Wednesday, December 14, 2016

ఓ చల్లని వెన్నెల వేళ...

ఓ చల్లని వెన్నెల వేళ...
---------------------------
భావరాజు పద్మిని - 14/12/16

వెన్నెలంటే ఎవరికి ఇష్టముండదు? వలపు మండితే వగరు వెన్నెల, వలపు పండితే అగరు వెన్నెల, విరహాలు రేపే పొగరు వెన్నల, ఏటి అద్దంలో జిలుగు వెన్నెల, సందె పొద్దులో పసిడి వెన్నల... ఇలా వెన్నెల జ్ఞాపకాలు ప్రతి మనసులో పదిలమే ! అలాగే... తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక్కటే జాబిలి... తెలుగువారి హృదయాలలో ఒక్కటే వెన్నెల -సిరివెన్నెల ! ఆ వెన్నెల కళ్ళలో ఒక్క క్షణమైనా మెరవాలని, ఆ వెన్నెల భావాల్లో ఒక్క సెకనైనా తడవాలని, పుంభావ సరస్వతి వంటి ఆ వెన్నెల కాళ్ళకు మ్రొక్కి పునీతులు కావాలని, ఎన్ని మనసులు పరితపిస్తూ ఉంటాయో ! మరా మాటలాంటిది, పాటలాంటిది... రసమయకావ్యమై చెవుల్లో మారుమ్రోగే అక్షర లాస్యాలు... నిద్రాణమై ఉన్న హృదయ కవాటాల్ని తెరిచి, భావాల సుమగంధాలు రంగరించిన అమృతవర్షం కురిపిస్తాయి. ఆ పరవశంలో డోలలూగే మనసులు... "జీవితంలో ఒక్కసారైనా, ఎలాగైనా ఈ మహానుభావుడిని కలిసితీరాలి," అని తీర్మానించుకుంటాయి. నేనూ అంతే...

మొబైల్ స్క్రీన్ మీద ఆయన పేరుతో వస్తున్న కాల్ చూసి, ఒక్కక్షణం నా కళ్ళు చుస్తున్నది నేనే నమ్మలేకపోయాను. ఆయన నాకు ఫోన్ చేస్తున్నారా? హైదరాబాద్ వచ్చే ముందునుంచి ఆయనను కలిసే అదృష్టం కల్పించమని మెసేజ్/ఫోన్ చేస్తున్నాను. కానీ, ఆయన జవాబివ్వలేదు. ఇక కుదరదేమోలే అనుకున్న సమయంలో ఈ కాల్. ఉదయం గురువుగార్ని దర్శించుకుని, ఆయన దీవెనలు పొందినందుకు జరుగుతున్న అద్భుతమా ఇది ? ఉద్వేగాన్ని అణచుకుంటూ ఫోన్ తీశాను.
"ఏమ్మా పద్మిని, ఇప్పుడు 6.30 అయ్యింది, నువ్వు కలుస్తానని అడుగుతున్నావు కదా, రాగలవా? ఇప్పుడు చీకటి పడిపోతుందని అనుకుంటే రేపు ఉదయం రావచ్చు. "
ఆయన్ను కలిసే అదృష్టం ఉండాలే కానీ, అర్ధరాత్రి అడవిలోకైనా ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. 'ఇప్పుడొచ్చేస్తానండి ' అన్నాను. ఆయన అడ్రస్ చెప్పారు. వెంటనే కాబ్ బుక్ చేస్కుని బయల్దేరాను. తలుపు ఆయనే తీసారు. ఆఫీస్ అనుకుంటా...



ఆ గదంతా నీలి వెన్నెల, నిండు వెన్నెల... నీలిరంగు పెయింట్ వేసిన గదిలో, మబ్బుల మధ్య ఎదురుగా..."నా ఉచ్వాసం కవనం, నా నిశ్వాసం గానం..." అని రాసుంది. చుట్టూ ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న చిన్న చిన్న ఫోటోలు డిజైన్ చేసి అంటించారు. ఇక ఆయన వెనుక... నింగి నుంచి కోసుకొచ్చిన జాబిలి దీపంలా పెద్ద గుండ్రటి లైట్. అందులోనూ ఆయన ఫోటోలు లీలగా కనిపిస్తున్నాయి. ఆయన ఎదురుగా ఒక చిన్న లైబ్రరీలా కట్టిన అరల్లో, ఎన్నో పుస్తకాలు. ఆ గదిలో అడుగుపెట్టిన వారు ఎవరైనా సరే, ఆ డిజైనర్ ను అభినందించకుండా ఉండలేరు. ఓ పక్క ఉద్వేగం, ఓ పక్క ఆనందం... అలా చూస్తూ ఉన్నాను. ఆయనకేదో ఫోన్ వచ్చింది, మాట్లాడారు. తర్వాత ఆయనే పలకరించి, నా రచనల గురించి అడిగారు. నేను రాసిన అహోబిల నృసింహ శతకం చూపించాను, తర్వాత 'సాహితీ యుగకర్త' అంటూ ఆయన మీద రాసిన కవిత... ఇలా కొన్ని చూసి, గతంలో వాట్స్ ఆప్ లో పంపినవి కూడా బాగున్నాయని, నా తెలుగు బాగుందని మెచ్చుకున్నారు. ఆయన నుంచి అందిన ప్రశంస నా పెన్నుకి, వెన్నుకి కొండంత బలం.

పెద్ద పెద్ద కళ్ళతో నేను అచ్చంగా వారి అమ్మాయిలా ఉన్నానట. వారి కోడల్ని పిలిచి, పరిచయం చేసారు. "నీకు గురువూ నువ్వే, శిష్యుడివీ నువ్వే... నీ మార్గం నువ్వే నిర్దేశించుకోవాలి..." అంటూ, జీవితానికి, కవిత్వానికి, వాళ్ళ నాన్నగారికి సంబంధించిన కొన్ని అమూల్యమైన విషయాలు చెప్పారు. ఆయనతో మాట్లాడుతుంటే నడిచే విజ్ఞానఖనితో మాట్లాడిన అనుభూతి కలిగింది. పై ఫ్లాట్ లో ఉన్న వారి ఇంటికి తీసుకువెళ్ళారు. అక్కడే చూసాను ఆయనలో పదిలంగా ఉన్న పసిపాపని. అప్పటిదాకా జీవితసారాన్ని కాచి వడపోసినట్లు కనిపించిన ద్రష్ట ఈయనేనా అనిపించింది.

