Sunday, December 29, 2013

సుభాషితాలు

'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో మిత్రులు అందించిన సుభాషితాలు...

జ్ఞాన వల్లి

రహస్యంగా ఇతరులను నిందించటం పాతకమని గ్రహించు.దాన్ని నువ్వు పూర్తిగా విడనాడాలి.మనస్సుకు అనేక విషయాలు తోచవచ్చు.కాని వాటిని వెల్లడింప పూనుకుంటే ,గోరంతలు కొండంతలౌతాయి..క్షమ చేతనే ,విస్మరణ చేతనే సర్వం అంతమొందుతుంది..

గాంభీర్యమూ,శిశుసహజమూ ఐన నిష్కాపట్యాన్ని సంతరించుకోండి..అందరితో అనుకూలంగా వ్యవహరించండి.పాక్షిక భావాలకి తావివ్వకండి.వ్యర్ధ వాగ్వాదం మహాపాతకం..

వ్యర్ధ వాగ్వాదం నిమిత్తం నీ వద్దకు యెవరైనా వస్తే ,మర్యాదగా తప్పుకో..సకల సంప్రదాయస్తులతోనూ నీ సానుభూతి ప్రకటించు.నీలో ఈ ప్రధాన గుణాలు ప్రకటితమైనప్పుడే మహాశక్తి సామర్ధ్యాలతో పనిచేయగలుగుతావు.

నిరుత్సాహమూ,అధైర్యమూ యెన్నటికీ ధర్మం అనిపించుకోవు..సదా మందహాస వదనంతో ఆనందమూర్తివై ఉంటే యే ప్రార్ధన కంటే కూడా ఇది నిన్ను విశేష భగవత్సన్నితుణ్ణి చేస్తుంది..

*****************************

వేదాంతం పాపాన్ని యెన్నడూ చూడదు.కాని దోషాన్ని గుర్తిస్తుంది.దుర్భలుడనని,పాపినని,నిర్భాగ్యుడనని,శక్తిహీనుడనని,యేదీ చేయలేనని తలచడమే వేదాంతం మహా దోఅషంగా పరిగణిస్తుంది..

బలమే గీవనం,,దౌర్భల్యమే మరణం,బలమే సౌఖ్యం,శాశ్వత జీవనం,అమరం:దౌర్భల్యం నిరంతర ప్రయాస.దు;ఖం.దౌర్భల్యమే మరణం..బాల్యం నుండీ,కాదు శైశవం నుందీ బలోపేతం,సానుకూలం,దోహదకరం ఐన భావాలను మెదడులో జొరబడనివ్వాలి..

దౌర్భల్యమే బాధకు కారణం.దుర్భలులం కావటం వలననే అస్త్యమాడుతాము,చంపుతాము,అనేక ఇతర నేరాలు చేస్తాము.ఎంతో బాధను అనుభవిస్తాము.తద్వారా మరణిస్తాము.యెక్కడ మనలను దుర్బలిలను చేసేది ఉండదో, అక్కద మరణం కానీ,బాధ కానీ ఉండదు.

బలమే ఆవశ్యకమైనది.అదే భవ రోగానికి ఔషధం.ధనికుల వలన హింసకు గురి ఐయ్యినపుడు పేదలకు కావలసిన దివ్యౌషధం బలమే..పండితులచే అణగద్రొక్కబడిన పామరులకు కావలసిన ఔషధం బలమే..ఇతర పాపాత్ములచే పీడింపబడే పాపులకు ఆవస్యకమైన ఔషధం బలమే.

అందుకే స్వశక్తి మీద నిలబడి,ధీరుడవై మసలుకొంటూ బలిస్టుడవై ఉండాలి.యావత్తు బాద్యతను నీ భుజస్కంధాలపై వహించి నీ విధికి నీవే కర్తవని గ్రహించి నీకున్న బలసం రక్షణలు నీలో నిలుపుకొని ఆత్మ స్తైర్యంతో నీ భవిష్యత్తుని నీవే తీర్చి దిద్దికోవాలి......

********************************

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా...అని ఒక కవి గారు ఒక పాట లో రాశారు...మనం ఎంతోకాలంగా అనుకుంటున్నది,,యెదురుచూస్తున్నదీ ఇక జరగదేమో ,,ఇక అవ్వదేమో,,ఇక రాదేమో..అనుకుంటూ నిరాశా,నిస్పృహలతో విసిగి వేసారి ఉన్నప్పుడు...సడన్ గా అది జరిగితే,ఐతే,వస్తే,ఆ ఆనందం వర్ణింపనలవికానిది..ఈరోజు ఆ ఆనందాన్ని అనుభవించాను.ఒక విషయంలో...దేముడు ఉన్నాడు..అవును..ఉన్నాడు...మన వెనుకే ఉండి అన్నీ చూస్తూ నడిపిస్తాడు...నమ్మకం,,విశ్వాసం ఉంచితే తప్పక అనుకున్నది జరుగుతుంది....ఆనందంలోనూ,,దు;ఖంలోనూ కన్నీరే వస్తుంది..థాంక్ గాడ్.....ఈరోజు నాకు చాలా మంచిరోజు.....

~~~~~~~~~~~~~~~~~~~

కెఎస్ఎన్ మూర్తి 

మనిషి స్వతంత్రంగా పుట్టాడు.కాని అతడు అన్ని చోట్లా బంధాలతో బంధింపబడి ఉన్నాడు.-రూసో

~~~~~~~~~~~~~~~~~~~~
షీలా తూపురాని 

పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గదిలాంటిది.

