Wednesday, October 30, 2013

'సహజకవి' పోతన 2

'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో మిత్రులు అందించిన పోతన పద్యాలు 


భాగవత గణనాధ్యాయి గారు  

మా మా వలువలు ముట్టకు
మామా! కొనిపోకుపోకు మన్నింపు తగన్
మా మాన మేల కొనియెదు?
మా మానసహరణ మేల? మానుము కృష్ణా!
నాయనా! కృష్ణా! మా బట్టలు తాకొద్దు. వాటిని తీయకు. మా మాట విను. మా సిగ్గు తీయకు. మా మనస్సులు దొంగిలించకు. ఈ ప్రయత్నం వదిలిపెట్టు.
గోపికా వస్త్రాపహరణ బాగా ప్రసిద్దమైన ఘట్టం. కృష్ణుడు గోపికల వస్త్రములు పట్టుకొని నల్లవిరుగు చెట్టు (నీపము) ఎక్కాడు. నీళ్ళల్లో ఉన్న గోపికలు పెట్టు కున్న ఈ మొర బహు చక్కటిది. అక్షరం “మా” 7 సార్లు (మకారం 11 సార్లు) వృత్యనుప్రాసంగా ప్రయోగించ బడింది. మా మా – మా అందరివి, మామా – సంభోదన, మా మాన – మా యొక్క మానం, మా మానస – మా యొక్క మనస్సులు అని మామా 4 సార్లు వాడిన యమకాలంకారం పద్యానికి సొగసులు అద్దింది. గోపికలు అంటే ఆత్మలు, కృష్ణ అంటే బ్రహతత్వం, వలువలు అంటే అవిద్యా ఆవరణలు, మా అంటే అహంకారం అనుకుంటే వచ్చే శ్లేష విశిష్ఠ మైన అలంకారంగా భాసిస్తుంది. పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు గారు “ప్రజ్ఞ అనె తల్లి తో బుట్టినది బ్రహ్మతత్వం గనుక జీవునికి మామ అయింది” అన్నారు.

మామా = మావి మావి, మా అందరి; వలువలు = వస్త్రములు; ముట్టకు = తాక వద్దు; మామా = నాయనా; కొనిపోకుపోకు = పట్టుకుకొని; పోకు = పోబోకుము; మన్నింపు = మా మాట విను; తగన్ = చక్కగా; మా = మా యొక్క; మానము = మర్యాదను; ఏల = ఎందుకు; కొనియెదవు = తీసెదవు; మా = మా యొక్క; మానస = మనస్సులను; హరణము = అపహరించుట; ఏలన్ = ఎందుకు; మానుము = విడువము; కృష్ణా = కృష్ణుడా.

వడ్డాది సత్యనారాయణ మూర్తి గారు 

గజేంద్రుని ప్రార్ధన .... గజేంద్ర మోక్షం....భాగవతం....పోతనామాత్యుడు 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కలుగఁడే నాపాలి కలిమి సందేహింపఁ; 
గలిమి లేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ;
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ; 
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల; 
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?

తే. అఖిల రూపముల్ దన రూప మైనవాఁడు
నాది మధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?

పోతనామాత్యులకు నమస్సుమాంజలులతో 
..........................................

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతంబూనితిన్
యుల్లంబున నిల్చి జ్రుంభణముగా నుక్తల్ సుశబ్దం శో
భిల్లం బల్కుము నాదు వాక్కునును సంప్రీతిన్ జగన్మోహిని
ఫుల్లాబ్జాషి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన.

ఇందుకలడు అందులేడని, సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకిచూచిన నందందే గలడు దాన వాగ్రణి వింటే.

చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక
విష్ణుభక్తిలేని విభుదుండు విభుదుడే పాద యుగము తోడి పశువుగాక.

ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్లకడకువచ్చుటలెల్లల్ 
గారణము మంగళములకు నీరాక శుభంబుమాకు నిజము మహాత్మా.

కాళీయ మర్దనము ....శ్రీ పోతన భాగవతము 
---------------------------------------

మమ్ముఁ బెండ్లి చేయు మా ప్రాణవల్లభు
ప్రాణ మిచ్చి కావు భక్తవరద!
నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్న నాటి పెండ్లి పెండ్లి కాదు.

