Monday, November 11, 2013

అన్నమయ్య 1

'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో ఆత్మీయ మిత్రులు అందించిన సమాచారం 

శ్రీ రావినూతల శ్రీనివాస్ 

ఒకనాడు అన్నమయ్య ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, వరదరాజస్వామిని సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణమిల్లి , బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) నమస్కరించి, పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠగోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు.
తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు. 
తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్త్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

ఈ అన్నమాచర్య కీర్తన చూడండి,నాకు ఎంతో ఇష్టమైన కీర్తన ,ఎంత అద్భుతమైన రచనో :

పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు 
పరగి నానా విద్యల బలవంతుడు 

రక్కసుల పాలిటి రణరంగ శూరుడు 
వెక్కసపు ఏకాంగ వీరుడు 
దిక్కులకు సంజీవి దెచ్చిన ధీరుడు 
అక్కజమైనట్టి ఆకారుడు 

లలితమీరిన యట్టి లావుల భీముడు 
బలు కపికుల సార్వభౌముడు 
నెలకొన్న లంకా నిర్ధూమధాముడు 
తలపున శ్రీరామ నాత్మారాముడు 

దేవకార్యముల దిక్కువరేణ్యుడు 
భావింపగల తపః ఫలపుణ్యుడు 
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు 
సావధానుడు సర్వశరణ్యుడు

వడ్డాది సత్యనారాయణ మూర్తి గారు 


ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | 
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||

చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | 
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||

మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | 
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||

చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | 
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | 
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | 

-------------------------------------------------------------

Manujudai Putti - మనుజుడై పుట్టి
........................................

మనుజుడై పుట్టి మనుజుని సేవించి 
అనుదినమును దుఃఖమందనేలా 
...
జుట్టెదుగడుపుకై చొరనిచోట్లు చొచ్చి 
పట్టెడుగూటికై బతిమాలి 
పుట్టినచోటికే పొరలి మనసు పెట్టి 
వట్టిలంపటము వదలనేరడుగాన 
...
అందరిలో బుట్టి అందరిలో బెరిగి 
అందరి రూపము లటుదానై 
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి 
అందరానిపదమందెనటుగాన

---------------------------------------------------------------


భావయామి గోపాలబాలం మన 
సేవితం తత్పదం చింతయేయం సదా 

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా 
పటల నినదేన విభ్రాజమానం 
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం 
చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి 

నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది 
సుర నికర భావనా శోభిత పదం 
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం 
పరమపురుషం గోపాలబాలం … భావయామి
ragam : yamuna kalyani

----------------------------------------------------------------------

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరుగునో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల



వివరణ
=====
ఆన్నమాచార్యులవారు భగవంతుదు చేసే ఈ జగత్ సృష్ఠి రక్షణ ప్రళయములను ఒక ఉయ్యాల ఆటతో పోల్చుచున్నారు।చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలలో నుండుట అలవాటైనది।జీవులు పీల్చే ఉఛ్ఛ్వాసములో నీభావము తెలుస్తు ంది। ఉఛ్చ్వాసము ఓంకారము। ఓంకారమునందు నారాయణుడు సర్వనిర్వాహకుడని, అతనికి జీవాత్ముడు దాసుడని , జీవాత్ముని లక్షణమదే అని, దాస్యమవలంబించిన జీవాత్ముడు ముక్తి కర్హుడై పరమాత్మతో యావత్కాలమును సుఖించుననే భావము గర్భితమై యున్నది।ఇది ఈ ఉయ్యాలలోనిదే। 

సూర్యుడుదయించు అస్త మించు రెండు కొండలును స్తంభములయితే నక్షత్రమండల మంతయును ఈ ఉయ్యాలను మోయుచున్నది। ఈ ఉయ్యాలకు ఆకాశము అడ్డదూలము। కనుక నీ ఉయ్యాల సమస్త ప్రపంచమును నిండియున్నది।

ఉయ్యాలకు నాలుగు వేదములను బంగారు గొలుసులు।(జగత్ క్రియా కలాపములకు వేదములే ఆధారము) ఉయ్యాల పట్టి సంఖ్యాశాస్త్రము।(మూడు లోకములు , సప్తకుల పర్వతములు, త్రిగుణములు , అరిషడ్వర్గములు, చతుర్దశవిద్యలు మొదలయిన వ్యవహార మంతయు సంఖ్యాశాస్త్రము మీదనే ఆధారపడినది కనుక ఆ పట్టి సంఖ్యాశాస్త్రము)। ధర్మదేవత పీఠము।

మేఘమండలము మేలు కట్లు (బందుకట్లు)। ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగు (చాలా మేలయినది)। నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన ఆభరణము।(స్వామి యొక్క మేనిపైననే జగత్తులాధారపడియున్నవి, కనుక ఇవియే స్వామికి నగలు)।