ఆయన సాహిత్యోపాసనకు, పరవశించి ఆయన ఇంట్లో పారాడేందుకు వచ్చిన దేవేరి భారతేనేమో... మనవరాలు ఆర్యభారతి. జగద్గురువు శంకరాచార్యుల వారి తల్లి 'ఆర్యాంబ.' సిరివెన్నెల గారూ, మనవరాల్ని అలాగే పిలుస్తారు. 'బంగారూ... ఎక్కడా...' అనంగానే, ఆటబొమ్మలతో సహా నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆర్యాంబ. పాపాయికి ఏం తెలుసు ఆ తాతగారు ఎవరో? ధీమాగా దబాయించేస్తుంది, ఇంటికీ, ఆఫీస్ కి మొత్తం ఆమే మహారాణి. 'ఆడుకుందాం రా తాతా...' అంటుంది. 'రాసుకోవాలి బంగారూ ' అంటారు ఈయన. 'సరే, నేనూ వస్తా పద...' అంటుంది బుజ్జి భారతి. తాతని లాగి కుర్చీలో కూర్చోపెట్టి, ఆయన ఒళ్లో కాళ్ళు పెట్టుకుని, 'ఏదీ నామీద రాసిన పాట పాడు' అని పాడించుకుంది. పరమభాగావతుడికి భగవంతుడికి ఉండే చనువు వంటిది ఆ చనువు. ఎటువంటి అరమరికలూ లేవు. మనవరాలి మీద మనసారా రాసిన పాట ఆయన నోట వింటూ నేనూ పరవశించిపోయాను. బయట లోకానికి ఎంత గొప్పవారైనా, ఇంట్లోని వాళ్ళతో, పిల్లలతో ఇలా కలిసిపోతేనే... అసలైన జీవనమాధుర్యం తెలుస్తుందని, ఆయన ఆచరణలో చూపారు. ఆర్యాంబతో నన్ను 'అత్తా, అత్తా' అని పిలిపించారు. ఫోటోలు తీసుకుంటూ ఉంటే, 'ఏదమ్మాయ్, ఓ సెల్ఫీ తీసుకుందాం రా, ఇంతవరకూ నేను ఎవరితోనూ సెల్ఫీ దిగలేదు. మొదటిది నీతోనే !' అన్నారు. నాకు లోలోపల సంబరం.



ఆ పుణ్య దంపతుల దీవెనలు తీసుకుని, వారు పెట్టిన చక్కటి పులిహోర తిని వెనక్కు బయల్దేరాను. చాలు భగవాన్ చాలు... సిరివెన్నెల గారి డైరీలో నాకోసం ఒక అరగంటని దయతో కేటాయించి ఇచ్చావు, ఈ జన్మకిది చాలు...

(11.12.2016 న అనుకోకుండా సిరివెన్నెల గారిని కలిసిన అనుభూతి మీతో ఇలా పంచుకుంటున్నాను.)

Tuesday, September 13, 2016

నా జానపద గేయాలు

ఎట్టా సెప్పేది? - జానపద గేయం
-------------------------------------
భావరాజు పద్మిని - 13/9/16

'పేమా, దోమా?' అంటే ఏందే? - అడిగాడు ఆ మొరటుబావ. ఆమెకు తెలిసింది పచ్చని ప్రకృతి ప్రపంచమే. కవితలు, కవనాలు, సినిమాల లోకాలు తెలియని ఆ గిరిజన స్త్రీ తన ప్రేమను ఎలా తెలియజేస్తుంది? ఎలా నిర్వచిస్తుంది ? ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జానపద గేయం.

మాటల్లో చెప్పమంటె మనసెట్టా సెప్పేది?
గుండెల్లో పెరిమెంతో గుట్టెట్టా విప్పేది?

నల్లమబ్బు సూడగాను నెమలి కాసుకుంటాది,
నీకోసం కాసుకున్న కళ్ళనడుగు సెబుతాయి.

గండుతేటి రొదల ఇనగ పూవు పులకరిత్తాది
నీ ఊసులింట మురిసిపొయె సెవులనడుగు సెబుతాయి.

కొండగుండె కౌగిలించి మబ్బు మిడిసిపడతాది
నిన్నల్లలేక నీరుగారు నానీడ నడుగు సెబుతాది.

కాగి కాగి నేల ఒళ్ళు నింగికేసి సూత్తాది
ఏడి సెగల ఏగుతున్న ఉసురు నడుగు సెబుతాది.

ఎన్నలంత ముద్దరేసి ఏరు ఎగసిపడతాది
గుండె మీన కుదురుకున్న నీబొమ్మ నడుగు సెబుతాది.



 ప్రేమ గురించి జానపద శైలిలో చెప్పావు కదా, మరి దోమ గురించి కూడా చెప్పవా ? అని ఒకరడిగారు. వెంటనే నాకున్న అపరిమితమైన 'అపరిచితురాలు' షేడ్స్ లోంచి ఓ నీడ నిద్దర లేచింది. సరే, జానపదుల్లో ఒక అలవాటు ఏంటంటే... కోపాన్ని తడిక మీద, బల్లి మీద, పిల్లి మీద చూపడం. చుట్టాల పోరు పడలేని ఓ ఇల్లాలు, వాళ్ళను దోమ మీద పెట్టి తిడితే ఎలా ఉంటుంది - అన్న ఊహే ఈ దోమపాట! సరదాకేనండోయ్.. :)
సెప్పపెట్టకుండ దోమ సక్కగొచ్చి కూకుంది
ఒంటిలోని సత్తువంత పీల్చి ఇరగబడతాంది!

ఏటేటో కావాలని సెవిలోన హోరంట?

తరమబోతే పోదాయే తగని తంటాలంట !

ఇల్లంతా కలతిరిగి ఎతికేది ఏందంట ?
ఇసిరికొట్టబోతే ఎనక చేరి ఇకఇకలంట !

రగతమంత తాగితాగి బలిసేది ఎందుకంట?
ఖరుసులేక ఊరిమీన బతికేందుకేనంట!

సప్పట్లు కొట్టేది సోగతాలు కాదంట ?
సాలుగాని సంబరాలు సోదిమాని పొమ్మంట!

********************************************************************

చుప్పనాతి సూరీడు
——————————
భావరాజు పద్మిని -1/ 7/16
(సరదాగా రాసిన ఓ జాన పద గేయం... )
చుప్పనాతి సూరీడు చప్పున కవ్విస్తాడే
చురచుర చూస్తావుంటే చిలిపిగ నవ్వేస్తాడే
నంగనాచి నాంచారి నేనంటే పానమైన
నువ్వెవరో నేనెవరో నన్నట్టే ఉంటాది //చుప్పనాతి సూరీడు//
ఏటికాడ నీళ్ళబిందె నోపలేక నడుస్తాంటె
ఎనకెనకే తానుకూడ తిప్పుకుంటా వస్తాడే
నడుమొంపున నీళ్ళబిందె వగలెన్నో ఒలకబోసె
ఒయ్యారం సూత్తుంటే నాగుండె జారెపిల్ల //చుప్పనాతి సూరీడు//
గిన్నెకోడి నొదిలిపెట్ట గంపనెత్త బోతాంటే
గంపకింద కోడిలాగ దాగి కూకుంటాడే
ఎర్రఎర్ర కళ్లతోనూ మిర్రి మిర్రి సూత్తవుంటే
నొసట పొద్దు పొడిసినట్టు ముద్దుగుంటవే పిల్ల //చుప్పనాతి సూరీడు//
మడిసేలో వడిసేలు వాడిసూసి యిసురుతాంటె
రాయి తనకె తాకినట్టు పిట్టలాగ ఒరుగుతాడె
నీ సేతి గాలానికి తగులుకున్న చేపలాగ
నా మనసే మతిసెదిరి గిలగిల మంటాందె పిల్ల //చుప్పనాతి సూరీడు//

******************************************************************************************************************
జానపదుల తీరు తెన్నులు విచిత్రంగా ఉంటాయి. మగడంటే ఆమెకు ప్రాణం. కాని అతను, పువ్వు పువ్వుకు తిరిగే తుమ్మెద లాంటి వాడు. భర్తంటే తనకున్న ఇష్టం ఒకప్రక్క ఆమెకు ఎంతటి అడ్డంకి అంటే, అతన్ని పల్లెత్తు మాట కూడా అనేందుకు ఆమెకు మనస్కరించదు, అలాగని, తనకే సొంతం కావాలనుకున్న అతని ప్రేమ ఇతరులకు దక్కుతుంటే చూస్తూ ఊరుకోలేదు. అందుకే చంద్రుడి వంకతో, భర్తను హెచ్చరిస్తోంది. సున్నితంగానే అనునయించాలి, ఎలాగ? ఈ సందర్భాన్నిఎలా రాయాలి, అని ఊహించి రాసిన జానపద గీతం ఇది.
నండూరి వారి "ఆనాటి నావోడు సెందురూడా' పంధాలో సాగిపోయే ఈ ఊహాత్మకమైన గీతం మీకోసం... జానపద గేయ రచన కొత్త కనుక తప్పులుంటే, పెద్దలు దయుంచి తెలుపగలరు.

