Monday, March 24, 2014

శతక పద్యాలు

'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో మిత్రులు అందించిన శతక పద్యాలు

వడ్డాది సత్యనారాయణ మూర్తి 

భాస్కర శతకము

అదర మింత లేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికిన్
భేదముచేయుటన్ దనదుపేర్మికిఁ గీడగు మూలమె ట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనజుండు గుణాడ్యుఁడైన ప్ర
హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా.

లోకమున తాను బలముగలవాఁడని గర్వించి సాదుజనుల కెగ్గు చేసినవాఁడు తప్పక నదించును.గుణనిది యగు ప్రహ్లాదకుమారుని భాదపెట్టి హిరణ్యకశిపుడు చావలేదా?

దాశరథీ శతకము
..................

కనక విశాలచేల,భవకానన శాతకుఠారధార,స
జ్జన పరిపాలశీల,దివిజస్తుత సద్గుణ కాండ,కాండ సం
జనిత పరాక్రమ క్రమ విదారద,శారద కంద కుంద చం
దన ఘనసార సారయశ,దాశరథీ కరుణా పయోనిదీ.

స్వర్ణమయము,విశాలమునైన వస్త్రము గలవాఁడా,సంసారారణ్యమునకు వాఁడియైన గొడ్డటివాదర యైనవాఁడా, సుజన రక్షణ స్వభావముగలవాఁడా,దేవతలచేనుతింపఁబడు సుగుణ సముదాయము గలవాఁడా,బాణ పరాక్రమమున నైపుణ్యము 
గలవాఁడా,శరత్కాలమేఘము,మొల్లలు,మంచిగందము,కర్పూరము అనువానివలెఁ దెల్లని కీర్తి గలవాఁడా, రామా,దయాసముద్రా!

భర్తృహరి సుభాషితాలు
తరువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!

భావం - బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క తాత్పర్యం.

శ్రీ మనోహర! సురార్చిత సింధు గంభీర!
భక్తవత్సల! కోటి భానుతేజ! 
కంజనేత్ర! హిరణ్యకశిపునాశక! శూర! 
సాధురక్షణ! శంఖ చక్రహస్త! 
ప్రహ్లాదవరద!పాపధ్వంస!సర్వేశ! 
క్షీరసాగరశయన! కృష్ణవర్ణ! 
పక్షివాహన! లసద్భ్రమరకుంతలజాల! 
పల్లవారుణపాద పద్మయుగళ!

చారు శ్రీచందనాగరు చర్చితాంగ! 
కుందకుట్మలదంత!వైకుంఠధామ! 
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస! 
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఓ లక్ష్మీపతీ!దేవతలందరిచే పూజలందుకొనువాడా!సముద్రములాంటి గంభీర స్వభావుడా!భక్తవత్సలా!కోటిసూర్య సమప్రభా!ఓ కమలాక్షా!హిరణ్యకశిపుడనే రాక్షసుని వధించిన వీరాధివీరా! అవక్రపరాక్రమవంతుడా! సాధురక్షకా! చక్రగదాధరా! ప్రహ్లాదునికి వరములిచ్చి కాపాడినవాడా! మా పాపములను బోగొట్టువాడా! ప్రపంచాధిపతీ! క్షీర సముద్రశయనా! కృష్ణవర్ణా! గరుత్మంతుడు వాహనముగా గలవాడా!తుమ్మెదల్లాంటి తల వెండ్రుకలు కల్గినవాడా! లేత ఎరుపు పాదపద్మములుగలవాడా! ఓ వైకుంఠవాసీ! ఆభరణములచే నొప్పువాడా! దుష్టసంహారా! పాపములు దరిచేరనీయనీ వాడా! ధర్మపురవాసీ! ఓ నరసింహస్వామీ! నీ కిదే నా నమస్కారము.

చిత్తసుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని, 
పుడమిలో జనుల మొప్పులకుఁగాదు; 
జన్మపావనతకై స్మరణజేసెదఁగాని, 
సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు; 
ముక్తికోసము నేను మ్రొక్కివేఁడెదఁగాని, 
దండిభాగ్యము నిమిత్తంబుగాదు;
నిన్నుఁబొగడ విద్య నేర్చితినేకాని,
కుక్షినిండెడు కూటి కొఱకుఁగాదు;