కాళీయ మర్దనం జరుగుతోంది. భయంకరమైన విషం కక్కే కాళీయ సర్పము యొక్క భార్యలు శ్రీకృష్ణుని ప్రార్ధిస్తున్నారు. దేవ దేవా ...భక్త వరదాత .... మా ప్రియుని ప్రాణాలు మాకు ప్రసాదించి, అతనితో మా వివాహం చెయ్యి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన మా పెళ్ళి పెళ్లి కాదు. ఇప్పుడు నువ్వు చేసే వివాహమే మాకు శాశ్వతము ..క్షేమకరము .

శ్రీమత్ భాగవతము .... పోతన ... గోవర్ధన గిరిని ఎత్తుట 
.................................................................................

బాలుం డీతఁడు; కొండ దొడ్డది; మహా భారంబు సైరింపఁగాఁ
జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగా బోల; దీ
శై లాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైఁబడ్డ నా
కే లల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్

గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కృష్ణపరమాత్మ గోపకులను రమ్మని పిలుస్తున్నాడు...
నేనేమో చిన్న పిల్ల వాడినని , ఈ పర్వతము చూస్తే పెద్దదని, నేను మొయలేనోమోనని సందేహ పడవద్దు .పర్వతాలు సముద్రాలూ ప్రా ణులన్నిటితో కూడిన ఈ భూమండలమంతా , మీద పడ్డ కూడా నా చెయ్యి వనకదు. బంధువులార సంతోషంగా మీరు అందరు ఈ కొండ 
కింద వుండండి....

 కొల్లూరు విజయా శర్మ గారు 

పద్మినీ ! నా వరకూ చాలా పెద్ద పరీక్ష . నాకు ఎంతో ఎంతో ప్రియాతిప్రియమైన కవి పోతన గారు.. ఇక భాగవతం లో ప్రతి పద్యం నాకు అత్యంత హృద్యమే ... ఇప్పటికే మిత్రులు అద్భుతమైన పద్యాలను,చక్కని వ్యాసాలను పొందుపరిచేశారు ... అసలు యే పద్యం పోస్ట్ చేయాలో అర్ధం కాని స్థితి ... మూర్తీభవించిన భక్తీ ,సౌజన్య మూర్తీ పోతన గారు.. నా తరఫున వారి పద్య పుష్పం ఒకటి 
"కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె స 
త్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా 
పరిభూతాంతర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ్భాందచ్చటాం 
తర నిర్వక్రము( బాలితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్ "
మహా విష్ణువు చేతినుండి వెలువడిన సుదర్శనాన్ని పోతన గారు ఈ పద్యం లో అత్యద్భుతంగా వర్ణించారు. కరుణాసముద్రుడైన విష్ణువు గజేంద్రుడ్ని రక్షించడానికి సుదర్శన చక్రాన్ని పంపించాడు ,ఆ చక్ర భ్రమణ వేగానికి భూమండలం కంపించిపోయింది. . ఆ వేగానికి చక్రం నుండి వెలువడుతున్న ఎగసిపడుతున్న విస్ఫులింగాల కాంతితో ఆకాశపు వెలుగు పువ్వుగా చెప్పబడే అంటే ఎంతో ప్రకాశవంతమైన శుక్రగ్రహమే వెలవెలబోయింది. బ్రహ్మాండాది లోకాలలో సుదర్శనానికి తిరుగే లేదు. దేవతా లోకాన్ని అది ఒక రక్షణ వలయంలా కాపాడుతుంది.

భావరాజు పద్మిని 

భాగవతంలోని ఒక ఘట్టంలో శివభక్తులు ధనవంతులై విష్ణుభక్తులు పేదలు అవటానికి కారణం చెప్పమని పరీక్షిత్తు శుకయోగిని ప్రశ్నిస్తాడు. శివుడు గుణత్రయాన్వితుడు కనుక రాగాదియుక్తమై రాగిల్లి, అతడిని కొలిచేవారు సంపదలు పొందుతారనీ, విష్ణువు గుణాతీతుడు కనుక అతని భక్తులు రాగాదిరహితులై ఉంటారనీ శుక యోగి చెప్పాడు. ఇదే ప్రశ్న ఒకసారి ధర్మరాజు వేస్తే కృష్ణుడు ఇలా జవాబు చెప్పాడట.