సెందురూడా - జానపద గీతం
---------------------------------
భావరాజుపద్మిని- 11/7/16

ఆడఈడ తిరగమాకు ఆకతాయి సెందురూడా
మాయదారి మబ్బునిన్ను మింగుతాది సెందురూడా

నీటిమీన నీడసూసి నవ్వుతావే సెందురూడా
ఎన్నెలంత దోచిఏరు ఎగురుతాంది సెందురూడా // ఆడఈడ//

రెల్లుగడ్డి మాటుసేరి ఊసులేల సెందురూడా
తీపుముళ్ళు చీరుతాయి తాకమాకు సెందురూడా // ఆడఈడ//

సుక్కలెన్నో పక్కచేరి నిక్కుతాయి సెందురూడా
సక్కనైన సంగడేదో సూడవోయి సెందురూడా // ఆడఈడ//

కునుకుమాని కలువనిన్నె కలవరించె సెందురూడా
మనసులోని మక్కువెంతొ కొలిసిసూడు సెందురూడా // ఆడఈడ//

***************************************************************************************************************

“ఈ గోదావరిలో ఏముందో తెలీదు. మౌనంగానే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలసటను అలలతో కడిగేస్తుందో, పైరగాలి వీవెనతో సేద తీరుస్తుందో గాని, మనసు కలతగా ఉన్నప్పుడు, కాసేపు ఈ నది ముంగిట మౌనంగా కూర్చుంటే కొత్త ఊపిరి పోసుకున్నట్లుగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు నదిఒడ్డున తచ్చాడుతుంటే, చిలిపి అలల సవ్వడితో కేరింతలు కొడుతూ మనతో ఆడుతున్నట్లుగా ఉంటుంది. బేధభావాలు చూపకుండా అందరినీ సమానంగా, అమ్మలా ఆదరిస్తుంది. ఆటుపోట్లకు తలొగ్గక, పాత నీటిని, కొత్త నీటిని కలుపుకుంటూ ముగ్ధంగా సాగిపోయే ఈ నది, మౌనంగా జీవన వేదాన్ని బోధిస్తున్నట్లుగా ఉంటుంది... “ మనసులోని ఆరాధననంతా కళ్ళలో నింపి, గోదావరినే తదేకంగా చూస్తూ అన్నాడు శరత్. ఇదే పాటగా జానపద భాషలో రాయగాలవా అంది చంద్రిక సవాలు చేస్తూ...
పల్లవి : గుండె గోదారితోన ఊసులాడతాంది
         మాట గొంతు దాటక మూగవోయింది

         గోదారి అమ్మలా కుశలమడుగుతాది
         చిలిపి అలల సడితోన ఆటలాడుతాది  
         పైరగాలి పైటతో నిలువెల్లా నిమురుతాది
         నిండుమనసుతోన నన్ను సల్లగ దీవిత్తాది // గుండె //

         బతుకు పడవ ఆటుపోట్లు వాడుకేనంది
         కుంగకపొంగక సాగితె ఏడుకేనంది
         పాతనీరు కొత్తనీరు కలుపుకుపొమ్మంది
        నిండినా ఎండినా నిబ్బరంగ నవ్వమంది // గుండె //


***************************************************************************************

బెట్టు సాలుసాలు - జానపద గేయం
----------------------------------------
భావరాజు పద్మిని - 28/9/16

మరో జానపద గేయం. ఆమెకు, తన మావ అంటే ఇష్టం, అతనికీ ఇష్టమే, కాని చెప్పడు. ఒకటే బెట్టు, బింకం. అది కరిగేలా తన మావ వెంట పడుతూ కవ్విస్తోంది ఓ కోణంగి. నిండు మేఘం కురవకుండా ఆగుతుందా ? నీటివడి ఆనకట్టలకు ఆగుతుందా? నిప్పు వేడి కప్పిపెడితే దాగుతుందా, అలాగే నామీద నీకున్న ప్రేమ కూడా, ఎన్నాళ్ళో దాచాలేవు, అంటూ ఇలా వెంటపడుతోంది. తేలిగ్గా బాణీ కట్టి, పాడగలిగిన ఈ పాట మీకు నచ్చితే, సరదాగా పాడి, అప్లోడ్ చేస్తాను.


బెట్టు సాలుసాలు గాని కట్టిపెట్టు మావా
గుండెమాటు గుట్టు కాస్త విప్పిసెప్పు మావా
మంకుపట్టు పట్టి నువ్వు డొంకలెంట పోతపోత
బింకమెంత పోయినా నే నొల్లకోను మావా

నీకు నాకు దూరమెంతో కానవచ్చె మావా
సెయ్యి సాపి సూడు మల్ల సెంతనుంట మావా
నీరు నిండ నింపుకున్ననల్లమబ్బు పారకుండ
నింగి అంచు వీడకుండ ఆగబోదు మావా //బెట్టు సాలుసాలు//

గాలమేసి గుండెనేమో లాగినావు మావా
మక్కువేదొ సెప్పకుండ దాచినావు మావా
అడ్డమేసి దిడ్డమేసి నీటిఊట నాగమన్న
ఉరకలేసి దుంకకుండా ఉండబోదు మావా //బెట్టు సాలుసాలు//

పైరగాలి పైటతోని ఆటలాడె మావా
మాయదారి సెందురూడు కన్నుగీటె మావా
నిప్పురవ్వ కప్పిపెట్టి నిక్కుసూపుతున్నగాని
మనసులోన అగ్గివేడి దాగాబోదు మావా //బెట్టు సాలుసాలు//

*******************************************************************************************************************************
మరుగున పడుతున్న జానపద గీతాలను తిరిగి బ్రతికించేందుకు నేను రాస్తున్న జానపద గేయాలకు ‘మల్లి పాటలు’ అని పేరు పెట్టాను. జానపదులు కలుసుకునేది ఎక్కువగా జాతరలలో, సంతలలో. అలా ఓ జాతరలో కలిసారు ఓ జంట. కళ్ళూ కళ్ళూ కలిసాయి... వెంటనే ఆ కుర్రాడు చందమామతో మాట్లాడుతున్నట్టు ఓ పాటను అందుకున్నాడు. ఉడికిస్తూనే తన గురించి చెప్పాడు. అమ్మాయి కూడా గడుసుదే మరి. ఊరుకుంటుందా... ఎలా సమాధానం ఇచ్చిందో నేను రాసి, స్వరపరచి, పాడిన ఈ పాటలో వినండి...
తాయిరోయ్ తాయిరోయ్ సందమావ
సుక్కలాంటి సిన్నదంట సందామావ
తిప్పుకుంట వచ్చినాది సందామవ
దాని సోకు మాడ నిక్కుసూడు సందామావ

తందెరోయ్ తందెరోయ్ సందామావ
సాకులాంటి పిల్లగాడు సందామావ
జాతరంత కాపుగాసె సందామావ
వీడి మిర్రికళ్ళ సూపుసూడు సందామావ

