Tuesday, October 14, 2014

జ్వాలా దేవి - నవదుర్గల ఆలయాలు -1

జ్వాలా దేవి - నవదుర్గల ఆలయాలు
- భావరాజు పద్మిని 

ఏ ప్రాంతంలో ఉంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు, ఆలయాలు దర్శించాలని చెప్తుంటారుమా వారు . మా పెళ్ళయ్యిన నాటి నుంచి అలాగే తిరుగుతున్నాం...  ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లోని నవదుర్గల ఆలయాలు తప్పక చూడాల్సిందే అని అంతా చెప్పారు. అందుకే గతనెల 3 రోజులు సెలవలు ఉన్నప్పుడు బయల్దేరాము. 

ముందుగా వెళ్ళే దారిలో 'నైనాదేవి' ఆలయం దర్శించేందుకు వెళ్ళాము. సన్నగా వాన, కొండ దారి, చుట్టూ హరిత వన సౌందర్యం ! ముందు నిండు గర్భిణి లాగా వెళ్తున్న బస్ టాప్ ఎక్కి కూర్చున్నారు కొంతమంది. వాళ్ళను చూసి, మా చిన్నదానికి గొప్ప సందేహం వచ్చేసింది. "అమ్మా! వీళ్ళు సీట్ బెల్ట్ లు లేకుండా బస్సు మీద ఎక్కరే ! వీళ్ళని పోలీసులు పట్టుకోరా ? వీళ్ళు కింద పడిపోరా ? " ఏం చెబుతాం ? సమాధానం లేని ప్రశ్నలకి చిరునవ్వే సమాధానం కదా !

కేబుల్ కార్ ద్వారా  నైనా దేవి ఆలయం వద్దకు చేరుకున్నాం. సుమారు 100 మెట్ల మీద అంతా జారుడుగా ఉంది. విపరీతమైన రద్దీ. నేనూ, మా వారు నిల్చున్నాం. మా వెనుక నుంచి విపరీతమైన తోపుడు. పావుగంట ఆగి చూస్తే, నేను అక్కడే ఉన్నాను, మా వారు ముందుకు వెళ్ళిపోయారు. నేనొక మెట్టు అంచున ఒంటికాలి మీద కొంగ లాగా నిల్చున్నాను. ముందు చంటి పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు. నా కాలు జారితే, క్రింద ఒక వంద మంది వరుసగా పడిపోతారు. మళ్ళీ లేవలేరు. గుడి యాజమాన్యం భక్తుల రక్షణకు ఎటువంటి ఏర్పాట్లు చెయ్యకపోవడం శోచనీయం !ఇంతకు మునుపు ఇక్కడ తొక్కిసలాటలో దాదాపు 142 మంది చనిపోయారు. తొక్కిసలాటలు ఇలాగే జరుగుతాయేమో ! గురుదేవుల్ని స్మరించుకుంటూ నిల్చున్నాను. కాసేపటికి ముందుకు వెళ్లి చూద్దును కదా, మా వారు నాకు చాలా దూరం వెళ్ళిపోయారు, నేను మెట్ల మీద నుంచి క్యూ లో పడ్డాను. కొందరు vip లను ప్రక్క నుంచి పంపేస్తున్నారు. 2 గంటల నుంచి క్యూ లో నిల్చున్న నా ముందు వాళ్లకు ఒళ్ళు మండి, "ఛలో, బహుత్ హో గయా ఇమాందారి ...' అంటూ క్యూ పై నుంచి దూకేశారు. నేను సైతం... అర్ధమయ్యిందిగా... మొత్తానికి నేనూ, శ్రీవారు, అమ్మవారి ముందు కలిసి, దర్శనానికి వెళ్ళాము.

నైనాదేవి వీళ్ళ ప్రకారం 51 శక్తి పీఠాల్లో ఒకటి. అమ్మవారి కళ్ళు పడ్డట్టుగా భావించే ఈ ప్రాంతానికి కంటి జబ్బులు, సమస్యలు ఉన్నవారు ఎక్కువగా వస్తుంటారు. దర్శనం అయ్యి బయట హోమగుండం వద్దకు రాగానే , అక్కడున్న పూజారులు నా కుడి చెయ్యి ఒకరు,  ఎడమ చెయ్యి ఒకరు లాక్కుని రక్షలు కట్టేసారు. దాదాపు 3 గంటల తర్వాత వానలో భోజనం లేకుండా తిరుగు ప్రయాణం అయ్యాము. దారిలో పాపి కొండల వద్ద గోదారిలా లీలగా నా కళ్ళకు కనిపించింది ఒక మనోహర దృశ్యం... అది హిమాలయాల నుంచి ప్రవహించే ప్రఖ్యాత "బ్యాస్" నది అని తెలిసింది. ఆ నది నీరు రంగే వేరుగా ఉంది. దిగి ఫోటోలు తీసుకుందాం అనుకునే లోపు... అక్కడున్న పోలీసులు అక్కడ ఫోటోలు తియ్యకూడదని, ముందు ప్రతిష్టాత్మకమైన "భాక్రానంగల్ డాం" ఉందని చెప్పారు. అలా చూస్తూ ముందుకు వెళ్ళ సాగాము...

