Wednesday, October 3, 2012

క్షేత్రయ్య

క్షేత్రయ్య

క్షేత్రయ్య అసలు పేరు అర్భకం వరదయ్య. జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నారు. సహపాఠి అయిన మోహనాంగి అనే దేవదాసికి సన్నిహితుడైయ్యారు. తరువాత మేనమామ కూతురు రుక్మిణిని పెండ్లాడారు. కానీ మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట. మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్ర్తీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. తనను తాను నాయికగా భావించుకుని, భగవంతుడి విరహంలో తపించడం మధుర భక్తి. ఆ మధుర భక్తి గీతాలకు మోహనాంగి నాట్యం చేసిందట. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.
చక్కటి క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలు కొన్ని...అంతర్జాలం నుంచి...మీ కోసం.

మువ్వ గోపాలుడు యెంత చక్కని వాడు? చెలులతో ఆ చక్కదనాన్ని వర్ణించి మురిసిపోతోంది ఒక గోపిక...

ఎంత చక్కనివాడే నా సామి వీ-డెంత చక్కనివాడే 
ఇంతి మువ్వ గోపాలుడు, సంతతము నా మదికి సంతోషము చేసెనే 

మొలక నవ్వుల వాడే-ముద్దు మాటల వాడే 
తళుకారు చెక్కు-టద్దముల వాడే 
తలిరాకు జిగి దెగడ-దగు జిగి మోవి వాడే 
తలిదమ్మి రేకు క-న్నుల నమరు వాడే 

చిరుత ప్రాయము వాడే- చెలువొందు విదియ చం 
దురుగేలు నొసలచే-మెరయువాడే 
చెఱకు విల్తుని గన్న-దొరవలే ఉన్నాడే 
మెరుగు చామన చాయ- మే నమరు వాడే 

పొదలు కెందామరల పెం-పొదవు పదముల వాడే 
కొదమ సింగపు నడుము-కొమ రుమరు వాడే 
మదకరి కరముల-మరువు చేతుల వాడే 
సుదతీ| మువ్వగోపాలుడెంత-సొగసు గలవాడే 

రా రమ్మని మువ్వ గోపాలుడిని పిలుస్తోంది ఒక గోపిక.

రారా సామి రారా రారా నా వలపు వారక మించె నా సామి ||

1 . ఎంత సేపని తాళు దానరా మోహమింతనరాదు నీ యానరా

చెంతజేరి కెమ్మోవి యానరా నన్ను

చింతల బెట్టేది మానరా నా సామి ||



2. ఏరా నీకు పగదాననా చుచి యేలేటంత పాటి లేదాయెనా

చేరి నీ పదసేవ జేయనా ఇపుడు

చిన్న నాటి కూటమి పోయెనా సామి ||

3. కూడితి విక దయ వుంచరా మువ్వ

గోపాల నా మోహమెంచరా 

వేడుకయ్యేని కౌగలించరా నన్ను

వింత సేయక గారవించ రా నా సామి ||




యెంత పిలచినా, వలచినా రాదు మువ్వ గోపాలుడు...అలిగాడేమో...నువ్వు తప్ప వేరు దిక్కెవరు స్వామీ...ఈ విరహ బాధ పగ వాడికి కూడా వద్దు...

పల్లవి:
వలపు నిలుప నాదు వశము గాదేమి సేతు వనితరో ఈ వేళ
పొలతిరొ మా మువ్వ గోపాల రాయడు చలము చేసినాడు ||

చరణాలు:

1.చలువ గంధము విరుల సరములేలే సొమ్ములేలే
సొలపైన ఈ సొగసు జుచేవారెవ్వరే
చెలియరో నేడది చెప్ప సక్కెము గాదు
వలపైన ఈ పాపము వద్దే పగవారికైన ||

2.చిలుక తేజిపై నెక్కి చెలరేగి ఎదురెక్కి
విలుగుణ ధ్వని చేసి విరి శరము బూని
కులుకు గుబ్బల నడుమ గురి జూచు చున్నాడే
అలరు విల్తుని బారి నార్చే వారెవ్వరిక ||

3.సరసుడు రాడాయె సరిప్రొద్దు వేళాయె
విరహము మెండాయె వెన్నెల కాకాయె
మరుని కేళిలో నన్ను మువ్వ గోపాలుడు
సరసముతో పెనగి చౌక చేసినాడిక ||

దొరికాడు గోపాలుడు...ఇంకా నిన్నువదిలి పెడతానా? వదిలితే మళ్లీ దొరుకుతావా? చల్లగా ఇంకో గోపిక నిన్ను సొంతం చేసుకోదు...మరో మువ్వ గోపాల పదం.

ఇంక నిన్ను బొనిత్తునా ఇభ రాజ వరదా ||

శుక వాణి చేత నీ సుద్దు లెల్ల విన్నట్లాయె ||


1.నవ్వులంట యున్నావేమో నా పద్దు మీ సారి
పువ్వు బోడూల చేత రవ్వ సేయించ మాన
జవ్వన మెల్ల నీ పాలు చేసి చాల నమ్మి యున్నందు
కెవ్వతె తో నో కూడి వచ్చి ఇపుడు లేదని బొంకేవు ||

2.పన్నుగ మువ్వ గోపాల బాస లిచ్చి నన్ను కూడి
వన్నె లాడి కే లో నైన వగ లెల్ల విన్నార నేడు ||