరడం మొదలు పెడితే... మన మనసులు బరువెక్కుతాయి. తేలికైన భాషలో... బరువైన భావాలతో అల్లిన పద్యాల దండలవి. అవన్నీ శ్రీరాముడి మెడలో చక్కగా అమరాయి.

                                          

భాగవతాన్ని ఆరంభిస్తూనే... అంత్యప్రాసలతో....

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !!

అంటూ మొదలు పెట్టారు. ఆ తర్వాత ముగ్గురమ్మలను కీర్తిస్తూ....

శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!.... అంటూ సరస్వతిని

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్... అంటూ లక్ష్మిదేవిని...

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్... అంటూ పార్వతి దేవికి మొక్కారు.

ఎన్నో ప్రశ్నలకు పోతన భాగవతం జవాబిస్తుంది. ఉదాహరణకు భగవంతుడు ఎవడు అన్న ప్రశ్నకు...

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

ఇది కేవలం హిందూ మతానికే కాదు... సర్వమతాలు అన్వయించుకోదగ్గ పద్యం. ఆది, అంతం లేని వాడు, అంతా తానే అయిన వాడు, అన్నింటికీ మూలకారకుడు... ఎవరు ఇంకెవరు పరమాత్ముడే. మరీ మాట్లాడితే మానవుడే. 

మరో పద్యంలో ఏకంగా వైకుంఠాన్నే కళ్ళకు కట్టారు....

అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై

మరొక చోట....

ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!

అంటూ వామనుడి బ్రహ్మాండ రూపాన్ని వర్ణించారు. అంతెందుకు గజేంద్రుడు... పాహి పాహి అని మనసారా పిలించినంతనే.... ఆ స్వామి బయలు దేరిన విధానాన్ని పోతన కళ్ళకు కట్టిన తీరు నభూతో...

సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁజక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహియై.

అమ్మ వారికి కనీసం చెప్పకుండానే ఆఘమేఘాల మీద బయలు దేరారట. ఇలా చెప్పుకుంటూ పోతే పోతన ప్రతిపద్యంలోనూ ఒక విశేషం, విశిష్టత కనపడుతాయి. భగవంతుడి కోసం, భాగవతం కోసమే తెలుగు నేల మీద పోతనను భగవంతుడు సృష్టించాడా అనిపిస్తుంది. ఆ సహజకవికి శిరసా నమామి.

No comments:

Post a Comment