Sunday, November 16, 2014

అమ్మ మనసు

అమ్మ మనసు (చిత్రం : పొన్నాడ మూర్తి గారు )
-------------------------------------
భావరాజు పద్మిని - 16/11/14
--------------------------------------
"నీకు బుద్ధుందా ? అన్నీ అల్లరి పనులే ! నీతో వేగలేక చస్తున్నానే !"
"ఏవిటో శ్రీమతిగారు చాలా కారంగా ఉన్నారు..."
"ఉండకేం చెయ్యమంటారు... చూడండి... ఏమీ తెలీనట్టు అమాయకంగా ఎలా మొహం పెట్టుకు చూస్తోందో. బాత్రూం నుంచి మగ్గు తో నీళ్ళు తెచ్చి హాల్ నిండా పోసేసింది. ఇప్పుడు ఇదంతా తుడవాలి..."
"ఏం తల్లీ, ఎందుకలా చేసావ్..."
చక్కగా నవ్వుతూ నాన్నని బుట్టలో పడేసి ఎత్తుకోమంటూ చేతులు చాస్తుంది పాప. ఇంకేముంది... ఇద్దరూ హత్తుకుని, నవ్వుకుంటారు...ఒకే పార్టీ !
"ఆ, ఆ , దాన్ని అలాగే నెత్తినెక్కించుకోండి.... ఇంకా అల్లరి చేస్తుంది... రాలుగాయి..."
____________________________________________________________________

"ఇలాంటి వెధవ్వేషాలు ఇంకో సారి వేసావంటే చావగొడతా ! రోజురోజుకీ నీ అల్లరి ఎక్కువౌతోంది..."
"మళ్ళీ ఏమయ్యింది..."
"ఆ మొహం చూడండి... పౌడర్ డబ్బా అంతా ఓంపేసి, భూతంలా మొహం నిండా పౌడర్ పట్టించుకు కూర్చుంది. చీకట్లో దబదబా నడుస్తూ, కిందున్న పౌడర్ వల్ల జారిపడబోయి, మంచం కోడు పట్టుకు చూద్దును కదా, దెయ్యంలా మంచం మూల నక్కి కూర్చుంది... హడిలి చచ్చాను..."
గట్టిగా నవ్వేసి, "అంతే కదా ! పోనీ ఆ పౌడర్ నేను తుడుస్తాలే ! కోప్పడకు... నువ్వు రా తల్లీ..."
చటుక్కున చంక ఎక్కేసి, అమ్మను వెక్కిరింతగా చూస్తుంది పాప...




కోపంగా పాపను తిట్టేస్తోంది అమ్మ...." అసలు... నిన్ను కాదే ! మీ నాన్నని అనాలి. అతి గారం చేసి, నిన్ను చెడగోడుతున్నారు..."
"ఓహో, ఈ సారి సమిష్టి యుద్ధమా ! ఇంతకీ నా అందమైన పెళ్ళానికి కోపం ఎందుకొచ్చిందో !"
"మీ మార్కెటింగ్ తెలివితేటలు నా దగ్గర కాదు ! ఇదేం చేసిందో తెల్సా ? పాలవాడు వచ్చాడని, తలుపు తీసి, పాల గిన్నె తేవడానికి వెళ్తే, ఈ లోపల బైటికి పారిపోయి, పక్కింటి డాబా సన్ షేడ్ మీద ఎక్కి, అమ్మా, నేను ఎక్కడున్నానో చెప్పుకో... " అంది. అక్కడి నుంచి పడితే... హమ్మో, నా గుండె జారిపోయింది. అయినా తమాయించుకుని, భలే వెళ్ళావ్, ఎలా వెళ్ళావో, అలాగే రా..." అని పిలిచాను, రాగానే బడితె పూజ చేసేసా. అదిగో, ఆ మూల కూర్చుని ఏడుస్తోంది. క్షణం చూపు తిప్పుకుంటే చాలు, సబ్బు ముక్కలా జారిపోతూ ఉంటుంది. దీన్ని పెంచడం నా వల్ల కాదు...
నాన్న, పాప మళ్ళీ షరా మామూలే !

___________________________________________________________________

"రెండు రోజుల నుంచి తినవు, తాగవు, నిద్రపోవు... కాస్త రెస్ట్ తీసుకో."
"ఎలాగండీ. చిన్నది అలా జ్వరం తో పడుకుని ఉంటే, నాకు ఏం తోస్తుంది చెప్పండి "
"అది అల్లరి చేసిందని తిడతావ్ కదా !దాన్ని విసుక్కుని, కసురుకుని, కొడతావ్ కదా ! ఇప్పుడు అది అల్లరి చెయ్యకుండా ఒక చోటే పడుందిగా , ఇంకేంటి నీ సమస్య ?"
"అదలా పడుకుని ఉండడమే సమస్య ! ఏ తల్లికి అయినా బిడ్డ సందడిగా తిరుగుతూ, ముద్దు మాటలు చెబుతుంటే సంబరం కాని, అది ఇలా నీరసంగా పడుకుని ఉంటే... నా ఒంట్లోని శక్తి అంతా ఎవరో పిండేసినట్టు ఉందండీ ! నేనూ చిన్నప్పుడు అల్లరి చేసిన దాన్నే కదా ! పిల్లల అల్లరి అమ్మకు ఇష్టమే ! కాని, కోప్పడి కాస్త నియంత్రించక పొతే... దానికి మంచేదో, చెడేదో ఎలా తెలుస్తుంది..."
"అయితే... దాని అల్లరి నీకూ ఇష్టమేనా !"
"అవునండి... నేనూ పక్కకెళ్ళి నవ్వుకుంటా ! చూడండి, ఎలా ఒళ్ళు తెలీకుండా పడుకుందో... మాయదారి జ్వరం నాకైనా వచ్చింది కాదు ! ఏం మాట్లాడరే ! అలా నా వంక ఎందుకు చూస్తున్నారు ?"
............................................................ ఎందుకంటే....
"అమ్మ మనసు అంటే ఏవిటో... నాకు ఇవాళే తెలిసింది...."