స్తనములు కదులుచుండగా, పైటకొంగులు రాచుకొణగా స్త్రీలు ఊపే ఉయ్యాల ఇది।(భగవంతుడూపే ఈ ఉయ్యాలకు బ్రహ్మాది దేవతలు తక్కిన జీవాత్మలు కూడ సహాయ భూతులు కనుక వారు ఊపే ఉయ్యాల ఇది। అయితే వీరందరూ స్త్రీలు।"స్త్రీప్రాయమితరంజగత్ = భగవంతుడొక్కడే స్వతంత్రత కలిగిన పురుషుడు తక్కిన వారందరు భగవంతునకు పరతంత్రులు కనుక స్త్రీలే" అని శాస్త్ర నిర్ణయము। వీరు కూడ ఈ ఉయ్యాల నూపుచున్నరు కదా) ఆ స్త్రీలు బ్రహ్మాండములన్నీ ఒరిగిపోతాయనే భయంతో ఊపుచున్నారు।(జగత్ క్రియలను భగవంతుడు నిర్భయంగా చేస్తాడు , తక్కిన వారు పరతంత్రులు కనుక భయంతో చేస్తారు।)

ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవి భూదేవి ప్రతి కదలికకు నిన్ను కౌగిలించుకొందురు కదా ! స్వామీ ! దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే నీ హావభావ విలాసములు తెలుస్తాయి।

బ్రహ్మాదులకు కూడ ఇది ఆశ్చర్యకరమై వర్ణింపనలవి కాదు। కన్నుల పండువయినది। ఓ వేంకటేశ్వరా ! ఈ ఉయ్యాల ఊపుట నీకు వేడుకయిన లీల।(స్వామికు వైకుంఠము భోగము కొరకని తక్కిన లోకములు లీల కొరకని సంప్రదాయము ) ఈ పదము అన్నమయ్య గారి భావుకతకు నిదర్శనము।

--------------------------------------------------------------------------------------------------------------------------

అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి
కమలాసన సౌభాగ్యము
.....................................................

కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులునింతంతని పలుకంగ రాదు

1. మించిన చొక్కులు మీరిన యాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచ బాణుని పరిణత(తు)లూ

2.కనుగవజలములు కమ్మని చెమటలు
అనయము జెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెరపులు
వినుకలి కనుకలి వేడుకలు

3.మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీ వేంకటపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుగూడిన యలసములు 

తాత్పర్యము
పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ వైభవములు, ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి.

1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను!

2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి పద్మినీజాతి సౌగంధ్యం కలిగిన కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి ఆనందం కలిగించే విషయాలు.

3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే” అనే వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు. మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.

ఆంతర్యము
ఈ కీర్తన మూడు చరణాల్లో చివర వర్ణించిన క్రియా పదాల్లో మొదట పరిణతి ఉంది. తర్వాత వేడుక, ఆపిమ్మట అలసట ఉంది. ఆలోచించినకొద్దీ కవితాప్రియులకు ఇందులో ఆనందం కనబడుతుంది.

చాలామంది అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనలను మనసారా పాడుకొని. ఆనందానుభూతిని పొందుతారు. శృంగార కీర్తనలను పాడటానికి, చదవటానికి , నలుగురిలో ప్రస్తావించటానికి ఇబ్బంది పడే జాతి ఒకటి ఈ మధ్య బయలుదేరింది. వారందరూ ఒక విషయాన్ని గుర్తించాలి. ఈ రకమైన శృంగార వర్ణనలు చేయటంలో అన్నమయ్య ఒకడే కాదు. వాల్మీకి, వ్యాసుడు కూడా ఉన్నారు. వారు ఎంత గొప్పగా భక్తిని రాసారో, అంత గొప్పగా శృంగారము, తదవయవ వర్ణన చేసారు.ఉదాహరణకి పరమ పవిత్రమైన వాల్మీకి రామాయణంలో సీతమ్మ తనను తాను ఇలా వర్ణించుకొంటోంది:

"నా నేత్రాలు, పాదాలు, చీలమండలు, ఊరువులు అన్నీ సమప్రమాణములో పుష్టిగా ఉన్నాయి.నా స్తనాలు సుందరాలు. చనుమొనలు గంభీరాలు. నా నాభి లోతు.." (రామాయణము- యుద్ధ కాండ(09-12 శ్లోకాలు)

నెత్తి మీద రామాయణాన్ని మోసే మనమెవరమూ కూడా , ఇటువంటి వర్ణనలు ఉన్నాయని రామాయణాన్ని పక్కన పెట్టలేదు. నిత్యము పారాయణ గ్రంధంగా గౌరవిస్తున్నాము.