పారమార్థికమునకు నేఁ బాటుపడితిఁ
గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఓ దుష్టసంహారా!నరశింహా!మనఃస్పూర్తిగా నిన్నే సేవింతును గాని దుష్టజనుల మొప్పునకు కాదు.నాజన్మ సాఫల్యతకై నిన్నే స్మరింతును గాని నా సాటివారిలో అనవసర గొప్పతనమునకు గాదు.ముక్తికోసమే నిన్ను మ్రొక్కి వేడుకొంటున్నాను గాని అనిత్యమైన భోగభాగ్యాదుల కొఱకు గాదు.నిన్ను ప్రస్తుతించుటకే విద్యనేర్చితినిగాని నశ్వరమైన శరీరము కొఱకుగాదు .ముక్తి కొఱకు నే
పాటుపడుతున్నాను గాని కీర్తి కొఱకుగాదు.ఓ నీలమేఘశ్యామా! కీర్తిని కోరుటలేదు. ముక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకొంటున్నాను.




పద్యాల అంత్యాక్షరి

మా 'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో సరదాగా పద్యాల అంత్యాక్షరి ఆడాము. ఇందులో ఎంతో మంది పిన్నలూ, పెద్దలూ ఆసక్తిగా పాల్గొన్నారు. ఆ పద్యాలన్నీ మీ కోసం...

సరదాగా పద్యాల అంత్యాక్షరి ఆడదాం...

మొదట నాకు నచ్చిన ఒక పద్యంతో మొదలు పెడతాను. ఆ పద్యం చివరి పదంతో, మీరు మరొక శతక పద్యం చెప్పాలి... వీలు కాకుంటే, వేరే ఏ పద్యమైనా సరే. వారు చెప్పిన పద్యం చివరి అక్షరంతో మరొకరు మరొక పద్యం చెప్పాలి. ఇంత మంది పెద్దలూ, పిల్లలూ ఉన్నారు. చూద్దాం, ఎన్ని పద్యాలు గుర్తుకు వస్తాయో...

అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
మనకు తగని ప్రదేశంలో, మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. మనకు గల గొప్పతనమును, ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యమునకు ఎలాంటి భంగమూ కలుగదు.

కొండ ఎంత పెద్దదైననూ అద్దంలో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా..! అయినంత మాత్రాన కొండ చిన్నది అయిపోదు. అలాగే... మన గొప్పతనం, మనమే చెప్పుకోనంత మాత్రాన తగ్గిపోదని పై పద్యం యొక్క భావం.

మరి పెద్దలూ, పిన్నలూ మొదలుపెట్టండి...

పవిత్రా కాశ్యప్

మృగ మదంబు జూడ మీద నల్లగనుండు
బరిడవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ..!

అర్ధం : ఓ వేమా.. కస్తూరి అనే సువాసనద్రవ్యుం రంగు నల్లగా కానీ వాసన మాత్రం చాలబాగుంటుంది. అలాగే మంచి మనుషుల రూపం ఏవిధంగావున్నా మనసు మాత్రం ఎంతో చక్కగా ఉంటుంది.

సంధ్యా రాణి 

మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!

 ఓ కుమారా! నీ రహస్యములెప్పుడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.

దుర్గ భమిడిపాటి (అదే సమయంలో )

ముక్కోటి దేవులందురు 
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించేనయా 
చక్కనిది ఆవకాయన 
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్

సంధ్యా రాణి గారి పద్యం చివర 'ర' కు పద్యం - కళ్యాణ్ కృష్ణ కుమార్ 

సీ . "రండిరా యిదె! కాల్చుకోండిరా" యని నిండు
గుండెలిచ్చిన మహోద్దండమూర్తి!
పట్టింపువచ్చెనా బ్రహ్మంతవానిని
గద్దించి నిలబెట్టు పెద్దమనిషి!!
తనకు నామాలు పెట్టిన శిష్యులను గూడ
ఆశీర్వదించు దయామయుండు!!!
సర్వస్వము స్వరాజ్య సమరయజ్ఞము నందు
హోమమ్మొనర్చిన సోమయాజి!!

అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు
నమ్మికొల్చిన ఏకైక నాయకుండు!
మన "ప్రకాశము" మన మహోమాత్యమౌళి!!
సరిసములు లేని "ఆంధ్రకేశరి" యతండు!!!!

-కరుణశ్రీ

                                            Kalyan Krishna Kumar's photo.

దుర్గ గారి పద్యానికి 'న ' తో వెంకట కోటేశ్వర రావు గారు అందించిన పద్యం 


                                Venkata Koteswara Rao B's photo.

సూర్యప్రభ ముత్యాల 

మేడి పండు చూడ మేలిమై ఉండు 

పొట్ట విప్పి చూడ పురుగులుండు 

పిరికి వాని మదిని బింకమీలాగురా 

విశ్వదాభిరామ వినుర వేమా!