హృదయమే ఉత్తమ భోదకుడు , కాలమేఉత్తమ గురువు , ప్రపంచమే ఉత్తమ గ్రంధం ,భగవంతుడే ఉత్తమనేస్తం.

~~~~~~~~~~~~~~~~~~

పతనేని జోగారావు 

మన సంస్కారాల అంతరార్థం :

భారతీయ సంస్కౄతిలో చెప్పబడినవన్నీ సమజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై ౠషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.
మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది స్మౄతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు.
మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది. సంస్కారల ఆచరణ మనిషి జీవితంలో వివాహాంతో మొదలవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. తద్వారా మన సంస్కారములు ప్రధానోద్దేశ్యం జీవుల క్షేమమేనని తేటతెల్లమవుతోంది. వేదోపనిషత్తుల ప్రకారం మన శరీరం ఐదు అంశాలమయంగా విభజింపబడింది.
1. అన్నమయ కోశం – భౌతిక శరీరం
2. ప్రాణమయ కోశం – శక్తి కేంద్రం
3. మనోమయ కోశం – చింతనా కేంద్రం
4. బుద్ధిమయ కోశం – వివేకం
5. అనందమయ కోశం – పరమశాంతి
మన శరీరంలో ఈ ఐదు అంశాలు షోడశ సంస్కారాల ద్వారా సక్రమమైన రీతిలో చలిస్తాయనేది శాస్త్రవచనం ఈ సంస్కారాల వెనుకనున్న వైజ్ణానిక రహస్యాలు నేతి వైజ్ణానికులకు సైతం అశ్చర్యపరుస్తాయి.
1. వివాహం : వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగ, ఆర్యమ, సవిత, పురంధి అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా, నా జీవితం సుఖమయమయమ్ అయ్ఏందుకు నీ చేయిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు.
2. గర్భాదానం : స్త్రీ పురష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం నిర్దేశించబడింది.
3. పుంసవనం : తల్లిం గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.
4. సీమతం : గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షింపబడుతుంది.
5. జారకకర్మ : బిడ్డకు నెయ్యిని రుచి చూపి, పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది.
6. నామకరణం : బిడ్డ ఈ సమజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వౄద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లి దండ్రులు జరిపే సంస్కారం.
7. నిష్ర్కమణం : బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటిబిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచYఅం చేయడమో ఈ సంస్కారంలోని అంతరార్ధం.
8. అన్నప్రాశనం : బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని పరిచయం చేయడం.
9. చూడాకర్మ : పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
10. కర్ణబేధ : చెవులు కుట్టించడం.
11. ఉపనయనం : బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం.
12. వేదారంభం : సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం.
13. సమావర్తనం : పిల్లలు విద్య ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరుపబడుతుంది.
14. వానప్రస్ధం : బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ.
15. సన్యాసం : ఐహిక బంధాల నుంచి విముక్తి పొందడం.
16. అంత్యేష్టి : పిత్రూణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం.

*****************************************

లక్ష్మీ నరసింహ స్వామిని ప్రదోష, పౌర్ణమిలలో స్తుతిస్తే?
లక్ష్మీ నరసింహుడు, సత్యనారాయణ స్వామి వంటి విష్ణుమూర్తులను పౌర్ణమి, ప్రదోషం నాడు పూజిస్తే.. ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. అలాగే ఈతిబాధలుండవని, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. 

ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రదోషం, పౌర్ణమి, స్వాతి నక్షత్ర సమయంలో కొబ్బరి నీరు, పాలు, పన్నీరు, తేనె, పసుపు, చందనం, తిరుమంజన పొడి వంటి అభిషేక వస్తువులతో అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి. అభిషేకానికి పూర్తయిన తర్వాత తులసీ మాలను అర్పించి స్తుతించే వారికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.

లక్ష్మీ నరసింహ స్వామినిపై తిథుల్లో ఆరాధించే వారికి తీరని పదోన్నతి, విదేశీయానం చేకూరడంతో పాటు రుణబాధలు, మానసికాందోళనలు తొలగిపోతాయని అంటున్నారు



Wednesday, December 18, 2013

కదంబం 1

'అచ్చంగా తెలుగు' ముఖ పుస్తక బృందంలో వివిధ సభ్యులు అందించిన విలువైన సమాచారం...



గంగావతరణం **Himaja Prasad

ఆకాశంబుననుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు
శ్లోకంభైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంభోధి పయోధినుండి పవనాంధోలోకంకముంజేరె గం
గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్టసంపాతముల్