వ్యాస భగవానుడు దేవీభాగవతంలో రెండవ అధ్యాయంలో ఇలా వ్రాసాడు:

“……కృష్ణుడు తన సంకల్ప మాత్రంతో రెండుగా మారాడు. ఎడమ భాగంలో స్త్రీ, దక్షిణ భాగంలో పురుషుడు ఉద్భవించాడు. అమె శరీరపు కాంతి విప్పారిన పద్మంలా ఉంది. ఆమె తొడలు చంద్ర బింబం కంటె అందంగా ఉన్నాయి. ఆమె పిరుదులు అరటి బోదెల్లా ఉన్నాయి. ఆమె స్తనాలు మారేడు పండ్లలా ఉన్నాయి. ….”

ఇలాంటి శృంగారపు వర్ణన ఉన్నంత మాత్రాన ఆ వర్ణనలు చదవటం మానేసి, మిగతా దేవీభాగవతాన్ని మాత్రమే భక్తులమైన మనము చదువుతున్నామా? కాదు. ‘ కృష్ణుడు తన సంకల్ప మాత్రంతో రెండుగా మారాడు ‘అను వాక్యంలోని లోతును తెలుసుకొని మనం చదివేటప్పుడు వికారాలకు గురి కావటం లేదు. ఆధ్యాత్మికఫలితాలు పొందుతున్నాం.

ఉన్నది ఒకడే. అతడే పురుషుడు. మిగతావాళ్లంతా స్త్రీలు అని ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతపు పునాది మీద లేచినవే ఆన్నమయ్య శృంగార కీర్తనలు. అన్నమయ్య శృంగార కీర్తన చదివిన ప్రతిసారి ఈ విషయాన్ని తలుచుకొంటుంటే ఇదమిత్ధమని చెప్పలేని తీపితో కలిసిన భక్తి భావనకు గురవుతాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశుడు . అతనికోసం అన్నమయ్య నాయిక అయ్యాడు. నాయికలుగా మారాడు. పోట్లాడాడు. అలిగాడు. పంతాలాడాడు. ఏది చేసినా ఒకటే లక్ష్యం. స్వామిలో లీనం కావటం. అదే మోక్షం. దానికి అన్నమయ్య శృంగారపు భావాల తొడుగు తొడిగాడు.

దేవీ భాగవతాన్ని, రామాయణాన్ని ఎంత భక్తి ప్రపత్తులతో చదువుతామో, అన్నమయ్య భక్తి 
కీర్తనలతో పాటు ఆయన మధుర భక్తి కలిగిన శృంగార కీర్తనలు కూడా చదవాలి. అన్నమయ్య శృంగారపు స్థాయికి చేరకపోయినా సరే కాని- ఆయన స్థాయిని అవమానించటం- తిరుపతి వెంకన్న మూల విరాట్టు ముందు నిలబడి, , నమస్కారం చేయకుండా పక్కకి వెళ్లినంత మహా పాపం. స్వస్తి.

---------------------------------------------------------------------------------------------------------------------------

వందే వాసుదేవం శ్రీపతిం - బృందారకాధీశ వందిత పదాబ్జం

ప// వందే వాసుదేవం శ్రీపతిం
బృందారకాధీశ వందిత పదాబ్జం 

చ// ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- 
చందనాంకిత లసత్-చారు దేహం 
మందార మాలికామకుట సంశోభితం
కందర్పజనక మరవిందనాభం 

చ// ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనం 
నిగమాదిసేవితం నిజరూపశేషప- 
న్నగరాజ శాయినం ఘననివాసం 

చ// కరిపురనాథసంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగతకరాబ్జం 
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరు వేంకటాచలాధీశం భజే

భావం: 
వాసుదేవునికి నమస్కరించుచున్నాను. బృందారకాధీశుని (ఇంద్రుని) చే పూజింపబడిన పాదములను కలవానికి నేను నమస్కరించుచున్నాను.

నల్ల కలువ వంటి దేహకాంతి గలవానికి, చందనము పూసుకున్న రమ యొక్క స్తనద్వయము వెలుగులో ప్రకాశించుచున్నవానిని, మందారమాలలను ధరించిన వానిని, ధగధగ మెరుస్తూన్న కిరీటము గల వానిని, మన్మధుని తండ్రిని, బొడ్డు యందు పద్మము కలవానికి నేను వందనము చేయుచున్నాను.

హృదయము నందు మెరుస్తూన్న కౌస్తుభమణిని ధరించిన వానిని, గరుడపక్షి వాహనముగా గలవానిని, పద్మనేత్రుని, వేదాలచే కొనియాడబడువానిని, సర్పరాజుపై పవ్వళించేవానికి నేను వందనము చేయుచున్నాను.