సూరిగాడంటేను ఊరికే రాజులే
పల్లెకారోల్లంత పాణమిత్తారులే
తల్లోన నాలుకల్లె సందామావ
నేను నలుగుర్లొ మెలుగుతుంట సందామావ
మాయగాడ్ని కాదుమల్ల సందామావ
నాతొ మాటగలిపి సూడరాదె సందామావ
//తాయిరోయ్//

మల్లంటె మాటగాదు మారాణి నేనులే
సిటికేత్తె సాలంట సాలాము సేత్తరే
కోరమీసమున్న వోరు సందామావ
కోరిసుట్టు దిరిగినారు సందామావ
కొరకరాని కొయ్యనంటు సందామావ
విస్గి ఎనక మళ్ళి పోయినారు సందామావ
//తందెరోయ్//

వగరు పొగరు లేనిపిల్ల వరసనాకు కాదులే
జోరు కాస్త దించితేనె ఏడుకైన ముద్దులే
కొయ్యనంటు కొయ్యమాకు సందామావ
నీ సూపు గుట్టు విప్పుతాంది సందామావ
ఈడుజోడు నేనుగాద సందామావ
సక్క సందెకాడ సెంతసేరు సందామవ
//తాయిరోయ్//

ఆటపాటలోన నాకు సాటిపోటి లేరులే
గడుసు పిల్లనంటు మంది సెప్పుకుంట హోరులే
కాని అయ్యసాటు బిడ్డనమ్మ సందామావ
హద్దుమీరి నడవబోను సందామావ
నచ్చినావు గాని నువ్వు సందామావ
పద్దతైన తోవసూడు సందామావ
//తందెరోయ్//





Sunday, August 7, 2016

స్నేహోత్సవ శుభాకాంక్షలు

మీకు ఎంత ఆకలిగా ఉన్నా, "ముందు నువ్వు తిను" అంటూ చేతిలో ఉన్న ఆహారాన్ని ఎవరికి అందిస్తారో... వారే మీ ప్రియ స్నేహితులు.

మీరు ఎంత అలిసిపోయి ఉన్నా. " ఆ కళ్ళు చూడు ఎంత లోతుకు పోయాయో, నువ్వు పడుకో, నీ పని నేను చేసేస్తాను" అంటూ ఎవరితో అంటారో - వారే మీ ప్రియ స్నేహితులు.

మీరెంత భయస్తులు అయినా, ఆ భయాన్ని పక్కకు నెట్టి, "నీకెందుకు, నువ్వెళ్ళు, నేను చూసుకుంటా" అని ఎవరితో అంటూ, ప్రాణాన్నిఅయినా పణంగా పెట్టేందుకు సిద్ధపడతారో - వారే మీ ప్రియ స్నేహితులు.

మీరెంత పెదవి విప్పకుండా మౌనంగా నవ్వుతూ కూర్చున్నా, "ఏమైంది, ఏంటి సంగతి?" అంటూ మీమనసును చదివేస్తారో - వారే మీ ప్రియ స్నేహితులు.



మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు "నీ సత్తా ఇంకా నీకు పూర్తిగా తెలియదు. నువ్వేదైనా చెయ్యగలవు, పద నీ వెంట నేనున్నాను, "అంటూ వెన్నంటి ముందుకు నడిపిస్తారో - వారే మీ ప్రియ స్నేహితులు.

మీ బాధలో తనూ కలతనిద్రగా మారేవారు, మీ ఆనందంలో హాసరేఖగా మెరిసేవారు, మీ విజయంలో సోపానంగా మారి అంత ఎత్తునున్న మిమ్మల్ని చూసి మౌనంగా మురిసేవారు, మీ పరాజయంలో మున్ముందు దాగున్న కొత్త ఆశల్ని చిగురింపచేసేవారు, కష్టసుఖాల్లో మొట్టమొదట మీరు గుర్తుచేసుకునేవారు, అవసరంలో అడక్కుండానే ముందుకొచ్చి సాయం చేసేవారు - ఒకటేమిటి, అన్ని రూపాల్లో , అన్ని వేళలలో, మీకు తోడునీడగా ఎవరుంటారో - వారే మీ ప్రియ స్నేహితులు.



అటువంటి మిత్రులందరికీ "హార్దిక స్నేహోత్సవ శుభాకాంక్షలు !!!" - భావరాజు పద్మిని.

Saturday, August 6, 2016

మార్పు

దారంటూ మారాలంటే అటుగా తొలి అడుగు మీరేకండి!
మార్పంటూ రావాలనుకుంటే - ఆ మార్పు మీరేకండి !

మనం రోజూ ఎన్నో చూస్తూ ఉంటాము. వాటిలో కొన్ని మారాలని అనుకుంటాము. కాని, ఆ దిశగా తొలి అడుగులు మనమే వేస్తే... మనకు తెలియకుండానే మన వెనుక కొన్ని అడుగులు మన మార్గాన్ని అనుసరిస్తాయి. ఎలాగంటే...

1. మామూలుగా పిల్లల్ని ట్యూషన్ కి దింపి వస్తున్నాము. కూడా స్నేహితురాలుంది. దారిలో కర్వేపాకు కోసం ఆగాము. ఇక్కడ కర్వేపాకు కొనుక్కురాడానికి దొరకదు. కొట్టుకురాడమే , లేక అడిగి దర్జాగా కోసుకురాడమే ! ఎండ మండిపోతోంది. ఓ 80 ఏళ్ళ పెద్దాయన, చిన్న కాగితం ముక్క చూపించి, "మున్నీ, ఏ అడ్రస్ పతా హై?" అని అడిగాడు. తెలీదన్నాను. పక్కనే ఉన్న బడ్డీ కొట్లో అడిగి వెళ్తున్నాడు. అడుగు వెయ్యటమే కష్టంగా ఉంది ఆయనకి. అలా ఆయన వెళ్తుండగా, ఆ బడ్డీ కొట్టు వాడిని, "ఆ పెద్దాయన ఎంత దూరం వెళ్ళాలి?" అని అడిగాను. లోపలకు దాదాపు రెండు కిలోమీటర్లు, ఏదో డాక్టర్ దగ్గరకు వెళ్ళా లట. నాకు మనసూరుకోలేదు. "నువ్వెళ్ళు, నేనొస్తాను. ఆ పెద్దాయన్ని బండి మీద దింపేసి వస్తాను," అన్నాను. "నేనూ వస్తాను, కాని ఆయన్ని నేను స్కూటీ మీద మొయ్యలేను, కూడా ఊరికే వస్తా పదమంది" స్నేహితురాలు. వెంటనే ఆయన వద్దకు వెళ్లి, బండి మీద ఎక్కించుకుని, ఆయనకు కావలసిన చోట దింపాను. నోరారా దీవించారు, తలమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. ఆ రోజెందుకో ఆయనలో నాకు నా ఇష్టదైవం భైరవుడు కనిపించారు. ఇదంతా నా స్నేహితురాలు చూస్తోంది, మరోసారి ఇటువంటి అవకాశం వస్తే, తను తప్పక చొరవ తీసుకుని, పెద్దవాళ్ళకు సాయపడుతుందని, తనను చూస్తే తెలిసింది.