కపిల మహాముని కోపాగ్నికి భస్మమైన తన పితరులకు పుణ్యలోక ప్రాప్తికై భగీరధుడు గంగనుగూర్చి తపస్సుచేయగా గంగ ఆకాశమునుండి శివునితలమీదకు,అక్కడనుండి హిమాలయపర్వతము మీదకు,అక్కడనుండి భువికి,భూలోకమునుండి సముద్రములోనికి,అటనుండి పాతాళలోకానికి చేరి సగరుల భస్మరాసులపై ప్రవహించి వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగించింది.

-- తెలుగు భారతం -- లీలా ప్రసాద్ గారు.

కం. క్రోధము తపముం జెఱచును,
క్రోధము యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధము ధర్మ క్రియలకు
బాధయగుం గ్రోధిగా దపస్వికి జన్నే.....

కం. క్షమలేని తపసితనమును,
బ్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రా
జ్యము భిన్నకుంభమున తో
యములట్టుల యద్రువంబులను నివియెల్లన్ ... 
------- నన్నయ్య

-- క్రోధము - క్షమలకు సంబంధించిన సూక్తులీ పద్యాలు :

క్రోధము వలన తపస్సు చెడిపోతుంది. అణిమాద్య సిద్దులు క్రోధం
వలన దెబ్బతింటాయి. తాపసికి, ధర్మాచరణకు క్రోధం ఆటంకం.

పగిలిన కుండలో నీళ్ళు నిలవనట్లే, క్షమాగుణం లేని తాపసితనం,
గర్విష్టి సంపదలు, అధర్మ పరుడైన రాజు యొక్క రాజ్యం నశిస్తాయి.

చెరుకు రామమోహనరావు 

ఇది బ్ర. శ్రీ. వే. జటావల్లభుల పురుషోత్తం గారి 'మౌక్తికము'
గంగా సమానః ఖలు శుద్ధ ధర్మః
సత్ కామ ఏవం యమునోపమశ్చ 
తన్మేళనం యత్ర తదేవ పూతం 
క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి 

ధర్మం అనే గంగ ,కామం అనే యమున ,దాంపత్యమనే అంతర్వాహినియైన సరస్వతితో కలిసి త్రివేణీ సంగమమై తనరారే ప్రయాగనే భార్య అట.ఎటువంటి సద్భావానో గమనించండి .

'సుందరాంగుడు సోమేశ్వరుడు ' == కృష్ణ శర్మ 

చూడరారండీ జన్మతరించ చూడరారండీ
ఎంతటి సుందరాంగుడో సోమేశ్వరుడు 
సూగల క్షేత్రమున వెలసిన గిరిజాప్రియుడు 
మా అమ్మ గౌరమ్మను పెండ్లాడ వచ్చినాడు 

రంగురంగులపట్టు పంచెనుకట్టి రత్నహారాలతో దివ్యాభరణాలతో 
అష్ట సిద్ధులు ముందునడువ బ్రహ్మాది దేవతలు వెనుకనడువ
నందీశ్వర వాహనముపై కోటి సూర్యుల వెలుగుతో
మూడుపదుల వయసుతో ఎంత అందమురా నీది

సుంగంధ పుష్పమాలా అలంకారములతో 
పచ్చకర్పూరపు తాంబూల సేవనముతో 
వనశంకరిగా వెలసిన మా అమ్మ గౌరమ్మను 
పెండ్లాడవచ్చినావు మన్మధుని మించిన అందగాడా 

పాడనీ నీ సుందర రూప వర్ణన కలకాలము
సుందరరూపా సుందరేశ్వరా కల్యాణసుందరా
ఏడేడు లొకాలలో దొరకడట సదాశివుడంటి విభుడు
నిను మించిన ప్రభువు వెరేవరురా నను నీ భక్తుని చేయరా 

ఆ రీతి ననువుంచి,శివా నిను దరిజేర వరమీయరా
దేవ దేవ మహాదేవ శివశంకరా శంభోశంకరా

శ్రీదేవి == అలంపురం కవిత 

అలంపురమొక ప్రాచీనక్షేత్రం 
చాళుక్య రాజైన పులకేశిచే నిర్మితం 

ప్రాకృతిక అందాలెన్నిటికో నెలవు 
శిల్పకళలకు ఇది చక్కటి కొలువు 

గడియారపువారు చేసిన సేవలు 
క్షేత్రాభివృద్ధిలో అపురూప ఘట్టాలు 

శక్తిపీఠంగా అలంపురం విలసిల్లె 
ముక్తిరూపిణిగా జోగులాంబ భాసిల్లె 

అడుగిడినవారు అలంపురము నందు 
ముక్తిని పొందుదురు ఇహపరము నందు

                                       

శ్రీనివాస్ మంచిరాజు

ఛాయా సోమేశ్వర ఆలయం ఒక అద్భుతం.... ఇక్కడ రోజు మొత్తం ఏదో ఒక స్థంభం నీడ శివలింగం మీద పడుతుంది.... ఈ గుడి లోని శిల్ప కళను చూడడానికి రెండు కళ్ళు చాలవు.... ఈ గుడి నల్గొండ ఊరి చివరలో ఉన్న పానగల్లు అనే ఊరిలో ఉంది.... NH - 9 నుండి కేవలం 15 కిలో మీటర్ల లోపు ఉంటుంది.

                                

భావరాజు పద్మిని 

చిన్నప్పుడు మా తెలుగు వాచకంలో ఉండేది...

బళ్ళారి రాఘవ ఒకసారి గుడివాడలో హరిశ్చంద్ర నాటకం వేస్తున్నప్పుడు కాటి సీనులో ఎక్కడి నుండో ఒక కుక్క స్టేజీ మీదకు అకస్మాత్తుగా ప్రవేశించిందిట. అంతా అవాక్కయి పోయేరు. ప్రేక్షకులు గొల్లున నవ్వేరు. రాఘవ సమయస్ఫూర్తితో నాటకంలో లేని ఓ డైలాగు ... ‘‘ ఓ శునక రాజమా !నీకును నేను లోకువయిపోతినా; పొమ్ము ’’ అని దానిని అదిలించే సరికి అది అక్కడి నుండి పారి పోయిందిట. ఈ విధంగా మహా నటుడు రాఘవ ఆ నాటి నాటకం రసాభాసం కాకుండా చేసారుట.

శ్రీనివాస్ రావినూతల - నీతి కధ 

ఒక వర్తకుడు బేరగానికి తేనె అమ్ముతున్నాడు. అకస్మాత్తుగా అతని చేతిలోనుంచి తేనేగిన్నె జారి కింద పడిపోయింది. గిన్నేలోనుంచి తేనె వొలికి నేలమీద పడింది. వ్యాపారి సాధ్యమైనంత తేనెను గిన్నేలోనికి పైపైన ఎత్తి పోసుకున్నాడు. కానీ ఇంకా కొంత తేనె నేలమీద ఉంది. తేనె తీపిదనానికి ఆశపడి ఈగలు గుంపులు గుంపులుగా వచ్చి తేనె మీద వాలాయి. తియ్యని తేనె రుచి మరిగి ఈగలు గబగబా తేనెను జుర్రుకోసాగాయి. 

కడుపునిండిన తర్వాత ఈగలు ఎగిరిపోవాలని ప్రయత్నించాయి. కాని రెక్కలు తేనెకు అంటుకుపోయ్యాయిగా! అవి ఎగరాలని ఎంతగానో ప్రయత్నించాయి. కానీ ఎగరలేకపోయాయి. పైకెగరాలని ప్రయత్నించే కొద్దీ తేనెకు మరింత అంటుకుపోయాయి పాపం!