ధర్మరాజునకు సహాయము చేయుటకు నిరంతరం ఉద్యుక్తుడైనవానిని, కరిరాజుని రక్షించిన వానికి, శరణుకోరిన వారికి స్నేహహస్తము అందించు పద్మము వంటి చేతులు కలవానిని, పద్మము వంటి ముఖము కలవానికి, చేతియందు చక్రముచే ప్రకాశించువాడు ఐన తిరువేంకటాచలాధిపునికి 
వందనము చేయుచున్నాను.


అన్నమయ్య

తెలుగునాట 'జో అచ్యుతానంద జో జో ముకుందా !' అని ఉయ్యాల ఊపుతూ ప్రతీ తల్లీ జో కొడుతుంది. పసివాళ్ళను సైతం పరవశింపచేసే పాటలు రాసిన ఆ మహనీయుడే అన్నమయ్య.

కడప జిల్లా రాజంపేట మండలంలో ఉన్న తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు అన్నమయ్య. తిరుపతి కొండల మీద తిరుపమేత్తుకున్నా పరవాలేదని చిన్నప్పుడే ఇంట్లో నుంచీ పారిపోయాడు. పసి పాపడిగా ఉన్నప్పటి నుంచీ అతడికి పాటలంటే ఇష్టం. తల్లి లక్కమ్మ ఒడిలో మంత్రముగ్ధుని వలె పాటలు వినేవాడు. ఆమెకు తిరుపతి వెంకన్న అంటే అమిత భక్తీ. ఉగ్గుపాలతో నేర్పిన గాంధర్వ గానం అన్నమయ్యకు వంటబట్టింది. చిన్నప్పటి నుంచీ సొంతగా పాటలు కట్టి పాడుకునే వాడు. వేదాలు వల్లించక కూని రాగాలు తీస్తున్న అన్నమయ్యను అంటా చిన్న చూపు చూసేవారు. వదిన గారు అతన్ని రాచిరంపాన పెట్టేది. పశువులకు గడ్డి కోసుకు రమ్మని పంపేది.

ఒకనాడు అన్నమయ్య గడ్డి కోస్తూ ,పాటలు పాడుతూ ,కొడవలితో గడ్డి బదులు తన వేలు కోసుకున్నాడు. నెత్తురు కారింది. బాధతో 'శ్రీహరీ!' అని కేక వేసాడు. తన రక్తంలో లీనమైన కర్తవ్యమేదో అతనికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే కొడవలి అక్కడే పడేసి, కట్టుబట్టలతో తిరుమలకు తరలి పోయాడు. అనేక ఊళ్లు తిరుగుతూ, గ్రామదేవతలను పూజిస్తూ తరలి పోయాడు. తిరుపతి చేరుకొని, ఏకబిగిన కొండ ఎక్కడం మొదలు పెట్టాడు. చెప్పులతో కొండ ఎక్కితే త్వరగా అలసిపోతానని తెలియదేమో, పెద్ద ఎక్కుడు చేరేసరికి సోమ్మసిల్లాడు. చల్లగాలి వీస్తూ, తుమ్మెదలు తొలచిన రంధ్రాలు పూరిస్తూ వేణుగానం చేస్తుంటే, వెదురు పొద కింద చెమటల బడలికతో ఉన్న అన్నమయ్య నల్లనయ్య లాగే ఉన్నాడట! ఎవ్వరికీ కనబడని ఆకలితో నిద్రించాడు.

అప్పుడొక చల్లని తల్లి వచ్చింది. చెప్పుల కాళ్ళతో కొండ ఎక్కరాదని చెప్పి, ప్రసాదాన్నాలు కడుపు నిండా పెట్టింది. ఆమె అతని పాలిటి అలమేలుమంగ. అన్నమయ్య గొంతు విప్పి ఆశువుగా ఒక శతకం చెప్పాడు. అదే వెంకటేశ్వర శతకం.

కడుపు నిండా అన్నం పెట్టిన తల్లిని అలమేలుమంగాగా భావించి, తనకు దేవుడిని చూపించమని ఇలా వేడుకున్నాడు.

ఓ లలితాంగీ యో కలికి యో యెలజవ్వని యో వధూటి యో 
గోల! మెరుంగుజూపు కనుగొనల నోయల మేలుమంగ మ 
మ్మేలిన తల్లి నీ విభున కించుక దెస జూపుమంచు నీ 
పాలికి జేరి మ్రొక్కుదురు పద్మభవాదులు వెంకటేశ్వరా!

ఈ శతకం అలమేలుమంగపై చెప్పినదే అని ఈ పద్యం వల్ల మనకు తెలుస్తున్నది...

