Monday, December 15, 2014

వెరైటీ తిళ్ళు

వెరైటీ తిళ్ళు 
-------------------
భావరాజు పద్మిని 

పొద్దుటే నిద్రకళ్ళు నులుముకుంటూ వంటింటి అధ్యాయానికి తెర తీస్తుండగా, కళ్ళ ముందు లీలగా కదిలింది...'భామా రుక్మిణి' సినిమాలో కమలహాసన్ లాంటి ఒక బామ్మ.

"ఏవిటే 'కుక్కు'తున్నావ్... అంది దబాయింపుగా..."

"బామ్మా, మనిషికి స్వప్న జాగృత్ సుషుప్తి అవస్థలు అని, 3 రకాల అవస్థలు ఉంటాయని నాకు తెలుసు. కాని, ఇవేవీ కాని 'స్కూలావస్థ ' లో మగ్గుతుంటే, ఇటులొచ్చి లేడీ నాగార్జున లాగా ప్రశ్నలు అడుగుట పాడియా ? చెప్పు ? "

" పాడి, కాదు పశువు కాదే అమ్మా ! పైలోకంలో కాసిన్ని మంచి పనులు చేసానా, యముడు మెచ్చి, అలా ఒక్కరోజు నీకు ఇష్టమైన చోట తిరిగి రా ! అని స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. గూగుల్ సెర్చ్ లో బాగా కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరా అని వెతికితే, 'కబుర్ల పోగు - భావరాజు పద్మిని' అని చెప్పింది. అందుకే ఇలా వచ్చా ! కాసేపు కబుర్లాడితే దీవించి వెళ్ళిపోతా అంతే ! "

" ఐతే ఓకే బామ్మా, టీ తాగుతావా..."

"వద్దు, ఆత్మలకి ఆకళ్ళు ఉండవు కాని, ఏవిటీ నలకల్లా కూరలు తరుగుతున్నావ్ ?"

"బామ్మా ! ఎన్నని చెప్పను నేటి అమ్మల కష్టాలు ? సొత్ , నార్త్ ఇండియా దాటి, చైనీస్, ఇటాలియన్, పొరుగింటి పుల్లకూరలు భారత్ కు వలస వచ్చేసాయ్. రకాలు పెరిగిన కొద్దీ, పిల్లల కోరికలు పెరిగాయి. ఇదిగో, రాత్రి ఇవాల్టి మెనూ లో 'హక్కా నూడుల్స్' కావాలని చెప్పి, పడుకున్నారు పిల్లలు. చైనా చింకి కళ్ళకి కనపడాలనేమో, కూరలు ఇలా నలకల్లా తరుక్కు చస్తారు. వాళ్ళని చూసి, మేమూ వాతలు పెట్టుకుంటున్నాం."

"ఎలాగెలాగ... హక్కు నూడలస్సా... అంటే ఏమిటి ? అసలు అచ్చ తెలుగు పిల్లవి, ఆ వంట ఎలా చేస్తావ్..."

"ఏముంది బామ్మా, మార్కెట్ లో పొడవాటి తాళ్ళ లాంటి ఈ ప్యాకెట్ దొరుకుతుందా, దీన్ని తెచ్చి, సగం ఉడకబెట్టి, సన్నగా తరిగిన ఈ కూరలు వేయించి, అందులో మాలాంటి అజ్ఞానుల కోసం చైనా వాడు కనిపెట్టిన 'చింగుల ఫార్ములా ' వెయ్యాలి ?"

"ఏవిటో నీ గోల, దీనికంటే, నరకంలో కేకలే బాగున్నాయ్... పాపాత్ములని కుండలో ఉడకబెట్టినట్టు, ఈ సగం ఉడకడం ఏవిటే అమ్మా, చిరుగుల ఫార్ము అంటే, కోళ్ళ ఫారం లాంటిదా ?"