చిన్నప్పుడు నోరు తిరగని పేర్లలో  ఈ "భాక్రా నంగల్ డాం " ఒకటి. ఇది 741 అడుగుల ఎత్తులో ఒకప్పుడు భారతదేశంలో అతి పెద్ద డాం(ఇప్పుడు తెహ్రి డాం - ఉత్తరాఖండ్ 855 అడుగుల ఎత్తు కలిగింది ). స్వాతంత్ర్యం వచ్చాకా జవహర్లాల్ నెహ్రు (1955-1963) ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది. 2011 లో లష్కరే వల్ల ఈ డాం కు ముప్పు ఉందని తెలిసి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు పెంచింది. ఎందుకంటే... ఈ డాం లో యెంత నీరు ఉందంటే... ఒకవేళ దీన్ని పేల్చివేస్తే ... హిమాచల్, మొత్తం చండీగర్, హర్యానా, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా మునిగిపోతాయట.... ఈ డాం నిర్మాణానికి నిపుణులు పడ్డ కష్టాలు, ప్రాణాలొడ్డిన కొందరు ఇంజనీర్ ల వివరాల వీడియో లు యు ట్యూబ్ లో చూడవచ్చు. భద్రత కోసం  ఇప్పుడు ఆ డాం చుట్టుప్రక్కల ఫోటోలు, వీడియో లు తియ్యనివ్వరు.

బిలాస్పూర్  లోని నైనాదేవి నుంచి వెళ్తూ, దారిలో అనుకోకుండా సట్లేజ్ నదిపై కట్టిన ఈ డాం చూసాము. నాకు మన పాపికొండల మధ్య గోదారిలో లాంచి ప్రయాణం గుర్తుకు వచ్చింది. నిజానికి ఈ డాం పేరు కేవలం "భాక్రా డాం " ఒక్కటే నట ! కాని దిగువన ఉన్న నంగల్ లోని నంగల్ డాం ను దీనితో కలిపి అంతా "భాక్రానంగల్ డాం " గా చెప్తుంటారు. కొండల్లో లేత ఆకుపచ్చ రంగులో ప్రవహిస్తూ, మధ్య మధ్య మాతో దోబూచులాడుతూ వస్తున్న సట్లేజ్ నది  నీటిని చూస్తూ ముందుకు సాగాము. ఉదయం ఇంట్లో తిన్న ఇడ్లీ నే. భోజనం లేదు. కూడా తెచ్చుకున్న యేవో పదార్ధాలు తిని, ఆత్మారాముడిని శాంతింప చేసాము.

నంగల్ దాటి ఒక 50 కిలోమీటర్లు ముందుకు సాగాకా... పూరీలు, పరాటా ల బొమ్మలు తగిలించిన ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. ఇక్కడ వాళ్లకు పూరీలు పరాటాలే పంచభక్ష పరమాన్నాలు. సాయంత్రం 5 అవుతోంది. ఫోటోలు బానే ఉన్నాయి కాని, ఫుడ్ లేదు. కావాలంటే లస్సి చేసి ఇస్తాను అన్నాడు. అదే త్రాగి బయల్దేరాము. చింతపూర్ని వద్ద ట్రాఫిక్ జాం. కొండల్లో, వానల్లో ఇది మామూలేనట ! ఎప్పుడు ఏ దారి బ్లాక్ అవుతుందో తెలీదట ! జ్వాలాదేవి చేరుకునే సరికి రాత్రి 7.30 అయ్యింది. హోటల్ కి వెళ్లి పిల్లల్ని, అత్తగారిని దింపి, భోజనం ఆర్డర్ ఇచ్చాకా, మా వారికి వెంటనే దేవి దర్శనం చేసుకోవాలని అనిపించింది.