ఎన్నో ఈగలు తేనెలో విలవిలలాడుతూ చనిపోయాయి. అయినా తేనె మీది ఆశ కొద్దీ కొత్తగా ఈగలు గుంపులు గుంపులుగా రావడం మానలేదు. విలవిలలాడుతున్న,చనిపోయిన ఈగలను చూసి అయినా అవి బుద్ది తెచ్చుకున్నాయా?

ఈగల అవస్థ చూసి వర్తకుడు ఇలా అన్నాడు---'జిహ్వ చాపల్యానికి,లోభానికి గురయ్యేవారు ఈ ఈగల్లాగానే మూర్ఖులు. క్షణికమైన ఆనందాన్ని ఆశించి,లోభం కొద్దీ తమ ఆరోగ్యం పాడుచేసుకుంటారు. నానా రోగాలతో అవస్థపడుతుంటారు. త్వరలో చావు తెచ్చుకుంటారు.

నీతి:లోభం కష్ట నష్టాలకు గురిచేస్తుంది. జిహ్వను అదుపులో ఉంచాలి.

సనాతన ధర్మం

రమణ మహర్షి: బంధాల గురించి

బంధాలు నలుగు రకాలుగా చెప్పుకోవచ్చు - ‘విషయ ఆసక్తి లక్షణం’, ‘బుద్ధి మాంద్యం’, ‘కుతర్కం’ మరియు ‘విపర్యయ దురాగ్రహం’. 

‘విషయ ఆసక్తి లక్షణం’ అంటే వస్తువుల(ఇల్లు,స్తలాలు...) పై బాగా కోరికలు ఉండటం. 
‘బుద్ధి మాంద్యం’ అంటే గురు చెప్పిన భోదనలను సరిగ్గా అర్ధం చేసుకోవక పోవడం.
‘కుతర్కం’ అంటే మూర్ఖముగా గురు చెప్పిన భోదనలను అర్ధం చేసుకోవడం.
‘విపర్యయ దురాగ్రహం’ అంటే అహంకారముతో "నేను పండితుదుని", "నేను వేదాలు చదివిన జ్ఞానిని" , "నేను సన్యాసిని" అని గర్వంగా ఉండటం.

భక్తుడు: వీటిని ఎలా అధికమించు కోవాలి?

రమణ మహర్షి: 

‘విషయ ఆసక్తి లక్షణం’ ఉపశాంతము తో జయించవచ్చు . మనస్సుని చెడు మార్గాలు లోకి వెల్లకండ చూసుకుంటూ,ఫలితం లేకుండా పని చెయ్యడం ద్వారా జయించవచ్చు.
‘బుద్ధి మాంద్యం’ ని గురువు యొక్క భోదనలు వినగా వినగా జయించవచ్చు.
‘కుతర్కం’ ని ఆలోచన లేక ధ్యానము ద్వారా జయించవచ్చు.
‘విపర్యయ దురాగ్రహం’ ని అత్యంతముగా ఆలోచన మీద ద్యానము ద్వారా జయించవచ్చు.

ఏ పని ఐతే మనకి రాబొయ్యే కాలములో మళ్ళి మళ్ళి చెయ్యాలి ,అనే కోరిక కలగదో అలాంటి పనులు మాత్రమే మనం చెయ్యాలి.

కళ్యాణి గౌరీ కాశీభొట్ల - గేయం "వందనమో ఆంధ్ర ధరిత్రీ 

వందనమో..ఆంద్ర ..ధరిత్రీ...
అందుకొనుము.. కీర్తి ..ప్రశస్తి.....

1.తేట..తేట,,తెలుగు మాటలూ..
పూట..పూట..పిండివంటలూ
ఊట లూరు....కవిత ధారలూ..
విరిసే తెలుగు జానపదాలూ//వందనమో//

2.గోదావరి..తరంగ లాస్యం...
కృష్ణ వేణి..నృత్యవిలాసం...
తెలుగుజాతి గుండె రవళిలో..
పలకించిన...ఐక్య..రవమ్ములు..//వందనమో//

3.కూచిపూడి..కులుకు నర్తనం..
త్యాగ రాజు ..మధుర ..కీర్తనం
వేమరాజు నుడివిన...శతకం..
తెలుగు వెలుగు కీర్తి..కిరీటం..//వందనమో//

4.మంచితనం..మానవత్వం....
సహకారం..మమకారం..
.ఆత్మీయ..పరిమళాలు..పూసి
.అతిశయించు..అమర నందనం....//వందనమో//

భమిడి పాటి కళ్యాణగౌరి.......28/12/13.,,ముంబై...

శ్రీశ్రీ 'సిరిసిరిమువ్వ' శతకం

'సిరిసిరిమువ్వ శతకం '

వ్యంగ్య ధోరణిలో శ్రీశ్రీ రచించిన సిరి సిరి మువ్వ శతకం యాభై కందాలతో కూడి, సామాన్య హృదయాలను దోచు కుంటుంది. సిరి అంటే సంపద. సమాసాల్లోనో, సామెతల్లోనో, జాతీయాల్లోనో మిగిలిఉంది. సిరిసంపదలు , నడమంత్ర పు సిరి మొదలైన విధంగా శతకాలలో మకుటం ఉంటుంది కాబట్టి శ్రీశ్రీ తన పేరు మీదనే ‘సిరిసిరి మువ్వ’ అని ప్రయోగించాడు.

కలలో శ్రీశ్రీకి చక్రపాణిగారు కలలోకనిపించి ,ఒకశతకం రాసి తనకంకితకీయమని అడిగాడట .శతకకన్యను పుచ్చుకొని కన్యాశుల్కంగా ఒక సిగరెట్టిస్తానన్నాడట .

నీకో సిగరెట్టిస్తా
నాకో కావ్యమ్ము రాసి నయముగనిమ్మా
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీకావ్యము వరలునోయి సిరిసిరి బాయీ ! 

సిరిసిరి మువ్వా ,సిరిసిరి మురళీ ,సిరిసిరి మౌనీ ,సిరిసిరి బాయీ ,సిరిసిరి గాగూ ,సిరిసిరి నేస్తం ,సిరిసిరి రావూ అనేవి మకుట స్థానంలో కనిపిస్తాయి (మకుట నియమోల్లంఘనం + మణిప్రవాళం అనే ప్రక్రియలకు ఆద్యుడు శ్రీశ్రీ.)

నాలాగ కంద బంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్‌ సద్గీతా
లాలాపించే కవితా శ్రీ
లోలుడు నహినహీతి సిరి సిరి మువ్వా!

నాలాగ కందాలు రాయగలిగిన వాళ్ళు సాహిత్యంలో అరుదు సుమా అని కూడా అనేశా డాయిన.

శుష్క చ్ఛాందస కవి జన
ముష్కరులకు సొంటి పిక్క, మూర మ్మునకా
యుష్కర్మము, తదుపరి శో
చిష్కే శున కప్పగింత సిరి సిరి మువ్వా!

ఉత్తుత్తి కవులకు తొడ పాశం పెడతాను, గుండు గీయిస్తాను... నిప్పుల్లోత్రోసేస్తాను... అక్కడుంది అసలు చమత్కారం! సాదా సీదా కవులను నిప్పుల్లో తోసేస్తాను జాగ్రత్త! అనడంలో ఉంది మహా కవి ధిక్కారం!

“కందం వ్రాసినవాడే కవి, పందిని చంపినవాడే బంటు” అని ఒక తెలుగు సామెత. దాన్నే ఇంకెవరో కసిగా “పందిని చంపినవాడే కందం వ్రాయాలి” అని మార్చారు. కందం వ్రాయక పోతే పోయారు గానీ దానికోసం పాపం పందిని చంపడం ఎందుకో మరి! ఈ భావం పలికేలా వ్రాసిన శ్రీశ్రీ పద్యం...

“పందిని చంపినవాడే