అమ్మకు తాళ్ళపాక ఘను డన్నడు పద్యశతకంబు చెప్పెగో 
కొమ్మని వాక్ప్రసూనముల గూరిమితో నలమేలుమంగకున్ 
నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్ 
సమ్మెడ మంది వర్దిలను జవ్వనలీలలు వెంకటేశ్వరా!

 
అన్నమయ్య కన్నుల కరువు తీరా స్వామిని సేవించాడు. అక్కడ నవకీర్తనలు చేసాడు. మర్నాడు ఆకాశగంగలో స్నానం చేసి, కట్టుచీర తీసి ఉతికి ఆరేసి, అది ఎందేలోగా 'కుతుకంబు సమకూర శతకంబు' ఒకటి చెప్పాడు. ఆ తరువాత దేవాలయం వద్దకు వస్తే తలుపులు మూసి ఉన్నాయి. అన్నమయ్య ఉండబట్టలేక, వేంకటేశ్వరుని మీద మరొక శతకం చెప్పాడు. నూరు పద్యాలు పూర్తీ కాగానే తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఆ నల్లని చిన్నవానికి వైష్ణవ దీక్ష ఇచ్చాడు వైష్ణవయతి. 



తన కుమారుడిని వెతుక్కుంటూ తిరుపతి వచ్చి, అన్నమయ్యను తనతో తీసుకువెళ్ళింది తల్లి. తిరుమలమ్మను, అక్కలమ్మను ఇచ్చి వివాహం జరిపించింది. తరువాత అన్నమయ్య అహోబిలం వెళ్లి, అక్కడి నరసింహునిపై ఎన్నో కీర్తనలు వ్రాసాడు. నారసింహావతార ఘట్టాన్ని వివరిస్తూ పదకొండు చరణాల పాటను వ్రాసాడు. అహోబిల నరసింహునిపై రచించిన ఒక  పాటను ఇప్పుడు చూద్దాం...


నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము

నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము

పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము

తాత్పర్యము
అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న నరసింహ స్వామిలో -తొమ్మిదిమంది నరసింహ మూర్తులను దర్శిస్తూ అన్నమయ్య పాడిన గీతమిది:

ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ , తొమ్మిది రూపాలు ధరించిన , నరసింహ స్వామి మన కళ్ల ఎదురుగా ఉన్న ఈ కదిరి నరసింహస్వామి. భక్తితో చూస్తే ఈయనలో తొమ్మిది రూపాలు కనిపిస్తాయి.

1. అహోబిలం కొండమీద ఒక గుహలో అరుగు మీద పది భుజాలతో ఉన్న వీర నరసింహస్వామి ఈ కదిరి నరసింహ స్వామి. పైన అహోబిలంలో నవ్వుతున్న జ్వాలా నరసింహ స్వామి ఇతడే. చిన్న అహోబిలపు కొండపై ఉన్న యోగానంద నరసింహ స్వామి ఇతడే. వేదాద్రిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఇతడే.

2. చిన్న అహోబిలానికి దగ్గరలో భార్గవ తీర్థం అనే క్షేత్రంలో వెలసిన నరసింహ స్వామి ఇతడే. పెద్ద అహోబిలానికి నాలుగు మైళ్ల దూరంలో బీభత్స మూర్తిగా వెలసిన మట్టెమళ్ల నరసింహ స్వామి ఇతడే. కానుగ చెట్టు కింద ఉన్న కానుగ నరసింహ స్వామి( వరాహ లక్ష్మీ నరసింహుడు )ఈ కదిరి నరసింహ స్వామి.

3. విజృంభిస్తూ ఎగువ అహోబిలంలో నరసింహ స్వామికి, ఉగ్ర స్తంభానికి మధ్యలో వెలసిన ప్రహ్లాద నరసింహస్వామి ఇతడే. కదిరిలో ఉన్న ఈ నరసింహ స్వామియే వేంకటాద్రి మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి.

( ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం నుంచీ... పై గీతం, భావం ఒక బ్లాగ్ నుంచీ సేకరణ - పద్మిని భావరాజు)



'పద కవితా పితామహుడు ' అన్నమయ్య

రచన: పరవస్తు నాగ సాయి సూరి 

భవసాగరాన్ని దాటించే భక్తి సాగరం, సాహితీ క్షీరసాగరం
----------------------------------------------------