2. ఉన్నట్టుండి హాయిగా తిరిగే తోటమాలి చనిపోయాడు. మూడు రోజులైంది, వంతులు వేసుకుని, నీ వాటా, నా వాటా అంటూ గిరి గీసుకుని పనులు చేసుకునే ఈ రోజుల్లో, మా ఫ్లాట్స్ చుట్టూ దాదాపు రెండెకరాల తోట, మొత్తం ఎండిపోయి, వడిలిపోయాయి మొక్కలు. నాకు మనసూరుకోలేదు. క్రిందికి దిగి, పైప్ అడిగాను. "మీరా, మీరు ఆ పైప్ బరువు కూడా మొయ్యలేరు," అంటూ నవ్వాడు సెక్యూరిటీ అతను. "ఇసుక ఇటుకలు, పలుగూ పారలు... అన్నీ పట్టిన చేతులివి. మమ్మల్ని ఆడపిల్లలని బలహీనంగా పెంచలేదు. కొండల్నైనా డీ కొనే ధైర్యంతో మగపిల్లల్లా పెంచారు, పైప్ ఎక్కడుందో చెప్పు," అన్నాను. ఆ పైప్ పెట్టి నెమ్మదిగా మొక్కలకి నీళ్ళు పోయసాగాను. నన్ను చూసి, నా స్నేహితురాలు కూడా దిగి వచ్చింది. దాదాపు, సాయంత్రం 4 నుంచి, రాత్రి 7 దాకా నీళ్ళు పోస్తూనే ఉన్నాము. తడిసిన మొక్కల్ని చూసాకా, అదొక చెప్పలేని తృప్తి. మర్నాడు ఇదంతా చూసిన గార్డ్ స్వచ్చందంగా మొక్కలకి నీళ్ళు పెట్టాడు.



3. పార్క్ లో సాయంత్రం వాకింగ్ కు వెళ్తూ ఉంటాను. ఆ రోజున మొక్కలన్నీ ట్రిమ్ చేసారు. ముళ్ళ చీమచింత కొమ్మలు, దారిలో అక్కడక్కడా పడున్నాయి. నడవలేక నడుస్తున్న పెద్దలు, ఉరకలెత్తే పిల్లలు అంతా అవస్థ పడుతున్నారు. నేను ఆ కొమ్మలు తీసి పక్కన వెయ్యటం మొదలుపెట్టాను. "శబ్బాష్ బేటా" అన్నారొక పెద్దాయన. వెంటనే నా పక్కన ఉన్న మరొక స్నేహితురాలు కూడా కొమ్మలు ఏరి పక్కన వెయ్యటం మొదలుపెట్టింది. మొదలంటూ పెడితే... వెనుక మరికొంతమంది అనుసరిస్తారు.

4. దాదాపు 55 ఫ్లాట్స్ ఉన్న భవంతి. ఇందులోనే రాత్రి కావలి ఉండే సెక్యూరిటీ గార్డ్ కాలికి పుండు వేసింది. నడవలేక, నిల్చోలేక ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళది ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్. పొట్ట చేతబట్టుకు ఇక్కడికి వచ్చాడు. ఇంతమంది రాత్రి పూట కళ్ళు మూసుకుని, భద్రంగా నిద్ర పోడం కోసం తన నిద్ర మానుకుని కాపలా కాసే అతను... నాలుగు మెతుకులు వండుకు తినలేని స్థితిలో ఉంటే... అందరికీ తెలిసినా, ఎవ్వరూ స్పందించలేదు. వెంటనే నేనే ఉదయం టిఫిన్ దగ్గరనుంచి, రాత్రి భోజనం దాకా వండి ఇవ్వడం మొదలుపెట్టాను. ఇక్కడ చిక్కు ఏమిటంటే, వాళ్ళ ఆహారం వేరు (రొట్టెలు, కూర), మన అన్నం వేరు. అతను తినేవే విడిగా, వేడిగా వండి ఇచ్చాను. ఓ వారంలో కోలుకున్నాడు. ఈ లోపల నన్ను చూసి, మరికొంత మంది ముందుకు వచ్చారు. ఒకరోజు క్రిందికి దిగి చూస్తే, ఎప్పుడూ పిండిమరలో పిండి ఆడే అబ్బాయి ముఖంలా దుమ్ముకొట్టుకుని ఉండే నా స్కూటీ, కొత్త పెళ్ళికూతురిలా తళతళ లాడుతోంది. "courtesy pays back interest" అన్న వాక్యం గుర్తొచ్చింది. అతని మనసులో ఉన్న కృతజ్ఞతా భావం ఈ విధంగా తెలిపాడు.

5. ఓసారి నెలవారీగా నేను పేద పిల్లలకి(సుమారు 60-70 మందికి) వండి అన్నదానం చేస్తుంటే ఒకావిడ వచ్చి, ఎలా చెయ్యాలి, ఏవి యెంత కావాలి, మిమ్మల్ని చూస్తుంటే నాకూ చెయ్యాలని ఉంది, అని అడిగి, రాసుకుని వెళ్ళింది. అలాగే ఇక్కడి నా స్నేహితురాళ్ళు కూడా వండి వడ్డించడం మొదలు పెట్టారు. అలాగే గతంలో నా ఫేస్బుక్ పోస్ట్ లు చూసి, కొంతమంది స్వచ్చందంగా సేవ, ఆహారం పంచడం మొదలుపెట్టారు. వారంతా నాకు మెసేజెస్ ద్వారా వారు పొందిన ఆనందాన్ని తెలియచేసారు.



ఇవన్నీ నేను చాలా తీరిగ్గా ఉండడం వల్ల చేస్తున్నాను అనుకుంటే పొరబాటే. ఓ పక్క రేడియోలో పని చేస్తూ, ఓ పక్క నా పత్రిక పనులు, వేరే పనుల్లో బిజీ గా ఉండగానే ఇవన్నీ చేసాను. జీవితం అంటే మనకు ఇన్ని ఇచ్చిన సమాజానికి, తిరిగి మనం కూడా ఏదో విధంగా సేవ చెయ్యడం. అలా సేవ చేసే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే పరిసరాలు గమనించి ముందడుగు వెయ్యాలి. అలా మనతో మొదలైన మార్పు మరింతమందికి ప్రాకి, నవ సమాజానికి నాంది పలుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం... మొదలుపెట్టండి.

Sunday, July 10, 2016

మంచి మాట

మంచి మాట 
---------------
భావరాజు పద్మిని - 16/7 /15

మంచి మాట - ఒక రాజు కధ 
------------------------------
అనగనగా ఒక రాజుగారు. ఆ రాజు గారికి తరచుగా తన నోటిలోని పల్లన్నీ ఊడిపోతున్నట్టు కల వస్తోంది. వెంటనే జోతిష్య పండితుడిని పిలిపించి , తన కలకు అర్ధం చెప్పమన్నాడు.
అతను, 'రాజా! ఈ కల అశుభ సూచకంగా అనిపిస్తోంది. మీ వాళ్ళంతా, మీ కాళ్ళ ముందే రాలిపోతారు...ఇదే, ఈ కలకు అర్ధం' అన్నాడు.
రాజుకు వెంటనే బోలెడంత కోపం వచ్చేసింది, మరి రాజు తలచుకుంటే, దెబ్బలకు కొదవా? వెంటనే ఆ జ్యోతిష్కుడిని చెరలో వేయించాడు.
మరొక జ్యోతిష్కుడు వచ్చి, 'రాజా! కొంత కటువుగా అనిపించినా, వాస్తవం చెప్పక తప్పదు. త్వరలోనే నీవు నీ ఆప్తులను కోల్పోతావని, ఈ కల తెలియజేస్తున్నది,' అన్నాడు.
ఈ జ్యోతిష్కుడికి కూడా చేరసాలే గతి అయ్యింది... ఇలా రాజు గారి కల మహిమ వల్ల చాలా మంది శిక్షలు అనుభవించారు. అప్పుడు, లౌక్యం, మాటకారితనం కలబోసిన ఒక పండితుడు రాజ సభకు వచ్చి, ' రాజా! నీవు ఎంతో అదృష్టవంతుడివి. దీర్ఘాయువువి. మీ వంశం మొత్తంలోకీ నీవే చిరకాలం బ్రతుకుతావు. పూర్ణాయువుతో , ఆరోగ్యంతో, చల్లగా ప్రజలను పాలిస్తావు. ఇదే నీ కలకు అర్ధం...' అన్నాడు.
రాజు ఉప్పొంగిపోయి, ఆ జ్యోతిష్కుడికి అనేక మాన్యాలు, బహుమతులు ఇచ్చి పంపాడు.
అంతరార్ధం ఆలోచిస్తే, జ్యోతిష్కులంతా చెప్పింది వొకటే! కాని, చెప్పిన విధానంలో తేడా!