మల్యాల పల్లం రాజు గారు 

వెన్నెముక లేని కవులకు
పెన్నెరులు, కురుల్,పగటివేషాలు కన్
సన్నలలంకారములట
విన్నావా ముళ్లపూడి వెంకటరమణా.

(శ్రీ అబ్బూరివారు - విన్నావా ముళ్లపూడి వెంకటరమణా అని ఓ శతకం రాశారట. దానిలో పద్యమిది..బాపూ రమణీయం కోతి కొమ్మచ్చి నుంచి...) గిరజాలు..వేషాలు ...ఫోజుల కవుల గురించి..

ఇక్కడ పడిందండీ అందరికీ బ్రేక్... 'ణ ' తో పద్యమే! కమల గారి సందేహం... సమాధానం చూడండి...
ణ తో మాటలే రావట్లేదండి అసలు... ణ తో ఎవరినా చెప్పేవరకు న తో చెప్పొచ్చా? లేక ఫై పద్యంలో ఆఖరి పదం లో ఆఖరి అక్షరానికి ముందు అక్షరం అయిన 'మ' తో చెప్పోచ్చ? 

ణ తో ఒక మాట దొరికిన్దండోయి... 'ణిసిధాత్వర్థము' అని ఒక మాట ఒక నిఘంటువు లో కనిపించింది... అయితే పద్యాలు మటుకు రావడం లేదు ఏమీ...

నిజానికి పల్లం రాజు గారు 'మా' తో వ్రాసే బదులు 'వ' తో వ్రాసారు కదా, అందుకని, ఇక అంతా కలిసి మళ్ళీ 'మ' తో పద్యాలు పాడేసుకున్నాము .

గోమతి రవి 

మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.
ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.

నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యము నితాం
తాపార భూతదయయును దాపస మందార నాకు దయసేయగదే.


దీపము కలిగిన ఇంటను 
దాపున శ్రీలక్ష్మి జేరి ధనములనిచ్చున్ 
కాపడుచుండు మనుజుల 
పాపమ్ములు పారద్రోలి, పాలించుసుమీ!

గోమతి గారి ధాటికి 'ఆయ్... అంతా మీరే ఆడేసుకుంటారా?' అంటూ ఆవిడని అడిగారు ఒకరు. 
ఆలస్యంగా వచ్చినందుకు అందుకోవాలిగా మీతొ...:)... ఇదండీ ఆవిడ సమాధానం . మళ్ళీ ఆట కొనసాగింది...

కమల ఈవని 

మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ

మనమాడిన మాటకు ప్రాణము సత్యము. కోటకు వీరభటుల సైన్యమే ప్రాణము. అదిలేని కోట శత్రువులకు సులభముగా వసమగును... ఆడవారికి శీలమే ప్రాణము. వ్రాసిన కాగితమునకు సంతకము లేనిచో విలువ లేదు... సంతకము చేసినచో దానికి ప్రాణము వచ్చి యెంత పనిఅయిన చక్కబెట్టును...

గోమతి రవి 

తొలుతనవిఘ్నమనుచు ఢూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య ఏకదంతమా నిను ప్రార్ధన చేసెద నా 
వెలుపటి ఘంటమున వ్రాక్కున నెప్పుడు బాయకుండుమీ 
తలపున నిన్ను వేదెద దేవ గణాధిప లోకనాయకా !

ఇటువంటి ఆటలు ఆడితే, విజ్ఞానం, వినోదం రెండూనూ... ఏమంటారు?







పార్కుకు వెళదాం రండి...

రండి, అలా పార్క్ దాకా వెళ్లి వద్దాం. అందమైన పార్కులో ...

కంటికింపైన పువ్వుల్నేమి చూస్తారు? కల్మషం లేని నవ్వుల్ని చూడండి.

జారుడుబండ - 
* ఝాం అంటూ జారేస్తే ఏముంది ? తాపీగా జారితే... అనుకుంటాడు ఓ పిల్లాడు.
* పై నుంచి క్రిందకు ఎందుకు జారాలి, క్రింది నుంచి పైకేక్కుతా... అంటూ ఎక్కేస్తుంది ఓ పాప.
* మెట్లెక్కి, జారుడుబండ గూడు నుంచి ప్రపంచాన్ని జయించిన ఉత్సాహంతో, అమ్మను తొంగి చూసి, జారతాడు ఓ బాబు. అమ్మ క్రింద చేతులు పెట్టి, వాడిని పడిపోకుండా పొదివి పట్టుకుని, ముద్దు పెడుతుంది.
* జారుడుబండ గూడు లోనే దాక్కుని, తన స్నేహితురాలితో, దోబూచులాడుతుంది ఓ పాప.
* మొదటి సారి చిట్టి తల్లిని జారుడుబండ ఎక్కిస్తుంటే, అది బెదిరి ఏడుస్తోంది. నాలుగైదు సార్లు పట్టుకుని జారించాకా, ఇంకా కావాలంటూ మారాం చేస్తోంది.