ఇద్దరం బయల్దేరాము. ఇక్కడి దేవుళ్ళకు కొబ్బరికాయలు, మహానైవేద్యాలు అక్కర్లేదు. మరమరాలు పెడితే చాలు. యేవో పటికబెల్లం పలుకులు, డ్రై ఫ్రూట్స్, కొన్ని స్వీట్స్ అమ్ముతారు. కొబ్బరికాయకు ఒక గుడ్డ చుట్టి , కాస్త ప్రసాదం, సాంబ్రాణి, వేసి వెదురు బుట్టలో ఇస్తారు. మనం తీసుకు వెళ్ళినవి కనీసం అమ్మవారికి తాకించరు . 'హో గయా చలో చలో...' అంటారు. ఉదయం నైనా దేవి వద్ద కొన్న బుట్ట తొక్కిడికి పుల్లలు పుల్లలుగా విడిపోయింది. అందులోని పూలు కొందరి నెత్తిన, మరమరాల ప్యాకెట్ విడి మరికొందరి మీద... ఇలా జారిపోయింది. బుట్ట కొంటే కాని, చెప్పులు పెట్టే వీలు లేదు. అయినా బుట్టలూ అవీ రద్దీలో ఎందుకని మెట్ల ప్రక్కన ఒక మూలగా చీకట్లో చెప్పులు విప్పాము.

"చూడు, నీవి కొత్త చెప్పులు. ఎవరైనా ఎత్తుకు పోతారు. నీ చెప్పుల మీద నా చెప్పులు కవర్ చేసి పెట్టు... "అన్నారు శ్రీవారు. అలాగే పెట్టి , వెళ్ళాము. పెద్దగా రద్దీ లేదు. అరగంట లోపే ఆలయ ముఖద్వారం వద్దకు వెళ్ళాము. అక్కడ ఉన్న పాదుకలకు దణ్ణం పెట్టుకున్నాము. మేము సరిగ్గా గుడి లోకి వెళ్ళగానే తలుపులు మూసేశారు. మా వెనుక ఉన్నవాళ్ళకు ఎవరికీ దర్శనం దొరకలేదు.

అంతా గురువుగారి దయ అనుకుని ముందుకు వెళ్ళాము. ఆశ్చర్యం ! అమ్మవారి ముఖం ఉన్న గూటిలో ఒక జ్వాల వెలుగుతోంది. సాధారణంగా, అమ్మవారు అంటే విగ్రహ రూపాన్ని తప్ప, ఒక జ్వాలను ఎవరూ ఊహించరు కదా ! అందుకే భక్తితో, దణ్ణం పెట్టుకున్నాం. దిగువన ఉన్న చిన్న గుహ వంటి ప్రాంతంలో మరొక రెండు జ్యోతులు వెలుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ మూడు జ్వాల లు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలాట! మునుపు ఏడు జ్యోతులు వేలిగేవని ప్రతీతి.

మహాభారతంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉందట. ఎటువంటి గడ్డు ప్రకృతి స్థితిగతుల్లో కూడా ఆరకుండా వెలిగే ఈ జ్యోతులు... అప్పటి నుంచి వెలుగుతూనే ఉన్నాయట ! పరిశోధించే వారికి ఇది సహజవాయువు... కాని ఇన్ని యుగాలుగా ఈ సహజవాయువు ఇంకిపోకుండా ఎలా ఉంది అనేదే ఇంకా వారికీ ప్రశ్నార్ధకం !



జ్వాలా దేవి ని గురించిన కొన్ని పౌరాణిక గాధలు ఉన్నాయి. కాంగ్రా మహారాజు రాజా భూమి చంద్ దుర్గా మాతకు పరమ భక్తుడు. ఈయనకు అమ్మవారు స్వప్నంలో కనిపించి ఆలయ నిర్మాణం చెయ్యమని ఆజ్ఞాపించిందట. ఆవుల మంద ద్వారా రాజు ఆలయం ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని, అందమైన ప్రాకారాలు, చక్కటి ఫోల్దింగ్ వెండి తలుపులతో ఈ ఆలయాన్ని కట్టించాడట . తర్వాతి కాలంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించి, మరిన్ని మెరుగులు దిద్దారట. 