                                               

చివరి జ్యోతిష్కుడు రాజు మనసును, ప్రవర్తనను తెలుసుకుని, ఆయన మనస్తత్వాన్ని అంచనా వేసి, విషయాన్ని చెప్పాడు. అందుకే, తనకు కావలసిన సంపదలని, రాజు మెప్పును పొందాడు.
ఎవరయినా మాట్లాడే ముందు ఇలాగే ఆలోచించి, ఎదుటి వారి స్థితి అంచనా వేసి మాట్లాడితే, అసలు మనుషుల మధ్య విభేదాలే ఉండవు. పిల్లలతో మాట్లాడేటప్పుడు, మనం వారి స్థాయికి దిగి మాట్లాడాలి, స్త్రీలతో సున్నితంగా ప్రస్తావించాలి, పెద్దలతో, వారి స్థాయికి ఎదిగి మాట్లాడాలి. తొందరపాటు, దూకుడు మాటలతో కొందరు ఇతరుల మనసులు చప్పున నొప్పించేస్తారు. వీటికే పుల్లవిరుపు మాటలని పేరు. ఇటువంటి వారికి అందరూ దూరమవుతారు. మంచి మాటతో మీరు మనసులు గెలుచుకుంటారు. మంచి మాట, చెప్పే పద్ధతిలో మీరు చెప్పగలిగితే, ఎవరినయినా మెప్పించగలరు. ఏమయినా సాధించగలరు. ఇది సత్యం.

Saturday, July 9, 2016

నా పాటలు

నా పాటలు 
భావరాజు పద్మిని 
నేను రాసిన వివిధ గేయాలు ఇందులో పొందుపరుస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే అంతే చాలు .
 ద్వారకామాయి వాసా సాయి 
నీదరి చేరితి దయగనవోయి 
సాయి రూపమే పరమశివం 
సాయి నామమే పరమపదం 

నిన్ను కన్నంతనే కలుగును హాయే 
నిను నమ్మి కొలిచితె కలతలు పోయే 
నీ కృప కలిగితే తొలగును మాయే 
నీ చరణమ్ములే వరములు వేయే // ద్వారకామాయి //

మది నీ మందిరం సాయి దేవా 
శ్రద్ధ సబూరి నిరతమునీవా 
ప్రేమతో పిలిచితి కావగ రావా 
భక్తుల పెన్నిధి నీవే కావా ? / / ద్వారకామాయి //

*********************************************************************************************************************
కార్లలో తిరుమల చాలామందే చేరుకుంటారు, కానీ మెట్లదారిలో వెళ్తే నిజమైన భక్తి కనిపిస్తుంది. అలా వెళ్తూ చూసినవే పాటగా పల్లవించాయి
మెట్టుమెట్టున పసుపు కుంకుమలు అలదుచు
పట్టెడి హారతుల పూవుల పూజ చేయుచు
మెట్టుమెట్టుకు మ్రొక్కి నీదిక్కు చేరెడి
భక్తుల జన్మల గట్టు దాటించగరావయా
రాయిని రప్పన నిన్నె కాంచి భజియించుచు
రాతిమీద రాతిని పేర్చి ఇల్లిమ్మని వేడుచు
రాళ్ళ తుప్పల దాటి నిన్ను చేరెడివారి
రాతల మార్చి చేయూతనివ్వు తిరుమలరాయా
గోవింద గోవిందని ఎలుగెత్తి పిలచుచు
పిల్లపాపల నెత్తి ఊరేగింపుగ దెచ్చుచు
ఆటల పాటల శంఖనాదాల గంటల
నీకు వేడుక జేయు దాసులగాచు వేంకటరాయా
కాలు లేకున్నను నడవ లేకున్నను
భక్తియె దన్నుగ జేసి కర్రల మొకాళ్ళ పాకి
పాపలవలె పారాడె నీ నిజబంటులను బ్రోచి
పదిలముగ నీ ఒడిలో పొదువుకొనగను రావయా
భావరాజు పద్మిని - 2/6/16.

**********************************************************************************************************************
                                                    

ఈ సారి ఆ తిరుమలవాసుని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఒక ఉదయం చెట్టు నీడన చల్లగాలిని ఆస్వాదిస్తూ కూర్చుంటే, ఆ గాలిలోనే ఏదో మాయ ఉందనిపించింది. ఆ భావన లోంచి జనించిన పాటే ఇది.
భావరాజు పద్మిని - 4/6/16
ఏడు లోకాలే ఏడుకొండలు కాగ
ఏడేడు జన్మల పాపాలు కడుగగ
ఎట్టెదుట కొలువైన వేంకటేశ్వరుడా
ఎటులైన దరిజేర్చు వాత్సల్య హృదయుడా
ఏ మునులు తపముకై ఈ తరువులయ్యిరో
ఏ ఋషులు నినుగొల్చి శుకపికములయ్యిరో
ఈ ఉడుత లీచిరుత లీజీవజంతులు
నెలకొనిరి ఈ విధము నీ కడనె నిలువగ
ఏ దివ్య తీర్ధములు ఇట సరసులైనవో
ఏ స్వర్గ ధామములు ఇట నెలవులైనవో
ఏ దివిని వీవెనలు పవనమ్ములైనవో
ఈ శాంతి నిలనెచట పొందలేమోస్వామి
దేవతలె నిటనిలవ నదృశ్యరూపున
నీ విమానమ్ముకడ కొలువయ్యి ఉందురట
యంతంత వారలె నింతచోటుకు వెదుకు
ఈ తిరుమలాయెను కలియుగ వైకుంఠము

*****************************************************************************************************************
december 12,2015
పల్లవి:
కొండంత ఎదిగినా కోరేదీ ప్రేమ
అచ్చంగా తెలుగు పంచు వెచ్చనైన ప్రేమ
చరణం1:
ఆత్మీయ బంధాలు ఆ దేవుని రూపాలు
అన్నదమ్ములక్కచెళ్ళెలంతా మణిపూసలు
చిరుచిరు కోపాలైనా చిటపట రుసరుసలైనా
సర్దుకుపోతేనే కదా మమతల మాధుర్యాలు // కొండంత//
చరణం2:
ఎగసిపడే భావాలను శ్రుతిచేసి మేళవిస్తే
తలపుల కుసుమాలన్నీమాలికగా జతచేస్తే
మదిలో పరిమళములే మహికే నందనములై
కొత్తచరిత కాద్యమై చరితార్ధం చెయ్యవా // కొండంత//

*******************************************************************************************************************
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం

ప. కరుణాంతరంగ లక్ష్మి నృసింహ
కలుష విదారా పావన నృసింహ

చ.౧. కంభమున బుట్టిన ఉగ్ర నృసింహ
హిరణ్య కశిపు ధ్వంసి వీర నృసింహ
మహావిష్ణు జ్యోతియె జ్వాలా నృసింహ
సర్వతోముఖుడవీవు సుందర నృసింహ //కరుణాంతరంగ//