"కాదు బామ్మా, అదొక పోట్లంలో పొడి. అది వేస్తే, ఆ రుచి వస్తుందన్నమాట . సగం ఉడికిన నూడుల్స్ అంటే, మళ్ళీ నూనెలో వేస్తే, అంటుకు పోకుండా, అలా ఉడకబెట్టాలి... ఒక్క ఐటెం వింటేనే  అలా కుదేలైపోతే ఎలా బామ్మా ? ఇంకా వేపుడు బియ్యం, వేడి కుక్క, పిజ్జా లు, బర్గర్ లు, పాస్తా లు, మంచురియా, మోమో లు, కేకు లు ... ఇలా నేటి అమ్మలు ఎన్ని చెయ్యాలో తెల్సా... "

"ఏవిటే ఇవన్నీ... కుక్కలూ, పిచ్చలూ నా ? ఈ తిళ్ళు అన్నీ వచ్చాకే రోగాలు ఎక్కువ అయ్యయేమో. ఎవడూ తేలిగ్గా చావడే . హాస్పిటల్లో మగ్గీ, మగ్గీ... వీళ్ళకి నరకంలో శిక్షలు అంటే కూడా ఎద్దేవా అయిపొయింది. మొన్నొకడు, నూనెలో వేగుతూ... హ హ కితకితలు... హైదరాబాద్ ఎండల కంటేనా ... అన్నాడు. ఇంకోడు కొండ మీద నుంచి దొర్లిస్తుంటే... హ హ... రోలరు కోష్టరు రైడ్ కంటేనా, అది తిరగేసి, మరగేస్తుంది అన్నాడు..."



"అవును బామ్మా, ఇప్పుడు మనుషులకి బోలెడు తిళ్ళు, బోలెడు కష్టాలు ! చిన్న వయసుల్లో షుగర్ లు, రోగాలు, హార్ట్ ఎటాక్ లు... బయటి తిళ్ళు... కాని, ఎన్ని తిన్నా నేను జన్మలో మర్చిపోలేని తిండి ఒకటుంది చెప్పనా ?"

"ప్రొసీడ్...."

"వెన్నెల్లో పీటేసుకుని, చుట్టూ మనవళ్ళని, కొడుకుల్ని, కోడళ్ళని, మనవరాళ్ళని కూర్చోపెట్టుకుని,  చద్దన్నంలో బెల్లపావకాయ కలిపి, ఓ గిన్నెడు నెయ్యి పోసి, దబ్బపండంత ముద్ద కలిపి, మా చేతిలో పెట్టేది మా బామ్మ. రెండు ముద్దలు తింటే, కడుపు నిండిపోయేది. ఆ రుచి, ఇప్పుడు ఎన్ని రకాలు తిన్నా రాదనుకో..."

"అవునే పిల్లా, నిజమే !"

"మరి బామ్మా, నీకు బోలెడు కబుర్లు చెప్పాగా, నాకు నరకంలో శిక్షలలో స్పెషల్ డిస్కౌంట్ ఇప్పిస్తావా ?"

"హమ్మా, ఎక్కడన్నా బామ్మ కాని, బాసు యముడి దగ్గర కాదేవ్... ఇంకాసేపు ఉంటే, వరాలు కూడా అడుగుతావేమో ! నేను డింగ్... నువ్వు చింగ్..."

" బామ్మా , దీవించడం మర్చిపోయావ్.... ఆగాగు..."