కందం రాయాల” టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా? రా
సేందు కయో షరతులేల ? సిరిసిరి మువ్వా!

'జరూక్ శాస్త్రి ' గారిపై వ్రాసిన పద్యమట , చదవండి...

రుక్కునకు, ఆగ్రహము గల
ము క్కునకున్‌, తెగవాగెడి
డొక్కునకున్‌ వాణీ ముఖరిత వీణా
భాక్కునకున్‌ సాటి లేని డబుడుక్కునకున్‌!

భావ కవిత్వంపై శ్రీశ్రీ విసిరిన వ్యంగ్య భాణం సిరిసిరి మువ్వ పద్యాలలోనే ఉంది-

“ఉగ్గేల తాగుబోతుకు?
ముగ్గేల తాజ్ మహలు మునివాకిటిలో?
విగ్గేల కృష్ణ శాస్త్రికి?
సిగ్గేల భావకవికి?సిరిసిరిమువ్వా!”

నేటి మనుషుల తీరుపై సంధించిన వ్యంగ్యాస్త్రం...
ఈ రోజులలో ఎవడికి
నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్
కారాలు, తెగ బుకాయి
స్తే రాజ్యా లేలవచ్చు సిరిసిరి మువ్వా!

హాస్య ధోరణిలో సాగిన క్రింది పద్యాలు చూడండి...

కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
డాయకుమీ అరవ ఫిలిం
చెయకుమీ చేబదుళ్ళు సిరిసిరి మువ్వా !

బారెట్లా అయితే సాం
బారెట్లా చెయ్యగలడు ?భార్యయెదుట తా
నోరెట్లా మెదిలించును
చీరెట్లా బేరమాడు ? సిరిసిరి మువ్వా !

సిరిసిరిమువ్వ శతకాన్ని పరిశీలిస్తే అభ్యుదయభావాలు,ఆడునిక విషయాలు కనిపిస్తున్నా, రచనమాత్రం ప్రాచినపంథాలోనేసాగింది. చాటువులలోభాగంగా చివర ఫలశృతినికూడా చెప్పాడు ...

ఈశతకం యెవరైనా 
చూసి,చదివి,వ్రాసి ,పాడి .సొగసిన సిగరెట్ 
వాసనలకు కొదవుండదు 
శ్రీశు కరుణ బలిమివలన సిరిసిరి మువ్వా !

అంతా చదివారు కదా... ఇక సిగరెట్ వాసనా ప్రాప్తిరస్తు!

                                                

మాటతీరు

'నేను కూడా అదే విషయం చెప్పాను, మరి నను చెప్పింది నీకు కటువుగా అనిపించింది, అతను చెప్తే నీకు హితవుగా అనిపించిందా ?' అడిగారు ఒకరు.

వెంటనే నాకు చిన్నప్పుడు విన్న కధ జ్ఞాపకం వచ్చింది.

అనగనగా ఒక రాజుగారు. ఆ రాజు గారికి తరచుగా తన నోటిలోని పల్లన్నీ ఊడిపోతున్నట్టు కల వస్తోంది. వెంటనే జోతిష్య పండితుడిని పిలిపించి , తన కలకు అర్ధం చెప్పమన్నాడు. 

అతను, 'రాజా! ఈ కల అశుభ సూచకంగా అనిపిస్తోంది. మీ వాళ్ళంతా, మీ కాళ్ళ ముందే రాలిపోతారు...ఇదే, ఈ కలకు అర్ధం' అన్నాడు.

రాజుకు వెంటనే బోలెడంత కోపం వచ్చేసింది, మరి రాజు తలచుకుంటే, దెబ్బలకు కొదవా? వెంటనే ఆ జ్యోతిష్కుడిని చెరలో వేయించాడు.

మరొక జ్యోతిష్కుడు వచ్చి, 'రాజా! కొంత కటువుగా అనిపించినా, వాస్తవం చెప్పక తప్పదు. త్వరలోనే నీవు నీ ఆప్తులను కోల్పోతావని, ఈ కల తెలియజేస్తున్నది,' అన్నాడు.

ఈ జ్యోతిష్కుడికి కూడా చేరసాలే గతి అయ్యింది... ఇలా రాజు గారి కల మహిమ వల్ల చాలా మంది శిక్షలు అనుభవించారు. అప్పుడు, లౌక్యం, మాటకారితనం కలబోసిన ఒక పండితుడు రాజ సభకు వచ్చి, ' రాజా! నీవు ఎంతో అదృష్టవంతుడివి. దీర్ఘాయువువి. మీ వంశం మొత్తంలోకీ నీవే చిరకాలం బ్రతుకుతావు. పూర్ణాయువుతో , ఆరోగ్యంతో, చల్లగా ప్రజలను పాలిస్తావు. ఇదే నీ కలకు అర్ధం...' అన్నాడు.

రాజు ఉప్పొంగిపోయి, ఆ జ్యోతిష్కుడికి అనేక మాన్యాలు, బహుమతులు ఇచ్చి పంపాడు.

అంతరార్ధం ఆలోచిస్తే, జ్యోతిష్కులంతా చెప్పింది వొకటే! కాని, చెప్పిన విధానంలో తేడా! 

చివరి జ్యోతిష్కుడు రాజు మనసును, ప్రవర్తనను తెలుసుకుని, ఆయన మనస్తత్వాన్ని అంచనా వేసి, విషయాన్ని చెప్పాడు. అందుకే, తనకు కావలసిన సంపదలని, రాజు మెప్పును పొందాడు. 

ఎవరయినా మాట్లాడే ముందు ఇలాగే ఆలోచించి, ఎదుటి వారి స్థితి అంచనా వేసి మాట్లాడితే, అసలు మనుషుల మధ్య విభేదాలే ఉండవు. పిల్లలతో మాట్లాడేటప్పుడు, మనం వారి స్థాయికి దిగి మాట్లాడాలి, స్త్రీలతో సున్నితంగా ప్రస్తావించాలి, పెద్దలతో, వారి స్థాయికి ఎదిగి మాట్లాడాలి. తొందరపాటు, దూకుడు మాటలతో కొందరు  ఇతరుల మనసులు చప్పున నొప్పించేస్తారు. వీటికే పుల్లవిరుపు మాటలని పేరు. ఇటువంటి వారికి అందరూ దూరమవుతారు. మంచి మాటతో మీరు మనసులు గెలుచుకుంటారు. మంచి మాట, చెప్పే పద్ధతిలో మీరు చెప్పగలిగితే, ఎవరినయినా మెప్పించగలరు. ఏమయినా సాధించగలరు. ఇది సత్యం. 

మన భద్రత మన చేతుల్లోనే

పోయిన సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసాము. తెచ్చి పెట్టాడు. సాయంత్రానికి బాల్కనీ నుంచీ గదంతా గ్యాస్ వాసన. ఈ దిక్కుమాలిన అపార్ట్ మెంట్ లతో వచ్చిన చిక్కేమిటంటే, వాసనలు కూడా మన ఇంటివా, పక్కింటివా, క్రింద, పైన ఇంటివా ఏమీ తెలియదు. కుక్కలా వాసన చూసి పట్టాలి. ఎక్కడో గ్యాస్ వాసన అనుకున్నాను, ఈ లోపు మా వారు 'పద్మిని,ఇక్కడ గ్యాస్ వాసన వస్తోంది చూడు,' అన్నారు. సీల్ వేసిన ఫుల్ సిలిండర్ లీక్ అవుతుందని ఎలా అనుకుంటాం ? ఎందుకైనా మంచిదని వెళ్లి చుస్తే, ఫుల్ సిలిండర్ లీక్ అవుతోంది. శనివారం సాయంత్రం ఏడు దాటింది ... గ్యాస్ కంపెనీ మూసేశారు. ఆదివారం సెలవు... అత్యవసర నెంబర్ చేసాను. అది మారిపోయిందని/ చెల్లనిదని సందేశం వచ్చింది. వెంటనే యెల్లో పేజెస్ వాళ్ళని నెంబర్ అడిగాను. వాళ్ళ దగ్గర బుకింగ్ సెల్ నెంబర్ తప్ప లేదు. ఏం చెయ్యాలి ? అపార్ట్ మెంట్ వాళ్ళ సలహాతో సిలిండర్ తీసుకెళ్ళి టెర్రస్ మీద పెట్టాము. ఇక చేసేదేముంది, సోమవారం ఉదయం వరకూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాను.