చ.౨. దుష్టుల దునిమేటి భీషణ నృసింహ
భక్తుల గాచేటి భద్ర నృసింహ
మృత్యుమృత్యుడవు నీవు అభయ నృసింహ
నమోనమో అహోబిల నృసింహ //కరుణాంతరంగ//

*****************************************************************************************************************

nov 15, 2014
మొట్టమొదటిసారి... ఒక పాట రాసాను. ఒక్క పాట రాయడం యెంత కష్టమో తెలిసింది. 2 రోజులు పట్టింది. తర్వాత ట్యూన్ కట్టాను... పాడాను. ఈ పాట నా అభిమాన దర్శకులు, రచయత అయిన Filmdirector Vamsy గారికి అంకితం... ఎందుకంటే... ఈ పాట వారికి ఇష్టమైన గోదావరిపై రాసాను. వినండి... చూడండి... చదవండి...మీ అభిప్రాయం చెప్పండి...
రచన, సంగీతం, గానం : భావరాజు పద్మిని
పాట సాహిత్యం :
పల్లవి :
వెండి వెల్లువయ్యింది వెన్నెల్లో గోదారి
నిండు పున్నమయ్యింది గుండెల్లో గోదారి
చరణాలు :
వేకువన గోదారి విరిసే మందారం
వెలుగుల్లో గోదారి మెరిసే బంగారం
సందెల్లో గోదారి సొగసే సింగారం
వెన్నెల్లో గోదారి మురిసే వయ్యారం || వెండి ||
పాపికొండల నడుమ పరవళ్ళు తొక్కింది
భద్రగిరి రామయ్య పాదాలు కడిగింది
కోనసీమన పచ్చని చీర చుట్టింది
కడలికై ఉరికింది కలల గోదావరి || వెండి ||
పాయలేన్నింటినో పాపిట దిద్దింది
జీవులన్నింటినీ కడుపులో కాచింది
చరితలెన్నో చెప్పి చల్లగా నవ్వింది
కవుల కవనాలలో కళకళలు ఆడింది ||వెండి ||
*****************************************************************************************************************
jan 11, 2015
నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టమండి, మీరు ఒక పాట రాస్తారా ? అని అడిగారు Pullati Rajesh గారు. ఆ దైవకృపతో రాసి, పాడాను. మీరూ వినండి... చదవండి.
శ్రీరామ రామ జయ రామ రామ కోదండ రామ రణరంగ ధీమ
శ్రీరామ రామ జయ రామ రామ సుగుణాభిరామ హనుమంత సోమ
పల్లవి :
హనుమ హృదయమే రామాలయము
హనుమ స్మరణమే మంగళకరము
చరణాలు :
1.
మారుతాత్మజుడు అంజనీసుతుడు
సూర్యుని శిష్యుడు అతిబలవంతుడు
సుగ్రీవుని హితుడు సుందరరూపుడు
వాక్కున చతురుడు వానరయోధుడు
వీర మారుతి ధీర మారుతి విజయ మారుతి వరద మారుతి
నిత్య మారుతి సత్య మారుతి అభయ మారుతి అక్షయ మారుతి // హనుమ హృదయమే //
2.
కామరూపమును పొందు వజ్రాంగుడు
అసురుల దునిమెను లంకను గాల్చెను
సీత జాడ గనెను వారధి గట్టెను
లకష్మణుకై సంజీవని తెచ్చెను
రామదూత రామ దాస రామభక్త రామభ్రాత
రామనామ జప పావన గాత్ర రామ పాదుకా సేవన సూత్ర // హనుమ హృదయమే //

*****************************************************************************************************************
nov 29, 2014

నాల్రోజుల క్రిందట ఉదయాన్నే టీ తాగుతూ ఉంటే , ఉదయంలో కూడా ఒక ముగ్ధ మౌన రాగం ఉంటుంది కదా, అనిపించింది. వెంటనే ఏ రాగాలు ఉంటాయో ఆలోచించి రాయాలని అనిపించింది. అదండీ సంగతి... అప్పటి నుంచి పగలూ రాత్రీ పాట గోలే ! పాట రాయడం ఓ రోజు పడితే, వీణ మీద ట్యూన్ కట్టడం, అది రికార్డు చేసి, కంప్యూటర్ లో ప్లే చేస్తూ, మళ్ళి పాట పాడి రికార్డు చెయ్యడం... వెరసి... 5 రోజులు పట్టింది... మీరూ వినండి, చదవండి, చూడండి ...
-------------------------------
ప్రకృతి రాగమే సంగీతం
హృదయ భాషయే సంగీతం
ఉదయభానుడి భూపాలరాగం
కొండగాలుల మలయమారుతం
విరిసే పూవుల వసంత రాగం
యేటి గలగలలె గమనప్రియగా
కువకువ ధ్వనమే కోకిలప్రియగా
నెమలి నాట్యమే మయూరధ్వని
ప్రేమ భావనే కేదారముగా
ఇంద్రధనస్సులా రాగమాలిక \\ప్రకృతి\\
వేద పఠనమే హంసధ్వనిగా
వెన్నెల గానం పూర్ణచంద్రిక
మేఘరాగమే మేఘరంజని
వానజల్లులా అమృతవర్షిణి
వేల వన్నెల కాంచు మనసులు
మురిసి పాడేను మోహన రాగం
వెండి అలలపై రాజహంసలా
ఆత్మ ఆడెను ఆనందభైరవై \\ప్రకృతి\\
*****************************************************************************************
నేడు గరుడపంచమి... గరుత్మంతుని స్మరణ మాత్రం చేత సర్వ విషాలు తొలగిపోతాయి. రామలక్ష్మణులకు నాగబంధ విముక్తిని, తల్లికి దాస్య విముక్తిని కలిగించిన అమితబలశాలి ఇతడు. గరుడుని మహిమను చక్కని పాటగా రాసి, గరుడధ్వని రాగంలో స్వరపరచి, అందిస్తున్నాను. నొటేషన్ ఇచ్చేముందు ఇష్టమున్నవారు, జన్మజన్మల విషాలు, పాపాలు తొలగేందుకు , శ్రేయస్సును పొందేందుకు, ఒక్కసారి ఈ పాటను చదవమని మనవి.

గరుడా గరుడా పరమానందకరుడా
వినతసుతుడ మాతృభక్తి పరాయణుడా

మాయోపాయము చేతను కద్రువ
సవతుల పందెము గెలిచినది
పందెపు నియమము కొగ్గిన వినత
దాసిగ బ్రతుకును ఈడ్చినది
దాసి పుత్రుడని వీపున తమ్ముల
ఊరేగించుచు మింటి కెగయగా
భానుని వేడికి మాడిన పుత్రుల
కాంచి కద్రువ అవమానించెను
ఏమిచ్చిన ఈ దాస్యము వీడును?
యని అడుగగ అమృతమె కోరెను  //గరుడా//

దివి నుండి సుధను తెచ్చు త్రోవలో
సురపతి వలదని అడ్డగించెను
ధర్మము కాదిది సుధనెల్లరు గ్రోలుట
మాయకు మాయయె తగుననెను
అమృత భాండమును దర్భల బెట్టి
నాగులు శుచికై స్నానము సేయగ
ఇంద్రుడు సుధగొని తనపురి జేరెను
వినత దాస్యము వీడిపోయెను
గరుడుని భక్తికి మెచ్చిన హరియె
తన వాహనముగ యతని గైకొనెను // గరుడ//

ఇంద్రజిత్తుని నాగబంధమున
చిక్కి నల్లాడిరి రామలక్ష్మణులు
గరుడుని రాకతొ బెదరిన నాగులు
పాశము వీడి పారిపోయెను
స్మరణ మాత్రమున సర్వవిషముల
రూపుమాపెడు 'విషదహారి' తడు
బలశాలియైన వినయశీలుడు
తల్లిమాటకై దాస్యము జేసెను
మాతృభక్తికి మచ్చుతునకగా
నిలచిన గరుడుని భజియించెదను //గరుడ//

**********************************************************************************************************
కృష్ణా పుష్కరాలు 2016 సందర్భంగా నేను రాసిన ఈ పాటను, శ్రీ గజల్ శ్రీనివాస్ గారు ఆలపించారు.