Wednesday, December 10, 2014

పేర్ల గిన్నెలు

పేర్ల గిన్నెలు 
----------------
భావరాజు పద్మిని - 10/12/14 


అప్పట్లో నేను 6వ తరగతి చదువుతున్నా. నాన్నగారి ఉద్యోగరీత్యా మేము గుంటూరు జిల్లా భట్టిప్రోలు కు బదిలీ అయ్యి వెళ్లి, అక్కడి టి.ఏం.రావు  పాఠశాల లో చేరాము. అక్కా, నేను ఆటల్లో, పాటల్లో, నాట్యంలో, చదువులో మేటి. మమ్మల్ని 'ఆలూరి సిస్టర్స్ ' అనేవారు. స్కూల్ మధ్యమధ్య రకరకాల పోటీలు పెట్టి, బహుమతులు ఇచ్చేది. అప్పుడు మాచేత ప్రార్ధనా గీతాలు, నాటకాలు, స్వాగత నృత్యాలు చేయించేవారు. తర్వాత బహుమతుల కార్యక్రమం మొదలవగానే... ఒకటి తరువాత ఒకటిగా ప్రైజులు చాలా వరకు నాకూ, అక్కకే వచ్చేవి.
వాటిలో కొన్ని పుస్తకాలు ఉండేవి. కాని, ఆ ప్రైజుల్లో చాలా వరకూ ఊర్లో ఉన్న వారు స్పాన్సర్ చేసేవారు. అవి ఏమిటంటే...

పెద్ద స్టీల్ గ్లాసు, మగ్గు, గుండు చెంబు, పళ్ళెం, గిన్నెలు వంటివి. అప్పట్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం లేదు. అన్నీ స్టీల్ వే ! ఊర్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు సైతం పేరంటాళ్ళు స్టీల్ వస్తువులే న్యూస్ పేపర్ లో చుట్టి ,ఇచ్చేవారు. అలా 6,7,8, తరగతులు పూర్తి అయ్యేసరికి, మా దగ్గర ఒక చిన్న స్టీల్ కొట్టు పెట్టుకునేన్ని సామాన్లు పోగయ్యాయి. అమ్మ కొన్ని వాడేది, కొన్ని నీ కాపురానికి అని అటకమీద దాచేది(వాటిలో చాలా తుప్పు పట్టేసాయి)... కొన్ని ఇచ్చేసేది...



ఇక్కడితో కధ అయిపోతే సరదా ఏముంది ? ఇదివరలో తమ గిన్నెలు ఇరుగూ పొరుగూ పుల్ల కూర రుచి కోసం మార్చుకున్నప్పుడు, మారిపోకుండా, వాటి మీద పేర్లు రాసుకునే అలవాటు.   తాము ఇచ్చిన గిన్నె బహుమతి అందుకున్న వారు వేరే వారికి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో, స్టీల్ కొట్లో వస్తువు కొనగానే...' చి.ల.సౌ. దమయంతి వివాహ సందర్భంగా లక్ష్మీకాంతమ్మ, కాసులయ్య అందించిన కానుక ' అని రాసేవారు. అయితే, అప్పటికప్పుడు కానుకలు సిద్ధంగా లేనివారు, ఆ స్టీలు గిన్నె షాప్ కు తీసుకెళ్ళి, ఆ పేర్లు కొట్టించి, ఇంకో పేర్లు రాయించేవాళ్ళు. ఎవరైనా చనిపోతే, వారి జ్ఞాపకార్ధం కూడా స్టీల్ గిన్నెలు ఇచ్చేవారు.
మొత్తానికి, స్కూల్ దాకా వచ్చేసరికి ఆ గిన్నెలకు పేర్లు గొప్ప, గిన్నె కురచ లాగా ఉండేవి. అంతగా చదువుకోని ఆ ఊరి జనానికి స్టీల్ కొట్టు వాడే గతి. కొన్ని సార్లు ఒత్తులు, పొల్లులు ఎగిరిపోయేవి. అది చదవబోతే ఇలా ఉండేది.
'కీ.శే. అనంతరామయ్య పుష్పవతి అయిన సందర్భంగా  అందిస్తున్న కానుక..."
" కృష్ణమూర్తి గారి శ్రీమంతం సందర్భంగా వారి జ్ఞాపకార్ధం అందిస్తున్న కానుక..."
"దాని అమ్మ (దానమ్మ ) జ్ఞాపకార్ధం వారి కుమారుడు వెంకటరత్నం , కోడలు వెంకాయమ్మ అందిస్తున్న బహుమతి..."