సోమవారం ఉదయం ఫోన్ చేస్తే, వాళ్ళు మధ్యానానికి సర్వీస్ అతన్ని పంపారు. అతను గ్యాస్ లీక్ అవుతోందని, సగం సిలిండర్ అయిపోయిందని, మళ్ళీ మేనేజర్ పెర్మిషన్ తీసుకుంటే, కొత్తది ఇస్తారేమో అడగాలని చెప్పాడు.సదరు మేనేజర్ అయ్యవార్ని కలిసేందుకు వెళ్తే వారు వస్తారు, వస్తారు... అంటూనే రారు, ఇక మంగళవారమే అన్నారు. సరే అక్కడ ఉన్న స్టాఫ్ తో మాట్లాడాలని వెళ్ళాను.

ప్రభుత్వ ఆఫీసుల్లో గొప్పతనం ఏమిటంటే, మనుషుల్ని పురుగుల్ని చూసినట్టు చూడడం, అవతలి వాళ్ళు గగ్గోలు పెడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం. ఇలాంటి వాళ్ళని చుస్తే, 'ఫర్ ఎవరీ ఆక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అప్పోసిట్ రిఅక్షన్ 'అన్న న్యూటన్ నెత్తిన మొట్టాలని అనిపిస్తుంది.

గ్యాస్ అయ్యవారు లేరు కనుక, అమ్మగారికి ఫోన్ చేసారు. ఆవిడ ప్రపంచంలో ఎవరూ కనీ వినీ ఎరుగని అవిడియా ఇచ్చింది. మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకోవాలట. లీక్ అవుతున్న సిలిండర్ వాళ్లకు ఇస్తే, వాళ్ళు కంపెనీ కి పంపి, వాళ్ళు వప్పుకున్న రోజున మళ్ళీ నాకు సిలిండర్ ఇస్తారట. నాకు ఒళ్ళు మండింది. వెంటనే ఇంటికి వచ్చి, హెచ్ .పి వెబ్సైటు లో ఆన్లైన్ కంప్లైంట్ పెట్టాను. క్లుప్తంగా ఇలా...

౧. లీక్ అవుతున్న సిలిండర్ ఇవ్వటం కంపెనీ తప్పు.
౨. ప్రింట్ అయిన రేసిట్ లు ఉండిపోయాయని, ఎమర్జెన్సీ నెంబర్ లు మారినా కొత్తవి వినియోగదారులకు ఇవ్వకపోవడం డీలర్ తప్పు.
౩. ఇవన్నీ ఉన్నా, కస్టమర్ కి స్పందించకపోవడం, కొత్తది మళ్ళీ డబ్బు కట్టి తీసోకోమనడం చాలా బాధాకరం.

అయ్యా, ఆలోచించండి. నా చోటులో మీ భార్య/ కుమార్తె ఉంటే... వాళ్ళు గ్యాస్ లీక్ చుసుకోకపోతే. మీ నిర్లక్ష్యం ఖరీదు, ప్రింట్ అయిన రిసీట్ లు వృధా కారాదన్న కక్కుర్తి ఖరీదు, కొన్ని జీవితాలు కావచ్చు. ఈ విషయంపై మీరు చర్య తీసుకుని, నా సిలిండర్ నాకు ఇప్పించ ప్రార్ధన.

మర్నాడు గ్యాస్ కంపెనీ వారే నాకు ఫోన్ చేసి, కొత్త సిలిండర్ ఇచ్చి వెళ్లారు. అంతే కాదు, డీలర్ కు చీవాట్లు పెట్టారు కూడా. ఈ మధ్యన ఎందుకనో, సీల్ వేసిన గ్యాస్ సిలిండర్ లీకేజ్ లు ఎక్కువ అవుతున్నాయి.  నిన్నో, మొన్నో దినపత్రికలో చదివాను. కొత్త సిలిండర్ సీల్ తీస్తుంటే, ఒక్క సారిగా గ్యాస్ లీక్ అయ్యిందట. అది వారు కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో ఉండగానే, దేవుడి ముందు వెలుగుతున్న దీపం మంటకి గ్యాస్ అంటుకుని, వంట గదిలో ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు, ఒక ఎనిమిది నెలల పాప, ఒళ్ళు కాలిపోయి ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ దొంగతనం కోసం ప్రయత్నమో, లేక కంపెనీ వారి వైఫల్యమో, జరిగాకా ఏమీ చెయ్యలేము.

అందుకే, చికిత్స కన్నా, నివారణ మంచిది అన్న సూత్రం ప్రకారం, ఇలా చెయ్యండి. మీ ఇంటి స్త్రీలకు ఈ విషయం తెలియచెప్పండి. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే అబ్బాయి రాగానే, అతని చేతే, సీల్ తీయించి, రెగ్యులేటర్ పెట్టించి, వెలిగించి, లీకేజీ లేదని నిర్ధారించుకున్నాకే, డబ్బులు ఇవ్వండి. మన భద్రత కోసం ఇది తప్పనిసరి. మర్చిపోకండే, వెంటనే చెప్పండి.


 

భక్తి అంటే ఏమిటి ?

"భక్తి అంటే ఏమిటి?" అడిగారొక రాజుగారు.

"భక్తీ అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం..." చెప్పారు ఒక మహర్షి.

"అవునా, నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి?"

"నాయనా! నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు కాని, నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం, సేవ చేసావని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం... నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే, దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ, ఆ దైవం మెచ్చే పని నీవు చేసినప్పుడు , ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం..."

" అందుకు చాలా సహనం, ఓర్పు ఉండాలి కదా!"

"అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే... ఒకరు వంద బిందెలతో శివుడికి అభిషేకం చేస్తే , శివుడు ప్రత్యక్షం అవుతాడు, అని చెప్పరే అనుకోండి, 98 బిందెలు మోసుకొచ్చి, అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాం. 99 వ బిందె దైవం ఇంకా రాలేదే అన్న విసుగుతో, ఆయన నెత్తినే పడేసి వస్తాం. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవాన్ని చేరే మార్గాలు."