వసుమతీనాధ! యేవ్వనిమీద నా కను 
గ్రహ బుద్ధి వొడము నా ఘనుని విత్త 
మంతయు గ్రామమున నపహరించిన వాడు 
ధనహీనుడగుచు సంతాపమందు 
విడుతురు బంధు లవ్విధమున నొంటరి 
యై చేయునది లేక యఖిల కార్య 
భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి 
నెరపుచు విజ్ఞాన నిరతుడగుచు 
బిదప వా డవ్యయానంద పదము నాత్మ 
నెరిగి సారూప్య సంప్రాప్తి నెలమి నొందు 
గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు 
వదిలి భజియింతు రితర దేవతల నెపుడు (భాగవతం , 10-11, 1230)

తనను పూజింప తలచిన వారిలో ఎవరినైనా కరుణించదలచుకొంటే వాళ్ళను మొదట బుక్కాఫకీర్లను చేస్తానని, తద్వారా బంధువులు దూరమై, ఒంటరియై, అన్ని పనులూ వదిలి, నా భక్తులతో స్నేహం చేసి, విజ్ఞానం పొంది, తరువాత ఆత్మ జ్ఞానం, అమితానందం, నా సారూప్యం కలుగుతాయి. అందుకే నా సేవ చాలా కష్టమని కొందరు వదిలివేస్తారు, అని చెప్తాడు కృష్ణుడు.

                                                  



రావినూతల శ్రీనివాస్ గారు 

హరిహరులకు బేధము లేదు అని నిరూపించే పద్యం. పోతనగారు ఎంత అందంగా రచించారో చూడండి:

తనువునంటిన ధరణీపరాగంబు పూసిననెరిభూతపూత గాగ 
ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికానితునక గాగ 
ఫాలభాగంబుపైబరగు గావలిబొట్టు కామునిగెల్చినకన్ను గాగ 
కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగుమెడకప్పు గాగ 

హారవల్లులురగహారవల్లులు గాగ 
బాలులీల ప్రౌఢబాలకుండు 
శివునిపగిదినొప్పె శివునికిం దనకును 
వేరులేమి దెలుప వెలయునట్లు 

ఎంత అద్భుతమైన పద్యమో చూడండి. చాలామంది విష్ణుభక్తులు హరుడిని పుజింపరు,శివభక్తులు హరిని పుజింపరు. మన పోతనగారు హరిలో హరుడిని చూసి తాను ధన్యత చెంది మనలను ధన్యులను చేస్తున్నారు. 

ఇది చిన్నికృష్ణుని బాల్య ఘట్టములోది. చిన్నికృష్ణుడు తన సోదరుడైన బలరాముడితో కలసి తప్పటడుగులు వేస్తూ,నేలమీద మట్టి మీద పోసుకుంటూ,అల్లరి చేస్తున్నారట. అప్పుడు చిన్నికృష్ణుడిని శివుడితో పోలిస్తే కృష్ణుడు ఇలా కనబడ్డాడట :శరీరమంతా అంటుకున్న ధరణిపరాగము (మట్టి,ధూళి)శివుడు పూసుకున్న విభూతిలాగా ఉన్నదిట. చిన్నికృష్ణుడి నుదుటన యశోదమ్మ తీర్చిన ముత్యపుబొట్టు (కలువల మిత్రుడైన చంద్రుని వలె)శివుని ఫాలభాగములో మెరుస్తున్న చంద్రువంక లాగా కనిపించినదట. బాలకృష్ణుని ఫాలభాగముపై యశోదమ్మ పెట్టిన నల్లటి దిష్టిబొట్టు శివుని మూడవనేత్రము లాగా ఉన్నదిట. చిన్నికృష్ణుని కంఠములోని పెద్ద నీలపురత్నము శివుడి యొక్క నీలకంఠము వలె మెరుస్తూ ఉన్నదిట. కన్నయ్య మెడలోని వరహాల హారములు శివుని మెడలోని పన్నగ హారములుగా కనబడ్డాయట. 

ఇలా బాలలీలలను చూపిన కృష్ణుడు తనకు,శివునకు బేధము లేదని తెలిపాడు. శివకేశవులను వేరు చేసి చూడడం మహాపాపం. కృష్ణుడు ఈ లీల ద్వారా మనకు బోధించిన నీతి ఇది.