ఇలా తీసివేతలు, కొట్టివేతల తో ఉన్న గిన్నెలు ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే, నా పెదాలపై చిరునవ్వు పూసేస్తుంది. ఏమైనా కష్టించి గెల్చుకున్న బహుమతి, కల్మషం లేని బాల్యం ఇవన్నీ జీవితపు పుటల్లో మధుర జ్ఞాపకాలు... కదూ !

మహాత్ములను తెలుసుకోవడం ఎలా ?

మహాత్ములను తెలుసుకోవడం ఎలా ?  

ప్రస్తుతం గారడీలతో పలువురు అనేక విధాలుగా మోసగిస్తున్న తరుణంలో, మాహాత్ములకు, గారడీ వాళ్లకు ఉన్న అంతరాన్ని గుర్తించేందుకు పెద్దలు చెప్పిన కొన్ని శ్లోకాలు, వాటి అర్ధాలు, మీకు ఇక్కడ ఇస్తున్నాను.

మహత్వ కార్యం క్రియతే మహద్భిః
హరేర్మహత్వ ప్రతిపాదనార్ధం |
ద్రష్టుశ్చ బుద్దేః పరివర్తనార్ధం
తద్భో మహాత్వస్య పరా పరీక్షా !

మహాత్ములు భగవంతుడి శక్తిని చూపించేందుకూ, చూసేవారిలో మంచి పరివర్తన కలిగించేందుకూ , మహిమలు చేస్తూ ఉంటారు. ఒక పని మాయా, మహత్తా అని నిరూపించేందుకు ఇదే చివరి పరీక్ష !

కో వేంద్ర జాలస్య మహాత్మనశ్చ
యధేష్ట సృష్టి ప్రణవస్య భేదః
ఏకశ్చమత్కార గతార్ధశక్తిః
మనఃపరీవర్తన చుంచురస్య |

గారడీ వాడు, మహాత్ముడు, ఇద్దరూ తలచుకున్నవి సృష్టి చేసేవారే. ఇద్దరిలో తేడా ఏమిటి ? ఒకరి శక్తి చూపరుల్లో ఉల్లాసం కలిగిస్తే, రెండవవారి శక్తి చూపరుల హృదయాలలో పరివర్తన కలిగిస్తుంది.



అంటే, వారు చేసే కార్యం వల్ల భగవంతుడి మహత్తు వెల్లడి కావాలి, ఆ కార్యం చూస్తున్న నీలో ఒక మంచి మానసిక పరివర్తన రావాలి. ఒక్కొక్కసారి అటువంటి కార్యం వల్ల నీలో తాత్కాలిక ప్రశాంతత రావచ్చు. లోకసామాన్యమైన వస్తువుల వల్ల తాత్కాలిక శాంతి కలిగితే, లోకాతీతమైన వస్తువు, అంటే భగవంతుడి వల్ల శాశ్వత శాంతి కలుగుతుంది. అందుకే మీ హృదయాన్ని మీరే చదవాలి ? ఎలా ?

హృదయంలో వ్యక్తమయ్యే అవ్యాజమైన ప్రశాంతతే అసలైన పరివర్తన. హృదయమంటే ఏమిటి ? గురువును ఎలా తెలుసుకోవడం ?

హృదయం నామ కిమితి
స్వతో వేత్స్యసి చింతనాత్ |
ప్రత్యభిజ్ఞాయతే శాంత్యా
హృదయే సద్గురుస్సఖే ||

మిత్రుడా ! హృదయమంటే ఏమిటో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఆ హృదయంలో శాంతి కలగడం ద్వారా నీవు నీ గురువును గుర్తు పట్టవచ్చు. ఎవరి సన్నిధిలో నీ హృదయం ప్రశాంతంగా ఉంటుందో వారే నీ గురువు.

చూసేవారిలో, అటువంటి శాంతిని తీసుకు రాలేనిది మహత్తు కాదు, గారడీ మాత్రమే !

(శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి - 'సూక్తి మాల- నీతి మంజరి' అనే పుస్తకం నుంచి, సేకరణ.)