అలా ముని నుంచీ ఉపదేశం పొందిన రాజు గారు అనేక దానాలు చేసారు. భూ దానం, గో దానం, సువర్ణ దానం, కన్యా దానం. దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ, ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్త దానాలు  చేసారు. అయినా దైవం ప్రత్యక్షం కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్ధిస్తూ, ఓర్పుగా సేవ చెయ్యసాగారు. 

ఒక రోజు రాజుగారు అర్ధరాత్రి మారువేషంలో తిరుగుతుండగా, ఒక ఇంటి నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆట బొమ్మలు కావాలని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. విధవరాలయిన ఆమెకు సరయిన బట్టలే లేవు, ఖరీదయిన బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కుతోచక కొడుకును సముదాయిస్తోంది. కాని, పిల్లవాడు మొండికేసి ఏడుస్తున్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షం అయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు. 



"స్వామి! నేను ఎన్నో గొప్ప దానధర్మాలు చేసినా, ఆలయాలు, సత్రాలు, చెరువులూ త్రవ్వించినా నీవు రాలేదు. మరి ఈ నాడు నాపై నీ దయ కలిగేందుకు కారణం ఏమిటి?"

"రాజా! పూర్ణ మనస్సుతో ఏ చేసే చిన్న పనయినా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి, నీవు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. నీవు చేసే దానధర్మాలను ఇలాగే కొనసాగించి, తుదకు నా సన్నిధి చేరతావు," అని దీవించి అదృశ్యం అయ్యారు. 

చూసారా! ఇది చిన్నప్పుడు నేను విన్న కధ. నా మనసులో బాగా నాటుకున్న కధ. మన జన్మ దైవాన్ని చేరేందుకే అయితే, వీలైనంతలో సేవ చేద్దాం.కొంత మంది ఉదయాన్నే, చలిలో టీ పాత్ర తెచ్చి, రోడ్డు మీద పడుకునే వాళ్లకు, బికారులకు ఇస్తుంటారు. నేను ప్రతీ గురువారం ఏదో ఒక ప్రసాదం స్వయంగా చేసి, ఓ పది మందికి పంచి పెట్టి వస్తాను. కేవలం బికారులే కాదు, రిక్షా వాళ్ళు, చెత్త ఏరుకునే వాళ్ళు, భోజన సమయంలో ఎవరు కనిపిస్తే వాళ్ళకే ఇస్తాను. అంతే కాదు, వీలున్నప్పుడల్లా, పళ్ళు, బిస్కెట్లు, బ్రెడ్ వంటివి కొని ఇస్తూ ఉంటాను. అప్పుడు వారు ఇచ్చే దీవెనలు, వారి కళ్ళలోని ఆనందం వెలకట్టలేము.

ప్రతీ క్షణం మనం మరణానికి చేరువ అవుతుంటాం. అందుకే దానం చేసేందుకు మరొకరిపై ఆధార పడకండి. పాత బట్టలు, దుప్పట్లు, ఆహారం, కాస్త డబ్బు ఏదైనా ఇవ్వండి. మీ చేత్తో పంచండి.  రోజుకొక మంచి పని చెయ్యడం లక్ష్యంగా పెట్టుకుందాం. ఉన్నంతలో, నలుగురికీ సహాయపడదాం. మానవ సేవే మాధవ సేవ.

బహుముఖప్రజ్ఞాశాలి బ్నిం గారు

జీవితంలో మనకు అనేక రకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. కొందరిని కలిసినప్పుడు, 'అబ్బా, వీళ్ళను ఎందుకు కలిసాంరా బాబూ..' అనిపిస్తుంది. మరికొందరిని కలిసినప్పుడు, 'అబ్బ, యెంత అద్భుతమైన వ్యక్తిని కలిసాము. వీరి నుంచీ నేర్చుకోవలసింది ఎంతో ఉంది,' అనిపిస్తుంది.అలా నేను ముఖపరిచయం లేకుండా ముఖపుస్తకం ద్వారా కలిసిన వ్యక్తే 'బ్నిం' లేక భమిడిపల్లి నరసింహమూర్తి గారు.

'నేను ఒకటో తరగతి కూడా చదువుకోలేదమ్మా, అసలు బడికే వెళ్ళలేదు,' వినయంగా అంటారాయన. కాని చందోబద్దంగా పద్యాలు వ్రాస్తారు. 'ఇది ఎలా సాధ్యం ?' అని మీరూ నాలాగే ఆశ్చర్యపోతుంటే, నాకు ఆయన చెప్పిన సమాధానమే చదవండి. ఆయన ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ బడి పేరు - అమ్మ ఒడి. ఆయన మాతృమూర్తి శ్రీమతి భమిడిపల్లి విజయలక్ష్మి గారు తెలుగు, సంస్కృత పండితురాలు. తన బిడ్డను తెలుగుజాతికే  ఆణిముత్యంగా తీర్చిదిద్దిన ఆ స్త్రీమూర్తికి పాదాభివందనం చెయ్యవచ్చు. అటువంటి స్త్రీలు పుట్టిన పుణ్య భారతంలో పుట్టినందుకు , ఒక స్త్రీగా నేను గర్విస్తున్నాను. 

తన ఊరు ఆత్రేయపురంలోనే చిన్నతనంలో చిత్రకళను కూడా అభ్యసించారు. అనేక కార్టూన్లు, పుస్తకాలకు ముఖచిత్రాలు, లోగోలు తీర్చిదిద్దారు. బాపు గారి గీతను, దర్శకత్వ శైలిని, ఆరాధించే బ్నిం గారు 'నా హృదయం బాపూ ఆలయం' అంటారు. బ్నిం గారంటే కూడా బాపు గారికి వల్లమాలిన అభిమానం. బ్నిం గారు, నేటి తరం మరచిపోతున్న 132 మందితెలుగు ప్రముఖులు గురించి వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చిత్రాలు గీసి, క్రింద నాలుగు లైన్ల కవితలతో వారికి నీరాజనం అర్పించి, తీర్చిదిద్దిన అద్భుతమైన పుస్తకం 'మరపురాని మాణిక్యాలు'. ఇందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో మొదలుపెట్టి, పింగళి వెంకయ్య గారి దాకా అనేక మంది తెలుగు ప్రముఖుల విశేషాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో వారిలోని రచయత, కార్టూనిస్ట్, చిత్రకారుడూ కలిసి ఒకేసారి కనిపిస్తారు. 

                                                 

