Thursday, February 11, 2016

ది లైఫ్ ఆఫ్ ఎ సెలబ్రిటీ

 ది లైఫ్ ఆఫ్ ఎ సెలబ్రిటీ
--------------------------
భావరాజు పద్మిని - 11/3/16

ఒక్కమాటలో చెప్పమంటే - సెలబ్రిటీ జీవితం అంటే - త్యాగం అంటాను నేను. అదేంటి? అంటారా. అయితే, ఈ పూర్తి వ్యాసాన్ని చదవాల్సిందే !

"వాడికేంట్రా బాబూ, పెట్టి పుట్టాడు, అడుగు తీస్తే కారు, అడుగేస్తే పనివాళ్ళు," అని తేలిగ్గా అనేస్తాము. కాని, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సెలబ్రిటిలలో దాదాపు 70% మంది స్వయం కృషితో పైకి వచ్చిన వారే. మిగతా వారు తాతలు, తండ్రుల పరపతి, పలుకుబడితో పైకొస్తారు. అయితే వీరి పునాదులు గట్టిగా ఉండవు కనుక, వీరు తాత్కాలికంగా పేరుప్రతిష్ఠలు పొందినా, చాలా మంది దాన్ని నిలుపుకోలేరు. అడుగులో అడుగు వేసుకుంటూ, ముందూ-వెనుకా చూసుకుంటూ నడిచేవారు, దారి తప్పినా, నడిచే సత్తా తనలో ఉంది కనుక మళ్లీ సర్దుకుంటారు. కాని గాడ్ ఫాదర్ ల గొడుగు క్రింద నడిచేవారు, మధ్యలో వదిలేస్తే తికమకపడతారు కదా. అలాగే ఇదీను.

స్వయం కృషితో పైకొచ్చిన ఏ సెలబ్రిటీ అయినా ముందుగా ఆర్జించేది... నలుగురి కళ్ళల్లో అభిమానం. కళ్ళతో మొదలయ్యే ఆ అభిమానం, క్రమంగా మనసుల్లోకి ప్రాకుతుంది. వారికోసం ఇతరులు ఏ పనైనా చేసేందుకు సిద్ధపడేలా చేస్తుంది. ఆ స్థితిలో మనిషి పొందినది, బహుశా ఈ ప్రపంచంలోనే అమూల్యమైన పెన్నిధి - ఇతరుల మనసులో తనకు కాస్తంత చోటు.

ఇక్కడే, ఈ స్ధాయికి చేరాకే మరో గొప్ప చిక్కు మొదలవుతుంది... ఈ ప్రేమాభిమానాల రుచి అన్నది ఒక్కసారి చూసాకా, ఇక ఎన్ని విలాసాలు వరించినా రుచించవు. నా కోసం, నా మాట కోసం, నా అక్షరాల కోసం, నా చిన్న చిరునవ్వు కోసం, కను సైగ కోసం, కొన్ని వేల మనసులు తపిస్తుంటాయి... అన్న భావన, ఆ వ్యక్తిని నిలువనివ్వదు. ఎక్కడో మారుమూల ఉన్న గుర్తుతెలియని ఆ అభిమాని కోసం ఏదైనా చెయ్యాలి, అన్న తపన ఆ సెలబ్రిటీని దహిస్తుంది. ఆశ్చర్యం ... అదే తపన చివరికి వారిని నిద్రాహారాలు సైతం మాని, అహర్నిశలు కృషి చేసేలా చేస్తుంది. వారు చెయ్యలేనిది ఏదో తాను  చెయ్యగలనన్న వారి నమ్మకం కోసం, ఎంతకైనా తెగించాలని అనిపిస్తుంది. వారు తనలో అభిమానించే ఆ కళను వారికి అందించి, మెప్పించాకా... ఇక అంతులేని  తృప్తి స్వంతమవుతుంది. 

అయితే, ఇక్కడే కొంతమంది సెలబ్రిటీలు అనుకున్నవి ఫలించక, నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇది సరికాదు. " చచ్చేంత ధైర్యం ఉన్నవారు, అదే ధైర్యాన్ని ఆయుధంగా పెడితే, నిరంతర ప్రయత్నం చేస్తుంటే , ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలరని " గుర్తుంచుకోవాలి. నిరాశలో ఉన్నప్పుడు, సేవా మార్గానికి కొన్నాళ్ళు దారి మార్చుకుంటే, దైవం ఇతరుల కంటే తనకిచ్చిన వరాలను గుర్తించి, బ్రతుకు విలువను తెలుసుకుని, మళ్ళీ ఉత్తేజం పొందుతారు.

ఇలా ఇతరుల ఆనందం కోసం నిద్రాహారాలు, కుటుంబం, వ్యక్తిగత సమయం, స్వేచ్ఛ, తన చుట్టలతో బంధువులతో మాట్లాడే తీరిక వేళలు, ఎండ, చలి తట్టుకుని, ఇష్టమైనవన్నీ వదులుకుని, విశ్రాంతి, విరామం లేకుండా పని చెయ్యడం అనేది ఒక రకంగా త్యాగం కాదంటారా? అలా నిత్యం పరిశ్రమించే ప్రతి ఒక్క సెలబ్రిటీకి నా సలాం. 

" నీకోసం నువ్వు బ్రతికితే అది జంతు జీవనం,

ఇతరుల కోసం బ్రతికితే, అది మానవ జీవనం,

ఇతరులకోసం నీ జీవితాన్ని త్యాగం చెయ్యటమే దివ్యత్వం " అన్న గురుదేవుల వాక్కులు యెంత సత్యమో కదా !

కాబట్టి, ఒకరకంగా ఇటువంటి  త్యాగం చేస్తున్న ఈ  సెలబ్రిటీల జీవన విధానంలో దివ్యత్వం ఉంటుంది. ఈ సారి ఇటువంటి వారిని చూసినప్పుడు, వారి కళ్ళు మీ చూపుల్లోని ఆరాధన కోసం, 'నేను మీ అభిమానిని అండి', అని వారి చెవులు మీరు చెప్పే చిన్నమాటకోసం తపిస్తూ ఉంటాయని, గుర్తుంచుకుంటారు కదూ. కళామతల్లికి ఇదే మనమిచ్చే సిసలైన నీరాజనం.