అక్బర్ కాలంలో ఉన్న ధ్యాను భగత్ ఈ ఆలయాన్ని దర్శించడానికి యాత్రికులతో వెళ్తూ ఉండగా, చక్రవర్తి వెంటనే అతన్ని తన సభకు రప్పించి, అమ్మవారి గురించి అడిగాడట ! ధ్యాను అమ్మవారి శక్తిని గురించి చెప్పగానే, చక్రవర్తి ఒక గుర్రం తల నరికి ఇచ్చి, "మీ అమ్మ శక్తి నిజమైతే, ఈ గుర్రం తలను మొండానికి జోడించి, తిరిగి జీవించేలా చెయ్యమను !" అని సవాల్ చేసాడట !పగలూ రాత్రి ప్రార్ధించినా అమ్మ ప్రసన్నం కాకపోవడంతో ధ్యాను తన తలనే నరికి అమ్మకు సమర్పించాడట ! వెంటనే సింహవాహినియై ప్రత్యక్షమైన దేవి, గుర్రాన్ని, ధ్యాను ను తిరిగి బ్రతికించింది. అందరు భక్తులూ దేవి కృపకు ఇలాగె పాత్రులు కావాలని ధ్యాను కోరగా, దేవి ఒక వరం ఇచ్చిందట ! 

"ఎవరైనా ఇక్కడ భక్తితో ఒక్క కొబ్బరికాయ సమర్పిస్తే, వారు తమ తల నరికి సమర్పించినంతగా ప్రసన్నం అవుతానని " దేవి ధ్యాను కు వరమిచ్చింది. ఈ ఉదంతం విన్న అక్బర్ ఈ దేవి విషయం తేల్చాలని, స్వయంగా బయలుదేరాడు.

అక్బర్ చక్రవర్తి ఈ ఆలయం లోని జ్వాలను ఆర్పాలని అనేక ప్రయత్నాలు చేసాడట.చివరికి నీటి పైపు ను కూడా పెట్టి చూసినా ఈ జ్వాల ఆరలేదట ! ఈ వింతను చూసిన అతను అమ్మవారి భక్తుడై ఒక బంగారు ఛత్రాన్ని సమర్పించాడు. కాని అది వెంటనే ఏదో తెలియని లోహంగా, బండ రాయిగా మారిపోయిందట ! ఆ రాయిని ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. 

జ్వాలాదేవి గర్భగుడి నుంచి బయటకు వచ్చాకా, అంబికేశ్వర్ మహాదేవ్ మందిరం (శివాలయం ) ఉంటుంది. బయట దుర్గా దేవి, మహాలక్ష్మి ఉపాలయాలు ఉన్నాయి. అక్కడే బంగారు ప్రాకారాలతో వెలిగే ఒక విశాలమైన హారతి మందిరం ఉంది. ఇందులో రోజుకు 5 సార్లు దుర్గా సప్తశతి లోని శ్లోకాలతో దేవికి హారతి ఇస్తూ, శయన హారతి సమయంలో ఆమెకు వెండి ఆభరణాలను ధరింప చేస్తారు . ఈ హారతి లైవ్ లో , యు ట్యూబ్ వీడియో లలో చూడవచ్చు.

మరి అంతటి మహిమ ఉన్న "కొబ్బరికాయ" నివేదన గురించి తెలియక, మేము కేవలం ధనం సమర్పిస్తే ఎలా కుదురుతుంది ? బయటకు వచ్చి చూసేసరికి, మా వారి చెప్పులు ఎవరో ఎత్తుకు పోయారు. నావి మాత్రం క్షేమంగా ఉన్నాయి. "కొండ నాలుకకు మందేస్తే... ఉన్న నాలుక పోయిందని, నీ కొత్త చెప్పులు రక్షించబోయి నా చెప్పులు పోయాయి" అన్నారు మావారు. నేను ఒకటే నవ్వడం. పోన్లెండి, ఏడాది వాడిన చెప్పులేగా... అయినా చెప్పులు పొతే, చాలా మంచిదని, మన కర్మ వాళ్ళు తీసుకు పోయినట్లు అని గురుజి చెప్పారు, అన్నాను.

ఆకలి ఆవురు ఆవురు మంటోంది. ఉదయం నుంచి భోజనం లేదు. మనకు లాగా వీళ్ళకు పెద్ద పెద్ద హోటల్స్ ఉండవు. ఒక రేకుల పాక లో పరాటా లనే పరమాన్నంగా భావించి తిని, బయట లస్సి త్రాగి, పాన్ వేసుకున్నాము. ఆ రోజు అలా అమ్మవారి దయతో ముగిసింది...

జ్వాలా దేవి ఆలయం లోని నవ జ్వాలలను క్రింది లింక్ లో దర్శించవచ్చు...