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము,
నట్ట నడి మీ పని నాటకము
అన్నమయ్య చెప్పినట్టు. నడిమిన జరిగేదంతా నాటకమే. మరి ఆ నాటకాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దాలంటే... అందులో నవరసాలు ఉండాలి. వీటితో పాటు పదో రసం... అంటే భక్తి రసమూ ఉండాలి. జీవితాంతం అన్నమయ్య చెబుతూ వచ్చింది ఇదే. వేంకటేశ్వరుని పూజించి తరించండి. ఆ స్వామి చల్లని నీడలో సేదతీరండి అని. ఇదంతా ఓ ఎత్తైతే... అన్నమయ్య ఈ నిజాన్ని ఆవిష్కరించడం మరో ఎత్తు. చిన్న చిన్న పదాల్లో... పండిత పామర రంజకంగా తిరుమల వేంకటేశుని పూజించి తరించాడు. 
నీ వల్ల నాకు పుణ్యము...
నా వల్ల నీకు కీర్తి 
అంటూ తిరుమల వాసుడితో బేరసారాలు ఆడగలిగిన మహాభక్తుడు అన్నమయ్య. దక్షిణా పథాన భజన సంప్రదాయానికి, పదకవితా శైలికి ఆ పదకవితా పితామహుడే ఆద్యుడు. భక్తి, సంగీతం, సాహిత్యం, శృంగారం, భావలాలిత్యాది విశేషాలను ఒకే చోట పొదిగి వెంకటేశ్వరుణ్ని సంకీర్తనా కమలాలతో అర్చించి తరించాడు. సాక్షాత్తు శ్రీహరి ఖడ్గమైన నందకమే అన్నమయ్య రూపు దాల్చిందని నమ్మిక. నిజమే కామ క్రోదాది అరిషడ్వర్గములను ఖండించాలంటే... మార్గం చూపాల్సింది శ్రీహరి ఖడ్గమే కదా. బహుశా అందుకేనేమో ఎటు నుంచి నరుక్కురావాలో అన్నమయ్యకు బాగా తెలుసు. అందుకే ఆకర్షించడానికి శృంగారాన్ని, అర్థం కావడానికి సరళ పదాల్ని, ఆకట్టుకోవడానికి మంచి ప్రయోగాల్ని, మార్చడానికి భక్తిరసాన్ని రంగరించి 32వేల సంకీర్తనల్ని రాశిపోశాడు... తాళ్ళపాక అన్నమాచార్యులు.
ఆ రాయడం కూడా మామూలుగా రాశాడా. మనిషి పుట్టుక నుంచి చావు వరకూ... ప్రతి సందర్భాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో చక్కగా అమర్చాడు. తల్లిగా మారి శ్రీనివాసునికి జోలపాడాడు, యశోదమ్మగా మారి గోరు ముద్దలు పెట్టాడు, తండ్రిగా మారి పెళ్ళిచేశాడు, తాతగా మారి శృంగారాన్ని బోధించాడు, చివరకు కొడుకుగా మారి చరమాంకాన్ని రుచి చూపాడు. ఇన్ని అవస్థలను సాహిత్యంలో ఏర్చి కూర్చిన మరో కవి, రచయిత తెలుగు సాహిత్యంలోనే కాదు... మరి ఏ ఇతర భాషల సాహిత్యంలోనూ కనిపించడంటే అతిశయోక్తి కాదు.
ఉగ్గు వెట్టరే వోయమ్మా చెయ్యొగ్గీనిదె శిశువోయమ్మా
కడుపులోని లోకమ్ములు గదలీ నొడలూచకురే వోయమ్మా
అంటూ.... ఆ చక్కనయ్యకు ఉగ్గు పెట్టాడు అన్నమయ్య. ఈ రోజుల్లో ఉగ్గు పెట్టడం ఎంత మంది తల్లులకు తెలుసు. అసలు ఉగ్గు అనేది ఒకటి ఉందని ఎవరికి తెలుసు. అన్నమయ్య ఈ కీర్తన ఉన్నంత కాలం తెలుగు లోగిళ్ళలో ఉగ్గు నిలిచిపోతుంది. అంతేనా....
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో...
అంటూ సాక్షాత్తు చంద్రుని సోదరినే అర్థాంగిగా స్వీకరించన వాడికి చందమామ అశపెట్టి గోరుముద్దలు తినిపించాడు. ఈ కీర్తనకు వెంకటేశుడి సంగతి ఏమో గానీ... తెలుగు లోగిళ్ళలో పసివాళ్ళు మాత్రం గబుక్కున తినేస్తారు. ఇంకోచోట....
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవింద
అంటూ శ్రీవారికి చక్కగా జోలపాట పాడి నిద్రబుచ్చాడు. ఈ పాటకు వెంకటేశుడి మాట అలా ఉంచితే తెలుగింట్లో ప్రతి పిల్లవాడు చక్కగా నిదరపోయాడు. శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నట్టుగా.... పిల్లలే ఈ పాటలకు పరవశిస్తే... ఆ పిల్లల స్వరూపమైన భగవంతుడు నిద్రపోడా ఏమిటి. నిద్రపుచ్చి ఆగాడా....
విన్నపాలు వినవలే వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
అంటూ... వింత వింత కోర్కెలతో తరలి వస్తున్నారు. ఇక చాల్లే మేలుకో. దేవతలంతా నిద్రలేచారు. అంటూ స్వామి వారిని హాయిగా మేలుకొలిపే బాధ్యత కూడా అన్నమయ్యదే మరి. 