16 ఏళ్ళకే ఆంధ్రపత్రిక వారు ఆయన కధను 'అచ్చేసి' వదిలేసారు. తరువాత ఆంధ్రజ్యోతి కూడా అవునని రెండోసారి అచ్చేసేసారు.అలా తన రచనా వ్యాసంగం మొదలుపెట్టిన ఆయన అనేక కధలు, కార్టూన్లు,నాట్య కళాకారుల కోసం 208 నృత్యరూపకాలు (యక్షగానాలు), టీవీ సీరియల్స్, పత్రికలకు సీరియల్స్, వ్యాసాలు వ్రాసారు. ముళ్ళపూడి వారి చమత్కార శైలి ఆయన అరువుచ్చుకున్నారు. 2010 లో 'కళారత్న' పురస్కారం, నాలుగు సార్లు నంది అవార్డులు గెల్చుకున్నారు. 

మామూలుగా, కాస్త పేరు రాగానే ఫ్యాన్ ఎక్కేస్తుంటాము. ఇంకాస్త పేరొస్తే, డాబా పైకి ఎక్కేస్తాము. మరికాస్త పేరొచ్చి,గుర్తింపు వస్తే,  రెక్కలోచ్చేస్తాయి. ఒకటో రెండో అవార్డులు వస్తే, మేఘాల పైన కూర్చుంటాము. ఇక బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక అవార్డులు పొందితే, తల వెనుక కనబడని విష్ణుచక్రం తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, 'నేను చాలా బిజీ' అంటారు, జనాలని గంటలు గంటలు వెయిట్ చేయిస్తారు. అలాగని బ్నిం గారు కూడా మేఘాల మీద ఉంటారని మీరు అనుకుంటే, తప్పులో కాలేసినట్టే!

ఎందరికో పుస్తకాలకు బొమ్మలు గీసి ఇచ్చారు. ఆంకర్ 'సుమ' కు తెలుగు ఉచ్చారణ నేర్పారు. ఎన్నో నృత్యరూపకాలు వ్రాసి ఇచ్చారు/ ఇస్తున్నారు. అడిగితే చాలు తప్పక సహాయపడతారు.

 నిగర్వి,స్నేహశీలి, హాస్యచతురులు, బహుముఖప్రజ్ఞాశాలి బ్నిం గారు. చక్కటి ఆత్మీయతతో, నిరాడంబరంగా మాట్లాడతారు. మెచ్చదగిన ప్రతీ అంశాన్ని గుర్తించి, మనసారా అభినందిస్తారు. ఇటువంటి అసాధారణ వ్యక్తిత్వం కల బ్నిం గారు ఎందరికో స్పూర్తిదాయకం.

Tuesday, December 10, 2013

బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మగారు

రచన :SVSN శర్మ గారు, 'అచ్చంగా తెలుగు' ముఖ పుస్తక బృందం నుండీ సేకరణ.

మా నాన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మగారు రచించిన వేంకటేశ షోడశోపచారపూజా స్తోత్రము:
ఈ 5 సీసపద్యాలు భావిస్తూ చదివితే శ్రీ వేంకటేశభగవానుని 16 ఉపచారలతో అర్చించినట్లే..

సీ:: విఘ్నవిధ్వంసుని విష్ణ్వాత్మకున్ విఘ్నవిభుభక్తి ప్రార్ధించి వేడుకలర,
శ్రీ వేంకటేశ్వరు శ్రితజనమందారునర్చింతుభక్తినినంతరమున
సర్వమంగళరూపు సర్వమంగళనాముశంఖచక్రహస్తు స్వర్ణభూషు,
వరదహస్తునూరుభాగస్థకరమున కష్టాబ్ధి యింతియె కనుడటంచు
తే:గీ: చెప్పునట్టులచూపెడిచిద్విలాసు శ్రీనివాసునిభక్తిని చిత్తమందు
ధ్యానమొనరింతుకలికల్మషాపహారు వేంకటాచలవాసుని వేదవేద్యు ............(1)
సీ:: నిర్మలమౌచిత్తనీరేజసౌవర్ణపీఠిపై నిలుమయోపీతవాస
భూదేవి శ్రీదేవిభూషలసవరింపకాళ్ళుకడిగెదనీకు కంజనయన
అర్ఘ్యంబునొసగెదహస్తబులకుభక్తినందుమలక్ష్మీశయఘవినాశ
ఆచమనీయంబునందుమసంప్రీతిసప్తాద్రినిలయ యోసరసిజాక్ష
తే:గీ: స్వర్ణఘటములజలమునుచక్కబోసి సకలపరిమళవస్తువుల్ చక్కచేర్చి
స్నానమాడింతుసర్వేశగానలోల గంధమలదెదనీమేనకంజనయన............(2)
సీ:: సౌర్ణతంతులచక్కనిర్మితములౌపీతవస్త్రంబులన్ ప్రేమగట్టి
యఙ్ఞోపవీతంబు యఙ్ఞరూపా నీకునర్పింతుభక్తినినందుమయ్య
మణిగణఖచితముల్ మంజులంబులునైన సౌవర్ణభూషల చక్కనుంచి
సౌర్ణభూషిత సర్వాంగసౌందర్య సందర్శనంబునచక్కనైన
తే.గీ: మనమునన్ పూలమాలలు మానితముగగూర్చిగళముననుంచెదకోర్కెలలర
ఘ్రాణతర్పణధూపముల్ కమ్రదీపపంక్తులన్ గను సంప్రీతిభక్తినిడితి.............(3)
సీ:: భక్ష్యబోజ్యలేహ్యబహువిధచోష్యముల్ సౌవర్ణపాత్రలచక్కనిడితి
నిష్టసతులగూడియిష్టంబుతోభుజియింపుమయ్య నతజనేష్టదాయి
మధురపానీయముల్ మధ్యమధ్యనుగ్రోలు శ్రీదేవియందీయ చిత్తమలర
పూగీఫలంబులు భూదేవినీకీయ తమలముల్ శ్రీదేవితవిలియొసగ
తే.గీ. విడెముగొనినీవు వేడుకన్ వేదవేద్య తూగుటూయలసతులతోనూగులాడి
నారదాదులుగానతానములుచేయ హారతిన్ గనుమిదుగొయో యఘవిదూర............(4)
సీ:: సౌవర్ణమంత్రపుష్పంబులనర్పించిసాష్టాంగములజేతుసామలోల
ఛత్రంబుబట్టుచుచామరంబునవీతు నృత్యంబునచ్చరల్నెమ్మిజూప
తుంబురునారదుల్ దోర్యుగంబునవీణగొనిపాటపాడగగూర్మివినుచు
నశ్వగజాదులనారోహణముజేసివిశ్వంబుపాలించువిశ్వవంద్య 
తే.గీ. అఖిలరూప అనంత సర్వాంతరస్థ కలుషవనదావ కవివర కావ్యజాల
సక్త మృదుచిత్త సుజనసంస్తవనరక్త భక్తజనరక్షణాయత్త పరమనతులు ............(5)
...ఇవి కాక 7 కొండల వివరములతో, దశావతారములను కూడా వివరిస్తూ `శ్రీ వేంకటేశ్వర నక్షత్రమాలా అని పుస్తకం వ్రాసారు. ఎన్నో స్తోత్రాలు, పురాణాల అనువాదాలు చేసారు. అతని గురించి చెప్పటానికి చాలా ఉంది. అందరికీ భావనకి ఉపయోగపడుతుందని ఈ పూజా స్తోత్రం పోస్ట్ చేసేను.