వరదుడు సాధుభక్తజన వత్సలు డార్తశరణ్యు డిందిరా 
వరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దా గుశస్థలీ 
పురమున యాదవప్రకరముల్ భజియింపగ నున్నవాడు నీ 
వరిగిన మిమ్ము జూచి విభుడప్పుడ యిచ్చు ననూనసంపదల్ 

కుచేలుడు మహాజ్ఞాని. పరమ భక్తుడు. కృష్ణుడు,కుచేలుడు సాందీపనీ మహర్షి వద్ద విద్యను అబ్యాసించారు. అటువంటి కుచేలుడు దుర్భర దారిద్ర్యముతో,అధిక సంతానముతో పీడింపబడుతున్న సమయంలో అతని భార్య స్వామీ!మీ చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుడు భక్తవత్సలుడు,దయాసాగరుదు,ఇందిరాపతి. అతడిప్పుడు యాదవులు సేవించుచుండగా కుశస్థలీపురమున ఉన్నాడు. మీరొకసారి అక్కడికి వెళితే ఆ ప్రభువు మిమ్ము చూసి స్వల్పము కాని సంపదలను ఇచ్చును కదా! అని చెప్పగా కుచేలుడు కృష్ణునికి ఇవ్వడానికి తన ఇంట్లో ఉన్న కొన్ని ముక్కిపోయిన అటుకులు తీసుకొని కృష్ణ దర్శనానికి బయలుదేరాడు. దారివెంబడి కృష్ణలీలలు పాడుకుంటూ,భక్తిలో తన్మయుడై ద్వారకను చేరి కృష్ణుడి భవనము చూసి లోపలికి ఎట్లు పోవాలి అని మధనపడుచుండగా కృష్ణుడు తన స్నేహితుని ఆగమనం గమనించి ఎదురేగి,కౌగలించుకొని,అత్యంత ఆదరముతో తన అంతఃపురములో తన నిజతల్పము మీద కూర్చుండబెట్టి,అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి అతనికి భోజనతాంబూలాది సత్కారములను చేసి అతనితో సత్కాలక్షేపమును చేస్తూ కుచెలా!నాకోసం ఏమి తెచ్చావు,చూపించుమనగా కుచేలుడు తాను తెచ్చిన అటుకులు ఇచ్చుటకు సిగ్గుపడుచుండగా కృష్ణుడు ఇట్లనెను:

దళమైన పుష్పమైనను 
ఫలమైనను సలిలమైన బాయనిభక్తిన్ 
గొలిచినజను లర్పించిన 
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్ 

మిత్రమా!నిశ్చలభక్తితో నన్ను కొలిచిన జనులు అర్పించిన పత్రము,పుష్పము,ఫలము,జలము ఏమైననూ నేను దానిని మధురాన్నముగా భావించి ప్రీతితో స్వీకరిస్తాను అని కుచేలుడి వద్దనున్న అటుకులు తీసుకొని పిడికెడు అరగించాడు. మరియొక పిడికెడు అటుకులు తెసుకుంటుంటే రుక్మిణీదేవి ఆ చేతులను పట్టుకొని తినద్దని వారించి,ఈ విప్రోత్తమునకు బహుసంపదలను అందించుటకు మీరు ఆరగించిన పిడికెడు అటుకులు చాలు అని చెప్పింది. 

అందరూ అనుకునేట్లు కుచేలుడు దరిద్రుడు కాదు. అపారమైన భక్తీ,జ్ఞానసంపన్నుడు. శరీరము మీద భ్రాంతి లేనివాడు. జీవన్ముక్తుడు. 

పోతనగారి పద్యాలు వేటిని స్పృశించినా తనివితీరదు. పోతనగారి భాగవతంలో కృష్ణలీలలు ఒక్కటి చాలు మన మనస్సులు రమించడానికి. ఇటువంటి భాగవతాన్ని చదివి మనందరమూ రసరమ్యడోలికల్లో తేలి,ఆ కృష్ణుడి కృపకు పాత్రులవుదాము. 

బాలుండాడుచు నాతపత్ర మని సంభావించి పూగుత్తి కెం 
గేలన్ దాల్చినలీల లేనగవుతో గృష్ణుండు డా నమ్మహా 
శైలమ్బున్ వలకేలదాల్చి విపులచ్చత్రంబుగా బట్టెనా 
భీలాబ్ర్హచ్యుతదుశ్శిలాచకితగోపీగోపగోపంక్తికిన్