                               

పుట్టుక తర్వాత వెంటనే చదువు సంధ్యలే కదా.... వాటి గురించి అన్నమయ్య చెప్పిన ఓ కీర్తనను ఇక్కడ పూర్తిగా ఉదహరిస్తాను...
వాదులేల చదువులు వారు చెప్పినవేకావా
వాదులేల మీమాట వారికంటే నెక్కుడా

నాలుగువేదాలబ్రహ్మ నలి నెవ్వనిసుతుడు
వాలినపురాణాలవ్యాసుడెవ్వని దాసుడు
లీల రామాయణపువాల్మీకివసిష్టులు
ఆలకిం చెవ్వని గొల్చి రాతడే పోదేవుడు

భారత మెవ్వనికధ భాగవతము చెప్పిన
ధీరుదైన శుకుడు యేదేవుని కింకరుడు
సారపుశాస్త్రాలు చూచిసన్యసించి నుడిగేటి
నారాయణనామపునాధుడేపో దేవుడు

విష్ణువాగ్యయని చెప్పేవిది సంకల్ప మేడది
విష్ణుమాయయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది
"విష్ణుమయం సర్వ" నునేవేవేదవాక్య మెవ్వనిది
విష్ణువు శ్రీవేంకటాద్రి విభుడే ఆదేవుడు 
చదువు... చదువు అంటూ గోల పెడుతున్నారు. అసలు చదువంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. ఆ స్వామికంటే ఎక్కువా. ఎందుకు వాదులాడుకుంటున్నారు. వేదాలు పఠించే బ్రహ్మ ఎవరి సుతుడు, పురాణాలు రాసిన వ్యాసుడు ఎవరి దాసుడు, రామయణం రాసిన వాల్మికి, రాముడికే విద్యలు నేర్పిన వశిష్టుడు ఎవరిని కొలిచారో వాడే కదా దేవుడు.
భారతం ఎవరి కథ, భాగవతాన్న చెప్పిన శుక మహర్షి ఏ దేవుడి దాసుడు, అన్ని శాస్త్రాల సారమూ ఆ శ్రీమన్నారాయణుడే. ఆయన దాసుడే కదా దేవుడు. అంతా విష్ణు మయం, విష్ణుమాయ అయినప్పుడు వేరే దానికి చోటు ఎక్కడ ఉంటుంది. కాబట్టి వాడే దేవుడు. వాడిని కొలవడమే చదువు అంటాడు. ఈ విశేషం మనకు పోతన భాగవతంలో భక్తప్రహ్లాదుని ఘట్టంలో కనిపిస్తుంది. 
చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు
నే చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!
అన్న ప్రహ్లాదుని మాటల్లోని అంతరార్థం ఈ కీర్తనలో కనిపిస్తుంది. చదువు తర్వాత ఇంకేముంటుంది పని చేయడం. నాలుగు డబ్బులు సంపాదించుకోవడమే. ఇక్కడే మనిషిలో మార్పులు మొదలౌతాయి. వృత్తులు, వ్యాధులు, బేధాలు ఇలా ఎన్నో పొడసూపుతాయి. వాటన్నింటి మీదా అన్నమయ్య కీర్తనలు కనిపిస్తాయి.
అప్పులేని సంసారమైన పాటే చాలు
తప్పు లేని జీతమొక్క తారమైన చాలు
అంటూ జీవితాన్ని ఎలా గడపాలో చక్కగా ఆవిష్కరించాడు అన్నమయ్య. అంతేనా ఎవడెవడి కోసమో పని చేస్తున్నావు. మానవ జన్మ సార్థకత ఇంతేనా అని ప్రశ్నిస్తూ....
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినము దుఃఖమొందనేలా
అని ప్రశ్నించాడు. మనిషిగానే పుట్టావు. మనిషి కోసమే ఎందుకు తాపత్రయ పడతావు. ఎక్కడ నుంచి పుట్టావో అక్కడే వ్యామోహాన్ని పెంచుకుని ఎందుకు బాధలు పడతావు. ఆ శ్రీహరిని చేరమంటూ జ్ఞానోదయం చేశాడు. ఇక్కడే వృత్తుల్ని కూడా ఆవిష్కరించాడు.
వాడల వాడల వెంట వాడెవో,
నీడ నుండి చీర లమ్మే నేత బేహారి
అంటూ... మానవ జీవితాన్ని చేనేత వృత్తితో పోల్చాడు. అంతేనా మరోసారి వైద్యుడిగా మారి....
కొనరో కొనరో మీరు కూరిమి మందు
వునికి మనికి కెల్ల నొక్కటే మందు
అంటూ... ధృవుడు, ప్రహ్లాదుడు, నారదుడు, జనకుడు... ఇలా ఎందరో వాడిన అద్బుతమైన ఔషదము. వాడి తరించండి. జీవితాన్ని సార్థకం చేసుకోమంటూ ఎలుగెత్తి చాటాడు. అన్నమయ్య కీర్తనల్లో కనిపించే ప్రత్యేకత ఇదే. ఇలా చూస్తూ పోతే ఎన్నో విశేషాలు. తల్లి ముందు బిడ్డలంతా ఎలా సమానమో భగవంతుడి ముందు జనులంతా అంతే సమానం ఆ విషయాన్ని ఆవిష్కరిస్తూ....
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే
పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే
అంటూ... హీనం, అధికం అంటూ ఏమీ లేదు. ఆకలి, నిద్ర దగ్గర నుంచి కామ సుఖం వరకూ అన్ని జీవులకు ఒక్కటే అంటూ ప్రబోధించాడు. మానవ జాతి ఐక్యతలోని అంతరార్థాన్ని అప్పుడే ఆవిష్కరించాడు అన్నమయ్య. ఇక వృత్తులు అయ్యాక వివాహమే కదా. ఇలాంటి పాటలు చెప్పుకుంటూ పోతే అన్నమయ్య దగ్గర ఎన్నో.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పెడమరలి నవ్వీనే పెళ్ళి కూతురు
అంటూ వివాహాన్ని చక్కగా ఆవిష్కరించిన అన్నమయ్య... ఆ సందర్భంలో ఉండే ఎన్నో సంప్రదాయాలను తన కీర్తనల్లో ఆవిష్కరించాడు. చివరకు
శోభనమే శోభనమే వై
భవములు పావనమూర్తికి
అంటూ... పవళింపు సేవను కూడా చక్కగా ఆవిష్కరించాడు. అంతేనా
ఏలే ఏలే మరదలా
వాలేవాలే వరసలా 
అంటూ యుగళగీతాలనూ అల్లారు. భక్తి పారవశ్యంలో రస పారవశ్యాన్ని రంగరించారు. 
మూసిన ముత్యాన కేలే మొరగులు
ఆశల చిత్తాన కేలే అలవోకలు
అంటూ... సరికొత్త లోకంలో విహరింప జేశారు. దర్మార్థ కామమోక్ష ప్రాధాన్యతను ఆవిష్కరించారు. 
పెళ్ళి తర్వాత ఏముంటుంది ఈ సంసార సాగరాన్ని చక్కగా ఈది చివరగా....
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే చొచ్చితి
అంటూ... జీవితంలో అలసిపోయి, పరమాత్ముని ఒడిలోనే సేదతీరాడు అన్నమయ్య. చూస్తు పోతే అన్నమయ్య రాసిన సంకీర్తనల్లో భగవంతుని భక్తి మాత్రమే కాదు... ఎలా జీవించాలి అన్న సందేశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 