పుష్కర శుభవేళ వచ్చె రావమ్మ కృష్ణమ్మ
దుష్కర్మలు బాప వడిగ రావమ్మ కృష్ణమ్మ
మాబలేశ్వరాన పుట్టి వేలమైళ్ళు పయనించి
బంజరు బంగరుగ మార్చ బిరబిరా పరువులెత్తి
ఆకలిదప్పుల దీర్చే అన్నపూర్ణ నీవమ్మ
ఆదరించు మము చల్లగ మాతల్లి కృష్ణమ్మ  //పుష్కర//
శ్రీశైలాన మల్లన్న అలంపురం జోగులాంబ
వేదాద్రిన నృసింహ అమరావతి అమరేశ
బెజవాడన దుర్గమ్మ మోపిదేవి సుబ్రమణ్య
వెలసితిరి నీ తటినే భువిని దివిని జేయ  //పుష్కర//
రాజుల రాజ్యాలనెన్నొ కన్నది నీ తీరం
వివిధ కళల పుట్టుకకు కృష్ణ ఆలవాలం
బౌద్ధ సంస్కృతులకు నీ ఒడియే ప్రాకారం
చరితలు చరితార్ధమవగ కృష్ణచుట్టె శ్రీకారం //పుష్కర//     
           
కనులార నినుగాంచిన పాపాలే పోవునట
గంగయె పునీతమవగ నీలోనే మునుగునట
శివకేశవ రూపిణివై అలరారే అమ్మవట
కలిబాధల కడుగనొక్క మునకేసిన చాలునట //పుష్కర//

ఈ పాటను క్రింది లింక్ లో వినగలరు 

*************************************************************************
గురూపదేశంతో లభించిన అస్త్రమంత్రాలలోని అస్త్రాలను సులభంగా పాడుకునేందుకు వీలుగా దైవానుగ్రహంతో ఈ విధంగా రాయడం జరిగింది. ఈ పాటలో ప్రస్తావించినవి అన్నీ విష్ణుమూర్తి అస్త్రాలు. వీటి స్మరణతోనే మనకు రక్షణ లభిస్తుంది. 


//అస్త్ర మంత్రాల పాట //

ప. తలచినంత రక్షనిచ్చు నీ దివ్య అస్త్రాలు. 
శౌరి నీదు అస్త్రాలే భక్తకోటి కవచాలు 

చ.౧. దుష్టుల దునిమేను నీ సుదర్శన చక్రము 
శిష్టుల గాచేను నీ గదా శాంగ ఆయుధాలు 
వైరి గుండె లదిరేలా నీ శంఖ నాదము 
హలముసలాయుధాలు హరించును భయాలు //తలచినంత //

చ.౨ హరిహర రూపము నీ త్రిశూలాయుధము 
దండ కుంత అస్త్రాలు దనుజ విదారణాలు 
శక్తి అంకుశాలు నీదు శౌర్య ప్రతిబింబాలు 
విపత్తులను గాచేను నీ వజ్రాయుధము  //తలచినంత //

చ.౩. కులిశ పరశు అస్త్రాలు కలిమలహరణాలు 
శతముఖాగ్ని కాల్చును శతజన్మల పాపాలు 
వరాహ కోరల రక్ష నృసింహ నఖాల రక్ష 
గరుడ రక్ష హనుమ రక్ష మాకు సర్వ రక్ష //తలచినంత //

*********************************************************************************
ఆమె కృష్ణారాధిక... కృష్ణ ధ్యానంలో లీనమై జగమే మరచింది. అలంకారాలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే తన రాధిక ఇలా వెలవెలబోతూ ఉండడం చూసిన కృష్ణుడు, ఆమెను సింగారించాలని కోరుతున్నాడు. కానీ ఆవిడకి కావలసింది అలంకారములు కాదట...

బంగరు మెరుగుల చెలియకు మురిపెము దీర
సింగారము సేతునే ఓ చక్కని రాధ

వెన్నెల వేల్పువు చూపుల మది తడపంగ
సింగారము లేలనాకు చల్లని కృష్ణా

కలువల కళ్ళకు కాటుక తీరుగ దిద్ది
చెవులకు కమ్మలు తొడిగెద చక్కని రాధ

నల్లనయ్య కనునిండిన కాటుక కాదా
వేణునాదమె వీనుల విందగు కృష్ణా

ఎర్రని చందనపు బొట్టు నుదుటను బెట్టి
అత్తరు గంధపు పూతలు పూసెద రాధ

కస్తురి తిలకపు గురుతులె అంటిన చాలు
వనమాలల గంధమలదు కౌగిట కృష్ణా

సన్నని నడుముకు వడ్డాణమునె బెట్టి
కురులను జాజుల సరములు పెట్టెద రాధ

నీ కరముల చుట్టగ నా నడుముకు సిరిలె
సరములేల నీ ఊర్పులె ముసురుగ కృష్ణా

పదములకెర్రని లత్తుక పారాణలది
బంగరు మువ్వలు తొడిగెద ముద్దుగ రాధ

కన్నుల కాంక్షల కెంపులె పారాణవగా
పండిన చెమటలె మేనికి మువ్వలు కృష్ణా

***************************************************************************************************
తెలుగు భాష మీద నేను రాసిన పాట ...

 తేట తెలుగు తియ్యనైన తేనెవాగు కదవోయ్
కోటిమంది గొంతుకలిపి చాటుదాము పదవోయ్

రమ్యమైన అక్షరాల రాచమాల తెలుగు
శ్రావ్యమైన శబ్దాల రాగాధార తెలుగు
ఇంపైన శిల్పంతో సొంపులొలుకు తెలుగు
ముచ్చటైన భావంతో ముద్దులొలుకు తెలుగు

రాజులే గులాములైరి తెలుగుతల్లి పంచన
కవులే ధృవతారలైరి తెలుగుకావ్య సొబగున
కళలెన్నో వెల్లివిరిసె తెలుగుతోట వసంతాన
తెలుగు వైభవమును తెలియ భాష నీవు నేర్వవోయ్

నదులతోనె పుట్టినట్టి నాగరికత మనదిలే
మణులవోలె మెరిసినట్టి కీర్తిచరిత మనదెలే
తెలుగులోన మాట్లాడుట లోకువేమి కాదులే
మాతృభాష మనకుజన్మ హక్కని నువు చాటవోయ్

ఉన్నభాష లెన్నియైన అమ్మభాష అనగా
జీవనాడులన్ని వీణ మీటినట్లు మ్రోగవా
బ్రతుకుతెరువు కోసమని భాషలెన్ని నేర్చినా
బ్రతుకుతీపి తెలియచేయు తెలుగుమాట మరువకోయ్

*******************************************************************************************************************