ఘనముగా ఇంద్ర యాగమును చేయడానికి ఉద్యమించిన నందాది గోప పెద్దలకు కృష్ణుడు ఇంద్ర యాగము ఎందుకు చేయాలి? అని అడుగగా నందుడు ఇంద్రయాగము చేయుటవలన వానలు కురిసి భూమి పై పచ్చగడ్డి పెరుగుతుంది. ఆ గడ్డిని మేసి గోగణములు వర్ధిల్లును. విరివిగా పాడి కలిగితే మానవులు, దేవతలు సుఖముగా ఉంటారు. కనుక మనమీ ఇంద్ర యాగము చేయాలి అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరి ద్వారానే మనము అన్నీ పొందుచున్నాము. అందుకని ఇంద్రయాగము బదులు మనము గోవర్ధనగిరిని పూజిద్దాము అని కృష్ణుడు వాళ్ళచే పూజలు చేయించి, ఆ పూజలలో తానూ పాల్గొని, శైలాకృతిలో వాళ్ళు పెట్టిన నైవేద్యములు స్వీకరించాడు. 

ఇంద్రుడికి కోపం వచ్చి సంవర్తక మేఘములను పిలిచి మానవుడైన శ్రీకృష్ణుని ప్రేరణచే ఆ గొల్లలు మదమెక్కి నా పూజలు మానేశారు. అందుకని మీరు వ్రజపురిలో ప్రళయకాల వర్షమును కురిపించి వారి జీవితములను అస్తవ్యస్తము చేసిరండి అని పంపించాడు. సంవర్తక మేఘములు ఇంద్రుని ఆదేశం మేరకు వ్రజపురిలో ఉరుములు, మెరుపులు,పిడుగుపాట్లు కుంభవృష్టి ధారలతో కురియుచుండగా కృష్ణుడు వరాహ రూపమున భూమినెత్తిన శ్రీహరి వలె, గోవర్ధన గిరిని బాలురు ఆడుకొనే పూగుత్తులను గొడుగుగా భావించి చేతితో తేలికగా మహా పర్వతమును ఎత్తి తన చేతి చిటికిన వేలుపై నిలబెట్టెను. 

ఏడు అహోరాత్రములు నిర్విరామంగా కుంభవృష్టిని కురిపించినా గొపాలురెవ్వరూ బాధ పడకుండా సంతోషంగా కాలం గడపడం గమనించి ఇంద్రుడు తన ఓటమిని గుర్తించి శ్రీకృష్ణుని క్షమాభిక్ష వేడుకొని ఆకాశగంగతో కృష్ణుడిని అభిషేకించి 'గోవిందా' అను బిరుదంతో సత్కరించాడు. 

భగవంతుని అన్ని నామాలు రూప,గుణాలతో సంభవిస్తే "గోవిందా" అనే నామము భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏడు రాత్రులు,ఏడు పగళ్ళు కష్టపడి తెచ్చుకున్న నామము.



కృష్ణమోహన్ మోచెర్ల గారు 

వచ్చెద రదె యదువీరులు
వ్రచ్చెద రరి సేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
జచ్చెదరును నేడు చూడు జలజాతాక్షీ!

రుక్మిణీ కల్యాణం ఘట్టంలోదిది. ప్రాస ద్విత్వాక్షరం ‘చ్ఛె’తో బాటు ‘ద’ మరియు ‘రకారం’ నాలుగు పాదాలలో ప్రయోగించిన యీ కందపద్యం నడక ఎంతో బావుంది.

దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు 

సీ. దానవ! త్రిపదభూతల మిత్తునంటివి, తరణి చంద్రాగ్ను లెందాఁక నుందు
రంతభూమియు వొక్క యడుగయ్యె నాకును స్వర్లోకమును నొకచరణ మయ్యె
నీసొమ్ము సకలమ్ము నేఁడు రెండడుగులు గడమపాదమునకుఁ గలదె భూమి
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు నిరయంబు నొందుట నిజము గాదె

తే. కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు
గాక ఇచ్చెద వేని వేగంబు నాకు
నిపుడు మూఁడవ పదమున కిమ్ము చూపు
బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమే

బలి చక్రవర్తిని మూడడుగుల భూమిని దానంఅడిగి రెండడుగులలో సమస్తలోకాలను కొలిచి మూడవ అడుగు ఎక్కడ అని అడిగిన వామనుని పలికులు. 
పోతన్న మహాభాగవతం అష్టమస్కందము నుండి.

నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులున్
నీపేరం బనిసేయు హస్తయుగమున్ నీమూర్తిపైఁ జూపులున్
నీపాదములపొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణా!!

శాపవిమోచన పొందిన గంధర్వులు శ్రీకృష్ణుని నుతించిన విధం
పోతన భాగవతం దశమస్కంధము నుండి.

No comments:

Post a Comment