చాలా మంది అన్నమయ్య కీర్తనల్ని భక్తి కీర్తనలుగా, భజన పాటలుగా మాత్రమే చూస్తుంటారు. తరిచి చూస్తే... అందులో మనిషి చిన్నతనానికి అవసరమైన ఉగ్గు లాంటి ప్రక్రియలు ఉంటాయి. ఎలా జీవించాలో చెప్పే పెద్దల తత్వాలు ఉంటాయి. ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న సమాధానాలు ఉంటాయి. వైద్య శాస్త్రం దగ్గర్నుంచి కామ శాస్త్రం వరకూ ప్రతి ఒక్కటి ఆ కీర్తనల్ల గోచరమౌతూ ఉంటాయి. ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతుంది. అదే అన్నమయ్య కీర్తనల్లోని గొప్పతనం. సరళమైన భాష వల్ల పండిత పామర రంజకంగానూ ఉంటాయి. పేదలకు, ధనవంతులకూ ఒకటే సందేశాన్ని అందిస్తాయి. అందుకే అన్నమయ్య సాహిత్యం ఏ ఒక్కరి సొత్తో కాదు. తెలుగు వారి ఉమ్మడి ఆస్తి. మరి మాట్లాడితే భారతీయ సంస్కృతికి చుక్కాని. సంసార సాగరాన్ని దాటేందు.. అన్నమయ్య భక్తి సాగరం చక్కని దారి. ఆ భావదారలో తడిస్తే చాలు బతికినంత కాలం జీవితం ధన్యం అవుతుంది. ఈ కట్టె కాలిపోయిన తర్వాత మన జీవితం సార్థకమౌతుంది.