ఉయ్యాల -
* ఒక్కరే కూర్చుని ఊగితే సరదా ఏముంది ? నిల్చుని ఉంటే, స్నేహితుడు ఊపాలి, అంటాడో బాబు.
* ఒకళ్ళ ఒళ్లో ఒకరు కూర్చున్న ముగ్గురు పాపలు, పచ్చని పంట చేల మీద జతగా ఎగిరే తెల్ల కొంగల్లా ఎగురుతూ నవ్వుతున్నారు.

చిన్ని రంగుల రాట్నం -
* పాపం, ఎన్నాళ్లని అది మనం కూర్చుంటే మనని తిప్పుతుంది ? దాన్ని ఖాళీగా ఉన్నప్పుడు తిప్పి , ఋణం తీర్చుకుందాం అనుకుంటాడో బుజ్జాయి.
* అలా బాగా తిప్పాకా, చప్పున ఎక్కి కూర్చుంటాడు. వెన్నెల ఆరబోసినట్టు నవ్వుతాడు.
* అటే ఎందుకు తిప్పాలి ? అందుకే, ఇటు తిప్పుతాడు మరో కొంటె కుర్రాడు. అలా అనుకున్నది చేస్తూ, సంబరపడతాడు.



సీ -సా - 
* చిట్టి బాబును కూర్చో పెట్టి, మరోవైపు పైకి, క్రిందికి చేత్తో ఒత్తి, పిల్లాడి నవ్వుల్ని చూసి, ప్రపంచం మరచిపోతున్నాడు తండ్రి.
* అటువైపు కూర్చున్న భారీ శాల్తీ ని చూసి, నేనిలా క్రిందే పడి ఉండాల్సిందేనా, అన్నట్టు బిక్క మొహం వేసి చూస్తున్నాడు ఓ బుజ్జాయి.

స్ప్రింగ్ ఏనుగు బొమ్మ -
* ఎత్తెత్తి కొడుతుందా ? దీని అంతు చూడాలి అనుకుని, తన బలాన్ని అంతా వాడి వంచేస్తాడు ఓ బాబు. మళ్ళీ పైకి లేస్తాడు. 
* ఆ ప్రక్కనే, ఏనుగు తనకూ కావాలని మొరాయిస్తాడు మరో బాబు.


* ఇసుకలో గవ్వలు, రంగు రాళ్ళు ఏరుతున్నాడు ఓ బాబు. రాయి దొరికినప్పుడల్లా, గెంతులేస్తూ తీసుకెళ్ళి అమ్మకు చూపిస్తున్నాడు. 
* తన చెప్పుల్ని ఇసుకలో కూరి, మళ్ళీ బయటకు తీసి చూసుకుంటోంది ఓ పాప. మళ్ళీ విదిలించి శుభ్రం చేసి వేసుకుని, మళ్ళీ దాచేస్తుంది.
* ప్రతీ వాళ్ళు తమ వంతు కోసం పోటీలు పడి పరుగులు, అలసిన పిల్లలు ఐస్ పుల్ల కొనుక్కుని  వెనుదిరగడాలు.

వీటన్నిటి పరిణామం.... చిట్టి మనసు నిండా తృప్తి, బోలెడంత ఆకలి, కంటి నిండా నిద్ర.

అందుకే మనసు ఒక్కోసారి పసిపాపై పారాడమంటుంది...
కొత్తవి చూసి బెదరద్దు, అలవాటైతే అవే ముద్దు అంటుంది.
పైకే కాదు, క్రిందికీ వెళ్ళమంటుంది.
ముందుకే కాదు, వెనక్కీ వెళ్లి చూడమంటుంది...
అటు నుంచి ఇటే కాదు, ఇటు నుంచి అటు కూడా తిరుగు అంటుంది...
పడినా, లేచినా, ఆడినా, ఓడినా, గాయపడినా.... అలుపెరుగని ప్రయత్నం చేసి, అనుకున్నది పొంది, ఆనందించమంటుంది. పసిపాపల పార్కు స్పూర్తి, పెద్దలకు కావాలి ఆదర్శం!